వైసీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం
Published Mon, Nov 11 2013 2:54 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM
పాలకొల్లు, న్యూస్‌లైన్ :ప్రముఖ పారిశ్రామికవేత్త, వైఎస్సార్ సీపీ నరసాపురం నియోజక వర్గ పరిశీలకుడు కనుమూరి రఘురామకృష్ణంరాజు పర్యటన వైసీపీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. రఘురామ కృష్ణంరాజు శనివారం పాలకొల్లు నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు 11చోట్ల వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ఆవిష్కరించారు. ఉదయం 9నుంచి రాత్రి 9 గంటల వరకూ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో తిరిగారు. పాలకొల్లు మండలం శివదేవునిచిక్కాలలో ఉదయం వైఎస్ విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని అనంతరం లంకలకోడేరు, వెంకటాపురం, అరట్లకట్ట పంచాయతీ కమ్ము, కాపవరం, కొత్తపేట, ఉల్లంపర్రు, పోడూరు మండలంలోని పెనుమదం, అప్పనచెర్వు, యలమంచిలి మండలం మేడపాడు, చింతదిబ్బ పంచాయతీ సీతమ్మచెర్వు గ్రామాల్లో విగ్రహాలను ఆవిష్కరించారు.
సమైక్య ఆంధ్రప్రదేశ్‌తోనే రాష్ట్రాభివృద్ధి
ఈ సందర్భంగా పలుచోట్ల రఘురామకృష్ణంరాజు మాట్లాడుతూ సమైక్య రాష్ట్రంలోనే ఆంధ్రప్రదేశ్ అన్నివిధాలుగా అభివృద్ధి చెందుతుందని చెప్పారు. రాజశేఖరరెడ్డి బతికి ఉంటే రాష్ట్రం విడిపోయే పరిస్థితి ఉండేది కాదని అన్నారు. రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అగ్రగామిగా తీర్చిదిద్దాలనే తమ పార్టీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తపనకు తనవంతు తోడ్పాటునందిస్తానని చెప్పారు. మాజీ ఎంపీ చేగొండి వెంకట హరరామజోగయ్య మాట్లాడుతూ రఘురామకృష్ణంరాజు జాతీయస్థాయి పారిశ్రామికవేత్త అయినప్పటికీ కేంద్రంలో అధికార పార్టీకి జంకకుండా సమైక్య రాష్ట్రం కోసం సుప్రీంకోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారని తెలి పారు. దీన్నిబట్టే రాష్ట్రంపై ఆయనకున్న అంకితభావం విశదమవుతుందన్నారు.అటువంటి వ్యక్తి నరసాపురం ఎంపీగా ఎన్నికైతే మన ప్రాంతం పారిశ్రామికంగా శరవేగంగా అభివృద్ధి సాధిస్తుందన్నారు. ఈ సందర్భంగా శివదేవునిచిక్కాల సర్పంచ్ వడ్డె సోమచంద్రశేఖర్(గని), సహకార సంఘం అధ్యక్షుడు శివరామకృష్ణప్రసాద్(సిద్దాంతి) రఘురామకృష్ణంరాజు సమక్షంలో వైఎస్సార్ సీపీలో చేరారు.
భారీర్యాలీ.. గ్రామాల్లో కోలాహలం
రఘురామకృష్ణంరాజు పర్యటన సందర్భంగా వందలాది కార్లు, ద్విచక్ర వాహనాలు ఆయన కాన్వాయ్‌లో భాగమయ్యాయి. కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు వచ్చినప్పుడు కూడా లేనివిధంగా నియోజకవర్గంలో కోలాహలం చోటుచేసుకుంది. ప్రతి గ్రామంలోనూ భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, ప్రజలు విగ్రహావిష్కరణ సభలకు వచ్చారు. ఉదయం నుంచి రాత్రి ఆయన పర్యటన ముగించే వరకూ వందలాది కార్లు, ద్విచక్ర వాహనాల ర్యాలీ కొనసాగింది. ప్రతిచోటా ఆయన్ను చూసేందుకు ప్రజలు, నాయకులు ఉత్సాహం చూపారు. దీంతో నియోజకవర్గమంతా సందడి వాతావరణం నెలకొంది. ఎక్కడ చూసినా వైఎస్ జగన్, రఘురామకృష్ణంరాజు ఫ్లెక్సీలే కనిపించాయి. ఈ కార్యక్రమం ద్వారా వైఎస్సార్‌సీపీ క్యాడర్‌లో ఉత్తేజం నెలకొంది. పార్టీ నేత ఆకెన వీరాస్వామి(అబ్బు) ఆర్థిక సహకారంతో ఏర్పాటుచేసిన విగ్రహాల ఆవిష్కరణ కార్యక్రమానికి జిల్లాలోని పార్టీ నాయకులంతా రావడంతోపాటు నియోజకవర్గంలోని పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ మోటారు సైకిళ్లు, కార్ల ర్యాలీతో హోరెత్తించారు.
Advertisement