టెక్కలిలో ‘రచ్చ’బండ
Published Thu, Nov 21 2013 4:27 AM | Last Updated on Tue, Aug 21 2018 5:44 PM
టెక్కలి, న్యూస్‌లైన్:టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆవరణలో బుధవారం నిర్వహించిన రచ్చబండ కార్యక్రమం రచ్చ రచ్చయింది. కేంద్ర మంత్రి కృపారాణితో పాటు టెక్కలి ఎమ్మెల్యే కొర్ల భారతి పాల్గొన్న ఈ కార్యక్రమానికి హాజరైన వారు ఉదయం నుంచే ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించడానికి సరైన ప్రణాళిక లేకపోవడంతో లబ్ధిదారులకు ఇక్కట్లు తప్పలేదు. కార్యక్రమం ప్రారంభమవడంతో ఒక్కసారిగా లబ్ధిదారులంతా వేదికవద్దకు దూసుకుపోయారు. వేదికపైనున్న కేంద్ర మంత్రి, ఎమ్మెల్యేకు తమ గోడు వినిపించుకోవాలనుకున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారంతా కృపారాణి డౌన్...డౌన్ అంటూ నినాదాలు చేశారు. పేదల కష్టాలు తక్షణమే తెలుసుకోవాలని డిమాండ్ చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి వారిని బయటకు పంపేందుకు ప్రయత్నించారు.
దీంతో ఆగ్రహం చెందిన లబ్ధిదారులంతా వేదిక ముందు బైఠాయించారు. సంక్షేమ పథకాల కోసం వస్తే అధికారులు పట్టించుకోవడం లేదని, ఆ బాధలను చెప్పుకునేందుకు వస్తే పోలీసులు నెట్టివేస్తున్నారంటు మండిపడ్డారు. గతంలో రచ్చబండలో ఇచ్చిన దరఖాస్తులకు ఇప్పటికీ మోక్షం కలుగలేదని కేకలు వేశారు. ఇదిలా ఉండగా దరఖాస్తులు స్వీకరణ వద్ద కేంద్ర బలగాలకు చెందిన పోలీసులు అత్యుత్సాహంతో లబ్ధిదారులను నెట్టివేశారు. ఈ క్రమంలో టీడీపీ, కాంగ్రెస్ నాయకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఒకదశలో మంత్రి వేదిక దిగి కిందకు వచ్చారు. మళ్లీ కొద్దిసేపటికే వేదిక మీదకు వెళ్లి ప్రసంగించారు. సంక్షేమ పథకాల పంపిణీని రచ్చ చేయడానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు.
గతంలో కేవలం పసుపు చొక్కా కార్యకర్తలకు మాత్రమే ప్రభుత్వ పథకాలు అందజేశారని విమర్శించారు. అలాంటి నీచ రాజకీయాలు చేయకుండా సహకరించాలని కోరారు. ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులకు మంత్రి సంక్షేమ పథకాల మంజూరు పత్రాలు అందజేశారు. టెక్కలి మండలానికి సంబంధించి 1086 ఇందిరమ్మ ఇళ్లు, 469 పింఛన్లు, 2409 రేషన్ కార్డులు, 44 బంగారు తల్లి పథకం లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బెహరా కృష్ణవేణి, డీసీసీబీ డెరైక్టర్ ధవళ కృష్ణ, హౌసింగ్ ఈఈ ఎన్.గణపతిరావు, తహశీల్దార్ ఆర్.అప్పలరాజు, వ్యవసాయ శాఖ ఏడీ చంద్రరరావు, ఎంపీడీఓ రాజులుతో పాటు కాంగ్రెస్ నాయకులు కె.రామ్మోహనరావు, పి.ఆనంద్, గుప్తా, విశ్వనాథం, లక్ష్మీపతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
Advertisement
Advertisement