ఈ వ్యాజ్యం దాఖలుకు మీరెలా అర్హులు?
* ఎమ్మెల్యే పితానికి హైకోర్టు ప్రశ్న.. విచారణ 11కు వాయిదా
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 1956 నవంబర్ 1 నాటికి స్థిరపడిన కుటుంబాల విద్యార్థులకే ఆర్థిక సాయం అందించేందుకు ‘ఫాస్ట్’ పేరుతో తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన జీవో 36ను సవాలు చేస్తూ మాజీ మంత్రి, టీడీపీ ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేయడంపై హైకోర్టు అభ్యంతరం తెలిపింది. అసలు ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసేందుకు మీకున్న అర్హతలు (లోకస్ స్టాండీ) ఏమిటో వివరించాలని పితాని సత్యనారాయణను ఆదేశించింది.
ఈ జీవోపై వివరణ ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను 11వ తేదీకి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కల్యాణ్ జ్యోతిసేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. ‘పిటిషనర్ ఓ రాజకీయ పార్టీకి చెందిన ఎమ్మెల్యే. అతనేమీ బాధితుడు కాదు. ఈ జీవో వల్ల నష్టపోతున్న విద్యార్థుల తండ్రి కాదు. సంరక్షకుడూ కాదు. ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేసేందుకు ఆయనకున్న అర్హతలేమిటి’ అని ధర్మాసనం ప్రశ్నించింది.