13న జిల్లాకు సీఎం రాక | CM arrival on 13th of this month | Sakshi
Sakshi News home page

13న జిల్లాకు సీఎం రాక

Published Mon, Nov 11 2013 5:40 AM | Last Updated on Mon, Jul 29 2019 5:28 PM

CM arrival on 13th of this month

సాక్షి  ప్రతినిధి, సంగారెడ్డి:  ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఈ నెల 13న జిల్లాకు రానున్నారు. సదాశివపేట మండలం వెల్టూరు గ్రామంలో నిర్వహించనున్న రచ్చబండ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. రెండు రోజుల సమయమే ఉండటంతో జిల్లా యంత్రాంగం యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు చేస్తోంది. ప్రభుత్వ విప్ తూర్పు జయప్రకాశ్‌రెడ్డి సహా జిల్లా అధికారులు సీఎం పర్యటన ఏర్పాట్లను ఆదివారం సమీక్షించారు. సదాశివపేటతోపాటు రచ్చబండ సమావేశం నిర్వహించనున్న వెల్టూరు గ్రామాన్ని జయప్రకాశ్‌రెడ్డి, జేసీ శరత్, ఎస్పీ విజయ్‌కుమార్ ఇతర అధికారులు సందర్శించారు. మొదట రచ్చబండ సమావేశం జరగనున్న వెల్టూరు గ్రామాన్ని సందర్శించి వేదికను ఖరారు చేశారు. అలాగే సీఎం హెలికాప్టర్ ల్యాండ్ అయ్యేందుకు వీలుగా సిద్దాపూర్ సమీపంలోని హౌసింగ్ కాలనీలో ఉన్న ఖాళీ ప్రాంతంలో హెలిపాడ్ ఏర్పాటు చేసేందుకు అధికారులు నిర్ణయించారు. అనంతరం సదాశివపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో బహిరంగ సభ జరుగుతుంది. అధికారుల సమాచారం ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సిద్దాపూర్ సమీపంలో ఏర్పాటు చేసిన హెలిపాడ్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా వెల్టూరు గ్రామానికి చేరుకుని రచ్చబండ సమావేశంలో పాల్గొంటారు. ఈ సందర్భంగా లబ్ధిదారులకు పింఛన్లు, ఇళ్ల పట్టాలు, రేషన్‌కార్డులు పంపిణీ చేస్తారు. అలాగే గ్రామస్థులతో ముఖాముఖిగా మాట్లాడతారు. అనంతరం రోడ్డు మార్గాన సదాశివపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్ చేరుకుని బహిరంగ సభలో పాల్గొంటారు. కాగా రచ్చబండలో భాగంగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేయనున్నారు.

 మూడోసారి రచ్చబండకు సీఎం
 రచ్చబండ కార్యక్రమంలో భాగంగా సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి మూడోసారి జిల్లాకు రానున్నారు. మొదటి, రెండో విడతల్లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమాల్లో సీఎం పాల్గొన్నారు. తాజాగా ఈనెల 13న సదాశివపేట మండలం వెల్టూరులో నిర్వహించనున్న మూడో విడత రచ్చబండకు సీఎం హాజరు కానున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement