అట్టడుగు వర్గాలపై ఇంత అక్కసా? | C Ramachandraiah Guest Column On Chandrababu Naidu Rude Behavior With Nayi Brahmins | Sakshi
Sakshi News home page

అట్టడుగు వర్గాలపై ఇంత అక్కసా?

Published Fri, Jun 29 2018 8:59 AM | Last Updated on Fri, Jun 29 2018 9:05 AM

C Ramachandraiah Guest Column On Chandrababu Naidu Rude Behavior With Nayi Brahmins - Sakshi

సమస్యలు విన్నవించేందుకు వచ్చిన క్షురకులను బెదిరిస్తూ వేలు చూపించిన సీఎం చంద్రబాబు

సంప్రదాయ వృత్తులు, సేవల ద్వారా ఆర్థిక, సామాజిక వ్యవస్థకు వెన్నెముకగా ఉన్న వర్గాల వారికి వారు చేసే సేవలకు తగిన పారితోషికం లభించకపోగా ఆ వృత్తులను చంద్రబాబు వంటి సీఎంలు నీచంగా, అపవిత్రంగా హేళనగా చూస్తూ అగౌరవించడం అనాగరికం. ఆంధ్రప్రదేశ్‌లో వెనుకబడిన ప్రాంతాలకు అన్యాయం జరుగుతున్నది. బలహీనవర్గాల దోపిడీ జరుగుతున్నది. పైగా, వారి ఆత్మగౌరవాన్ని దారుణంగా దెబ్బతీస్తున్నారు. హేళన చేస్తున్నారు. చిన్నచూపు చూస్తున్నారు. సీఎం చంద్రబాబు తన ఫ్యూడల్‌ భావజాలాన్ని వదులుకొని బీసీలకు న్యాయం చేయనట్లయితే.. అందుకు తగిన మూల్యాన్ని రాబోయే ఎన్నికలలో చెల్లించక తప్పదు.

సందర్భం

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇటీవల నాయీ బ్రాహ్మణుల పట్ల ప్రవర్తించిన తీరు, చేసిన తీవ్ర వ్యాఖ్యలు ఏపీ ప్రజలకు షాక్‌ కలిగించాయి. ఆంధ్రప్రదేశ్‌లోని దేవాలయాలలో పనిచేసే క్షురకులు తమకు ప్రభుత్వం ఇస్తున్న పారితోషికాన్ని పెంచాలని చాలా కాలంగా కోరుతున్నారు. ప్రభుత్వం ఏర్పాటై నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా మేనిఫెస్టోలో తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ నాయీ బ్రాహ్మణులు ఆందోళనకు దిగడంలో తప్పేముంది? కానీ, ప్రభుత్వం తగిన రీతిలో స్పందించలేదు. ఈ నేపథ్యంలో నాయీబ్రాహ్మణ ప్రతినిధులు తమ డిమాం డ్లను పరిష్కరించాలంటూ అమరావతి సచివాలయానికి వెళ్లారు. అదే సందర్భంలో కాన్వాయ్‌లో సచివాలయానికి వస్తున్న  బాబుకు నాయీబ్రాహ్మణ ప్రతి నిధులు ఎదురుగా కన్పించారు. తానుండే సచివాలయ బిల్డింగ్‌కు వారు రావడం సీఎంకు రుచించలేదు. వాహనం దిగిన వెంటనే బాబు ఆగ్రహంతో ఊగిపోతూ నాయీబ్రాహ్మణ ప్రతినిధులవైపు దూసుకువెళ్లారు. తన చూపుడువేలును వారివైపు చూపిస్తూ, వారిని హెచ్చరిస్తూ బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. సమాజంలో అట్టడుగు వర్గాల పట్ల ఉండాల్సిన సానుభూతి కించిత్తు లేనివిధంగా సీఎం ప్రవర్తించిన తీరుకు సభ్యసమాజం నివ్వెరపోయింది. 

