amrutha hastam
-
నేడే ‘పోషణ’కు శ్రీకారం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్, వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాలు సోమవారం నుంచి అమలులోకి రానున్నాయి. సీఎం వైఎస్ జగన్ తన క్యాంపు కార్యాలయం నుంచి ఈ పథకాలను ప్రారంభించనున్నారు. వీటి ద్వారా అంగన్వాడీ కేంద్రాలను బలోపేతం చేయడంతోపాటు గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు బలవర్ధకమైన పౌష్టికాహారాన్ని అందచేసేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే అమలులో ఉన్న వైఎస్సార్ అమృత హస్తం, మధ్యాహ్న భోజన పథకం, బాలామృతం, వైఎస్సార్ బాల సంజీవనికి అదనంగా వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకాన్ని అమలు చేయనున్నారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ ప్లస్ పథకం.. 4 రాష్ట్రంలోని 77 గిరిజన, సబ్‌ప్లాన్ మండలాల పరిధిలోని 8 ఐటీడీఏలు, 52 ఐసీడీఎస్ ప్రాజెక్టులతో పాటు 8,320 అంగన్వాడీ కేంద్రాల్లో ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. 66 వేల మంది గర్భిణులు, బాలింతలకు నెలలో 25 రోజులపాటు వేడి పాలు, అన్నం, పప్పు, కూరగాయలు లేదా ఆకుకూరలు, గుడ్డు అందజేస్తారు. టేక్ హోమ్ న్యూట్రిషన్ కిట్ కింద నెలకు 2 కిలోల మల్టీ గ్రెయిన్ ఆటా, అర కిలో వేరుశనగ చిక్కీ, అరకిలో రాగి పిండి, అరకిలో బెల్లం, అరకిలో ఎండు ఖర్జూరం పంపిణీ చేయనున్నారు. ఒక్కో లబ్ధిదారుడిపై నెలకి రూ.1,100 చొప్పున మొత్తం రూ.87.12 కోట్లు ఖర్చు చేయనున్నారు. – 36 నుంచి 72 నెలల లోపున్న 1.64 లక్షల మంది చిన్నారులకు నెలలో 25 రోజులపాటు వేడి అన్నం, పప్పు, కూరగాయలు, ఆకుకూరలతోపాటు 200 మిల్లీ లీటర్ల పాలు, కోడిగుడ్డు, 50 గ్రాముల బాలామృతం లడ్డు ఇస్తారు. ఒక్కొక్కరికి రూ.553 చొప్పున మొత్తం రూ.108.83 కోట్లు ఖర్చు కానుంది. – 6 నుంచి 36 నెలలలోపున్న 1.50 లక్షల మంది చిన్నారులకు టేక్ హోం న్యూట్రిషన్ కిట్ కింద నెలకు 2.5 కిలోల బాలామృతం, 30 కోడి గుడ్లు, 6 లీటర్ల పాలు అందించనున్నారు. ఒక్కొక్కరిపై నెలకు రూ.620 చొప్పున మొత్తం రూ.111.60 కోట్లు ఖర్చు చేయనున్నారు. మొత్తం 3.80 లక్షల మంది లబ్ధిదారులపై రూ.307.55 కోట్లు ఖర్చు చేయనున్నారు. వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం.. – ఈ పథకాన్ని 77 గిరిజన మండలాలు మినహా రాష్ట్రవ్యాప్తంగా 47,287 అంగన్వాడీ కేంద్రాల్లో అమలు చేయనున్నారు. 5.80 లక్షలమంది గర్భిణీలు, బాలింతలకు నెలలో 25 రోజులు వేడి పాలు, అన్నం, పప్పు, కూరగాయలు లేదా ఆకుకూరలు, కోడి గుడ్లు సరఫరా చేస్తారు. టేక్ హోం న్యూట్రిషన్ కిట్ కింద నెలకు 250 గ్రాముల వేరుశనగ చిక్కీ, కిలో రాగి పిండి, 250 గ్రాముల బెల్లం, మరో 250 గ్రాముల ఎండు ఖర్జూరం, కిలో సజ్జ పిండి అందిస్తారు. దీని కోసం ఒక్కొక్కరిపై నెలకు రూ.850 చొప్పున మొత్తం రూ.591.60 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనుంది. – 36 నుంచి 72 నెలల్లోపు ఉన్న 7.06 లక్షల మంది చిన్నారులకు నెలకు ఒక్కొక్కరిపై రూ.350 చొప్పున మొత్తం రూ.296.52 కోట్లు ఈ పథకంతో ఖర్చు చేస్తారు. – 6 నుంచి 36 నెలల లోపున్న 13.50 లక్షల మంది చిన్నారులకు ఒక్కొక్కరిపై రూ.412 చొప్పున మొత్తం రూ.667.44 కోట్లు ఖర్చు చేయనున్నారు. – వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకంలో మొత్తం 26.36 లక్షలమంది లబ్ధిదారులకోసం ప్రభుత్వం రూ.1,555.56 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ రెండు పథకాల అమలుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. -
ఇవేం... పా'పాలు'!
అన్న అమృత హస్తం పథకం అభాసుపాలవుతోంది. పౌష్టికాహారంలో భాగంగా నిరుపేదలైన గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు అంగన్వాడీల ద్వారా పాలు అందజేస్తున్నారు. అయితే విషతుల్యమైన పాలు సరఫరా అవుతుండటం వారి పాలిట శాపంగా మారుతోంది. పాలు తొంభై రోజులు నిల్వ ఉంటాయనే ప్రభుత్వ ప్రకటన ఒట్టిదేనని తేలింది. కనీసం అంగన్వాడీ కేంద్రాలకు చేరే వరకు కూడా నిల్వ ఉండటం లేదు. కేంద్రాలకు వచ్చే సరికి ప్యాకెట్లు ఉబ్బిపోయి, దుర్గంధం వెదజల్లుతున్నాయి. దీంతో లబ్ధిదారులు తాగకుండా పారబోస్తున్నారు. ఇంత జరుగుతున్నా పాలకులు, అధికారులు పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. కర్నూలు,ఆళ్లగడ్డ: నిరుపేద గర్భిణి, బాలింతలకు అన్న అమృత హస్తం పథకం కింద ఒక పూట సంపూర్ణ భోజనాన్ని అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందిస్తున్నారు. భోజనంతో పాటు కోడిగుడ్డు, 200 మి.లీ పాలు ఇస్తున్నారు. 2013 జనవరిలో ఇందిరమ్మ అమృత హస్తం పేరుతో ప్రారంభించగా.. టీడీపీ అన్న అమృత అహస్తంగా పేరు మార్చింది. కాసులు కురిపిస్తున్న టెండర్లు .. పాలకుల ధనదాహం..అధికారుల నిర్లక్ష్యంతో కాంట్రాక్టర్లకు కాసుల వర్షం కురుస్తోంది. పథకానికి వంటనూనె, బియ్యం, కందిపప్పు చౌక దుకాణాల ద్వారా సరఫరా చేస్తున్నారు. గుడ్లు, పాలు మాత్రం మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కాంట్రాక్టర్ల ద్వారా అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నారు. కాంట్రాక్టర్ అధికార పార్టీకి చెందిన వారు కావడం, నాయకులకు, స్థాయి వారీగా ఉన్నతాధికారుల వరకు నెల మామూళ్లు ఇవ్వాల్సి రావడంతో నాసిరకం వస్తువులు సరఫరా చేస్తూ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్నారు. తమకు ముట్టేది ముడుతుండటంతో పాలకులు, అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. వంకల్లో పారబోత.. పాలు పాడై పోతున్నాయని చెబితే అధికారుల నుంచి బెదిరింపులు వస్తుండటంతో కార్యకర్తలు కాంట్రాక్టర్ల నుంచి తీసుకుని పెట్టె విప్పి చూసి పాడై ఉంటే పడేస్తున్నారు. చాలా గ్రామాల్లో రోడ్ల వెంట కుప్పకుప్పలుగా పాల ప్యాకెట్లు పడి ఉంటున్నాయి. ఎవరికి ఫిర్యాదు చేయాలి.. జిల్లాలో ప్రస్తుతం నెలకు 3,74,674 లీటర్ల పాలు కొనుగోలు చేస్తున్నారు.ఇందుకు శిశు సంక్షేమ శాఖ నెలకు రూ.1.50 కోట్లు కాంట్రాక్టర్లకు చెల్లిస్తోంది. నెలకు సరిపడా నిల్వలను ఒకేసారి అంగన్వాడీ కేంద్రాలకు చేరుస్తున్నారు. పాడైపోయిన పాల ప్యాకెట్‌పై ముద్రించిన నంబర్‌కు ఫోన్ చేస్తే స్పందన రావడం లేదు. సూపర్వైజర్లు, సీడీపీఓలకు కార్యకర్తలు సమాచారమిస్తున్నా వారు కూడా ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్థం కావడం లేదు. పాలు..విషతుల్యం.. జిల్లాలోని 16 ప్రాజెక్టుల్లోని 3,549 అంగన్వాడీ కేంద్రాల పరిధిలో మొత్తం 74,834 మంది లబ్ధిదారులున్నారు. పాల సరఫరా భాధ్యతను తొలుత మహిళా సంఘాలకు అప్పగించారు. ఐసీడీఎస్, ఐకేపీ మధ్య సమన్వయం లోపించడంతో అంగన్వాడీ కార్యకర్తలే సమకూర్చుకోవాలని సూచించారు. స్థానికంగా అవకతవకలు జరుగుతున్నాయనే ఉద్దేశ్యంతో పాల సరఫరాను సమగ్ర స్త్రీ శిశు సంక్షేమ శాఖ తీసుకుంది. రెండేళ్లుగా ప్రభుత్వం విజయ వజ్రా బ్రాండ్ పేరుతో టెట్రా ప్యాకెట్లు అందజేస్తున్నారు. వీటి కాల వ్యవధి తొంబై రోజులుగా ప్యాకెట్లపై ముద్రించారు. అయితే సరఫరా చేసిన రెండు రోజులు గడవక ముందే పాకెట్లు ఉబ్బిపోయి, దుర్వాసన వెదజల్లుతున్నాయి. -
పౌష్టికాహారం అందని ద్రాక్షేనా!
ప్రొద్దుటూరు : అన్న అమృత హస్తం పథకంలో భాగంగా ప్రతి రోజూ మధ్యాహ్న భోజనంలో గర్భిణులు, బాలింతలతోపాటు ఎంపిక చేసిన చిన్నారులకు గుడ్డు వడ్డించాల్సి ఉంది. పౌష్టికాహారం అందించేందుకు రూ.కోట్లు వెచ్చించి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. ప్రతి నెలా ఈ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కేంద్రాలకు 1.50 లక్షల గుడ్లు సరఫరా చేయాల్సి ఉంది. గత నెల రోజులుగా గుడ్ల సరఫరా ఆగిపోయింది. ఈ కారణంగా అంగన్వాడీలు వీరికి భోజనం మాత్రమే పెట్టి పంపుతున్నారు. ప్రొద్దుటూరు అర్బన్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని 196 అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు 1268 మంది, బాలింతలకు 1187 మంది, చిన్నారులు 14,448 మంది ఉన్నారు. స్వరాజ్యనగర్ సెక్టార్ పరిధిలో దాదాపుగా అన్ని ఎస్సీ అంగన్వాడీ కేంద్రాలే ఉన్నాయి. వీరికి గత నెల రోజులుగా 6వేలకుపైగా అందాల్సిన గుడ్ల సరఫరా ఆగిపోయింది. మైదుకూరు నగర పంచాయతీ పరిధిలోని 87 అంగన్వాడీ కేంద్రాలకు నెల రోజులుగా కాంట్రాక్టర్ గుడ్లు సరఫరా చేయడం లేదు. జిల్లాలో 15 ఐసీడీఎస్ ప్రాజెక్టులు ఉన్నాయి. వీటి పరిధిలో 3,268 మెయిన్, 353 మినీ అంగన్వాడీ కేంద్రాలు నడుస్తున్నాయి. వీటిలో 21,711 మంది గర్భిణులు, 20,155 మంది బాలింతలు, ఏడాదిలోపు చిన్నారులు 23,700 మంది 1 నుంచి 3 ఏళ్లలోపు చిన్నారులు 76,075 మంది, మూడేళ్ల నుంచి ఆరేళ్లలోపు వారు 98,842 మంది నమోదై ఉన్నారు. వీరిలో 3–6 ఏళ్లలోపు పిల్లలు ఎక్కువ మంది అంగన్వాడీ కేంద్రాలకు రావడం లేదు. మిగిలిన వారందరికి ప్రతి నెల దాదాపుగా 30 లక్షల గుడ్లు కాం ట్రాక్టర్ సరఫరా చేయాల్సి ఉంది. ఈ ప్రకారం ఆయా ప్రాజెక్టు సీడీపీఓలు ప్రతి నెల వీరికి బిల్లులు చెల్లిస్తున్నా రు. గతంలో రెవెన్యూ డివిజన్ల వారి గా గుడ్ల సరఫరా కాంట్రాక్టును ప్రతి ఏడాది జిల్లా జాయింట్ కలెక్టర్ టెండ ర్లు నిర్వహించి అప్పగించేవారు. కొత్త విధానానికి తెరతీసిన ప్రభుత్వం తొలి నుంచి రెవెన్యూ డివిజన్ల వారిగా గుడ్ల సరఫరా కాంట్రాక్టర్‌ను నియమించేవారు. అయితే టీడీపీ ప్రభుత్వం ఇందుకు భిన్నంగా రాష్ట్ర స్థాయిలో కాంట్రాక్టు నిర్వహించి ఎంపిక చేసిన కంపెనీలకు జిల్లాల వారీగా కాంట్రాక్టును అప్పగించింది. ఈ ప్రకారం వైజాగ్‌కు చెందిన యునైటెడ్ ట్రేడర్స్ వారు కాంట్రాక్టు దక్కించుకుని గుడ్లు సరఫరా చేశారు. గతంలో నెక్ ప్రకారం మార్కెట్ ధరలను బట్టి కాంట్రాక్టర్లకు దబ్బు చెల్లిస్తుండగా ప్రభుత్వ పెద్దల జోక్యంతో ఏడాది పొడవునా గుడ్డుకు రూ.4.68 చొప్పున చెల్లించారు. గత ఏడాది జూలై 14 నుంచి కాంట్రాక్టు దక్కించుకున్న వీరు గుడ్లు సరఫరా చేశారు. నిబంధనల ప్రకారం ఈ ఏడాది జూలై 14తో వీరికి గడువు ముగిసింది. కారణం తెలియదు కానీ అధికారులు జూలై 15 నుంచి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ 15 వరకు గడువు పొడిగించారు. దీంతో ఈనెల 15 నాటికి అధికారులు టెండర్లు నిర్వహించి కొత్తవారికి కాంట్రాక్టును అప్పగించాల్సి ఉంది. అలాంటిది జనవరి 2019 వరకు మరో మూడు నెలలపాటు యునైటెడ్ ట్రేడర్స్‌కు గడువు పొడిగించారు. ఈ లెక్కన ఆరు నెలలపాటు ఇదే సంస్థకు గడువును పొడిగించారు. ఈ సమస్య కారణంగా సంబంధిత కాంట్రాక్టర్ గుడ్ల సరఫరాలో జాప్యం చేస్తున్నారు. నెల రోజులుగా బకాయిపడ్డ 30 లక్షల గుడ్లను ఏవిధంగా ఎవరికి పంపిణీ చేస్తారో అర్థం కాని విషయం. కాంట్రాక్టర్ నిర్వాకంతో 30 లక్షల గుడ్లకు సంబంధించిన మొత్తం రూ.1.50 కోట్లు మిగిలినట్లేనని అధికారులు సంబరపడుతారో చూడాల్సి ఉంది. -
అమృతం..విషమైంది
బేస్తవారిపేట: అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేసే పాలప్యాకెట్లు ఉబ్బి దుర్వాసన వెదజల్లుతూ పాడైపోవడంతో కాంట్రాక్టర్ కలగొట్ల సమీపంలో పడేశాడు. బేస్తవారిపేట గోడౌన్లో నిల్వ ఉంచిన అన్న అమృతహస్తం పథకంలో గర్భిణులు, బాలింతలకు, బరువు తక్కువ చిన్నారులకు అందించే ట్రాక్టర్ పాల ప్యాకెట్లు పనికిరాకుండా పోవడంతో పడేశారు. జిల్లా అంతటికీ పాల ప్యాకెట్లు సరఫరా చేసే కాంట్రాక్టర్ బేస్తవారిపేటలోని గోడౌన్‌కు సకాలంలో చేర్చాడు. గోడౌన్ నుంచి అంగన్వాడీ కేంద్రాలకు సబ్ కాంట్రాక్టర్ సరఫరా చేయలేదు. మే నెలలో లబ్ధిదారులకు అందని పాలు: బేస్తవారిపేట ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని అర్థవీడు, కంభం, బేస్తవారిపేట, గిద్దలూరు ప్రాజెక్ట్ పరిధిలోని కొమరోలు, గిద్దలూరు, రాచర్ల మండలాల్లోని అంగన్వాడీ కేంద్రాలకు మే నెలలో అన్న అమృతహస్తం పథకంలో అందించాల్సిన పాల ప్యాకెట్ల సరఫరా నిలిచిపోయింది. గర్భిణులు, బాలింతలు, బరువు తక్కువ ఉన్న చిన్నారులకు పౌష్టికాహారం అందకుండాపోయింది. అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్న పాల ప్యాకెట్లలో కొన్ని దుర్వాసన రావడం, ప్యాకెట్లు ఉబ్బిపోయాయి. పట్టించుకోవాల్సిన ఐసీడీఎస్ అధికారులు సరైన చర్యలు తీసుకోకపోవడంతో లబ్ధిదారులు నష్టపోతున్నారు. బేస్తవారిపేట ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో గర్భిణులు 950, బాలింతలు 1050, బరువు తక్కువ పిల్లలు 550, గిద్దలూరు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలో గర్భిణులు, బాలింతలు 2,452 మంది ఉన్నారు. -
రాష్ట్రానికి పట్టణ సంస్కరణ ప్రోత్సాహకం
తొలిస్థానంలో ఆంధ్రప్రదేశ్.. తెలంగాణకు ఆరోస్థానం సాక్షి, న్యూఢిల్లీ: 2016–17లో పట్టణ సంస్కరణలు చేపట్టిన 16 రాష్ట్రాలకు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రోత్సా హకాలు అందించింది. అమృత్ పథకంలో భాగంగా ఈ–గవర్నెన్స్, ఆడిటింగ్, ఇంధన, నీటి ఆడిట్, తదితర అంశాలను పరిశీలించి రాష్ట్రాలకు మార్కులు ఇవ్వగా తెలంగాణ ఆరో స్థానంలో, ఆంధ్రప్రదేశ్ తొలిస్థానంలో నిలిచాయి. 16 రాష్ట్రాలకు మొత్తం రూ.500 కోట్లను పట్టణాభివృద్ధి శాఖ పంపిణీ చేసింది. ఏపీకి రూ.27.14 కోట్లు, తెలంగాణకు రూ.19.93 కోట్లు అందజేసింది. శుక్రవారం ఢిల్లీలో పట్టణ పరివర్తన జాతీయ సదస్సులో భాగంగా ఈ ప్రోత్సాహకాలు అందించారు. సిటీ లివెబులిటీ ఇండెక్స్‌ను కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్యనాయుడు ఆవిష్కరించారు. దేశంలోని 116 ప్రధాన నగరాల్లో జీవన నాణ్యతను ఈ ఇండెక్స్ ద్వారా వెల్లడిస్తారు. -
