క్రమంగా బలహీనపడుతున్నలెహర్
విశాఖపట్నం: రాష్ట్రానికి టెన్షన్ పుట్టించిన లెహర్ తుపాను క్రమంగా బలహీనపడుతోంది. కాకినాడ నుంచి మచిలీపట్నం వైపు దిశమార్చుకుని అతి తీవ్ర స్థాయి నుంచి తీవ్ర తుపానుగా బలహీనపడుతోంది. తీరం దాటే సమయంలో మరింత బలహీనపడి తుపానుగానే మారొచ్చని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. ప్రస్తుతం తుపాను పశ్చిమ వాయవ్య దిశగా మచిలీపట్నానికి 150 కి.మీ. దూరంలో కేంద్రీకృతమై ఉంది. ఈరోజు మధ్యాహ్నం మచిలీపట్నం వద్ద లెహెర్ తీరం దాటే అవకాశం ఉంది.
లెహర్ పశ్చిమవాయవ్య దిశగా పయనిస్తుందని, ఆ తుఫాన్ తీరం దాటే సమయంలో 80- 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. అలాగే తీరం దాటే సమయంలో భారీగా వర్షాలు కురుస్తాయని, గుంటూరు, ప్రకాశం, ఉభయగోదావరి జిల్లాలలో భారీ వర్షాలు, ఉత్తరకోస్తా జిల్లాలో కొన్ని చోట్ల వర్షాలు పడతాయని పేర్కొన్నారు.
లెహర్ ప్రభావంతో కోస్తాంధ్రలో విజయనగరం, శ్రీకాకుళం మినహా కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 29వ తేదీ వరకు ప్రభావం ఉంటుందని, ప్రకాశం జిల్లాతోపాటు తెలంగాణలోనూ వర్షాలు కురవొచ్చని పేర్కొన్నారు. తుపాను ప్రభావంతో కొన్నిచోట్ల 80 కి.మీ. నుంచి 90 కి.మీ. వేగంతో గాలులు వీస్తాయని, తీరం దాటే సమయంలో వీటి తీవ్రత మరింత ఉంటుందన్నారు. మచిలీపట్నంలో ఏడో నంబర్, ఓడరేవు, కాకినాడలో ఆరో నంబర్, నిజాంపట్నంలో 5వ నంబర్, మిగతా అన్ని పోర్టుల్లోనూ మూడో నంబర్ ప్రమాద హెచ్చరికల్ని జారీ చేశారు. తీర ప్రాంతాల్లో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, అలలు ఒక మీటరు ఎత్తు వరకు ఎగిసి పడొచ్చని, ఆస్తి నష్టం వాటిల్లే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
మచిలీపట్నం తీరంలోనే ఎందుకు: తుపాన్లు మచిలీపట్నంలోనే ఎందుకు తీరం దాటుతున్నాయన్న అంశంపై నిపుణులు విశ్లేషిస్తున్నారు. సాధారణంగా చల్లగాలులు వీస్తున్న కొద్దీ తుపాను బలహీనపడుతుంది. తుపాను ఎక్కడ తీరం దాటుతుందన్నది గాలి దిశపైనే ఆధారపడి ఉంటుంది. ప్రస్తుతం వాయవ్యం నుంచి గాలులు వీస్తుండడంతో మచిలీపట్నం వైపు తుపాను దూసుకొస్తోంది. తుపాన్లు సముద్రంలో ఉన్నప్పుడు చాలా శక్తి కావాలి. కావాల్సిన ఉష్ణోగ్రతలుంటేనే అవి బలపడతాయని, నదీ ముఖ ద్వారాలవైపే ప్రయణిస్తాయని వాతావరణశాఖ మాజీ అధికారి ఆర్.మురళీకృష్ణ అభిప్రాయపడ్డారు.