కులాల మధ్య పితాని చిచ్చు
సాక్షి, ఏలూరు :పదేళ్లు పదవిని అనుభవించి, మంత్రిగా పనిచేసిన వ్యక్తి మళ్లీ పదవి కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. నైతికంగా దిగజారి కుటిల రాజకీయాలు చేస్తూ కులాల మధ్య చిచ్చుపెడుతున్నారు. ఆయనే మాజీ మంత్రి, ఆచంట నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పితాని సత్యనారాయణ. 2004లో పెనుగొండ నుంచి, 2009లో ఆచంట నియోజకవర్గం నుంచి గెలుపొందిన పితాని అంతకుముందు వరుసగా రెండుసార్లు ఓడిపోయారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్, మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి మంత్రి వర్గంలోనూ పనిచేసిన ఆయన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత గానీ కాంగ్రెస్ పార్టీని వీడలేదు. అనంతరం కిరణ్ స్థాపించిన జై సమైక్యాంధ్ర పార్టీలో భాగమయ్యారు. ఆ పార్టీ రాష్ర్ట్ర ఉపాధ్యక్షుడిగా కూడా వ్యవహరించిన ఆయన కొద్దిరోజులకే టీడీపీలో చేరారు. సొంత బావ, ఆచంట నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జ్ గుబ్బల తమ్మయ్యకు వెన్నుపోటు పొడిచి ఆ సీటును తన్నుకుపోయారు. ఇంతచేసినా వైఎస్సార్ సీపీ అభ్యర్థి ముదునూరి ప్రసాదరాజును ఎదుర్కోలేకపోతున్నారు.
వైఎస్సార్ సీపీని ఎదుర్కొనేందుకు పితాని అధర్మ యుద్ధానికి దిగారు. పదవిలో ఉండి వెనకేసుకున్న అక్రమ సొమ్మును ఎన్నికల కోసం ఆయన వెదజల్లుతూ కులాల మధ్య చిచ్చుపెడుతున్నారు. రహస్య మంతనాలు జరుపుతూ మాట వినని వారి సామాజిక వర్గాల మధ్య చీలికలు తెస్తున్నారు. వైఎస్సార్ సీపీని ఓడించేందుకు ఆయన చేస్తున్న అత్యంత నీచమైన ప్రయత్నాలను జనం అసహ్యించుకుంటున్నారు. తెలుగుతల్లిని ముక్కలు చేస్తుంటే కళ్లు మూసుకుని, చివరి వరకూ పదవిని పట్టుకుని వేలాడిన ఆయనకు ఓటు వేసేదే లేదంటూ తెగేసిచెబుతున్నారు. అయితే పితాని మాత్రం వెయ్యి రూపాయలు ఇచ్చి ఓటు కొనాలని చూస్తున్నారు. దాని కోసం సొత్తు ఇప్పటికే సిద్ధం చేశారు. బూత్ స్థాయికి ఆ సొమ్మును తరలించారు. అన్నేళ్లు పదవిలో ఉండి కూడా నియోజకవర్గ ప్రజల బాగోగులు పట్టించుకోని పితాని కుటిల పన్నాగాలకు ఓటుతో బుద్ధి చెప్పడానికి ప్రజలు ఎదురుచూస్తున్నారు.