సాక్షి, అమరావతి: టీడీపీ రాష్ట్రస్థాయి సమన్వయ కమిటీ సమావేశం మంగళవారం వాడీవేడిగా జరిగింది. అధినేత చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు అంశాలు చర్చకు వచ్చినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం తెలుస్తోంది. ముఖ్యంగా జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌పై విమర్శలు చేసిన మంత్రి పితాని సత్యనారాయణను చంద్రబాబు మందలించినట్టు తెలిసింది. పవన్‌పై అలాంటి వ్యాఖ్యలు చేయొద్దని పితానిని సీఎం చంద్రబాబు హెచ్చరించినట్టు సమాచారం.
ఇటీవల పవన్ కల్యాణ్‌తో టీడీపీ మైత్రీ కొనసాగుతుందా? అంటూ మంత్రి పితానిని విలేకరులు ప్రశ్నించగా.. పవన్ కల్యాణ్‌కు ఏపీలో పార్టీ జెండానే లేదు.. ఆయన గురించి ఆలోచించే ఓపిక, టైమ్ రెండూ లేవంటూ పితాని ఘాటు వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. పవన్ టీడీపీకి మిత్రపక్షమని, కాబట్టి ఆయన గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలని, అనవసర వ్యాఖ్యలు చేయకూడదని చంద్రబాబు టీడీపీ నేతలకు హితబోధ చేసినట్టు సమాచారం.
విజయవాడలో ఇటీవల ప్రారంభించిన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపైనా సమావేశంలో చర్చ జరిగింది. విజయవాడలో టీడీపీ రాష్ట్ర కార్యాలయం ఏర్పాటుచేయకపోవడంపై మంత్రి దేవినేని ఉమాపై చంద్రబాబు ఈ సందర్భంగా ఆగ్రహం వ్యక్తం చేసినట్టు సమాచారం. చంద్రబాబు ఆగ్రహంతో స్పందించిన దేవినేని ఉమా.. 'మీ అనుమతి కోసం ఎదురుచూస్తున్నాం' అని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. కానీ, 'అన్నీ నీకు నచ్చినట్టు చేసి.. పార్టీ కార్యాలయం ఏర్పాటులో మాత్రం నా అనుమతి కావాలంటావా?' అని చంద్రబాబు ఉమాపై మండిపడినట్టు తెలుస్తోంది. త్వరలోనే విజయవాడలో టీడీపీ రాష్ట్ర కార్యాలయానికి శంకుస్థాపన చేయాలని సమావేశంలో నిర్ణయించారు.
కేసీఆర్ వచ్చినప్పుడు తెలుగు తమ్ముళ్ల అతి..!
మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ పెళ్లి గురించి సమన్వయ కమిటీ భేటీలో చర్చ జరిగింది. శ్రీరామ్ పెళ్లికి తెలంగాణ సీఎం కేసీఆర్ వచ్చిన తెలుగు తమ్ముళ్ల నుంచి విశేషమైన స్పందన వచ్చిన సంగతి తెలిసిందే. పెళ్లికి కేసీఆర్ వచ్చినప్పుడు మనవాళ్లు అతిగా ప్రవర్తించారని చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు సమాచారం. తన కన్నా కేసీఆర్‌కే తెలుగు తమ్ముళ్లు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని చంద్రబాబు నొచ్చుకున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా.. పయ్యావుల కేశవ్‌తో సీఎం కేసీఆర్ రహస్య చర్చలు జరిపారంటూ గందరగోళం సృష్టించారని, ఇలాంటి విషయాల్లో పరిమితంగా ప్రవర్తిస్తే మంచిదని నేతలకు చంద్రబాబు హితబోధ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment