తెలుగుదేశం అధినేత చంద్రబాబు కుటిల రాజకీయ చాణక్యానికి కాలం చెల్లింది. ఆయన వేసే ఎత్తుగడలు, కుతంత్రాలు, చేసే మాయామర్మాలు సామాన్య ప్రజలకు సైతం అర్ధమైపోతున్నాయి. అయినా అయన ఇంకా వాటినే నమ్ముకున్నారు, అమలుచేస్తున్నారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో జరిగిన ఈఎస్‌ఐ కుంభకోణం బయటపడి అందులో... చంద్రబాబు క్యాబినేట్‌లో మంత్రులుగా పని చేసిన అచ్చెన్నాయుడు, పితాని సత్యనారాయణల ప్రమేయం ఉందని వెల్లడి కాగానే... ఉలిక్కిపడిన చంద్రబాబు ‘వారు బీసీలు కనుకనే ఆరోపణలు చేస్తున్నారు. బీసీలంటే సీఎం జగన్మోహన్‌రెడ్డికి పడదు’ అంటూ పాత పల్లవినే కొత్త రాగంలో అందుకున్నారు. ఐదేళ్ల తన పాలనలో బీసీ, ఎస్సీ, మైనారిటీలతో సహా అనేక వర్గాలను దూరం పెట్టి, వారిని దూరం చేసుకొన్నది స్వయంగా చంద్రబాబే!
దూరమైన వర్గాలను దగ్గర చేసుకోవడానికి తాపత్రయపడుతున్న చంద్రబాబు... సీఎం వైఎస్ జగన్‌పైన, రాష్ట్ర ప్రభుత్వపైన పసలేని ఆరోపణలతో బురద జల్లడానికి యధాశక్తి ప్రయత్నిస్తున్నారు. ఏ నాయకుడికి లేనివిధంగా ప్రతి చిన్న అంశాన్ని కులం కోణంలో చూడటం చంద్రబాబుకు అలవాటు. చట్టానికి కులం, మతం, ప్రాంతం ఉంటాయా? తప్పు చేసిన వారిని కులం దృష్టితో చూసి వదిలి వేసే విధానం భారతీయ శిక్షాస్మృతిలో గానీ, రాజ్యాంగంలో గానీ ఉన్నదా? ఈ విషయాలు చంద్రబాబుకు తెలియక కాదు. బడుగు బలహీన వర్గాలను తన రాజకీయ ఆయుధాలుగా, తన రక్షణ కవచాలుగా ఉపయోగించుకోవడానికి అలవాటు పడ్డ చంద్రబాబు ఈఎస్‌ఐ కుంభకోణంలో తన సహచర నాయకుల ప్రమేయం ఉన్నదని తెలియగానే వారి కులాన్ని తన రాజకీయ ప్రయోజనానికి వాడుకోవడానికి సిద్ధపడ్డారు.
బాబు ‘బీసీ’ థియరీ
బలహీనవర్గాలను రాజకీయంగా ఉపయోగించుకోవాలి కానీ వారు రాజకీయంగా సాధికారత సాధించరాదన్నది చంద్రబాబు వ్యూహంగా కనిపిస్తుంది. తాజా ఉదంతాన్ని పరిశీలిస్తే... స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు 34 శాతం, ఎస్సీలకు 19.08 శాతం ఎస్టీలకు 6.77 శాతం మొత్తం 59.85 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తీర్మానం చేసి ఆ మేరకు జీవో జారీ చేసింది. హైకోర్టు దీనిపై అభ్యంతరం తెలపలేదు. కానీ... తెలుగుదేశం పార్టీ నేత అయిన బి. ప్రతాపరెడ్డి అనే వ్యక్తి దానిపై సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో... తొలుత ‘స్టే’ ఇచ్చిన సుప్రీంకోర్టు.. ఈ రిజర్వేషన్ల అంశంపై రాష్ట్ర హైకోర్టులో నిర్ణయం జరిగేలా ఆదేశాలు జారీ చేసింది. చివరకు హైకోర్టు అన్ని రకాల రిజర్వేషన్లు 50 శాతం మించరాదని రూలింగ్ ఇవ్వడంతో బీసీలకు వర్తింపజేయాలనుకున్న కోటాలో 9.85 శాతం కోత పడి బీసీలకు వేలాది సంఖ్యలో పదవులు చేపట్టే అవకాశం లేకుండా పోయింది. బీసీలకు మరోమారు అన్యాయం చేయడానికి టీడీపీ పాల్పడిన అనైతిక చర్య బయటపడగానే తమకు అలవాటైన రీతిలో ‘దొంగే దొంగ దొంగ...’ అన్నట్లు రాష్ట్ర ప్రభుత్వమే పనిగట్టుకొని బీసీ రిజర్వేషన్లను తగ్గించే ప్రయత్నం చేసిందంటూ పచ్చ మీడియాతో బురద జల్లిస్తున్నారు.
