మృతుడు తులసీరావు (ఫైల్)
సాక్షి, ఎంవీపీ కాలనీ (విశాఖ తూర్పు), టెక్కలి: సమస్యలు, ప్రమాదాలు ఎలా వచ్చి పడతాయో... ఏ సంబంధం లేకుండానే ఎలా ఇరుక్కుపోతామో ఎవ్వరూ ఊహించలేరు. విశాఖలో సోమవారం తెల్లవారుజామున విగతజీవిగా కనిపించిన ఓ యువకుడి హత్య వెనుక మిస్టరీ కూడా ఇలాంటిదే. వివాహేతర సంబంధానికి అలవాటు పడిన ఓ యువకుడు చూపించిన అతి ఉత్సాహం ఓ కుటుంబాన్నే అగాథంలోకి నెట్టింది. అభం శుభం తెలియని వారిని, వారి స్నేహితులను కటకటాలపాలు చేసింది. సోమవారం ఓ యువకుడి హత్యను గుర్తు తెలియని యువకుడి హత్యగా కేసు నమోదు చేసుకున్న ఎంవీపీ పోలీసులు ఎట్టకేలకు ఆ యువకుడి వివరాలు తెలుసుకున్నారు. మృతుడు శ్రీకాకుళం జిల్లా టెక్కలి మండలం చాటిపల్లి గ్రామానికి చెందిన పల్లి తులసీరావు (28)గా నిర్ధారించారు. ఈ ఘటనపై వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి.
తులసీరావు గత కొన్నేళ్లుగా దివీస్ ల్యాబ్‌లో ఉద్యోగం చేస్తున్నాడు. ఆదర్శనగర్‌లో ఉంటున్న ఓ మహిళతో అతనికి కొంతకాలంగా వివాహేతర సంబంధం ఉంది. అయితే కొద్ది రోజులుగా అతనికి ఆ మహిళ దూరంగా ఉంటోంది. ఈ క్రమంలో ఆమెపై కోపంతో రగిలిపోతున్న తులసీరావు సోమవారం రాత్రి మద్యం సేవించి ఉషోదయ కూడలి దరి ఆదర్శనగర్ వచ్చాడు. రాత్రి సమయంలో ఆమెకు ఫోన్ చేసి మాట్లాడుతూనే ఆమె ఉంటున్న ఇంటికి వెళ్లి తలుపులు కొట్టాడు. అయితే ఎంతకీ తీయకపోవడంతో ఫోన్లో దుర్భాషలాడుతూ ఇంటి తలుపులు గట్టిగా కొట్టాడు. పలుమార్లు ఇదే తరహాలో ఉద్రేకంగా వ్యవహరించాడు.
చదవండి: (ప్రేయసి ఇంటి వరండాలో శవంగా మారిన యువకుడు)
కొద్ది రోజుల కిందటే ఆ ఇంట్లోకి దంపతులు...
వాస్తవానికి తులసీరావుతో వివాహేతర సంబంధం ఉన్న మహిళ కొన్ని రోజుల క్రితమే ఆదర్శనగర్‌లోని ఇల్లు ఖాళీ చేసేసి వేరే చోటకు వెళ్లిపోయింది. ఇటీవల వేరే కుటుంబం ఆ ఇంట్లో అద్దెకు దిగారు. అయితే భర్త ఉద్యోగ రీత్యా వేరే ఊరికి వెళ్లడంతో భార్య ఒక్కరే ఆ ఇంట్లో ఉంది. ఎవరో తలుపులు బలంగా కొడుతున్నట్లు గమనించిన ఆమె భయాందోళనకు గురైంది. విషయాన్ని ఫోన్‌లో ఆమె భర్తకు సమాచారం అందించింది. దీంతో ఏం జరుగుతుందో తెలియని ఆమె భర్త ఆ చుట్టుపక్కలే ఉంటున్న అతని స్నేహితులకు ఫోన్ చేసి విషయం చెప్పాడు.
ఒకసారి తన ఇంటికి వెళ్లి పరిస్థితి చూడాలని, తలుపులు కొడుతున్నది ఎవరో చూసి మందలించాలని స్నేహితులకు చెప్పాడు. దీంతో కొద్దిసేపటికి అక్కడికి చేరుకున్న అతని స్నేహితులు తులసీరావు గొడవ చేయడాన్ని గుర్తించి అతనిపై దాడి చేశారు. అక్కడి నుంచి పంపించే ప్రయత్నం చేసినా మద్యం మత్తులో ఉన్న అతను వినలేదు. దీంతో ఆవేశంలో వారు కొట్టిన దెబ్బలు తగలరాని చోట తగలడంతో అక్కడికక్కడే తులసీరావు కుప్పకూలిపోయాడు. దీంతో భయపడిన వారు అతన్ని రోడ్డు పక్కకు లాగేసి అక్కడి నుంచి పరారయ్యారు.
చదవండి: (ఏడాది క్రితం పెళ్లి.. జోగ్ ఫాల్స్ చూడాలని వెళ్లి..)
పోలీసుల అదుపులో నిందితులు
సోమవారం తెల్లవారుజామున యువకుడు గాయాలతో పడి ఉండటాన్ని స్థానికులు గమనించి 108కి సమాచారం అందించి కేజీహెచ్‌కు తరలించారు. సోమవారం మధ్యా హ్నం 12 గంటల సమయంలో తులసీరావు మృతి చెందినట్లు సమాచారం రావడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఘటన స్థలానికి సీఐ ప్రసాద్‌తోపాటు సిబ్బంది వెళ్లి వివరాలు సేకరించారు. పలు కోణాల్లో దర్యాప్తు చేయగా మంగళవారం అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో తులసీరావు కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతోపాటు అజయ్, శివ అనే ఇద్దరు యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది.
అయితే ఈ ఘటనలో ఇరుక్కున్న వారికి... తులసీరావుకి వేరే మహిళతో ఉన్న వివాహేతర సంబంధంపై ఎలాంటి అవగాహన లేదు. తులసీరావుతో అక్రమ సంబంధం పెట్టుకు న్న మహిళ గతంలో అద్దెకు ఉన్న ఇంట్లో... కొత్తగా వీరు అద్దెకు దిగడమే వారి పాలిట శాపమైంది. దీంతో ప్రస్తుతం ఆ ఇంట్లో ఉంటున్న భార్యభర్త, స్నేహితులైన నలుగురు యువకులు ఈ ఘటనలో ఇరుక్కుపోయారు. ఇప్పటికే వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అయితే ఆ విషయాన్ని ఎంవీపీ పోలీసులు నిర్ధారించలేదు.
Comments
Please login to add a commentAdd a comment