NARASAPURA
-
నేటినుంచి లేఖర్ల నిరసన
నరసాపురం (రాయపేట), న్యూస్‌లైన్ : ఆస్తి లావాదేవీలకు సంబంధించిన రిజిస్ట్రేషన్లను మీసేవ కేంద్రాలకు అనుసంధానం చేయడాన్ని వ్యతిరేకిస్తూ గురువారం నుంచి లేఖర్లు ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద నిర్వహించిన సమావేశంలో బుధవారం లేఖర్లు ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. లేఖర్ల సంఘం అధ్యక్షుడు కోయ రంగారావు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్లను మీసేవ కేంద్రాలకు అనుసంధానం చేయడం వలన రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది లేఖర్లు రోడ్డున పడే ప్రమాదముందని అన్నారు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ ఈనెల 26 నుంచి 28 వరకు స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి రిజిస్ట్రేషన్లను అడ్డుకుంటామని చెప్పారు. అప్పటికీ ప్రభుత్వ వైఖరి మారకుంటే దశలవారీగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. సంఘ కార్యదర్శి నడింపల్లి ఆంజనేయులు మాట్లాడుతూ బ్రిటీష్ కాలం నుంచి ప్రజల ఆస్తుల పరిరక్షణకు పకడ్బందీగా ఉన్న వ్యవస్థను ప్రభుత్వం చిన్నాభిన్నం చేస్తోందన్నారు. రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటీకరణ దిశగా మార్పులు చేపట్టడం దారుణమన్నారు. సీనీయర్ లేఖరి పుసులూరి సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ ఇప్పటికే ఈసీ, పబ్లిక్ నఖలు కాఫీలును మీ సేవ కేంద్రాలద్వారా పొందడానికి లబ్ధిదారులు వ్యయప్రయాసలకు గురవుతున్నారు. సకాలంలో పత్రాలు మంజూరు కావడంలేదని, పత్రాలు అర్ధ రహితంగా ఉంటున్నాయని, రూ.వందతో అయ్యేది రూ.500ల వరకు ఖర్చు అవుతుందని లబ్ధిదారులు వాపోతున్నారని పేర్కొన్నారు. మూడురోజులపాటు నాన్ జుడీషియల్ స్టాంపు పేపర్ల విక్రయాలు నిలిపివేయాలని, ఆస్తి లావాదేవీలకు సంబంధించి విక్రయ ఒప్పందాలు తయారుచేయుట, కొలతలు వేయుట తదితర కార్యక్రమాలను నిలిపివేయాలని తీర్మానం చేశారు. సంఘ కోశాధికారి కెల్లా సతీష్, లేఖర్లు నాగేంధ్ర త్రినాథ్, జి.రవిరామారావు, శ్రీనివాస్, పులపర్తి వెంకటేశ్వరరావు, తెలగంశెట్టి సత్యనారాయణ, కె.రామచంద్రరావు, దిడ్ల నాగరాజు, సుభాకర్, కొప్పాడి శ్రీనివాస్, స్టాంపు వెండర్లు గోటేటి నాగేశ్వరరావు, వెంకటరమణ పాల్గొన్నారు. -
హడలెత్తిస్తున్న హెలెన్
సాక్షి, ఏలూరు :హెలెన్ తుపాను ‘పశ్చిమ’ ప్రజలను హడలెత్తిస్తోంది. దిశమార్చుకున్న తుపాను నరసాపురం-మచిలీపట్నం మధ్య కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. బుధవారం రాత్రి వరకూ తుపాను ప్రభావం జిల్లాపై లేకపోవడంతో ప్రజలు, రైతులు ఊపిరి పీల్చుకున్నారు. తుపాను ఉన్నట్టుండి దిశమార్చుకుందని, కృష్ణా-పశ్చిమగోదావరి జిల్లాల మధ్య శుక్రవారం మధ్యాహ్నానికి తీరందాటే అవకాశం ఉందని సమాచారం వెలువడింది. రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉం దని హెచ్చరికలు జారీ అయ్యూయి. తుపాను ప్రభావంతో గురువారం జిల్లావ్యాప్తంగా జల్లులు పడ్డాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వాతావరణం మేఘావృతమై ఉండగా, తీరప్రాంతం కల్లోలంగా మారింది. వరి కోతలు చేపట్టిన రైతులకు వణుకు పట్టుకుంది. ఏ క్షణాన భారీ వర్షాలు కురిసి