మంచాల, న్యూస్‌లైన్: ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలు పేదలకు అందుతున్నాయో లేదో తెలుసుకోవాలన్న ఉద్దేశంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గ్రామాల్లో రచ్చబండ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి ప్రసాద్‌కుమార్ అన్నారు. వైఎస్ ఆశయం మేరకు పేదలకు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో ప్రభుత్వం రచ్చబండ కార్యక్రమం నిర్వహిస్తోందన్నారు. శుక్రవారం మంచాలలోని ఓ ఫంక్షన్ హాలులో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో మంత్రి ప్రసంగించారు.
దేశ సమగ్రాభివృద్ధి, అన్ని వర్గాల ప్రజల సంక్షేమం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలలోని బడుగు, బలహీన వర్గాల ప్రజల అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రాష్ట్రంలో ప్రతి కుటుంబానికి అండగా నిలుస్తున్నామన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు, పింఛన్లు, రేషన్‌కార్డుల మంజూరు చేస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం సబ్‌ప్లాన్, అలాగే బాలికల కోసం బంగారుతల్లి పథకాలకు రాష్ట్ర ప్రభుత్వం చట్టబద్ధత కల్పించిందని చెప్పారు. తెలంగాణ విషయంలో కాంగ్రెస్ పార్టీ 2004 ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు చురుకుగా చర్యలు తీసుకుంటోందన్నారు.
మైనింగ్ జోన్ రద్దు చేయాలి...
కార్యక్రమంలో ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి మాట్లాడుతూ మండలంలో మైనింగ్ జోన్ ఏర్పాటును రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మైనింగ్ జోన్‌తో రైతులు, ప్రజలు జీవనోపాధి కోల్పోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన పరిశ్రమలలో స్థానికులకు ఉపాధి కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని మంత్రిని కోరారు. అంతకు ముందు మంత్రి ప్రసాద్‌కుమార్ లింగంపల్లి రోడ్డు ను ప్రారంభించారు. అలాగే రూ.40లక్షలతో మంచాల-లింగంపల్లి రోడ్డు నిర్మా ణ పనులకు, తాళ్లపల్లిగూడలో ఎస్సీ కమ్యూనిటీ హాలుకు శంకుస్థాపన చేశారు. అనంతరం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా 758మందికి రేషన్‌కార్డులు, 633మందికి పింఛన్లు, 844 స్వ యం సహాయక సంఘాలకు రూ.42.31 లక్షల వడ్డీలేని రుణాల చెక్కులు, 91మందికి బంగారుతల్లి పథకం మంజూరు పత్రాలను మంత్రి అందజేశారు.
సీపీఎం నిరసన...
రచ్చబండ వేదికపై ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో ఎమ్మెల్సీ నాగేశ్వర్‌రావు ఫొటో లేకపోవడంతో సీపీఎం నాయకులు నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమం ప్రారంభమవుతుండగా సీపీఎం జిల్లా నాయకులు పి.యాదయ్య, కె.జగన్, కె.శ్రీనివాస్ నాయక్, ఆర్.జంగయ్య, మండల పార్టీ కార్యదర్శి కె.శ్రీనివాస్ రెడ్డి తదితరులు ఒక్కసారిగా ఆందోళనకు దిగారు. దీన్ని గమనించిన మంత్రి ప్రసాద్‌కుమార్ వెంటనే లేచి ఎమ్మెల్సీ ఫొటో ఉంచనందుకు చింతిస్తున్నామని చెప్పడంతో సీపీఎం నాయకులు శాంతిం చారు. కార్యక్రమంలో డీసీసీ అధ్యక్షుడు క్యామ మల్లేష్, మాజీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, డీఆర్‌డీఏ పీడీ వరప్రసాద్‌రెడ్డి, ఆర్డీఓ సూర్యారావు, తహసీల్దార్ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ నాగమణి, సర్పంచ్‌లు పాల్గొన్నారు.
వైఎస్ ఆశయం మేరకే రచ్చబండ: ప్రసాద్‌కుమార్
Published Sat, Nov 23 2013 3:51 AM | Last Updated on Wed, Mar 28 2018 10:59 AM
Advertisement
Advertisement