= అయినా అప్రమత్తం
= తీరప్రాంతాల్లోనే స్పెషల్ ఆఫీసర్లు
= లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి
ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాకు హెలెన్ తుపాను ముప్పు తప్పింది. మచిలీపట్నం వద్ద శుక్రవారం తుపాను తీరం దాటిందని తెలుసుకోవడంతో అధికారులు, ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. తుపాను ముప్పు తప్పినప్పటికీ భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని సమాచారం రావడంతో లోతట్టు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించారు. పదకొండు తీర ప్రాంతాలకు నియమించిన స్పెషల్ ఆఫీసర్లు తమకు కేటాయించిన ప్రాంతాల్లోనే ఉండి పరిస్థితులను సమీక్షిస్తున్నారు. జిల్లాకు స్పెషల్ ఆఫీసర్‌గా వచ్చిన ఎంటీ కృష్ణబాబు, కలెక్టర్ విజయకుమార్‌లు పలు ప్రాంతాలను సందర్శించి అక్కడి ఏర్పాట్లను పరిశీలించారు. ముఖ్యంగా చీరాల, వేటపాలెం, చినగంజాంల్లోని లోతట్టు ప్రాంతాల్లో నివసించే వారిని అవసరమైతే తరలించేందుకు సిద్ధంగా ఉండాలని ఆయా మండలాల అధికారులను ఆదేశించారు.
ఒంగోలులోని కలెక్టరేట్‌తోపాటు రెవెన్యూ డివిజనల్ కార్యాలయాలు, తహసీల్దార్ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్‌లు అలాగే ఉంచారు. తుపాను తీవ్రత జిల్లాపై ఎక్కువగా ఉంటుందని హెచ్చరికలు రావడంతో జాతీయ విపత్తుల నివారణ సంస్థ నుంచి నలభై మంది ప్రత్యేక సిబ్బందిని జిల్లాకు పంపించారు. వారిని ఒంగోలు, సింగరాయకొండ ప్రాంతాల్లో ఉంచి పరిస్థితి సమీక్షించారు. అయితే తుపాను ముప్పు తప్పిందని తేలడంతో శుక్రవారం వారిని మచిలీపట్నం పంపించారు. ఉదయం నుంచి ఆకాశం మేఘావృతం కావడం, చల్లని గాలులు వీయడం, ఒకటి రెండుచోట్ల చినుకులు పడటంతో భారీ వర్షాలు కురుస్తాయేమోనని ప్రజలు భయాందోళనలు చెందారు.
హై అలర్ట్ నుంచి రిలాక్స్..
హెలెన్ తుపాను తీవ్రత అంచనా వేయలేమంటూ రెండు రోజులుగా వస్తున్న హెచ్చరికలతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. పై-లీన్ ముప్పు తప్పినప్పటికీ ఆ తరువాత వచ్చిన భారీ వర్షాలు జిల్లాను అతలాకుతలం చేశాయి. తొమ్మిది మందిని బలిగొనడంతోపాటు వందల కోట్ల రూపాయల నష్టం కలిగింది. రైతాంగాన్ని కోలుకోనీయకుండా చేసింది. భారీ వర్షాల బీభత్సం నుంచి క్రమంగా బయటపడుతున్న తరుణంలో హెలెన్ రూపంలో హెచ్చరికలు రావడంతో ప్రజలతోపాటు అధికారులు ఆందోళనకు గురయ్యారు. తుపాను ఒంగోలు వద్ద తీరం దాటుతుందని తొలిరోజు వాతావరణ కేంద్రం నుంచి హెచ్చరికలు రావడంతో ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేసింది.
జిల్లాలోని పదకొండు తీర ప్రాంతాల మండలాలకు స్పెషల్ ఆఫీసర్లను నియమించి యుద్ధప్రాతిపదికన అక్కడకు చేరుకొని ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ విజయకుమార్ ఆదేశాలు జారీ చేశారు. సముద్రంలోకి వేటకు వెళ్లిన మత్స్యకారులను సకాలంలో రప్పించగలిగారు. అంతేగాకుండా వేటకు వెళ్లేందుకు సిద్ధమవుతున్న మత్స్యకారులను కూడా ఎక్కువ శాతం కట్టడి చేయగలిగారు. పునరావాస కేంద్రాలను కూడా సిద్ధం చేశారు. భారీ వర్షాల కారణంగా రవాణా వ్యవస్థ స్తంభిస్తే ప్రజలు ఇబ్బందులు పడరాదన్న ఉద్దేశంతో బియ్యం, ఇతర నిత్యావసర సరుకులను కూడా నిల్వ చేశారు.
అధికారులు, సిబ్బంది అంతా అందుబాటులో ఉండాలన్న ఉద్దేశంతో సెలవులు పెట్టిన వారిని కూడా వెనక్కు రప్పించారు. ఒకవైపు వాతావరణ కేంద్రం హెచ్చరికలు, ఇంకోవైపు అధికారుల హడావుడి ఏర్పాట్లను చూసిన ప్రజలు ఏ క్షణంలో ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని ఆందోళన చెందారు. ఎప్పటికప్పుడు తమ బంధువుల యోగక్షేమాలు తెలుసుకుంటూ గడిపారు. మచిలీపట్నం వద్ద తుపాను తీరం దాటిందని తెలియడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
మచిలీపట్నం వద్ద తప్పిన ముప్పు
Published Sat, Nov 23 2013 6:33 AM | Last Updated on Sat, Sep 2 2017 12:54 AM
Advertisement
Advertisement