పంటను మింగేస్తాయోనని కలవరపడుతున్నారు. పంటను దక్కించుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తుపాను సమాచారం నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు. నరసాపురం డివిజన్‌పై పెను ప్రభావం నరసాపురం-మచిలీపట్నం మధ్య కేంద్రీకృతమైన హెలెన్ శుక్రవారం మధ్యాహ్నానికి తీరం దాటే అవకాశం ఉంది. గురువారం సాయంత్రం నుంచి తీరం వెంబడి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండటంతో పలుచోట్ల చెట్లు నేలకూలాయి. హెలెన్ తీవ్ర తుపానుగా మారే ప్రమాదం ఉంది. అలలు మీటరు నుంచి మీటరున్నర ఎత్తుకు ఎగసిపడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావం తీరానికి సమీపంలో గల నరసాపురం, మొగల్తూరు, యలమంచిలి, భీమవరం మండలాలపై తీవ్రంగా పడే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో బియ్యపుతిప్ప, మర్రితిప్ప, దర్భరేవు, పెదమైనవానిలంక, లక్ష్మణేశ్వరం, కేపీ పాలెం, లోసరి, దొంగపిండి, నాగిడిపాలెం, వెదుర్లంక, వేములదీవి, యర్రంశెట్టివారి పాలెం గ్రామాల ప్రజలను యుద్ధప్రాతిపదికన సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టారు. ప్రజలు మొండిగా వ్యవహరించకుండా అధికారులకు సహకరించాలని కలెక్టర్ సిద్ధార్థజైన్ విజ్ఞప్తి చేశారు. నరసాపురం ప్రాంతానికి జాతీయ విపత్తుల నివారణ బృందాలను పంపించాలని ప్రభుత్వాన్ని కోరారు. రెవెన్యూ మంత్రి ప్రత్యేక దృష్టి తుపాను నేపథ్యంలో ప్రజలను, వారి ఆస్తులను రక్షించేందుకు అధికార యంత్రాంగం అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం సాయంత్రం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సిద్ధార్థజైన్‌తో ఆయన మాట్లాడారు. అత్యవసరమైతే తీరప్రాంత ప్రజలను బలవంతంగానైనా సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రాణనష్టం జరగకుండా చూడాలని మంత్రి ఆదేశిం చారు. తుపాను బాధిత ప్రజలకు పునరావాస కార్యక్రమాలు అమలు చేయడంలో కొత్త సర్పంచ్‌లను భాగస్వాములను చేయాలన్నారు. సమాచార వ్యవస్థలకు అంతరాయం కలగకుండా చూడాలన్నారు. చేపల వేటకు వెళ్లిన వారిని వెనక్కి రప్పించేందుకు మత్స్య శాఖ అధికారులతో తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులెవరైనా సెలవులో ఉంటే వెనక్కి పిలిపించాలని ఆదేశించారు. నిధుల కోసం వెనకడుగు వేయవద్దని సూచించారు. భారీ వర్షం కురుస్తుంది రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి మాట్లాడుతూ తుపాను ప్రభావంతో 25 సెంటీమీటర్ల వరకూ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. విపత్తుల నివారణ సంస్థ కమిషనర్ సి.పార్థసారథి మాట్లాడుతూ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం డివిజన్లో అత్యంత అప్రమత్తతతో ఉండాలన్నారు. రైతుల గుండెల్లో ‘తుపాను’ ఖరీఫ్ వరి కోతలు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో హెలెన్ తుపాను ముంచుకొస్తుండటం రైతుల్ని కలవరపెడుతోంది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 6లక్షల ఎకరాల్లో వరి పండించగా, సుమారు లక్ష ఎకరాల్లో కోతలు పూర్తయ్యాయి. వీటిలో 30 శాతం పంట పనలపై ఉంది. మెట్టలో 70 శాతం కోతలు పూర్తయ్యాయి. తుపాను తీవ్రమైతే డెల్టాలోని లక్షలాది ఎకరాల్లో పంటలకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. పంటను కాపాడుకోవడానికి, కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకోవడానికి కర్షకులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో కాలువలకు నీటి విడుదలను తగ్గించారు. -
వైసీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం
పాలకొల్లు, న్యూస్‌లైన్ :ప్రముఖ పారిశ్రామికవేత్త, వైఎస్సార్ సీపీ నరసాపురం నియోజక వర్గ పరిశీలకుడు కనుమూరి రఘురామకృష్ణంరాజు పర్యటన వైసీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. రఘురామ కృష్ణంరాజు శనివారం పాలకొల్లు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు 11చోట్ల వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ఆవిష్కరించారు. ఉదయం 9నుంచి రాత్రి 9 గంటల వరకూ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో తిరిగారు. పాలకొల్లు మండలం శివదేవునిచిక్కాలలో ఉదయం వైఎస్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని అనంతరం లంకలకోడేరు, వెంకటాపురం, అరట్లకట్ట పంచాయతీ కమ్ము, కాపవరం, కొత్తపేట, ఉల్లంపర్రు, పోడూరు మండలంలోని పెనుమదం, అప్పనచెర్వు, యలమంచిలి మండలం మేడపాడు, చింతదిబ్బ పంచాయతీ సీతమ్మచెర్వు గ్రామాల్లో విగ్రహాలను ఆవిష్కరించారు. సమైక్య ఆంధ్రప్రదేశ్తోనే రాష్ట్రాభివృద్ధి ఈ సందర్భంగా పలుచోట్ల రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలోనే ఆంధ్రప్రదేశ్ అన్నివిధాలుగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. రాజశేఖరరెడ్డి బతికి ఉంటే రాష్ట్రం విడిపోయే పరిస్థితి ఉండేది కాదని అన్నారు. రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దాలనే తమ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తపనకు తనవంతు తోడ్పాటునందిస్తానని చెప్పారు. మాజీ ఎంపీ చేగొండి వెంకట హరరామజోగయ్య మాట్లాడుతూ రఘురామకృష్ణంరాజు జాతీయస్థాయి పారిశ్రామికవేత్త అయినప్పటికీ కేంద్రంలో అధికార పార్టీకి జంకకుండా సమైక్య రాష్ట్రం కోసం సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని తెలి పారు. దీన్నిబట్టే రాష్ట్రంపై ఆయనకున్న అంకితభావం విశదమవుతుందన్నారు.అటువంటి వ్యక్తి నరసాపురం ఎంపీగా ఎన్నికైతే మన ప్రాంతం పారిశ్రామికంగా శరవేగంగా అభివృద్ధి సాధిస్తుందన్నారు. ఈ సందర్భంగా శివదేవునిచిక్కాల సర్పంచ్ వడ్డె సోమచంద్రశేఖర్(గని), సహకార సంఘం అధ్యక్షుడు శివరామకృష్ణప్రసాద్(సిద్దాంతి) రఘురామకృష్ణంరాజు సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు. భారీర్యాలీ.. గ్రామాల్లో కోలాహలం రఘురామకృష్ణంరాజు పర్యటన సందర్భంగా వందలాది కార్లు, ద్విచక్ర వాహనాలు ఆయన కాన్వాయ్‌లో భాగమయ్యాయి. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు వచ్చినప్పుడు కూడా లేనివిధంగా నియోజకవర్గంలో కోలాహలం చోటుచేసుకుంది. ప్రతి గ్రామంలోనూ భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, ప్రజలు విగ్రహావిష్కరణ సభలకు వచ్చారు. ఉదయం నుంచి రాత్రి ఆయన పర్యటన ముగించే వరకూ వందలాది కార్లు, ద్విచక్ర వాహనాల ర్యాలీ కొనసాగింది. ప్రతిచోటా ఆయన్ను చూసేందుకు ప్రజలు, నాయకులు ఉత్సాహం చూపారు. దీంతో నియోజకవర్గమంతా సందడి వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా వైఎస్ జగన్, రఘురామకృష్ణంరాజు ఫ్లెక్సీలే కనిపించాయి. ఈ కార్యక్రమం ద్వారా వైఎస్సార్సీపీ క్యాడర్లో ఉత్తేజం నెలకొంది. పార్టీ నేత ఆకెన వీరాస్వామి(అబ్బు) ఆర్థిక సహకారంతో ఏర్పాటుచేసిన విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమానికి జిల్లాలోని పార్టీ నాయకులంతా రావడంతోపాటు నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ మోటారు సైకిళ్లు, కార్ల ర్యాలీతో హోరెత్తించారు. -
39వేల హెక్టార్లలో పంటనష్టం
నరసాపురం(రాయపేట), న్యూస్‌లైన్ : అధిక వర్షాలకు జిల్లాలో 39 వేల 21 హెక్టార్లలో పంటనష్టం వాటిల్లిందని, నష్టపోయిన రైతులను అన్నివిధాలా ఆదుకుంటామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి పితాని సత్యనారాయణ తెలిపారు. నరసాపురం మునిసిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వర్షాలు వల్ల జిల్లాలో 635 ఇళ్లు, పంచాయతీ, ఆర్అండ్ బీ రోడ్లు దెబ్బతిన్నాయని, 4 పశువులు మృతిచెందాయని వివరించారు. ప్రభుత్వం అందించే నష్టపరిహారాన్ని త్వరలో వెల్లడించనున్నట్లు తెలిపారు. ఎకరాకు రూ.5వేల నుంచి రూ.15వేలు నష్టపరిహారాన్ని అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. మృతుల కుటుంబాలకు అందించే ఎక్స్‌గ్రేషియో కూడా పెంచే యోచనలో ఉన్నట్లు తెలిపారు. ఐదు రోజులుగా రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడంతో అనేక ఇళ్లు ధ్వంస మయ్యాయని, పంటనీట మునగడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, నలుగురు మృతిచెందారని, పశువుల పెంపకందారులకు నష్టంవాటిల్లిందని, చేనేత మగ్గాల్లోకి వర్షం నీరు చేరుకుందని పేర్కొన్నారు. జిల్లాలో ఏలూరు మండలం శ్రీపర్రు, తణుకు మండలం దువ్వ, నరసాపురం మండలం నవరసపురం, చాగల్లు మండలం ఊనగట్ల, నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామాల్లో క్యాంపులు నిర్వహించామన్నారు. జిల్లాలో వరిపంటకు తీవ్ర నష్టంవాటిల్లగా పత్తి, వేరుశనగ తదితర పంటలకు నష్టం వాటిల్లిందని పంట నష్టాన్ని అధికారులు గుర్తిస్తున్నారని తెలిపారు. ఎర్ర కాలువ, తమ్మిలేరు పొంగిపొర్లుతున్నాయని, ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉందని పేర్కొన్నారు. ఎమ్మెల్యే కొత్తపల్లి సుబ్బారాయుడు నియోజకవర్గంలో జరిగిన నష్టాన్ని మంత్రి, జిల్లా కలెక్టర్ సిద్ధార్థ జైన్ దృష్టికి తీసుకువచ్చారు. పై-లీన్ తుఫాన్‌తో దెబ్బతిన్న పంటలకు అధిక వర్షాలు తోడు కావడంతో రైతులు తీవ్ర నష్టపోయారన్నారు. సమావేశంలో మాజీ ఎమ్మెల్యే కొత్తపల్లి జానకీరామ్, రెవెన్యు, మునిసిపల్, ఆర్డ బ్ల్యూఎస్ అధికారులు పాల్గొన్నారు. -
లాకప్ నుంచి నలుగురు పరార్
నరసాపురం(రాయపేట), న్యూస్‌లైన్ :పోలీస్ కస్టడీలో ఉన్న నలుగురు పారిపోయారు. నరసాపురం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం వేకువ జామున జరిగిన ఈ ఘటనలో చోరీ కేసుల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్న తోటి ప్రసాద్, అతని భార్య లక్ష్మి, పెనుగొండకు చెందిన ఉండవల్లి వెంకటేష్, నరసాపురానికి చెందిన బూసిని శ్రీకాంత్ పరారయ్యారు. నిత్యం జనసంచారం ఉండే ప్రాంతంలో ఉన్న పోలీస్‌స్టేషన్ లాకప్‌కు రంధ్రం చేసుకుని పారిపోయారని పోలీసులు చెప్పటం పలు అనుమానాలకు తావిస్తోంది. పట్టణ పోలీస్‌స్టేషన్ వెనుకే సీఐ కార్యాలయం కూడా ఉంది. ఇక్కడ సెం ట్రీ డ్యూటీ కూడా 24 గంటలూ ఉంటుంది. సిమెం ట్‌తో నిర్మించిన లాకప్ గోడ పగులగొట్టి పారి పోయారని పోలీసులు చెప్పటం అనుమానాలకు దారి తీసింది. వివరాలు ఇవి..