బీసీలంటే బాబుకు చులకన
బీసీ వర్గాలను ఓటు బ్యాంకుగా వాడుకోవడమే తప్ప... బీసీలను అన్ని రంగాలలో ప్రోత్సహించి, గౌరవించి వారికి సాధికారత కల్పించాలన్న ఆలోచన చంద్రబాబుకు ఏనాడు లేదు. ఈఎస్‌ఐ కుంభకోణంలో చిక్కుకొన్న తన పార్టీనేతలు బీసీలు కనుకనే... వారిని ఇరికించారని మాట్లాడిన చంద్రబాబు ఒకసారి గతంలోకి తొంగి చూడాల్సిన అవసరం ఉంది. 2000వ సంవత్సరంలో క్యాబినెట్ మంత్రిగా ఉన్న కృష్ణాయాదవ్ ‘తెల్గీ స్టాంప్‌ల’ కుంభకోణంలో చిక్కుకొన్నాడని తెలియగానే... క్షణం కూడా ఆలస్యం చేయకుండా.. సీఎంగా ఉన్న చంద్రబాబు అతనిని మంత్రి పదవి నుంచి తప్పించాడు. పైగా, ఎంతో సాహాసోపేతంగా వెంటనే చర్య తీసుకున్నట్లుగా పత్రికల్లో రాయించుకున్నారు. కృష్ణాయాదవ్ బీసీ నేత అయినా తప్పుచేశారు కనుక ఉపేక్షించలేదు. ఆ ధర్మం ఇప్పుడు వర్తించదా? వందలాది కోట్ల విలువైన స్కామ్ జరిగితే.. కులాన్ని చూసి నిందితులను వదిలిపెట్టాలా? తన ప్రభుత్వంలో ఒక ధర్మం... వేరొకరి ప్రభుత్వంలో మరో ధర్మం ఉంటుందా? కులం కార్డును బాబు తనకు అనుకూలంగా ఎలా ఉపయోగించుకుంటాడో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే.
2004లో ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికలో డా‘‘ వై.ఎస్. రాజశేఖరరెడ్డి ప్రభంజనంలో తెలుగుదేశం ఓటమి పాలయిన తర్వాత... బీసీ కులాలను దగ్గర చేసుకోవడానికి ప్రతిపక్షనేతగా చంద్రబాబు 2007లో వరంగల్‌లో ‘బీసీ గర్జన’ పేరిట భారీ సభ నిర్వహించారు. ప్రధాన బీసీ వర్గాల వారి సమక్షంలో జరిగిన ఆ సభలో బీసీలకు తెలుగుదేశం పార్టీ 33 శాతం మేర.. అంటే 100 పార్టీ టిక్కెట్లు కేటాయిస్తుందంటూ ఓ డిక్లరేషన్ రూపొందించి అందరి హర్షధ్వానాల మధ్య దానిని ఆమోదించారు’. రెండేళ్ల తర్వాత, అంటే... 2009 ఎన్నికలలో చంద్రబాబు అర కొరగా బీసీలకు సీట్లు ఇచ్చి యధావిధిగా బీసీలను మోసం చేశారు. బీసీలు ఆర్థికంగా బలహీనులు కనుక వారికి 33 శాతం టిక్కెట్లు ఇచ్చినా గెలవలేరంటూ సాకు చూపి మరీ మోసం చేశారు.