నాయీ బ్రాహ్మణులు కోరిన కోర్కెలేమీ గొంతెమ్మ కోర్కెలు కావు. వారి హామీలను నెరవేర్చితే రాష్ట్ర ఖజానాపై విపరీత భారమేమీ పడదు. ఒక వేళ వారు చేసిన డిమాండ్లలో సహేతుకత కొంత లేదనే అనుకొందాం.. కానీ సంప్రదింపుల ద్వారా, వాస్తవ పరిస్థితులను తెలియజెప్పి వారిని ఒప్పించగలిగే నేర్పును ప్రభుత్వం చూపాలి. మీడియా కెమెరాలు తన చుట్టూ ఉన్నాయని తెలిసినప్పటికీ నాయీ బ్రాహ్మణులపట్ల అలా దురుసుగా, కర్కశంగా, ఉన్మాదంగా వ్యవహరించారంటే అర్థం.. బలహీనవర్గాల వారెవరూ భవిష్యత్‌లో తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ సచివాలయం వైపు కన్నెత్తి చూడరాదన్న సంకేతాన్ని బలంగా తెలియజెప్పడమే!

ద్వంద్వ ప్రమాణాలు 
ఎన్నికల సంవత్సరంలోకి అడుగుపెట్టినా అధికారపార్టీ ఇచ్చిన హామీలు నెరవేరనప్పుడు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికి ఆయా సామాజికవర్గాల వారు ఆందోళన బాట పట్టడం నేరం అవుతుందా? అదే నిజమైతే.. నాలుగేళ్ళపాటు బీజేపీతో చెట్టాపట్టాలు వేసుకొని అధికారాన్ని పంచుకొని ఎన్నికలు ముంచుకొస్తున్న వేళ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి తెలుగుదేశం ఇప్పుడు ఆందోళనలు చేయడంలో అర్ధమేమిటి? టీడీపీ ఏమి చేసినా అది పవిత్రం, పోరాటం. ఇతర పార్టీలు, కుల సంఘాలు ప్రభుత్వాన్ని నిలదీస్తే.. అది అపవిత్రం, అనైతికం. నిజానికి  నిరసన తెలిపే హక్కు ప్రజాస్వామ్యంలో అందరికీ ఉందన్న స్పృహ సీఎం చంద్రబాబుకు లోపించింది. రాష్ట్రానికి ప్రత్యేక హాదా సాధన కోసం అంటూ తన పార్టీ ఎంపీలతో పార్లమెంట్‌ ఆవరణలోనే నిరసన ప్రదర్శనలు, విచిత్ర వేష విన్యాసాలు చేయించారు. ప్రజల సొమ్ముతో ధర్మదీక్షలు, నవనిర్మాణ దీక్షలంటూ చేసి కేంద్రాన్ని, ప్రధాని మోదీని, ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్‌పార్టీ, జనసేనలతో పాటు వామపక్షాలను సైతం తిట్టిపోశారు. ఆ వేదికల నుంచి బాలకృష్ణ వంటివారు సభ్యసమాజం భరించలేని బూతుపురాణాలను వల్లించారు. ఇదంతా బాబుగారు చేసే ప్రజాస్వామ్య పోరాటం! కానీ, నాయీ బ్రాహ్మణులు తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సచివాలయంలోకి అడుగుపెడితే బాబుగారు సహిం చలేకపోయారు. ఇటువంటి ద్వంద్వ ప్రమాణాలు పాటించడం బాబుకు కొత్తేమీ కాదు.

బీసీల పట్ల కపట ప్రేమ
ఈ ఘటన కంటే ముందే బాబు అసలు రంగేమిటో, వెనుకబడిన వర్గాల పట్ల ఆయన అనుసరించిన దుర్మార్గపు వైఖరి ఏవిధంగా ఉన్నదో.. వెనుకబడిన వర్గాల జాతీయ కమిషన్‌కు చైర్మన్‌గా పనిచేసిన జస్టిస్‌ ఈశ్వరయ్యగౌడ్‌ బయటపెట్టారు. న్యాయవాద వృత్తిలో సీనియర్లుగా ఉండి, అన్ని అర్హతలు కలిగిన వారిని హైకోర్టు జడ్జీలుగా నియామకం చేసే ముందు ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయం కోరడం ఓ సాంప్రదాయంగా కేంద్రప్రభుత్వం పాటిస్తున్నది. అందులో భాగంగానే ఏపీ, తెలంగాణల నుంచి హైకోర్టు జడ్జీలుగా ఎంపిక చేయడానికి తెలుగు రాష్ట్రాల సీఎంలకు కేంద్రం ఏప్రిల్‌ 30, 2016న అభ్యర్థుల జాబితాను పంపింది. తనకందిన జాబితాపై ఎటువంటి అభ్యంతరాలు వ్యక్తం చేయకుండా తెలంగాణ సీఎం కేసీఆర్‌ ఆమోదం వ్యక్తం చేయగా.. బాబు మాత్రం 11 నెలలపాటు నిర్ణయం చెప్పకుండా జాప్యం చేశారు. చివరకు మార్చి 21, 2017న.. తనకందిన జాబితాలోని ఇద్దరు బీసీలు, ఒక ఎస్సీ, మరొక బ్రాహ్మణ కులానికి చెందిన అభ్యర్థులకు  నైపుణ్యాలు లేవని, వారికి నిబద్ధత లేదని, జడ్జీలుగా నియమించడానికి తగిన అర్హతలు వారిలో ఏమాత్రం లేవంటూ బాబు కేంద్రానికి లేఖలు రాశారు. అయినప్పటికీ ఆ అభ్యర్థుల అర్హతల ఆధారంగా కేంద్రం వారిని జడ్జీలుగా నియమించింది. 