కృష్ణా జిల్లా ఘంటసాల గ్రామానికి చెందిన తోటి ప్రసాద్ కార్లు దొంగిలించి వాటిపైనే అతని భార్య లక్ష్మిని, పిల్లలను తిప్పుతూ ఇంటి దొంగతనాలకు పాల్పడేవాడు. ఇతను పలు జిల్లాల్లోని 10 దొంగతనం కేసుల్లో నిందితుడు. ప్రసాద్, లక్ష్మిలను నెల కిందట నరసాపురం పట్టణ పోలీసులు బెంగళూరులోఅదుపులోకి తీసుకున్నారు. వారికి సహకరించిన పెనుగొండకు చెందిన ఉండవల్లి వెంకటేష్‌ను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరినుంచి కేజీన్నర బంగారం, 70 బైక్‌లు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇంత పెద్ద మొత్తంలో చోరిసొత్తును స్వాధీనం చేసుకున్న పోలీ సులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు. వీరి తోబాటు బైక్ దొంగతనంలో పట్టుబడ్డ స్థానికుడు బూసిని శ్రీకాంత్ కూడా లాక ప్లో ఉన్నాడు. ఇతనిపై ఓ హత్య కేసు కూడా ఉంది. వీరిని పట్టణ పోలీసులు విచారణ చేస్తూ వచ్చారు. ఇతర జిల్లాల్లో కూడా వీరు చోరీలకు పాల్పడినట్టు తెలిసి ఆయా జిల్లాల పోలీసులు వీరిని విచారణ చేసేందుకు నరసాపురం రానున్నట్లు తెలిసింది. అదుపులోకి తీసుకున్న వీరిని చాలా కాలంగా స్టేషన్లో ఉంచడంతో సిబ్బందిని వారు లోబరుకుని, వారి సహకారంతోనే పరారై ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరువు పోతుందని లాకప్‌కు రంధ్రం చేసి పారిపోయారనే ప్రచారాన్ని పోలీసులు లేవనెత్తి ఉంటారనే ఆరోపణలు వినపడుతున్నాయి. ఎస్పీ సీరియస్ ! నరసాపురంలో పోలీసుల పనితీరుపై ఎస్పీ సీరియస్ అయినట్లు తెలిసింది. పోలీసుల అదుపులో లాకప్‌లో ఉన్నవారు పరారు కావడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. రూరల్ పోలీస్‌స్టేషన్‌నుంచి 10రోజులు క్రితం ముగ్గురు నిందితులు పరారైన విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. తాజాగా పట్టణ పోలీస్‌స్టేషన్ నుంచి నలుగురు నిందితులు పరారు కావడం చర్చనీయాంశమైంది. వీఆర్‌లోకి ఎస్సై, ముగ్గురు పీసీలు ఈ ఘటనతో పట్టణ ఎస్సై ప్రసాద్‌తోపాటు ముగ్గురు కానిస్టేబుళ్లను వీఆర్‌లోకి పంపించారు. ఈ ఘటనపై విచారకు సీఐ పూర్ణచంద్రరావును నియమించారు. -
విద్యార్థినులకు బంగారు పతకాలు ప్రదానం
నరసాపురం, న్యూస్‌లైన్: ప్రతిభ కనబరచిన విద్యార్థినులకు నరసాపురం రోటరీ క్లబ్ సభ్యులు పురస్కారాలను అందజేశారు. పట్టణంలో ఆదివారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి రోటరీ గవర్నర్ డీవీఆర్ పూషా అతిథిగా పాల్గొన్నారు. గత ఏడాది 10వ తరగతి, ఇంటర్, డిగ్రీలలో టౌన్ ఫస్ట్ సాధించిన ఆదిత్య స్కూల్ విద్యార్థినులు జీఎల్ఎస్ ప్రవల్లిక, లోకం ధనుంజయ కుమారి, పరసా సౌజన్యలకు బంగారు పతకాలు ప్రదానం చేశారు. పాలంకి విశ్వనాథశాస్త్రి, కోట్ల రామ్‌కుమార్, ఆడిటర్ రామ్మోహన్ సౌజన్యంతో విద్యార్థులకు బంగారు పతకాలు సమకూర్చారు.రోటరీక్లబ్ అధ్యక్షుడు తోట శ్రీనివాసబాబు, కార్యదర్శి పాలంకి సుబ్బారావు, పార్వతీదేవి తదితరులు పాల్గొన్నారు.