ఫలితమిచ్చిన ప్రజాసైన్యం
ప్రచారం గడువు ముగిసిపోతోంది. మరికొన్ని గంటల్లో మైకులన్నీ మూగపోతాయి. ఎక్కడికక్కడ అంతా గప్‌చుప్. సార్వత్రిక ఎన్నికలలో భాగంగా తెలంగాణ ప్రాంతంలో ఈనెల 30వ తేదీన పోలింగ్ జరగనుంది. దాంతో సోమవారం సాయంత్రం 4 గంటలకల్లా ప్రచారాల గడువు ముగిసిపోతుంది. దీంతో అభ్యర్థులంతా ఒకవైపు ముమ్మరంగా ప్రచారం చేసుకుంటూనే మరోవైపు సోమవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయంలోపు చేయాల్సిన 'ఇతర' కార్యక్రమాలపై దృష్టిపెడుతున్నారు. మరోవైపు వాళ్లకు దీటుగా అధికార యంత్రాంగం కూడా అంతేస్థాయిలో పటిష్ఠమైన నిఘా ఏర్పాటుచేయడంతో ఎక్కడికక్కడ డ బ్బు, మద్యం పట్టుబడుతున్నాయి.
ఈసారి ఎన్నికలను అత్యంత పారదర్శకంగా, స్వేచ్ఛగా, స్వతంత్రంగా నిర్వహించాలనే గట్టి ఉద్దేశంతో ఉన్న ఎన్నికల అధికారులు.. ఎన్నడూ లేనంత స్థాయిలో నిఘా పెంచడంతో దేశం మొత్తంలో ఎక్కడా లేనంతగా భారీమొత్తంలో నగదు, బంగారం, మద్యం అన్నీ మన రాష్ట్రంలోనే పట్టుబడుతున్నాయి. ఇప్పటివరకు దాదాపు 125 కోట్ల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నారు.
అభ్యర్థుల ఫోన్లను ట్యాపింగ్ చేయడం, ఆన్‌లైన్ లావాదేవీలపై కన్నేసి ఉంచడం, హవాలా సెంటర్లపై నజర్ పెట్టడం లాంటివి ఈసారి కొత్తగా చేస్తున్నారు. దీనివల్ల ఏ మార్గంలో అభ్యర్థులు నగదు పంపుతున్నదీ ఇట్టే తెలుసుకుని ఎక్కడపడితే అక్కడ స్వాధీనం చేసుకుంటున్నారు. బ్యాంకుల ద్వారా భారీమొత్తంలో జరిగే లావాదేవీల విషయంలో కూడా అధికారులు పటిష్ఠ నిఘా ఏర్పాటుచేశారు. గతంలో ఎన్నడూ లేనట్లుగా ఈసారి ఎన్నికల అధికారులు ఓ సరికొత్త ప్రయోగం చేశారు. ప్రజాసైన్యం ఒకదాన్ని అధికారులు తయారుచేసుకున్నారు.
వివిధ ప్రాంతాల్లో ఉన్న యువకులు, విద్యాధికులు, ఉత్సాహవంతులు, నిజాయితీపరులు, ఎన్నికల వ్యవస్థను, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలనుకునే వారితో ఒక సైన్యం ఏర్పాటుచేశారు. వాళ్లు రాష్ట్రవ్యాప్తంగా వేర్వేరు ప్రాంతాల్లో ఉంటూ ఎక్కడ డబ్బు తరలుతున్నా, పంపకాలు సాగుతున్నా ఎన్నికల నిఘా అధికారులకు ఎస్‌ఎంఎస్ ద్వారా సమాచారం అందిస్తున్నారు. అది అందిన క్షణాల్లోనే అధికారులు అక్కడ దాడులు చేసి భారీ మొత్తాలను పట్టుకుంటున్నారు. ఈ ప్రజాసైన్యం విషయం దాదాపు ఎవరికీ తెలియదు. దేశం పట్ల అభిమానం, ప్రజాస్వామ్యాన్ని బతికించాలనే చిత్తశుద్ధి ఉండటంతో తామెవరన్న విషయాన్ని కూడా ఎవరికీ తెలియనివ్వకుండా, తమ పేర్లు ఎక్కడా బయటకు రానీయకుండా ఈ సైన్యం నిశ్శబ్దంగా పని చేసుకుపోతోంది. రాష్ట్ర ఎన్నికల అధికారులు తీసుకున్న ఈ నిర్ణయం సత్ఫలితాలను ఇచ్చింది. ప్రచారం అయిపోయిన తర్వాత వివిధ ప్రాంతాల్లో అభ్యర్థులు నగదు, చీరలు, మద్యం.. ఇలా రకరకాల ప్రలోభాలతో తమవాళ్లను రంగంలోకి దింపుతారు. వాళ్లను ప్రజాసైన్యం సమర్థంగా అడ్డుకోగలిగితే ఈసారి ప్రజాస్వామ్యం బతికి బట్టకట్టినట్లే.