అటకెక్కిన ‘అమృత్’
- ‘అనంత’లో మొదలుకాని రూ.50 కోట్ల పనులు - అభివృద్ధిపై పాలకుల్లో కొరవడిన చిత్తశుద్ధి - గ్రూపు రాజకీయాలతో ప్రజా శ్రేయస్సు గాలికి.. అనంతపురంలోని 32వ డివిజన్లో ఉన్న బుద్ధవిహార్ పార్కు ఇది. దీన్ని అమృత్ పథకం కింద రూ.50 లక్షలతో అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. ఈ పనులకు ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, మేయర్ స్వరూప 2016 జూన్ 25న శంకుస్థాపన చేశారు. ఇంతవరకు ఇవి అంగుళం కూడా ముందుకు కదలేదు. పైగా 32వ డివిజన్‌ను మేయర్ దత్తత తీసుకున్నారు. అయినప్పటికీ పనులపై శ్రద్ధ చూపకపోవడం గమనార్హం. అనంతపురం న్యూసిటీ : ‘అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని’ అన్న చందంగా తయారైంది అనంతపురం నగర పాలక సంస్థ పరిస్థితి. కేంద్ర ప్రభుత్వం 2015-16లో ‘అనంత’ను ‘అమృత్’ పథకం కింద ఎంపిక చేసినా.. ఆ స్థాయిలో అభివృద్ధి మాత్రం జరగడం లేదు. పాలకుల వర్గ విభేదాల నేపథ్యంలో ప్రగతి పడకేసింది. ‘అమృత్ సిటీ’గా అనంతను అభివృద్ధి చేయడానికి నగరపాలక సంస్థకు రూ.50 కోట్ల నిధులను కేంద్రం మంజూరు చేసింది. వీటిని వరద నీటి కాలువలు, మురుగునీటి శుద్ధి ప్లాంట్, నీటి సరఫరా, పార్కుల అభివృద్ధికి వినియోగించుకోవాలి. ఈ పనులకు సంబంధించి కార్పొరేషన్ అధికారులు డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్) తయారు చేశారు. పరిపాలనా పరమైన అనుమతి కూడా మంజూరైంది. అయినా పనులు ముందుకు సాగడం లేదు. దీంతో ప్రభుత్వం ఇటీవల వీటి నిర్వహణ బాధ్యతను పబ్లిక్ హెల్త్‌కు అప్పగిస్తూ జీఓ విడుదల చేసింది. పట్టించుకోని పాలకవర్గం అమృత్ పథకం కింద నిధులు మంజూరైనప్పుడు పాలకవర్గం గొప్పలు చెప్పుకుంది. ఆ తర్వాత నిధుల వ్యయం గురించి పెద్దగా పట్టించుకోలేదు. ఈ నిధుల్లో రూ.50 లక్షలతో బుద్ధవిహార్ పార్క్ అభివృద్ధి, రూ.18 కోట్లతో వరద నీటి కాలువల నిర్మాణం, రూ.17 కోట్లతో మురుగునీటి శుద్ధి ప్లాంట్, రూ.10 కోట్లతో సమ్మర్ స్టోరేజీ ట్యాంకు మరమ్మతు, రూ.50 లక్షలతో రాజీవ్ చిల్డ్రన్స్ పార్క్ పునరుద్ధరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. వీటికి పరిపాలనా అనుమతి మంజూరైనా.. సాంకేతిక (టెక్నికల్) అనుమతి మాత్రం రాలేదు. పాలకవర్గంలోని గ్రూపు రాజకీయాలే ఇందుకు కారణం. ఎమ్మెల్యే, మేయర్ వర్గీయులు తరచూ వివాదాలను లేవనెత్తుతున్నారు. వారు ఏనాడూ ‘అమృత్’ పరిస్థితేంటని ఆలోచించిన దాఖలాలు లేవు. ఇంతకుముందు నగర పాలక సంస్థకు రెగ్యులర్ కమిషనర్ లేకపోవడం, ‘అమృత్’ పనులకు సంబంధించి ప్రత్యేకంగా డీఈ, ఏఈ లేకపోవడం కూడా పనులు సాగకపోవడానికి కారణాలు. ప్రస్తుతం ఏపీఎఫ్ఐయూడీసీ నుంచి నియమితులైన సిటీ ప్లానర్ హిమబిందు, ఎక్స్పర్ట్ రోజారెడ్డి, కన్సల్టెంట్ ఆయూబ్ పర్యవేక్షిస్తున్నారు. ప్రయోజనాలెన్నో... ‘అమృత్’ పనులు పూర్తయితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. వరద నీటి కాలువలు ఏర్పాటైతే ఏళ్ల తరబడి వెంటాడుతున్న మరువ వంక సమస్య తీరుతుంది. అశోక్‌నగర్ బ్రిడ్జి నుంచి ఐరన్ బ్రిడ్జి మీదుగా సూర్యనగర్ సర్కిల్, త్రివేణి టాకీస్, ఎర్రనేల కొట్టాలు, తడకలేరు వరకు డ్రెయినేజీ ఏర్పాటు చేస్తారు. దీనివల్ల మరువ వంకకు భవిష్యత్తులో వరద వచ్చినా ఎటువంటి ప్రమాదమూ ఉండదు. అలాగే శిల్పారామంలో మురుగునీటి శుద్ధి ప్లాంట్ ఏర్పాటు చేయనున్నారు. నడిమివంక, మరువ వంక ద్వారా వచ్చే మురుగు నీటిని ఇందులో శుద్ధి చేసి మొక్కల పెంపకానికి వినియోగించడంతో పాటు తడకలేరు వద్ద ఉన్న డ్యాంలోకి పంపుతారు. దీంతో పాటుగా నీటి సరఫరాకు సంబంధించి సమ్మర్ స్టోరేజీ ట్యాంకు పునరుద్ధరణ పనులు చేపట్టాల్సి ఉంది. స్టోరేజీ ట్యాంకులో బండ్‌కు పగుళ్లు ఏర్పడుతున్నాయి. ట్రీట్మెంట్ ప్లాంట్ కూడా సరిగా లేదు. దాని స్థానంలో మరొకటి ఏర్పాటు చేస్తే ప్రజలకు శుద్ధి జలాన్ని అందించవచ్చు. -
అమృత్‌కు ప్రధాని ప్రశంసలు
సంస్కరణల అమలులో తొలిస్థానంలో తెలంగాణ సాక్షి, హైదరాబాద్: అమృత్ సంస్కరణల అమలులో దేశంలోనే మొదటి స్థానంలో ఉన్నందున తెలంగాణ రాష్ట్ర పురపాలక శాఖకు ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. అన్ని రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ఉన్నతాధికారులతో ప్రధాని మోదీ బుధవారం ప్రగతి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా అమృత్ పట్టణాలకు సంబంధించి సంస్కరణల అమలులో తెలంగాణ ముందంజలో ఉందని ప్రధాని ప్రశంసించారు. -
పన్నులు పెంచితేనే పనులు జరుగుతాయి
-
వృద్ధురాలి నేత్ర దానం
