హడలెత్తిస్తున్న హెలెన్
Published Fri, Nov 22 2013 4:15 AM | Last Updated on Sat, Sep 2 2017 12:50 AM
సాక్షి, ఏలూరు :హెలెన్ తుపాను ‘పశ్చిమ’ ప్రజలను హడలెత్తిస్తోంది. దిశమార్చుకున్న తుపాను నరసాపురం-మచిలీపట్నం మధ్య కేంద్రీకృతమై ఉందని వాతావరణ శాఖ ప్రకటించిన నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. బుధవారం రాత్రి వరకూ తుపాను ప్రభావం జిల్లాపై లేకపోవడంతో ప్రజలు, రైతులు ఊపిరి పీల్చుకున్నారు. తుపాను ఉన్నట్టుండి దిశమార్చుకుందని, కృష్ణా-పశ్చిమగోదావరి జిల్లాల మధ్య శుక్రవారం మధ్యాహ్నానికి తీరందాటే అవకాశం ఉందని సమాచారం వెలువడింది. రానున్న 48 గంటల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉం దని హెచ్చరికలు జారీ అయ్యూయి. తుపాను ప్రభావంతో గురువారం జిల్లావ్యాప్తంగా జల్లులు పడ్డాయి. విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వాతావరణం మేఘావృతమై ఉండగా, తీరప్రాంతం కల్లోలంగా మారింది. వరి కోతలు చేపట్టిన రైతులకు వణుకు పట్టుకుంది. ఏ క్షణాన భారీ వర్షాలు కురిసి పంటను మింగేస్తాయోనని కలవరపడుతున్నారు. పంటను దక్కించుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. తుపాను సమాచారం నేపథ్యంలో ప్రజాప్రతినిధులు, అధికారులు అప్రమత్తమయ్యారు. జిల్లాలో కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశారు.
నరసాపురం డివిజన్‌పై పెను ప్రభావం
నరసాపురం-మచిలీపట్నం మధ్య కేంద్రీకృతమైన హెలెన్ శుక్రవారం మధ్యాహ్నానికి తీరం దాటే అవకాశం ఉంది. గురువారం సాయంత్రం నుంచి తీరం వెంబడి 80 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తుండటంతో పలుచోట్ల చెట్లు నేలకూలాయి. హెలెన్ తీవ్ర తుపానుగా మారే ప్రమాదం ఉంది. అలలు మీటరు నుంచి మీటరున్నర ఎత్తుకు ఎగసిపడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావం తీరానికి సమీపంలో గల నరసాపురం, మొగల్తూరు, యలమంచిలి, భీమవరం మండలాలపై తీవ్రంగా పడే అవకాశం ఉంది. ఈ పరిస్థితుల్లో బియ్యపుతిప్ప, మర్రితిప్ప, దర్భరేవు, పెదమైనవానిలంక, లక్ష్మణేశ్వరం, కేపీ పాలెం, లోసరి, దొంగపిండి, నాగిడిపాలెం, వెదుర్లంక, వేములదీవి, యర్రంశెట్టివారి పాలెం గ్రామాల ప్రజలను యుద్ధప్రాతిపదికన సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు చేపట్టారు. ప్రజలు మొండిగా వ్యవహరించకుండా అధికారులకు సహకరించాలని కలెక్టర్ సిద్ధార్థజైన్ విజ్ఞప్తి చేశారు. నరసాపురం ప్రాంతానికి జాతీయ విపత్తుల నివారణ బృందాలను పంపించాలని ప్రభుత్వాన్ని కోరారు.
రెవెన్యూ మంత్రి ప్రత్యేక దృష్టి
తుపాను నేపథ్యంలో ప్రజలను, వారి ఆస్తులను రక్షించేందుకు అధికార యంత్రాంగం అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. గురువారం సాయంత్రం హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ సిద్ధార్థజైన్‌తో ఆయన మాట్లాడారు. అత్యవసరమైతే తీరప్రాంత ప్రజలను బలవంతంగానైనా సురక్షిత ప్రాంతాలకు తరలించి ప్రాణనష్టం జరగకుండా చూడాలని మంత్రి ఆదేశిం చారు. తుపాను బాధిత ప్రజలకు పునరావాస కార్యక్రమాలు అమలు చేయడంలో కొత్త సర్పంచ్‌లను భాగస్వాములను చేయాలన్నారు. సమాచార వ్యవస్థలకు అంతరాయం కలగకుండా చూడాలన్నారు. చేపల వేటకు వెళ్లిన వారిని వెనక్కి రప్పించేందుకు మత్స్య శాఖ అధికారులతో తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులెవరైనా సెలవులో ఉంటే వెనక్కి పిలిపించాలని ఆదేశించారు. నిధుల కోసం వెనకడుగు వేయవద్దని సూచించారు.
భారీ వర్షం కురుస్తుంది
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి మాట్లాడుతూ తుపాను ప్రభావంతో 25 సెంటీమీటర్ల వరకూ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. నీటిపారుదల శాఖ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. విపత్తుల నివారణ సంస్థ కమిషనర్ సి.పార్థసారథి మాట్లాడుతూ పశ్చిమగోదావరి జిల్లా నరసాపురం డివిజన్‌లో అత్యంత అప్రమత్తతతో ఉండాలన్నారు.
రైతుల గుండెల్లో ‘తుపాను’
ఖరీఫ్ వరి కోతలు ముమ్మరంగా సాగుతున్న తరుణంలో హెలెన్ తుపాను ముంచుకొస్తుండటం రైతుల్ని కలవరపెడుతోంది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 6లక్షల ఎకరాల్లో వరి పండించగా, సుమారు లక్ష ఎకరాల్లో కోతలు పూర్తయ్యాయి. వీటిలో 30 శాతం పంట పనలపై ఉంది. మెట్టలో 70 శాతం కోతలు పూర్తయ్యాయి. తుపాను తీవ్రమైతే డెల్టాలోని లక్షలాది ఎకరాల్లో పంటలకు భారీ నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది. పంటను కాపాడుకోవడానికి, కళ్లాల్లో ఉన్న ధాన్యాన్ని ఒబ్బిడి చేసుకోవడానికి కర్షకులు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. జిల్లాలో కాలువలకు నీటి విడుదలను తగ్గించారు.
Advertisement