ఓటుకు కార్పొరేటు!
సాక్షి ప్రతినిధి, విజయనగరం : జిల్లాలో దాదాపు అన్ని స్థానాల్లో వెనకబడిపోయామన్న భయంతో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు ఆందోళన చెందుతున్నారు. పరిస్థితి బాగోలేదని గ్రహించి తన కోటరీలో ఉన్న కార్పొరేట్ సంస్థల యజమానులను, పక్క జిల్లాల నేతలను డబ్బు సంచులతో ఇక్కడికి పంపించారు. తెలంగాణ నేతలతో పాటు పొరుగు జిల్లా నేతలను ఇక్కడికి తరలించి, నియోజకవర్గాల్లో తిష్ట వేయించారు. డబ్బు తో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల పోలింగ్ సమయం దగ్గరపడే కొద్దీ టీడీపీ నేతలను ఓటమి భయం వెంటాడుతోంది. పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికే మద్యం, డబ్బు పంపిణీ చేసినా మార్పు కన్పించకపోవ డంతో కలత చెందుతున్నారు. ఇవన్నీ చంద్రబాబు దృష్టికెళ్లాయి.
దీంతో ఆందోళన చెందిన ఆయన నేతలను తరలించారు. కోట్లాది రూపాయలతో నియోజకవర్గానికి ముగ్గురేసి చొప్పున పంపించారు. తెలంగాణలో ఎన్నికలైపోవడంతో అక్కడి నేతలను దాదాపు ఇక్కడికి పంపించారు. నామా నాగేశ్వరరావు, ఓ విద్యా సంస్థల అధినేత, విశాఖ జిల్లాకు చెందిన ఓ పారిశ్రామిక వేత్త నేతృత్వంలో వీరంతా పనిచేస్తున్నారని సమాచారం. ఆయా నియోజకవర్గాల పరిధిలోని లాడ్జీల్లో కాకుండా ఇళ్లను అద్దెకు తీసుకుని తిష్ఠవేశారు. ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. చివరికీ ఆ పార్టీ కార్యకర్తలు, నాయకులకు కూడా సమాచారమివ్వకుండా గోప్యతను పాటిస్తున్నారు. ప్రజల్లో సానుకూలత లేకపోవడంతో టీడీపీ నేతలంతా ఓటూ...నోటు జపం చేస్తున్నారు. ఈక్రమంలో ఓట్ల కోసం బేరసారాలు సాగిస్తున్నారు. స్థానిక నాయకులను వెంటబెట్టుకుని రాయబారాలు నెరుపుతున్నారు. గ్రూపుగా ఓటర్లతో ఒప్పందాలు చేయిస్తూ డబ్బు మూటలు అందజేస్తున్నట్టు తెలిసింది.
ఓటుకు నోటు అంటూ విస్తృతంగా డబ్బు పంపిణీ చేస్తున్నారు. అంతేకాకుండా పెద్ద మొత్తంలో మద్యం కేసులను చోటా నాయకులకు అందించి ఓటర్లకు పూటుగా పట్టించడం ద్వారా తమ వైపు తిప్పుకోవాలని యోచిస్తున్నారు.అధికారులు షాడో టీంలు ఏర్పాటు చేయడంతో డబ్బు, మద్యం పంపిణీ బాధ్యతలను కొంతమందికి ప్రత్యేకంగా అప్పగించారు. వీరికి బ్యాంకు ఖాతాల ద్వారా నగదు సరఫరా చేస్తున్నారు. వీరి ద్వారా వార్డుల్లోనూ, గ్రామాల్లోనూ పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నట్టు తెలిసింది. అలాగే, మద్యం కూడా ఇప్పుడున్న లెసైన్సు షాపుల ద్వారానే సరఫరా చేయిస్తున్నారు. డబ్బు విచ్చలవిడిగా పంచుతున్నా తమ పార్టీకే ఓట్లు పడతాయన్న నమ్మకం టీడీపీ నేతల్లో కలగడంలేదు. దీంతో వారు నైరాశ్యంలో ఉన్నారు.