పితాని ఎక్కడ? | Pithani finds the going tough in native Achanta | Sakshi
Sakshi News home page

పితాని ఎక్కడ?

Published Sat, Jul 12 2014 1:54 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

పితాని ఎక్కడ? - Sakshi

పితాని ఎక్కడ?

- ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాల్లో కానరాని సీనియర్ నేత
- మంత్రి పదవి ఆశించి భంగపాటు
- వ్యూహాత్మక మౌనమా.. అసంతృప్త రాగమా!
- టీడీపీ శ్రేణుల్లో ఎడతెగని చర్చ

సాక్షి ప్రతినిధి, ఏలూరు : పితాని సత్యనారాయణ.. గడచిన దశాబ్ద కాలంలో అప్పటి అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధి. ఇప్పుడు కూడా అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రజాప్రతినిధే. కాంగ్రెస్ హయాంలో ఐదేళ్లపాటు మంత్రిగా జిల్లా రాజకీయాలను కనుసైగలతో శాసించిన పితాని టీడీపీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచారు. గడచిన 50 రోజుల కాలంలో ఎక్కడా ప్రజలకు.. కనీసం నాయకులకు కూడా కానరావడం లేదు. సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమంలో తప్పించి మరే ఇతర ప్రభుత్వ, పార్టీపరమైన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్న దాఖలాలే లేవు. జిల్లా పరిషత్ చైర్మన్ ఎన్నిక సందర్భంలోను, ఎంపీపీ ఎన్నికల వేళ కూడా ఆయన  జాడే లేదు. బీసీ కోటాలో ప్రస్తుత టీడీపీ హయాంలోనూ మంత్రి పదవి వస్తుందని ఆశించి భంగపడిన ఆయన వ్యూహాత్మకంగా మౌనముద్ర వహిస్తున్నారా.. అసంతృప్తితో దూరంగా ఉంటున్నారా అనేది రాజకీయ వర్గాల్లో చర్చాంశనీయమైంది.
 
సుజాతకు మంత్రి పదవి రావడంతో...
 2004లో పెనుగొండ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పితాని తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా పెనుగొండ నియోజకవర్గం రద్దయి ఆచంటలో కలిసింది. అప్పటి ఎన్నికల్లో పితానికి ఆచంట నుంచి పోటీచేసే అవకాశాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కల్పించారు. ఆరోగ్యశ్రీ శాఖ మంత్రి పదవిని సైతం కట్టబెట్టారు. ఆ తర్వాత రోశయ్య కేబినెట్‌లోనూ పితాని కొనసాగారు. కిరణ్‌కుమార్‌రెడ్డి కేబినెట్‌లో సాంఘిక సంక్షేమ శాఖ, ఆర్ అండ్ బీ వంటి కీలక శాఖలు చేపట్టి జిల్లా రాజకీయాలను శాసించారు.

అప్పట్లో మంత్రి హోదాలో వట్టి వసంతకుమార్ ఉన్నప్పటికీ పితాని హవా సాగించారు. సీఎం పదవికి కిరణ్ రాజీనామా చేసిన తర్వాత ఆయన వెంటే ఉండి జై సమైక్యాంధ్ర పార్టీ ఉపాధ్యక్షుడిగా వ్యవహరించారు. ఎన్నికల వేళ చివరి నిమిషంలో టీడీపీలోకి వెళ్లి ఆచంట నుంచి పోటీచేసి అతి తక్కువ మెజారిటీతో బయటపడ్డారు. వరుసగా మూడుసార్లు గెలవడంతోపాటు బీసీ వర్గానికి చెందిన సీని యర్ నేతగా ఉన్న తనకు మంత్రివర్గంలో అవకాశం వస్తుందని ఆశించారు. కానీ చంద్రబాబు అనూహ్యంగా పీతల సుజాతకు మంత్రి పదవిని కట్టబెట్టడంతో పితాని ఆశలు తల్లకిందులయ్యాయి. దీనివల్ల పితానికి రాజకీయంగానూ ఒకింత ఇబ్బందికర పరిస్థితి ఎదురుకానుందని అంటున్నారు.
 
సుజాత వైపు ఆచంట టీడీపీ శ్రేణులు
2004లో ఆచంట ఎమ్మెల్యేగా పీతల సుజాత గెలుపొందారు. అప్పట్లో ఎస్సీ రిజర్వుడు స్థానమైన ఈ నియోజకవర్గం పునర్విభజనలో భాగంగా 2009లో జనరల్ కావడంతో ఆమెకు ఆ ఎన్నికల్లో చంద్రబాబు సీటు ఇవ్వలేదు. 2014 ఎన్నికల్లో ఆమె చింతలపూడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి పొందిన విష యం తెలిసిందే. ఆచంట పూర్వ ఎమ్మెల్యేగా ఉన్న విస్తృత పరిచయాల నేపథ్యంలో ఇప్పుడు ఆ నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు, కార్యకర్తలు మం త్రి సుజాతనే ఆశ్రయిస్తున్నారు.

టీడీపీలోకి పితాని రాకను మొదటినుంచీ వ్యతి రేకిస్తున్న ఓ వర్గం పూర్తిగా సుజాత వెంటే ఉంటోంది. ఈ పరిణామాలు పితానికి ఇబ్బందిగా మారాయంటున్నారు. ఈ దృష్ట్యా కొన్నాళ్లపాటు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్టు సమాచారం. అందుకే విదేశంలో బంధువుల ఇంట సేదతీరుతున్నట్టు తెలు స్తోంది. ఈనెల 16, 17తేదీల్లో చంద్ర బాబు జిల్లా పర్యటనకు రానున్నారు. అప్పుడైనా పితాని మొహం చూపిస్తారా, చాటేస్తారా అనేది తేలాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement