మహిళా సాధికారత ఎక్కడ!
సంగారెడ్డి క్రైం, న్యూస్‌లైన్: మహిళా సాధికారత సాధిస్తున్నామని అనేక మంది వేదికలెక్కి ఉపన్యాసాలు చేస్తున్నా వాస్తవానికి మహిళలు ఇంకా వివక్షకు గురవుతూనే ఉన్నారు. చట్టాలు ఎన్ని ఉన్నప్పటికీ మహిళలకు నానాటికీ రక్షణ లేకుండాపోతోంది. జిల్లాలో ఏ మూల చూసినా ప్రతిరోజు ఏదో ఒక చోట మహిళపై లైంగిక దాడులు, హత్యలు, వేధింపుల పరంపర కొనసాగుతూనే ఉన్నాయి.
పాలు తాగే పసి పాప మొదలుకొని స్కూలుకు వెళ్లే బాలిక, కళాశాలకు వెళ్లే యువతి, ఉద్యోగానికి వెళ్లే మహిళ వరకు బయటకు వెళ్లి తిరిగి వచ్చే వరకు నమ్మకం లేకుండా పోతోంది. ఇక అత్తవారింట్లో మహిళలపై భర్త, అత్తామామల వేధింపులు సర్వసాధారణం. ఇలా జిల్లాలో ఏదో ఒక చోట మహిళలపై ఏదో ఒక రూపంలో దాడులు జరుగుతూనే ఉన్నాయి. కొన్ని సంఘటనలు పోలీస్‌స్టేషన్ మెట్లెక్కినప్పటికీ మరికొన్ని మరుగునే ఉంటున్నాయి.
గత రెండేళ్లలో జిల్లాలో మహిళలపై చోటు చేసుకున్న సంఘటనలను పరిశీలిస్తే సంఖ్య పెరిగినట్లు తెలుస్తోంది. 2013 సంవత్సరంలో వరకట్నం కోసం 25 మంది మహిళలు హత్యలకు గురయ్యారు. అలాగే వరకట్న కేసులు 476, అత్యాచారా కేసులు 64, రెండో పెళ్లి చేసుకున్నారంటూ నమోదైన కేసులు 52, వెకిలి చేష్టలు, ఇతర వేధింపులకు సంబంధించి 169 కేసులు నమోదయ్యాయి.
చట్టాలను సక్రమంగా అమలైనప్పుడే మహిళలపై పెరుగుతున్న అత్యాచారాలు, వేధింపులను అరికట్టేందుకు అవకాశం ఉంటుందని మహిళా సంఘాలు పేర్కొంటున్నాయి. నిర్భయ తదితర చట్టాలు ఉన్నప్పటికీ మహిళలపై లైంగిక దాడి పెరుగుతోందంటున్నారు. శిక్షలపై ప్రతి ఒక్కరికీ అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
మహిళల కోసం ఏర్పాటైన చట్టాల్లో కొన్ని..
మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించి దౌర్జన్యానికి పాల్పడితే సెక్షన్ 354 ప్రకారం ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది.
లైంగిక దాడి చేసిన వారిపై నిర్భయ చట్టం కిందకేసు నమోదవుతుంది.
చిన్నపిల్లలను లైంగికంగా వేధిస్తే ప్రివెన్షన్ యాక్టు ఫర్ చిల్డ్రెన్ సెక్సువల్ అఫెన్సెస్ కింద కేసు నమోదు చేస్తారు.
వరకట్నం కోసం భార్యను వేధిస్తే 304(బి) సెక్షన్ కింద భర్తకు ఏడేళ్ల వరకు జైలు శిక్ష అమలువుతుంది.
మహిళలను ఆత్మహత్యకు కారణమైన వారికి ఐపీసీ సెక్షన్ 306 కింద పదేళ్ల వరకు జైలు విధించే అవకాశం ఉంది.
వివాహిత మహిళలను వేధింపులకు గురిచేస్తే ఐపీసీ 498 ప్రకారం మూడేళ్ల వరకు జైలు శిక్ష విధిస్తారు.
రెండో వివాహం చేసుకున్న భర్తకు సెక్షన్ 494 కింద కేసు నమోదవుతుంది.