సీఎం చంద్రబాబు కేవలం సదరు అభ్యర్థులు హైకోర్టు న్యాయమూర్తులు కాకుండా ఉండేందుకే జాప్యం చేశారని, వారికి వ్యతిరేకంగా లేఖ రాశారని స్పష్టమైంది. ఇదే అంశాన్ని జస్టిస్‌ ఈశ్వరయ్య బయటపెట్టడంతో.. చంద్రబాబుకి బలహీన వర్గాల పట్ల ఉన్న వ్యతిరేకత నగ్నంగా బయటపడింది. చంద్రబాబు వైఖరి చాలా మందికి తీవ్ర ఆవేదన కలిగిం చింది. ఓట్లకోసం బయటకు బీసీ జపం చేస్తూ.. బీసీలను అణగదొక్కే బాబు వైఖరిని చాలా మంది జీర్ణిం చుకోలేక పోయారు. నిజానికి తెలుగు రాష్ట్రాలను కుదిపివేసే ఈ వార్తపై ఏ ఒక్క మీడియా కూడా బహిరంగ చర్చ నిర్వహించలేదు. రాష్ట్ర ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు బాబుని వెనకేసుకురావడానికి  తాపత్రయ పడ్డారు. గతంలో తమ హయాంలో జడ్జీలుగా బీసీలను నియమించామని సమర్థించుకున్నారు. కానీ.. న్యాయమూర్తులుగా బీసీలు పనికిరారని బాబు లేఖ రాసిన విషయాన్ని సమర్ధించుకోలేకపోయారు. బీసీలు మాత్రమే కాదు.. ఎస్సీల పట్ల కూడా బాబు అనుచితంగా మాట్లాడటం గమనార్హం.‘‘కావాలని ఎవరు ఎస్సీల్లో పుడతారు?’’ అంటూ బాబు చేసిన వ్యాఖ్యను ఎవ్వరూ మర్చిపోలేరు. 

ఫ్యూడల్‌ మనస్తత్వం
ప్రజలందరినీ కుల, మత, ప్రాంత వివక్ష లేకుండా ఆదరించాల్సిన ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి బలహీన వర్గాలను కించపర్చే విధంగా మాట్లాడ్డం, నిర్ణయాలు తీసుకోవడం గతంలో ఎప్పుడూ లేదు. బలహీనవర్గాల పట్ల, మరికొన్ని వర్గాలపట్ల చంద్రబాబుకు చులకన భావమే కాదు.. వ్యతిరేక భావం కనిపిస్తోంది. ఇది ఆయన ఫ్యూడల్‌ మనస్తత్వానికి అద్దం పడుతుంది. భౌతిక శ్రమ చేస్తూ సంపద సృష్టికి మూల కారకుల్లో అధికశాతం మంది ఎస్టీలు, ఎస్సీలు, బీసీలే! సమాజానికి సర్వ సంపద సృష్టించేవారు, మనిషి నాగరికంగా కన్పించడానికి కారకులైనవారు.. బాబుకు చులకనగా కనిపిస్తున్నారు. అందరికీ సమాన అవకాశాలు కల్పించాలన్న మహోన్నత ఆశయంతో భారత రాజ్యాంగాన్ని రాసిన డా‘‘ బీఆర్‌ అంబేడ్కర్‌ కూడా ఒక సందర్భంలో ‘‘రాజ్యాంగంలో వెనుకబడిన కులాల పరిరక్షణకు ఎలాంటి ఏర్పాట్లు చేయనందుకు నేను చాలా చింతిస్తున్నాను. రాష్ట్రపతి చేత ఏర్పాటు చేయబడిన కమిషన్‌ ప్రతిపాదనలకు అనుగుణంగా ప్రభుత్వాలే ఆ పనికి పూనుకోవాలని మేం భావిస్తున్నాం’’ అని ప్రకటించారు. 