సంగాలపల్లె (వీరపునాయునిపల్లె): మండల పరిధిలోని సంగాలపల్లె గ్రామానికి చెందిన ఎరమల పార్వతమ్మ(60) శుక్రవారం మృతిచెందింది. ఆమె నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు స్నేహిత అమృతహస్తం సేవా సమితి అధ్యక్షుడు రాజుకు సమాచారం అందచేశారు. వెంటనే సమితి అధ్యక్షుడు రాజు, స్నేహ సేవా సమితి అధ్యక్షుడు మధుసూదనరెడ్డిలు గ్రామానికి చేరుకొని ఆమె నేత్రాల నుంచి కార్నియాను తొలగించారు. వీటిని హైదరాబాద్‌లోని నేత్రాలయానికి తరలించన్నుట్లు వారు విలేకరులకు తెలిపారు. నేత్ర దానం చేసిన పార్వతమ్మ భర్త జయరామిరెడ్డి కుటుంబ సభ్యులను వారు అభినందించారు. -
వృద్ధురాలి నేత్ర దానం
సంగాలపల్లె (వీరపునాయునిపల్లె): మండల పరిధిలోని సంగాలపల్లె గ్రామానికి చెందిన ఎరమల పార్వతమ్మ(60) శుక్రవారం మృతిచెందింది. ఆమె నేత్రాలను దానం చేయాలని కుటుంబ సభ్యులు స్నేహిత అమృతహస్తం సేవా సమితి అధ్యక్షుడు రాజుకు సమాచారం అందచేశారు. వెంటనే సమితి అధ్యక్షుడు రాజు, స్నేహ సేవా సమితి అధ్యక్షుడు మధుసూదనరెడ్డిలు గ్రామానికి చేరుకొని ఆమె నేత్రాల నుంచి కార్నియాను తొలగించారు. వీటిని హైదరాబాద్‌లోని నేత్రాలయానికి తరలించన్నుట్లు వారు విలేకరులకు తెలిపారు. నేత్ర దానం చేసిన పార్వతమ్మ భర్త జయరామిరెడ్డి కుటుంబ సభ్యులను వారు అభినందించారు. -
పార్కులకు అమృత్ నిధులు
కరీంనగర్: అమృత్ పథకానికి ఎంపికైన జిల్లాలోని కరీంనగర్, రామగుండం కార్పొరేషన్ల పరిధిలో పార్కుల అభివృద్ధి కోసం నిధులు మంజూరయ్యాయి. జీవో నెం.589 ద్వారా ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ఎంజీ గోపాల్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. కరీంనగర్‌కు రూ.69 లక్షలకు రూ.57 లక్షలు మంజూరయ్యాయి. అందులో 50 శాతం కేంద్రప్రభుత్వ వాటా రూ.28 లక్షలు, 20శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.11.40 లక్షలు, కార్పొరేషన్ వాటా 30 శాతం 29.10 లక్షలు. రామగుండంకు రూ.1.08 కోట్లకు రూ.కోటి మంజూరు కాగా అందులో 50 శాతం కేంద్రప్రభుత్వ వాటా రూ.50 లక్షలు, 20శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.20 లక్షలు పోను కార్పొరేషన్ వాటా 30 శాతం రూ.29.10 లక్షలు జమచేయాల్సి ఉంటుంది. ఈ నిధులు ఫైనాన్స్ విభాగం ద్వారా మున్సిపాలిటీల ఖాతాల్లో జమ అవుతాయని జీవోలో పేర్కొన్నారు. -
అభివృద్ధి జాడేదీ?
జిల్లాకు చెందిన వెంకయ్యనాయుడు, నారాయణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రులుగా పనిచేస్తున్నా నగరాభివృద్ధికి నిధులు తీసుకురావడంలో వెనుకబడుతున్నారు. మంత్రి నారాయణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.40కోట్లు తీసుకువచ్చి అభివృద్ధి పనులు చేపడతామని ప్రకటించిన ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. అమృత్ పథకం కింద రూ.10 కోట్లు విడుదల కావాల్సి ఉన్నా అభివృద్ధి ప్రతిపాదనల తయారీలో జాప్యంతో మంజూరు కాలేదు. ఫలితంగా నెల్లూరు కార్పొరేషన్లో పాలకవర్గం కొలువుదీరి రెండున్నరేళ్లు గడిచినా అభివృద్ధి జాడలు మాత్రం కనిపించడం లేదు. నెల్లూరు, సిటీ: నెల్లూరు నగర పాలక సంస్థ పాలకులు, అధికారులు నిర్లక్ష్యంతో నగరాభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నచందంగా తయారైంది. మంజూరైన నిధులను సద్వినియోగించుకోకపోవడం..రావాల్సిన నిధులకు ప్రతిపాదనలు తయారుచేసి పంపడంలో జాప్యం చేస్తుండడంతో అభివృద్ధిలో వెనుకబడిపోతోంది. నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో 54 డివిజన్లు ఉన్నాయి. సుమారు 7లక్షల మందికిపైగా జనాభా నివాసం ఉంటున్నారు. నగరపాలక వర్గం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడుస్తుండగా ఇప్పటి వరకు 13వ ఆర్థిక సంఘం నిధులు రూ.17కోట్లు, కార్పొరేషన్ సాధారణ నిధులు రూ.20కోట్లతో మాత్రమే అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. ఇందులోను కొన్ని పనులు టెండర్ల దశలోనే నిలిచిపోయాయి. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్, 14వ ఆర్థిక సంఘం నిధుల కింద రూ.70కోట్ల వరకు విడుదల కాగా అధికారులు ఇంకా అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు తయారు చేసే పనిలోనే ఉన్నారు. నిధులను వినియోగించుకోకపోతే వెనక్కు వెళ్లే అవకాశం ఉంది. అయినా పాలకులు, అధికారులు అభివృద్ధి పనులకు చర్యలు తీసుకోవడంలో వెనుకబడుతున్నారు. మంజూరు కాని అమృత్ పథకం నిధులు గత ఏడాది జూన్ 25న కేంద్ర ప్రభుత్వం నెల్లూరు నగర పాలక సంస్థను అమృత్ పథకం కింద ఎంపిక చేసింది. అమృత్ పథకం కింద 5 ఏళ్లలో వివిధ దశల్లో రూ.102 కోట్లు మంజూరు చేస్తారు. ఇందులో భాగంగా ఈ ఏడాది రూ.10కోట్లతో పనులు ప్రారంభించాల్సి ఉంది. అధికారులు అసత్వంతో ప్రతిపాదనలు పంపడంలో జాప్యం చేయడంతో ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. ప్రకటనలకే పరిమితం రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులను తీసుకువచ్చి నగరాన్ని అభివృద్ధి చే స్తామన్న మంత్రి నారాయణ హామీలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి రూ.10కోట్లు, సాధారణ నిధుల నుంచి రూ.40కోట్లు మంజూరు చేయిస్తామని ప్రకటించిన ఇంతవరకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. మంత్రి తన సొంత జిల్లాకే నిధులు తీసుకురాలేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ కార్పొరేటర్ల డివిజన్‌లోనే అభివృద్ధి 13వ ఆర్థిక సంఘం, సాధారణ నిధులతో అరకొరగా అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచినా అవి కేవలం అధికార పార్టీ కార్పొరేటర్ల డివిజన్లకే పరిమితమవుతున్నాయి. వైఎస్సార్సీపీ కార్పొరేటర్ల డివిజన్లకు పనులు కేటాయింపులో పక్షపాతం చూపిస్తున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఎన్నిసార్లు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం ఉండడం లేదు. బడా కంపెనీకి టెండర్లు ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు రూ.42.30కోట్లతో చేపట్టనున్న పనులను 8 ప్యాకేజీలుగా విభజించి గత నెలలో టెండర్లును పిలిచారు. అయితే మంత్రి నారాయణ ఆదేశాలతో టెండర్లును ఒకే కాంట్రాక్ట్ సంస్థకు అప్పగించేందుకు పావులు కదుపుతున్నారు. 8 ప్యాకేజీల టెండర్లను రద్దు చేసి బడకంపెనీకి అప్పగించే పనిలో ఉన్నారు. -
టీడీపీ నేతలకు సలాం కొట్టిన అధికారులు
కడప : కడపలో శనివారం జరిగిన 'అమృత్' పథకం ప్రారంభోత్సవ కార్యక్రమంలో అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రోటకాల్ ఉల్లంఘించి టీడీపీ నేతలకు అధికారులు సలాం కొట్టారు. వేదికపై టీడీపీ నేతలను కూర్చోబెట్టడంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రోటోకాల్ ఉల్లంఘనపై కడప మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్యే అంజద్ బాషా కార్యక్రమాన్ని బహిష్కరించారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
సురక్షితమైతేనే నగరం సుందరం
సమకాలీనం స్మార్ట్ సిటీ అంటే ఏమిటోగానీ, స్వచ్ఛమైన గాలి, నీరు లభించే వాతావరణం సగటు నగర జీవికి కావాలి. విపత్తుల్లోనూ ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు భద్రతను కల్పించాలి. హరితాన్ని, జలవనరుల్ని పరిరక్షిస్తూ నిలకడైన అభివృద్ధిని సాధించే ఆవాసయోగ్య నగరాలే స్మార్ట్‌సిటీలు. ఆ లెక్కన మన నగరాలెంత భద్రమైనవి? పారిస్ సదస్సులో దేశాలన్నీ ఏ చర్యలకు కట్టుబడతాయో ప్రకటించినట్టే... నగరాల పరిరక్షణకు, పర్యావరణ భద్రతకు పాలకులు, అధికారులు, పౌర సమాజం తమ నిబద్ధతను ప్రకటించాలి. ఆశావహ సంకేతాలిచ్చిన పారిస్ పర్యావరణ సదస్సు నేర్పిన పాఠమేమిటి? మనందరి కింకర్తవ్యమేమిటి? నిడివిలో చిన్నవిగా ఉన్నా ఇవి చాలా పెద్ద ప్రశ్నలు. సమాధానాలు, కార్యాచరణలు మరీ పెద్దవి. పర్యావరణ పరిరక్ష ణకు భూతాప పరిమితిని రెండు డిగ్రీల సెల్సియస్ దాటనీకుండా నియం త్రించాలని 190కి పైగా దేశాలు కుదుర్చుకున్న ఒప్పందం ఆహ్వానించదగ్గదే! దాదాపు రెండు వారాలు సాగిన ఈ సదస్సు తర్వాత, భాగస్వామ్య దేశాలన్నీ తమ తమ స్థాయిలలో బద్ధులమై ఉంటామని ప్రకటించిన ఉద్దేశాల (ఐఏన్డీసీ)ను, కుదుర్చుకున్న ఒప్పందాన్ని క్షుణ్ణంగా పరిశీలించిన మీదట... ప్రపంచ మేధావులు క్రోడీకరిస్తున్న ఆచరణీయ ముఖ్యాంశాలు ఐదు: 1. అభివృద్ధికి నూతన నిర్వచనం, నిలకడైన ప్రగతికి వినూత్న పంథా అవసరం, 2. డిజిటల్ విప్లవ వేగంతో స్వచ్ఛ-ఇంధన వినియోగం వైపు పరివర్తన జరగాలి, 3. ఉత్పత్తి-వ్యాపార-వాణిజ్య రంగాలు కర్బన ముద్రలను (కార్బన్ ఫుట్‌ప్రింట్స్) తగ్గించే సరికొత్త ‘వాతావరణ పరిభాష’ను అలవరచుకోవాలి, 4. నగర-పట్టణీకరణ వ్యూహాలు... శిలాజ ఇంధనాల స్థానే పునర్వినియోగ ఇంధనాల్ని వాడటం వంటి చర్యల ద్వారా ‘కర్బన మూల్యం చెల్లింపుల‘కు సిద్ధపడాలి, 5. వాతావరణ మార్పు దుష్పరిణామాల్ని తట్టుకునే చర్యల కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయింపులను, వ్యయాలను పెంచే ఆర్థిక విధానాల ను అమలుపర్చాలి. ప్రభుత్వాలు, పౌర సంస్థలు, వ్యక్తులు చిత్తశుద్ధితో పాటి స్తేనే ఆశించిన లక్ష్యాలు నెరవేరి, ఫలితాలు లభిస్తాయి. ముఖ్యంగా... కర్బన ఉద్గారాలకు, భూతాపోన్నతికి మానవ కారణాల్లో నగర, పట్టణీకరణ ప్రధాన సమస్య అని సదస్సు నొక్కి చెప్పింది. మన దేశంలో ఈ సమస్య మరింత తీవ్ర స్థాయిలో ఉంది. అందుకు మన హైదరాబాద్ ఒక ప్రత్యక్ష నిదర్శనం. మరో తెలుగు రాజధాని అమరావతి నిర్మాణమే ఓ పర్యావరణపరమైన పెద్ద సవాల్! గ్రామాల నుంచి అపరిమిత వలసల వల్ల పెరుగుతున్న జనాభా, తగిన ప్రణాళికలు లేకుండాసాగే ‘కుహనా అభివృద్ధి’, పెరుగుతున్న ఆర్థిక అంతరాలు సగటు మనిషి జీవన ప్రమాణాల్ని పతనం చేస్తున్నాయి. వాతావరణాన్ని