పర్యావరణ అనుమతులకు నిపుణుల కమిటీ సిఫారసు
భద్రాద్రి విద్యుత్ కేంద్రం నిబంధనలపై సైతం ఆమోద ముద్ర
ఇంకా విడుదల కాని తుది ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లా పాల్వంచలోని కొత్తగూడెం థర్మల్ పవర్ స్టేషన్(కేటీపీఎస్) ఏడో దశ విద్యుత్ కేంద్రానికి కేంద్ర పర్యావరణ, అటవీశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కేటీపీఎస్‌లో మొత్తం 1720 మెగావాట్ల సామర్థ్యంతో 11 విద్యుత్ కేంద్రాలను ఆరు దశల్లో నెలకొల్పారు. ఏడోదశ విస్తరణలో భాగంగా తెలంగాణ జెన్‌కో అక్కడ 800 మెగావాట్ల సామర్థ్యంతో కొత్త విద్యుత్ కేంద్రాన్ని నిర్మిస్తోంది. కేటీపీఎస్ ప్రాజెక్టుకు సంబంధించిన 230 ఎకరాల స్థలంలోనే ఈ ప్రాజెక్టును నిర్మించేందుకు పర్యావరణ అనుమతుల కోసం గత రెండేళ్లుగా జెన్‌కో ప్రయత్నాలు చేస్తోంది. తాజాగా కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖకు ఆధ్వర్యంలోని నిపుణుల కమిటీ ఈనెల మొదటివారంలో సమావేశమై ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులివ్వాలని సిఫారసు చేసింది.
ఈ మేరకు కేంద్ర పర్యావరణ శాఖ నుంచి తాజాగా తెలంగాణ జెన్‌కోకు లేఖ అందింది. మరో వారం రోజుల్లో అనుమతుల ఉత్తర్వులు సైతం జారీ కానున్నాయని జెన్‌కో వర్గాలు తెలిపాయి. ఖమ్మం జిల్లా మణుగూరులో 1080 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న భద్రాద్రి థర్మల్ కేంద్రానికి సంబంధించి అమలు చేయాల్సిన నిబంధనలను సైతం ఇదే సమావేశంలో ఎక్స్‌పర్ట్ కమిటీ ఆమోదించింది. అదే విధంగా, నల్లగొండ జిల్లా దామరచర్లలో 4000 మెగావాట్ల సామర్థ్యంతో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రానికి 13,674 హెక్టార్ల అటవీ భూమిని రాష్ట్ర ప్రభుత్వం కోరగా, అందులో కేవలం 4334 హెక్టార్లను కేటాయించేందుకు కేంద్ర పర్యావరణ, అటవీశాఖ అంగీకారం తెలిపింది.
పాల్వంచ కేటీపీఎస్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్
Published Wed, Jun 24 2015 2:48 AM | Last Updated on Sun, Sep 3 2017 4:15 AM
Advertisement
Advertisement