పేరుకే బీసీల జపం
ఓట్ల రాజకీయం కోసం బాబు వేసుకొన్న అనేక ముసుగుల్లో ‘సామాజకన్యాయం’ ఒకటి. ఎన్టీఆర్‌ నేతృత్వంలోని తెలుగుదేశంపార్టీ బీసీలకు సముచిత ప్రాధాన్యం ఇచ్చిన మాట నిజం. కానీ.. పార్టీ పగ్గాలు చంద్రబాబు చేతికొచ్చాక.. సామాజిక న్యాయం ఒక నినాదంగానే మిగిలింది. 2007లో ‘వరంగల్‌ బీసీ సభ’ నిర్వహించిన బాబు.. బీసీలకు 100 సీట్లు ఇస్తానని డిక్లరేషన్‌ ప్రకటించారు. కానీ, 2009లో ఇచ్చిన మాట తప్పారు. 2014లో ఆ ఊసే లేదు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో బీసీలకు నామమాత్రపు ప్రాతినిధ్యమే తప్ప.. వారి జనాభా ప్రాతిపదికన సీట్లు కేటాయించడం లేదు. బీసీలు మెజార్టీగా ఉన్న శ్రీకాకుళం, అనంతపురం మినహా లోక్‌సభ అభ్యర్థులుగా బీసీలకు టికెట్లివ్వడం లేదు. అనకాపల్లి, కాకినాడ, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, గుంటూరు, నర్సరావుపేట వరకు రెండు కులాలకే లోక్‌సభ టికెట్లు కేటాయించారు. అసెంబ్లీ టిక్కెట్ల కేటాయింపుల్లో బీసీలకు మొండి చేయి చూపారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో వృత్తిదారులైన బీసీ కులాలు అనేకం ఉన్నాయి. వారందరికీ దశాబ్దాలుగా అన్యాయం జరుగుతోంది. 2019 ఎన్నికల్లో విశాఖ జిల్లా నుంచి అనంతపురం జిల్లా వరకు ఎంతమంది బీసీలకు టికెట్లిస్తారో బాబు చెప్పగలరా? 

బాబు అభివృద్ధి ఎజెండాలో బలహీన వర్గాలకు చోటు లేదు. విశాలమైన రోడ్లు, ఐకానిక్‌ బిల్డింగ్‌లు మాత్రమే అభివృద్ధికి సంకేతమని బాబు నమ్ముతారు. అందుకే తను చేసిన సైబరాబాద్‌ నిర్మాణం వల్లనే తెలంగాణలో ఆదాయం పెరిగిందని పదే పదే చెప్పారు. అంతే తప్ప 80%గా ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఆదాయాలు, జీవనప్రమాణాల మెరుగుదలతోనే అభివృద్ధి సాధ్యమని బాబు గ్రహించకపోవడం దురదృష్టం. నూతనంగా ఏర్పడిన  ఏపీలో వెనుకబడిన ప్రాంతాలకు అన్యాయం జరుగుతున్నది. బలహీనవర్గాల దోపిడీ జరుగుతున్నది. పైగా, వారి ఆత్మగౌరవాన్ని దారుణంగా దెబ్బతీస్తున్నారు. హేళన చేస్తున్నారు. చిన్న చూపు చూస్తున్నారు. బాబు తన ఫ్యూడల్‌ భావజాలాన్ని వదులుకొని బీసీలకు న్యాయం చేయనట్లయితే.. అందుకు తగిన మూల్యాన్ని రాబోయే ఎన్నికలలో చెల్లించక తప్పదు.

వ్యాసకర్త
మాజీ ఎంపీ సి. రామచంద్రయ్య
ఫోన్‌ : 81069 15555

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement