'నా మౌనం చేతకాని తనంగా తీసుకోకండి'
ఆచంట : ‘నేను అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తున్నాను... నేను రూ 500 కోట్లు సంపాదించానంటూ నాపై లేనిపోని దుష్ర్పచారం చేస్తున్నారు.. నా ప్రతిష్టకు భంగం కలిగిస్తున్నారు.. తప్పుడు రాజకీయాలు చేస్తూ ఆచంటలో అడుగడుగునా అభివృద్ధిని అడ్డుకుంటున్నారు.. నా మౌనాన్ని చేతకానితనంగా చూస్తున్నారు.. అడ్డగోలుగా దోచుకోవడానికి నేను సిద్ధంగా లేను.. ఇటువంటి దుష్ర్పచారం చేస్తున్న వారికి అడ్డుకట్ట వేస్తాను’ అని ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ ప్రత్యర్థులకు హెచ్చరికలు జారీ చేశారు.
పితాని ప్రసంగంతో ఆచంట నియోజకవర్గ టీడీపీలోని వర్గ విభేదాలు మరోసారి తేటతెల్లమయ్యాయి. బుధవారం ఆయన మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఉద్వేగంగా ప్రసంగించారు. ఆచంటలో కొంతమంది స్వార్థ రాజకీయాలు చేస్తూ అమాయకులైన ప్రజలను రెచ్చగొడుతున్నారని, ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదన్నారు. రహదారుల విస్తరణకు అడ్డుతగులుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆచంటలో ఇళ్ల స్థలాలు కావాలంటూ చేస్తున్న ఆందోళనకారులలో చాలా మందికి పట్టాలు పంపిణీ చేశామని, కొందరు వారికి డబ్బులిచ్చి తనకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేయిస్తున్నారని ఆరోపించారు. ఎవరు ఏ తప్పుడు ప్రచారం చేసినా ఎన్నికలలో తన విజయాన్ని అడ్డుకోలేకపోయారని అన్నారు.