ఊహించని విధంగా పితానిని ప్రశ్నించిన హైకోర్టు
హైదరాబాద్: మాజీ మంత్రి, పశ్చిమగోదావరి జిల్లా ఆచంగ టిడిపి శాసనసభ్యుడు పితాని సత్యనారాయణకు హైకోర్టులో ఊహించని ప్రశ్న ఎదురైంది. తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సాయం(ఫాస్ట్) పథకానికి వ్యతిరేకంగా పితాని దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు ఈ రోజు విచారణ జరిపింది. ఈ సందర్భంగా ఫాస్ట్ పథకంతో మీరేమైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? అని హైకోర్టు ప్రశ్నించింది. అంతేకాకుండా మీరేమైనా స్థానిక ఎమ్మెల్యేనా అని కూడా కోర్టు పిటిషనర్ పితానిని ప్రశ్నించింది. ఈ విచారణను హైకోర్టు వచ్చే సోమవారానికి వాయిదా వేసింది. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా కోర్టు వివరణ కోరింది.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఫీజు రీయిబర్స్‌మెంట్‌కు సంబంధించి గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని రద్దు చేస్తూ ఫాస్ట్ పథకాన్ని ప్రకటించింది. ఈ జీవో వివాదస్పాదమైన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ పథకం ద్వారా విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరమవుతుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లో ఏపీ విద్యార్థులే కాకుండా ఇతర రాష్ట్రాలకు చెందిన పేదవిద్యార్థులు అనేకమంది ఉన్నారు. స్థానికత సమస్య తీసుకువచ్చి ఒక్క తెలంగాణ విద్యార్థులకే ఫీ రియింబర్స్‌మెంట్ అమలు చేస్తామని తెలంగాణ ప్రభుత్వం చెప్పడాన్ని సవాల్ చేస్తూ పితాని సత్యనారాయణ హైకోర్టులో ప్రజాప్రయోజన వాజ్యాం దాఖలు చేశారు.