మద్నూర్, న్యూస్‌లైన్ : ప్రజలకు సంక్షేమ ఫలాలు అందించేందుకే రచ్చబండ నిర్వహిస్తున్నామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని మా ర్కెట్ యార్డులో రచ్చబండ నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ ఈ ప్రాంతంలో సోయా ఎక్కువగా పండిస్తున్నారన్నారు. వచ్చే ఏడాది సోయా విత్తన శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేసేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. రెండేళ్ల క్రితం దరఖాస్తు చేసుకున్నవారికి ఇప్పుడు పింఛన్లు, రేషన్‌కార్డులు మంజూరు చేయడం దారుణమని ఎమ్మెల్యే హన్మంత్ సింధే విమర్శించారు. అంతకు ముందు మేనూర్‌లో మంత్రి సుదర్శన్‌రెడ్డి ఎస్సీ కమ్యూనిటీ భవణ నిర్మాణానికి శంకస్థాపన చేశారు.
డబ్బులిస్తేనే స్థలం కేటాయిస్తారట!
అధికారులకు డబ్బులిస్తేనే తమకు ఇండ్ల స్థలం కేటాయిస్తారట అని మొగాకు చెందిన ఈరేశం రచ్చబండ కార్యక్రమం మధ్యలో లేచి గట్టిగా మాట్లాడారు. నాకు సొంత ఇల్లు లేదని గ్రామ శివారులోని ప్రభుత్వ స్థలంలో గుడిసె వేసుకొని ఉంటున్నానన్నారు. ఇంటి స్థలం ఇవ్వడానికి తహశీల్దార్ రవి, ఏఆర్‌ఐ అజయ్ డబ్బులు డిమాండ్ చేశారని ఆరోపించారు. దీంతో పోలీసులు ఈరేశంను పక్కకు లాక్కెళ్లారు. వెంటనే స్పందించిన బోధన్ సబ్‌కలెక్టర్ హరినారాయణన్ అతడి వద్దకు వచ్చి సమస్యలు తెలుసుకున్నారు. వారంలో సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.
మహిళా సంఘాల అభివృద్ధికి కృషి..
బిచ్కుంద : మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం రుణాలు అందిస్తోందని మంత్రి సుదర్శన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం బిచ్కుంద మార్కెట్ యార్డులో రచ్చబండ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి సబ్‌ప్లాన్ ఎంతో ఉపయోగపడుతోందని పేర్కొన్నారు. కాంగ్రెస్‌తోనే తెలంగాణ రాష్ర్టం సాధ్యమన్నారు. కౌలాస్‌నాలా ప్రాజెక్టు కాలువల అభివృద్ధికి రూ. 5 కోట్లు ఇస్తున్నామని, లెండి ప్రాజెక్టు నిర్మాణానికి మన రాష్ట్ర వాటా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. లెండి కాలువల నిర్మాణానికి భూమి ఇచ్చి సహకరించాలని రైతులను కోరారు. నియోజకవర్గ అభివృద్ధికి మంత్రి ఎంతో కృషి చేస్తున్నారని ఎంపీ సురేశ్ షెట్కార్ పేర్కొన్నారు. అనంతరం మహిళా సంఘాలకు పావలా వడ్డీ రాయితీని పంపిణీ చేశారు. సంక్షేమ పథకాలకు దరఖాస్తు చేసుకోవడం కోసం వికలాంగులు, వృద్ధులు అవస్థలు పడ్డారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే హన్మంత్ సింధే, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు, కలెక్టర్ ప్రద్యుమ్న, బోధన్ సబ్ కలెక్టర్ హరినారాయణన్, మాజీ ఎమ్మెల్యే అరుణాతార తదితరులు పాల్గొన్నారు.
సంక్షేమ ఫలాలు అందించేందుకే.. : సుదర్శన్‌రెడ్డి
Published Mon, Nov 25 2013 6:48 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Advertisement