ఛిద్రం చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఒకటి మహా నగర ఎన్నికల ముంగిట్లో, మరొకటి రాజధాని నిర్మాణ సన్నాహాల్లో ఉన్న ఈ సంధి కాలంలో వాటి బాగోగులు సర్వత్రా చర్చనీ యాంశాలే! మన మహానగరాల్లో ఆకర్షణీయత ఎంత? ఆవాసయోగ్యత ఎంత? అన్నది కోటి రూకల ప్రశ్న! అభివృద్ధి అంటే అభద్రతా? అధోఃగతా? నేటి పాలకులెవరిని కదిలించినా ప్రధాన నగరాలన్నింటినీ ‘స్మార్ట్ సిటీ’లు చేస్తామని అరచేత స్వర్గం చూపిస్తున్నారు. ఇంతకీ స్మార్ట్ సిటీ అంటే ఏంటి? ఏమో! కానీ, స్వచ్ఛమైన గాలి, నీరు లభించే వాతావరణంతో సగటు నగర జీవి జీవన ప్రమాణాల్ని పెంచి, విపత్తుల్లోనూ జీవితాలకు, స్థిరచరాస్తులకు భద్రతను కల్పించే నగరాల్ని స్మార్ట్ సిటీలు అనొచ్చేమో! సహజ వాతావ రణాన్ని కాపాడే హరితాన్ని, జలవనరుల్ని పరిరక్షిస్తూ నిలకడైన అభివృద్ధి సాధించే ‘ఆవాసయోగ్య’ నగరాలే స్మార్ట్‌సిటీలు. అలా లెక్కిస్తే మన నగరా లెంత భద్రమైనవి? ఎంత స్మార్ట్‌గా ఉన్నాయి? మొన్న హైదరాబాదు, ముంబాయి, నిన్న చెన్నై, రేపు... మరో నగరం! ఇంకా పెను ప్రమాదం ముందుందని అంతర్జాతీయ అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. 2031 నాటికి భారత నగర, పట్టణ జనాభా 60 కోట్లు దాటుతుందని ‘గ్లోబల్ కమిషన్ ఆన్ క్లైమేట్ అండ్ ఎకానమీ’ వెల్లడించింది. ఇది అమెరికా జనాభాకు రెట్టింపు. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో పట్టణ జనాభా 37 కోట్లు మాత్రమే! ఇంత స్వల్ప వ్యవధిలో ఇంతగా నగర, పట్టణీకరణ చైనాలో తప్ప మరెక్కడా జరగలేదు. భవిష్యత్తు ప్రమాదాల్ని పసిగట్టి ఇప్పట్నుంచే నియంత్రణ చర్యల్ని చేపట్టడంలో చైనాతో మనకసలు పోలికే లేదు. ఎన్ని విమర్శలున్నా... నగరాలు, పట్టణాల నిలకడైన అభివృద్ధి ప్రణాళికల్లో, జనాభా వృద్ధిని నియం త్రించడంలో చైనాను అందుకోవడం భారత్‌కు అయ్యే పనికాదు. మెకిన్సే గ్లోబల్ సంస్థ అధ్యయనం ప్రకారం, వచ్చే పదేళ్లలో పది లక్షల జనాభా దాటే మన నగరాల సంఖ్య 68కి చేరనుంది. అప్పుడేంటి పరిస్థితి? కేంద్ర ప్రభుత్వం ఇటీవలే రెండు ముఖ్య కార్యక్రమాల్ని చేపట్టింది. ‘స్మార్ట్ సిటీ’ల అభివృద్ధి, ‘అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్’ (అమృత్). ఓ కార్యక్రమం కింద వంద, మరో కార్యక్రమం కింద 500 నగరాలు- పట్టణాల అభివృద్ధి లక్ష్యంగా పేర్కొన్నారు. ‘‘ప్రణాళికాబద్ద పట్టణాభివృద్ధి భూమికపైనే భారత ప్రగతి కథాగమనం సాగిస్తామ’’ని కేంద్రం ప్రకటిం చింది. యూపీఏ హయాంనాటి జేఎన్ఎన్యూఆర్ఎమ్ పథకంలోని వైఫల్యా లను ఏ మేరకు పరిగణనలోకి తీసుకుంటున్నారో అనుమానమే! ప్రకృతి విపత్తుల కోణంలో తగు భద్రత కోసం రూపొందించిన విధాన ముసాయిదా (2014)లో ఉన్న పర్యావరణ ప్రభావ అంచనా (ఈఐఏ)... తీరా రాజపత్రం (2015)లో కనిపించకపోవడమే ఈ అనుమానానికి కారణం. ఆ రెండు నగరాల కథ! చరిత్రాత్మకమైన భాగ్యనగరం నేడు వాతావరణ పరంగా ఓ అభాగ్యనగరమే! సమీప భవిష్యత్తులోనే ఓ మహా మురికి కూపం అయినా కావచ్చు. అసా ధారణ స్థాయి వలసలు, లెక్కకు మించుతున్న జనాభా, అపరిమిత విస్తరణ, అడ్డగోలు నగరాభివృద్ధి, పౌర సదుపాయాల పరమైన వ్యూహం- ప్రణాళిక లేమి కలిసి పర్యావరణ భద్రత లోపిస్తోంది. భవిష్యత్తు మరింత భయం కలిగించేలా ఉంది. కులీకుతుబ్‌షాకు ప్రీతిపాత్రమైన హైదరాబాద్ ఒకప్పుడు చెరువులు, కుంటలకూ, హరితానికీ ప్రతీతి. సమశీతోష్ణ నగరమనే ఖ్యాతి ఉం డేది. అందుకే, రాష్ట్రపతి వేసవిలో, శీతాకాలంలో ఇక్కడికి విడిది వస్తుంటారు. ఆ పరిస్థితి మారి, ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతున్నాయి. కబ్జాదా రుల భూదురాక్రమణలు, పాలకుల నిర్లక్ష్యం, రియల్టర్ల దౌష్ట్యాల ఫలితంగా చెరువులు, పార్కులు దాదాపు కనుమరుగయ్యాయి. కాలుష్యం విపరీతంగా పెరిగింది. నగరంలో సుమారు 50 చదరపు కిలోమీటర్ల పరిధిలో గ్రీన్‌బెల్ట్ (హరిత తోరణం) ఉందని జీహెచ్ఎంసీ చెబుతోంది. అంటే మొత్తం విస్తీర్ణం లో సుమారు 8 శాతం. బెంగళూరు విస్తీర్ణంలో 13 శాతం హరిత తోరణం ఉంది. చండీగఢ్ నగర విస్తీర్ణంలో 30 శాతం హరిత తోరణంగాఉంది. అందుకే అది హరిత నగరంగా దేశానికే ఆదర్శమైంది. ఇక రాజధాని ఢిల్లీలో 5.95 శాతం, చెన్నైలో 2.01 శాతం, ముంబాయిలో 5.11 శాతం హరిత తోరణం ఉంది. హైదరాబాద్‌లో ప్రజారవాణా వ్యవస్థ అస్తవ్యస్థంగా, ఆధారపడ లేనిదిగా మారడంతో, వ్యక్తిగత వాహనాల సంఖ్య అనూహ్యంగా పెరుగు తోంది. గ్రేటర్ పరిధిలో అది 43 లక్షలకు చేరుకుంది. 