మచిలీపట్నానికి చేరువలో హెలెన్ తుపాను
మచిలీపట్నం : తీరానికి మరింత చేరువైన హెలెన్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. మచిలీపట్నానికి ఆగ్నేయంగా...140 కి.మీ. దూరంలో కేంద్రీకృతం అయ్యింది. ఈరోజు మధ్యాహ్నం మచిలీపట్నం-నర్సాపురం మధ్య... తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ఆ సమయంలో గంటకు 70 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. దీంతో తుఫాను తీవ్రత తూర్పు తీరప్రాంతమంతా ఉండనుంది. తీరం వెంబడి సముద్రంలో అలలు భారీగా ఎగసి పడుతున్నాయి.
మచిలీపట్నం, బంటుమిల్లి, బందర్, అవనిగడ్డ, కోడూరు, నాగాయలంక మండలాలపై తుఫాను తీవ్ర ప్రభావం చూపిస్తోంది. ఈ మధ్యాహ్నం మచిలీపట్నం-నర్సాపురం మధ్య తుఫాను తీరందాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. తుఫాను తీవ్రత ఎక్కువగా ఉండడంతో తీరంలోని లోతట్టు ప్రాంతాల ప్రజలు గజగజలాడుతున్నారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. కాకినాడలో ఈదురుగాలులతో భారీ వర్షం కురుస్తోంది. ఉప్పాడ - కాకినాడ బీచ్ లో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. తుపాను దృష్ట్యా ఓడరేవుల్లో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. మచిలీపట్నం, నిజాంపట్నం ఓడరేవుల్లో... 10వ నంబర్ , కాకినాడ ఓడరేవులో 9వ నెంబరు, విశాఖ, గంగవరం, భీమిలి, కళింగపట్నం ఓడరేవుల్లో... 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక ఎగురవేశారు. ఇక తీరప్రాంతంలో ఉన్న పాఠశాలలకు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ నీతూప్రసాద్ సెలవు ప్రకటించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని.... సెలవులో ఉన్న సిబ్బంది తక్షణమే విధుల్లోకి చేరాలని ఆదేశించారు.
పశ్చిమ గోదావరి జిల్లాలో హెలెన్ దృష్ట్యా జిల్లా యంత్రాంగం అప్రమత్తం అయ్యింది. జిల్లా అధికారులతో కలెక్టర్ సిద్దార్ధ జైన్ సమావేశమై పరిస్థితి సమీక్షిస్తున్నారు. ఎనిమిది మండలాల పరిధిలో 37 గ్రామాల్లో తుఫాను ప్రభావం అధికంగా ఉన్నట్లు తెలిపారు. ఇక గుంటూరు జిల్లా పైన కూడా తుపాన్ ప్రభావం నెలకొంది. 39 గ్రామాలకు తుపాన్ ప్రభావం ఉంది. సముద్ర తీరం అల్లకల్లోలంగా మారింది. అలాగే నెల్లూరు జిల్లాపై కూడా హెలెన్ తుపాను ప్రభావం చూపుతోంది. సముద్ర తీరంలో అలలు ఎగసిపడుతున్నాయి. భారీగా ఈదురు గాలులు వీస్తున్నాయి.
లోతట్టు ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
హెలెన్ తుపాను హెల్ప్లైను నంబర్లు
కాకినాడ: 0884 - 2365506
ఏలూరు: 08812 - 230050
నరసాపురం: 08814 - 27699
కొవ్వూరు: 08813 - 231488
జంగారెడ్డిగూడెం: 08812 - 223660
మచిలీపట్నం: 08672 - 252572, 1077
విజయవాడ: 0866 - 2576217
విశాఖ: 1800 - 42500002