లాకప్ నుంచి నలుగురు పరార్
Published Thu, Oct 24 2013 2:36 AM | Last Updated on Tue, Aug 21 2018 7:17 PM
నరసాపురం(రాయపేట), న్యూస్‌లైన్ :పోలీస్ కస్టడీలో ఉన్న నలుగురు పారిపోయారు. నరసాపురం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో బుధవారం వేకువ జామున జరిగిన ఈ ఘటనలో చోరీ కేసుల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్న తోటి ప్రసాద్, అతని భార్య లక్ష్మి, పెనుగొండకు చెందిన ఉండవల్లి వెంకటేష్, నరసాపురానికి చెందిన బూసిని శ్రీకాంత్ పరారయ్యారు. నిత్యం జనసంచారం ఉండే ప్రాంతంలో ఉన్న పోలీస్‌స్టేషన్ లాకప్‌కు రంధ్రం చేసుకుని పారిపోయారని పోలీసులు చెప్పటం పలు అనుమానాలకు తావిస్తోంది. పట్టణ పోలీస్‌స్టేషన్ వెనుకే సీఐ కార్యాలయం కూడా ఉంది. ఇక్కడ సెం ట్రీ డ్యూటీ కూడా 24 గంటలూ ఉంటుంది.
సిమెం ట్‌తో నిర్మించిన లాకప్ గోడ పగులగొట్టి పారి పోయారని పోలీసులు చెప్పటం అనుమానాలకు దారి తీసింది. వివరాలు ఇవి..కృష్ణా జిల్లా ఘంటసాల గ్రామానికి చెందిన తోటి ప్రసాద్ కార్లు దొంగిలించి వాటిపైనే అతని భార్య లక్ష్మిని, పిల్లలను తిప్పుతూ ఇంటి దొంగతనాలకు పాల్పడేవాడు. ఇతను పలు జిల్లాల్లోని 10 దొంగతనం కేసుల్లో నిందితుడు. ప్రసాద్, లక్ష్మిలను నెల కిందట నరసాపురం పట్టణ పోలీసులు బెంగళూరులోఅదుపులోకి తీసుకున్నారు. వారికి సహకరించిన పెనుగొండకు చెందిన ఉండవల్లి వెంకటేష్‌ను కూడా అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వీరినుంచి కేజీన్నర బంగారం, 70 బైక్‌లు, రెండు కార్లు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. ఇంత పెద్ద మొత్తంలో చోరిసొత్తును స్వాధీనం చేసుకున్న పోలీ సులు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.
వీరి తోబాటు బైక్ దొంగతనంలో పట్టుబడ్డ స్థానికుడు బూసిని శ్రీకాంత్ కూడా లాక ప్‌లో ఉన్నాడు. ఇతనిపై ఓ హత్య కేసు కూడా ఉంది. వీరిని పట్టణ పోలీసులు విచారణ చేస్తూ వచ్చారు. ఇతర జిల్లాల్లో కూడా వీరు చోరీలకు పాల్పడినట్టు తెలిసి ఆయా జిల్లాల పోలీసులు వీరిని విచారణ చేసేందుకు నరసాపురం రానున్నట్లు తెలిసింది. అదుపులోకి తీసుకున్న వీరిని చాలా కాలంగా స్టేషన్‌లో ఉంచడంతో సిబ్బందిని వారు లోబరుకుని, వారి సహకారంతోనే పరారై ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పరువు పోతుందని లాకప్‌కు రంధ్రం చేసి పారిపోయారనే ప్రచారాన్ని పోలీసులు లేవనెత్తి ఉంటారనే ఆరోపణలు వినపడుతున్నాయి.
ఎస్పీ సీరియస్ !
నరసాపురంలో పోలీసుల పనితీరుపై ఎస్పీ సీరియస్ అయినట్లు తెలిసింది. పోలీసుల అదుపులో లాకప్‌లో ఉన్నవారు పరారు కావడంపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారని సమాచారం. రూరల్ పోలీస్‌స్టేషన్‌నుంచి 10రోజులు క్రితం ముగ్గురు నిందితులు పరారైన విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచారు. తాజాగా పట్టణ పోలీస్‌స్టేషన్ నుంచి నలుగురు నిందితులు పరారు కావడం చర్చనీయాంశమైంది.
వీఆర్‌లోకి ఎస్సై, ముగ్గురు పీసీలు
ఈ ఘటనతో పట్టణ ఎస్సై ప్రసాద్‌తోపాటు ముగ్గురు కానిస్టేబుళ్లను వీఆర్‌లోకి పంపించారు. ఈ ఘటనపై విచారకు సీఐ పూర్ణచంద్రరావును నియమించారు.
Advertisement
Advertisement