39వేల హెక్టార్లలో పంటనష్టం
Published Mon, Oct 28 2013 3:19 AM | Last Updated on Sat, Sep 2 2017 12:02 AM
నరసాపురం(రాయపేట), న్యూస్‌లైన్ : అధిక వర్షాలకు జిల్లాలో 39 వేల 21 హెక్టార్లలో పంటనష్టం వాటిల్లిందని, నష్టపోయిన రైతులను అన్నివిధాలా ఆదుకుంటామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. నరసాపురం మునిసిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాలు వల్ల జిల్లాలో 635 ఇళ్లు, పంచాయతీ, ఆర్‌అండ్ బీ రోడ్లు దెబ్బతిన్నాయని, 4 పశువులు మృతిచెందాయని వివరించారు. ప్రభుత్వం అందించే నష్టపరిహారాన్ని త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపారు. ఎకరాకు రూ.5వేల నుంచి రూ.15వేలు నష్టపరిహారాన్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు.
మృతుల కుటుంబాలకు అందించే ఎక్స్‌గ్రేషియో కూడా పెంచే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ఐదు రోజులుగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో అనేక ఇళ్లు ధ్వంస మయ్యాయని, పంటనీట మునగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, నలుగురు మృతిచెందారని, పశువుల పెంపకందారులకు నష్టంవాటిల్లిందని, చేనేత మగ్గాల్లోకి వర్షం నీరు చేరుకుందని పేర్కొన్నారు. జిల్లాలో ఏలూరు మండలం శ్రీపర్రు, తణుకు మండలం దువ్వ, నరసాపురం మండలం నవరసపురం, చాగల్లు మండలం ఊనగట్ల, నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామాల్లో క్యాంపులు నిర్వహించామన్నారు.
జిల్లాలో వరిపంటకు తీవ్ర నష్టంవాటిల్లగా పత్తి, వేరుశనగ తదితర పంటలకు నష్టం వాటిల్లిందని పంట నష్టాన్ని అధికారులు గుర్తిస్తున్నారని తెలిపారు. ఎర్ర కాలువ, తమ్మిలేరు పొంగిపొర్లుతున్నాయని, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు నియోజకవర్గంలో జరిగిన నష్టాన్ని మంత్రి, జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ దృష్టికి తీసుకువచ్చారు. పై-లీన్ తుఫాన్‌తో దెబ్బతిన్న పంటలకు అధిక వర్షాలు తోడు కావడంతో రైతులు తీవ్ర నష్టపోయారన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకీరామ్, రెవెన్యు, మునిసిపల్, ఆర్‌డ బ్ల్యూఎస్ అధికారులు పాల్గొన్నారు.
Advertisement