1999లో ఆనాడు కేంద్రంలోని వాజ్‌పేయి నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీని చేరమని బీజేపీ కోరింది. అయితే ఎంపీలుగా ఉన్న కె. ఎర్రన్నాయుడు, అల్లాడి రాజ్‌కుమార్ మొదలైన బీసీ నాయకులు కేంద్ర మంత్రులయితే... తన ఇమేజ్ తగ్గిపోతుందనే ఏకైక కారణంతో 29 మంది లోక్‌సభ సభ్యుల బలం ఉన్నప్పటికి ఎన్డీయే ప్రభుత్వంలో చేరకుండా బయట నుంచి సపోర్టు చేస్తాం అనే పేరుతో సరిపెట్టారు. కాగా, 2014లో నరేంద్రమోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వంలో చేరడానికి సిద్ధపడి, సీనియర్, సమర్ధుడు అయిన బీసీ నేత కొనకళ్ల నారాయణను పక్కన పెట్టి... ఒకటి అశోకగజపతి రాజుకు, రెండోది జూనియర్ అయిన సుజనా చౌదరికి కట్టబెట్టి... బీసీలకు చంద్రబాబు మరోసారి అన్యాయం చేశారు.
బీసీల పట్ల బాబు వ్యతిరేక వైఖరి
2014 ఎన్నికలలో నరేంద్రమోదీ, పవన్‌కళ్యాణ్‌ల బలంతో స్వల్ప ఓట్ల వ్యత్యాసంతో అధికార పీఠం ఎక్కిన చంద్రబాబు తన ఐదేళ్ల పాలనలో అడుగడునా బలహీనవర్గాల వ్యతిరేక వైఖరిని నిసిగ్గుగా బహిర్గతపర్చారు. న్యాయమూర్తులుగా పని చేయడానికి బీసీ వర్గాల అభ్యర్థులు పనికిరారంటూ బాబు రాసిన లేఖ బహిర్గతమైనప్పుడు... ఆయన అసలు స్వరూపం ఏమిటో ప్రజలకు అవగతమైంది. అదే విధంగా, తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సచివాలయానికి వచ్చిన బలహీనవర్గాల ప్రతినిధులను సీఎం హోదాలో చంద్రబాబు బెదిరించిన వైనాన్ని ఎవ్వరూ మర్చిపోలేరు. పార్టీలో సీనియర్ నేతగా, నిజాయితీపరుడిగా పేరు తెచ్చుకొన్న దళితనేత మోత్కుపల్లి నర్సింహులుకు గవర్నర్ పదవి ఇవ్వాలని ప్రధాని నరేంద్రమోదీని అడుగుతున్నానంటూ ప్రచారం చేసి... చివరకు చంద్రబాబు ఆయనకు అన్యాయం చేశారు. రాజ్యసభ సీటును ఎగ్గొట్టడానికి ఆయనకు గవర్నర్ పదవి ఆశ చూపి... చివరకు ఏదీ లేకుండా ఆయనంతట ఆయనే పార్టీ నుంచి నిష్క్రమించే పరిస్థితుల్ని చంద్రబాబు కల్పిం చారు.
