సాక్షి, కొత్తగూడెం: చట్టాలు ఎన్నో...ఇప్పటికే ఉన్నవి, కొత్తగా వచ్చినవి...అయినా, ఏటికేడాది మహిళకు రక్షణ లేకుండా పోతోంది. లైంగికదాడులు, హత్యలు, వేధింపుల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇంటా బయటా ఎక్కడ చూసినా ‘ఆమె’ అఘాయిత్యాలు, అవమానాల బారిన పడుతోంది.
ముక్కుపచ్చలారని పసికందు నుంచి ముదుసలి వరకూ మృగాళ్ల పాశవిక చర్యలకు గురవుతూనే ఉన్నారు. ప్రతి రోజు జిల్లాలో ఏదో చోట మహిళలపై ఏదో ఒక రూపంలో దాడి జరుగుతూనే ఉంది. కొన్ని పోలీసు కేసుల వరకు వెళ్తే.. మరికొన్ని కుటుంబ పరువుపోతుందన్న ఉద్దేశంతో బయట పడడం లేదు. గత మూడేళ్లలో పరిశీలిస్తే 2013లో మహిళలపై అఘాయిత్యాలు పెరిగాయి. జిల్లాలో గత ఏడాది అత్యధికంగా 97 లైంగికదాడి కేసులు, 245 లైంగికదాడి యత్నం, 298 వేధింపుల కేసులు నమోద య్యాయి. అలాగే నిర్భయ చట్టం కింద గత ఏడాది 26 కేసులను నమోదు చేశారు.
తగ్గుతున్న ఆడపిల్లల సంఖ్య..
జిల్లాలో ఆడపిల్లల సంఖ్య తగ్గుతోంది. ఆధునికయుగంలోనూ ఆడపిల్ల పుట్టిందంటే పెదవి విరుస్తున్నారు. జన గణనను చూస్తే ఇవి ప్రమాద ఘంటికలే అని చెప్పవచ్చు. 2001లో జిల్లాలో ప్రతి వెయ్యిమంది మగ పిల్లలకు ఆడపిల్లల సంఖ్య 971 ఉంది. అయితే 2011 నాటికి ఇది 958కి పడిపోయింది. అలాగే 2001లో ఆరేళ్లలోపు ఆడపిల్లల సంఖ్య 1,72,470 ఉంటే.., 2011లో 1,37,966కు చేరుకుంది.
2001లో మహిళాజనాభా పెరుగుదల 16.39శాతం కాగా 2011లో 8.47 శాతానికి పడిపోయింది. ఈ గణాంకాలు జిల్లాలో ఆడపిల్లల శాతం ఏస్థాయిలో పడిపోతుందో చెబుతున్నాయి. భ్రూణ హత్యలు, పుట్టిన తర్వాత చిదిమేయడం గుట్టుగాసాగుతోంది. ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు, ఆడపిల్ల ఇంటికి ముద్దు .. అని ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ప్రచార కార్యక్రమాలు ప్రణాళిక లేక ప్రజల్లో అవగాహన కల్పించలేకపోతున్నాయి.
ఈ శోకం...ఇంకెన్నాళ్లు?
Published Sat, Feb 1 2014 7:16 AM | Last Updated on Mon, Jul 30 2018 9:21 PM
Advertisement
Advertisement