సాక్షి, అమరావతి : కాపుల రిజర్వేషన్ అంశంపై ఏపీ మంత్రి పితాని సత్యనారాయణ స్పందించారు. వెనుకబడిన వర్గాలకు నష్టం కలిగించే ఉద్దేశ్యం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, ఎన్నికల హామీని నెరవేర్చే క్రమంలోనే కాపులకు రిజర్వేషన్ కల్పించారని, బీసీల మనోభావాలు, ఆందోళన నెలకొన్న నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడితో వ్యక్తిగతంగా చర్చిస్తానని ఆయన తెలిపారు. ప్రస్తుతం పితాని సత్యనారాయణ అమెరికా పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా పితాని మంగళవారం మాట్లాడుతూ... ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల వెనుకబడిన వర్గాల్లో నెలకొన్న ఆందోళన నెలకొందని, తాను అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి అవసరమైతే బీసీ సంఘ ప్రతినిధులతో కూడా చర్చించేందుకు చొరవ తీసుకునే ప్రయత్నం చేస్తానని తెలిపారు.
కాపులకు రిజర్వేషన్ కల్పించే విషయమై ప్రభుత్వం ముందుగాని, నిర్ణయం వెల్లడించిన తరువాత గానీ వెనుకబడిన వర్గాల ప్రతినిధులతో సంప్రదింపులు చేసి ఉంటే ఇంత గందరగోళం ఉండేదికాదని బీసీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయని, ఈ విషయంలో తాను కూడా వారి అభిప్రాయంతో ఏకీభవిస్తున్నట్లు మంత్రి పితాని తెలిపారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి అండగా ఉన్న బీసీలకు నష్టం కలిగే విధంగా చంద్రబాబు నాయుడు వ్యవహరించరని, తమకు కూడా బీసీల ప్రయోజనమే ముఖ్యమని ఆయన అన్నారు. కాపు రిజర్వేషన్ అంశంపై వెనుకబడిన వర్గాలు సంయమనంతో వ్యవహరించాలని, సమస్య జఠిలం కాకుండా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందనే నమ్మకం తనకు ఉందన్నారు. అలాగే వాల్మీకి బోయలను ఎస్టీ జాబితాలో చేర్చడం హర్షణీయమని, దీనివల్ల వారి స్థితిగతులు మారతాయన్నారు.
Comments
Please login to add a commentAdd a comment