దళితులంటే చంద్రబాబుకు ఏ పాటి గౌరవమో చెప్పడానికి ఈ ఉదంతం చాలదా? తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి వున్న మరో దళిత నాయకుడు జె.ఆర్. పుష్పరాజ్‌ను బయట కుర్చోబెట్టి... చంద్రబాబు తన చాంబర్ లోపల ఓ పారిశ్రామికవేత్తతో బేరం కుదుర్చుకొని ఆయనకు రాజ్యసభ సభ్యత్వం కట్టబెట్టారంటూ... ఆ పార్టీ నేతలే ఇప్పటికీ బహిరంగంగా వ్యాఖ్యానిస్తుంటారు. వైఎస్సార్‌సీపీ మీద గట్టిగా విమర్శలు చేయించడానికి ఉపయోగించుకొన్న పార్టీ దళితనేతల్లో ఒకరైన వర్ల రామయ్యకు రాజ్యసభ సభ్యత్వం ఇస్తున్నామని ప్రకటించి, తీరా.. ఆయన తన ఇంటినుంచి బయలుదేరి తాడేపల్లికి చేరుకునే సమయానికి జాబితాలో ఆయన పేరును తప్పించి సొంత సామాజికవర్గానికి చెందిన కనకమేడల రవీంద్రకుమార్‌కు రాజ్యసభ పదవి ఇవ్వటం పట్ల తెలుగు సమాజం ఆనాడు నిర్ఘాంతపోయింది.
అమరావతి కాంతుల్లో ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించిన భూముల్లో 5 శాతం మొత్తాన్ని బడుగు బలహీన వర్గాలకు కేటాయిస్తామంటూ చట్టం తెచ్చిన చంద్రబాబు ఐదేళ్లపాటు అధికారంలో ఉన్నప్పుడు దానిని అమలు చేయలేదు. ప్రస్తుత ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్‌మోహన్‌రెడ్డి పేదలకు, బలహీనవర్గాలకు న్యాయం చేయడానికి ఆ ప్రాంతంలోని 1250 ఎకరాలను 54 వేల కుటుంబాల వారికి పంచి పెట్టడానికి ఇళ్ల పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేపట్టగానే... చంద్రబాబు దానిని అడ్డుకోవడానికి కొందరితో న్యాయస్థానంలో కేసులు వేయిస్తున్నారు. చంద్రబాబుకు బలహీన వర్గాల మీద అభిమానం వుంటే పట్టాలిచ్చే కార్యక్రమాన్ని అడ్డుకొంటారా?
దేహంలో అంతర్భాగమే
దివగంత నేత మాజీ ముఖ్యమంత్రి డా‘‘ వై.ఎస్. రాజశేఖరరెడ్డి బడుగు బలహీన వర్గాల వారిని సమాజమనే దేహంలో అంతర్భాగంగానే పరిగణించారు. వారి సాధికారతకు ఫీజుల రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ వంటి పథకాలు అమలు చేశారు. పలు వెనుకబడిన కులాలను బీసీ జాబాతాలో చేర్పించి... వారికి న్యాయం చేశారు. వైఎస్సార్ ఏనాడూ కుల, మత రాజకీయాలు చేయలేదు. ఆయన చూపిన బాట లోనే ఆయన వారసుడిగా రాష్ట్ర ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ బడుగు బలహీనవవర్గాలకు క్యాబినెట్ కూర్పు మొదలుకొని అన్నింటా సముచిత ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇది చూసి ఓర్వలేని చంద్రబాబు ఈ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి కులం రంగు పులమాలని విశ్వప్రయత్నం చేస్తున్నారు. జరగబోయే మున్సిపల్, పంచాయితీ ఎన్నికలలో లబ్ధి పొందడానికి చంద్రబాబు తనకు తెలిసిన పాత విద్యలనే మళ్లీ ప్రయోగిస్తున్నారు. చంద్రబాబు అవినీతి, ఆశ్రిత పక్షపాతంపట్ల ప్రజలు ఇచ్చిన తిరుగులేని తీర్పు మరోసారి పునరావృతం కావాలి. ప్రజలు విజ్ఞులు. ఆ విజ్ఞత మరోసారి చాటాలి. చంద్రబాబు బడుగు బలహీన వర్గాల వ్యతిరేక వైఖరికి శాశ్వత సమాధి కట్టాలి.
సి. రామచంద్రయ్య
వ్యాసకర్త మాజీ మంత్రి, ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్‌సీపీ
Comments
Please login to add a commentAdd a comment