సాక్షి, కొత్తగూడెం: జిల్లా స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమృతహస్తం పథకం అభాసుపాలవుతోంది. ఈ పథకం అమలుతీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో 23 ఐసీడీఎస్ ప్రాజెక్టులుండగా ఖమ్మం, కొత్తగూడెం పరిధిలో అర్బన్ ప్రాజెక్టులున్నాయి. ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం, మధిర రూరల్ తో పాటు ఏజెన్సీలో 18 ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి.
కేవలం గ్రామీణ ప్రాంతాల ప్రాజెక్టుల పరిధిలోనే గత ఏడాది నుంచి అమృతహస్తం పథకం అమలవుతోంది. ఈ ప్రాజెక్టుల పరిధిలో 49,146 మందికి మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలి. కానీ పథకంలో పేర్కొనట్లుగా ఏ అంగన్‌వాడీ కేంద్రంలోనూ పూర్తిస్థాయిలో మెనూ అమలు కాకపోవడం గమనార్హం. రోజుకు 200 మిల్లీలీటర్ల పాలు, వారానికి నాలుగు రోజులు గుడ్డు అందించాలని మెనూలో పేర్కొన్నారు. పథకం ప్రారంభం నుంచి చాలా అంగన్‌వాడీ కేంద్రాల్లో పాలు పంపిణీ చేయడం లేదు. కొన్ని కేంద్రాల్లో వారం, పదిరోజులు మాత్రమే పాల పంపిణీతో సరిపెడుతున్నారు.
అసలు మెనూలో పాల పంపిణీ కూడా ఉందని గర్భిణులు, బాలింతలకే తెలియదు. స్థానికంగా పాల కొరత ఉందని అందుకే పంపిణీ చేయలేకపోతున్నామని అంగన్‌వాడీ టీచర్లు చెబుతున్నారు. కోడి గుడ్డు వారానికి రెండు రోజులే ఇస్తున్నారు. ప్రస్తుతం చాలా కేంద్రాలకు పదిహేను రోజులుగా గుడ్డు సరఫరానే లేదు. ఇదేమని బాలింతలు అడిగినా తమకే సరఫరా లేదని అంగన్‌వాడీ టీచర్లు చెబుతుండటంతో చేసేది లేక వెనుదిరుగుతున్నారు.
ఏజెన్సీలో మరీ అధ్వానం...
ఏజెన్సీలో ‘అమృతహస్తం’ అమలుతీరు మరీ దారుణంగా ఉంది. ఇక్కడ గర్భిణులు, బాలింతలు 36,858 మంది వరకు ఉన్నారు. వీరిలో సగం మందికి కూడా అమృతహస్తం మెనూ అందడం లేదు. పోషకాహార లోపం వల్ల ఏజెన్సీలోని గిరిజన మహిళలకు రక్తహీనత వస్తోంది. అమృతహస్తం పథకం ప్రకారం పప్పు, పాలు, ఆకు కూరలు, ఆయిల్ తప్పకుండా ఇస్తేనే వీరి ఆరోగ్యం కొంతైనా మెరుగుపడేది.
పాల్వంచ, ఇల్లెందు, భద్రాచలం ఏజెన్సీ పరిధిలోని కేంద్రాలపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కేవలం నాసిరకం పప్పు, ముతక బియ్యం, వారానికి రెండు రోజులు మాత్రమే గుడ్లు ఇస్తున్నారు. మెనూలో సూచించిన ప్రకారం కాకుండా తక్కువ మోతాదులో పప్పు, నూనె అందిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లోనే వీటిని వడ్డించి పెట్టాల్సి ఉండగా కొన్ని కేంద్రాల్లోనే వండి పెడుతుండగా మిగిలిన కేంద్రాల్లో కొద్ది మొత్తంలో పంపిణీ చేసి అంగన్‌వాడీ టీచర్లు చేతులు దులుపుకుంటున్నారు.
కాంట్రాక్టర్ల కక్కుర్తి.. నాణ్యతకు తూట్లు..
అమృతహస్తం పథకంలో పప్పు, నూనె, గుడ్లు అంతా కాంట్రాక్టర్లే సరఫరా చేయాలి. కానీ వీరు ఉన్నతాధికారులను మచ్చిక చేసుకొని నాసిరకమైన సరుకులను అంగన్‌వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పప్పు పుచ్చిపోయి ఉండటంతో గర్భిణులు, బాలింతులు దాన్ని తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. నూనె పరిస్థితి కూడా ఇంతే. చిన్నగుడ్లు సరఫరా చేసి పెద్దగుడ్లకు బిల్లు చేస్తున్నట్లు సమాచారం.
గుడ్లలోనూ నాణ్యత ఉండటం లేదని అంగన్‌వాడీ టీచర్లే చెబుతుండటం గమనార్హం. పథకం ప్రారంభంలో వస్తువుల్లో నాణ్యత ఉన్నా.. అధికారుల పర్యవేక్షణ లోపంతో నాణ్యతలోపించడమే కాకుండా మెనూ సక్రమంగా అమలు కావడం లేదని అంటున్నారు. ప్రభుత్వం కాంట్రాక్టర్లకు రూ. కోట్లు మంజూరు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఈ పథకం లబ్ధి గర్భిణులు, బాలింతలకు అందకపోవడం శోచనీయం.
‘అధ్వాన’హస్తం
Published Thu, Feb 13 2014 2:26 AM | Last Updated on Fri, Jun 1 2018 7:32 PM
Advertisement