మేడే దినోత్సవంలో అవార్డును అందజేస్తున్న సీఎం చంద్రబాబు
సాక్షి, అమరావతి: ఒకప్పుడు శ్రమ దోపిడీ వల్ల కార్మికులు రోడ్లెక్కి ధర్నాలు, సమ్మెలు చేసేవారని, మారుతున్న కాలానికి అనుగుణంగా యాజమాన్యాలు కార్మికుల సంక్షేమం గురించి పట్టించుకోవడంతో ఇప్పుడు ధర్నాలు, సమ్మెలు లేవని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో మే డే సందర్భంగా కార్మిక శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్ట్రంలో రెండున్నర కోట్ల మంది అసంఘటిత కార్మికులుగానే ఉన్నారని, వీరంతా భవనాల నిర్మాణం, ఫ్యాక్టరీలు, ఇళ్లల్లో పనిచేస్తున్నారని తెలిపారు. కార్మికులతో సరిగా పనిచేయించేవారే ఉత్తమ యాజమానులని, పరిశ్రమల అభివృద్ధికి పనిచేస్తూ సహకరించేవారే ఉత్తమ కార్మికులని తెలిపారు.
చట్టాలు, తనిఖీలు ఆన్‌లైన్‌లోనే..
రాష్ట్రంలో 2.13 కోట్ల మంది చంద్రన్న బీమాలో అసంఘటిత కార్మికులుగా నమోదు చేసుకున్నారని తెలిపారు. కార్మిక చట్టాలను ఆన్‌లైన్ చేశామని, తనిఖీలను కూడా ఆన్‌లైన్‌లోకి తీసుకువచ్చామన్నారు. రాష్ట్రంలో టెక్స్‌టైల్ పరిశ్రమలో ఎక్కువ మంది పనిచేస్తున్నారని, 20 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు రూ. 1,140 కోట్లను చంద్రన్న బీమా కింద ఇచ్చామని తెలిపారు. రాష్ట్రంలోని ఈఎస్‌ఐ ఆస్పత్రులకు రూ. 80 కోట్లతో వసతులు కల్పిస్తున్నామని, 79 ఐటీఐలను ఆధునికంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. రాష్ట్రంలో కార్మికులు అశాంతిగా ఉండకూడదని, కార్మిక అశాంతి ఉంటే పరిశ్రమలు రావని చెప్పారు.
మూడు ఈఎస్‌ఐ ఆస్పత్రుల ప్రారంభం..
కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్రంలో కార్మికుల కోసం 25 ఈఎస్‌ఐ ఆస్పత్రులను ఏర్పాటుచేయగా అందులో మూడు ప్రారంభమయ్యాయని తెలిపారు. అనంతరం ముఖ్యమంత్రి చేతుల మీదుగా 2018కి సంబంధించిన శ్రమశక్తి, బెస్ట్ మేనేజ్‌మెంట్ అవార్డులను బహూకరించారు.
Comments
Please login to add a commentAdd a comment