3,500 ఆర్టీసీ బస్సుల్లో రోజూ 20 లక్షల మంది రాకపోకలు సాగిస్తున్నారు. ఇక 1.50 లక్షల ఆటోల్లో 4 లక్షల మంది, ఎంఎంటీఎస్ రైళ్లలో లక్షలాది మంది రాకపోకలు సాగిస్తు న్నారు. ద్విచక్ర వాహనాలపైనే నిత్యం 20 లక్షల మంది ప్రయాణిస్తున్నట్టు అంచనా. పలు శివారు ప్రాంతాలకు ప్రజా రవాణా వ్యవస్థ అందుబాటులో లేక వ్యక్తిగత వాహనాల సంఖ్య అనూహ్యంగా పెరుగుతోంది. ఫలితంగా ఓ వైపు ఇంధన బడ్జెట్, మరోవైపు వాయు, శబ్ద కాలుష్యాలు పలు రెట్లు పెరుగు తున్నాయి. నగర తాగునీటి, మురుగునీటి వ్యవస్థలైతే ఓ ఇంద్రజాలమే! ఇక్ష్వాకుల కాలం నాటి పైపులైన్ల వ్యవస్థ స్వల్ప మరమ్మతులతో కొనసా గుతోంది. తాగునీటిని నగరానికి రప్పించడానికి చూపే శ్రద్ధాసక్తుల్లో పదో వంతయినా... మురుగు నీటిని బయటకు పంపడంపై లేదు. ఫలితంగా నగరం దుర్గంధ కూపంగా మారుతోంది. వరదనీటి కాలువలు, మురుగునీటి కాలువలు, తాగునీటి పైపు లైన్లు పలుచోట్ల కలగలిసిపోతున్నాయి. జబ్బులు పెచ్చుపెరిగి అనారోగ్య భాగ్యనగరాన్ని ఆవిష్కరిస్తున్నాయి. ఇక కొత్తగా ఊపిరిపోసుకుంటున్న ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమ రావతిది మరోచరిత్ర! సహజ న్యాయ సూత్రాలకు, సుప్రీంకోర్టు తీర్పు లకు విరుద్ధంగా బహుళ పంటల హరిత భూముల్ని హరించి, అనైతిక పునాదుల పైనే ఆ నగరం పురుడు పోసుకుంటోంది. వరదలకు పేరైన కృష్ణాతీరంలో ఈ స్థావరం... వరదలు, భూకంపాల జోన్ అని నిపుణుల కమిటీ చేసిన హెచ్చరి కల్ని బేఖాతరంటూ సాగుతున్న పురో‘గతి’! యాభై వేల ఎకరాల అటవీ భూముల్ని డీనోటిఫై చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ వినతిపై కేంద్రం అభ్యం తరాలు వ్యక్తం చేసింది. పర్యావరణ భద్రతా చర్యల కార్యాచరణపై పలు సందేహాలున్నాయి. నిర్మాణ అనుమతుల్ని సూత్రప్రాయంగా నిరాకరించిన జాతీయ హరిత ట్రిబ్యునల్ ముందు కేసు విచారణలో ఉంది. ఇక్కడ కూడా ‘నిబద్ధత’ వెల్లడించాలి! పారిస్ సదస్సులో పాల్గొన్న దేశాలన్నీ తమ స్థాయిలో ఏమేం చర్యలకు కట్టు బడతాయో ‘నిబద్ధత’ (ఐఎన్డీసీ) ప్రకటించినట్టే నగరాల పరిరక్షణకు, పర్యా వరణ భద్రతకు పాలకులు, అధికారులు, సంస్థలు, పౌర సమాజం, వ్యక్తులు తమ నిబద్ధతను ప్రకటించాలి. ప్రకటించిన ప్రతి అంశాన్నీ తు.చ. తప్పక ఆచరించాలి. ‘విశ్వస్థాయిలో ఆలోచించు-స్థానికంగా ఆచరించు’ అన్న సూత్ర మిక్కడ అక్షరాలా సరిపోతుంది. కౌన్సిల్ ఫర్ గ్రీన్ రివల్యూషన్ (సీజీఆర్) ఆధ్వర్యంలో ‘సెంటర్ ఫర్ ఎకనమిక్ అండ్ సోషల్ స్టడీస్’ (సెస్)లో ఇటీవల హైదరాబాద్ ఆవాసయోగ్యతపై లోతైన చర్చ జరిపింది. పలువురు నిపుణులు పాల్గొన్న ఈ సదస్సు సమస్య మూలాల్ని, తీవ్రతకు కారణమౌతున్న అంశాల్ని చర్చించడంతో పాటు నివారణ, ముందు జాగ్రత్త చర్యలను విపులీకరించింది. మహానగర ఎన్నికల ముంగిట్లో రాజకీయ పార్టీలు ‘ఎన్నికల హరిత ప్రణాళిక’లను ప్రకటించాలని, ఆచరించాలని డిమాండ్ చేసింది. పౌరుల్ని భాగస్వాముల్ని చేసి, తగు సంప్రదింపుల ద్వారా అభివృద్ధి కార్యక్రమాల్ని రూపొందించాలని, వాటిని వ్యాపార దృక్ప థంతో కాక జనహితంలో, చిత్తశుద్ధితో ఆచరించేందుకు మార్గదర్శకాల్ని సూచించింది. సుస్థిరాభివృద్ధికి ఐక్యరాజ్యసమితి ప్రకటించిన 17 లక్ష్యాల్లో రెండంశాలు, మన మహానగరాల పరిరక్షణకు సరిగ్గా సరిపోతాయి. ఒకటి, ‘సమ్మిళిత, సురక్షిత, పరిస్థితులకనుకూలంగా ఒదిగే, నిలకడైన పర్యావరణ విధానాల్ని రూపొందించుకోవాలి’. రెండు, ‘‘విపత్తుల్లో... మృతులు, బాధితుల సంఖ్యను, ప్రత్యక్ష ఆర్థిక నష్టాలను నిలకడగా తగ్గించుకోగలిగే దీర్ఘకాలిక చర్యలుండాలి’’ సురక్షిత నగరాలే సుందర నగరాలు, చూడచక్కని నగరాలు (స్మార్ట్ సిటీలు) సుమా!! దిలీప్‌రెడ్డి, సాక్షి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ ఈమెయిల్: dileepreddy@sakshi.com -
15నుంచి ‘వన్ ఫుల్ మిల్’..
ఆదిలాబాద్ టౌన్ : గర్భిణి, బాలింతలకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న అమృతహస్తం పథకం జిల్లాలోని అన్ని ప్రాజెక్టుల్లో అమలు చేసేందుకు ప్రణాళిక సిద్ధమైంది. ఈ నెల 15 నుంచి ‘వన్ ఫుల్ మిల్’ పేరిట ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. జిల్లాలో మాతా శిశు మరణాలను తగ్గించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని మరింతగా పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇదివరకు గర్భిణులు, బాలింతలకు నెలకు 16 ఉడికించిన కోడిగుడ్లను మాత్రమే అందించేవారు. ఇక నుంచి నెలరోజులపాటు వారికి కోడిగుడ్లు ఇవ్వనున్నారు. ప్రొటీన్లు, విటమిన్లతో కూడిన ఆహారాన్ని అందజేయనున్నారు. ఈ పథకం నిర్వహణ బాధ్యతలను అంగన్వాడీ కార్యకర్తలకే అప్పగించనున్నారు. జిల్లాలో ఇలా... అమృత హస్తం పథకం 2013 జనవరిలో జిల్లాలోని 12 ప్రాజెక్టుల పరిధిలో ప్రారంభించారు. ఆరు ప్రాజెక్టు పరిధిలో ఈ పథకం అమలుకు నోచుకోలేదు. ఈ నెల 15వ తేదీ నుంచి 18 ప్రాజెక్టుల పరిధిలోని 3,538 అంగన్వాడీ కేంద్రాల్లో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. దీంతో జిల్లాలో 44 వేల మంది గర్భిణి, బాలిం తలకు పౌష్టికాహారం లభించే అవకాశం ఉంది. రూ.15 విలువ గల భోజనాన్ని ప్రతిరోజూ వారికి ఇవ్వనున్నారు. ఆకుకూరలు, కూరగాయలు, పాలు, పెరుగు, ఉడికించిన కోడిగుడ్లు, ఎగ్‌కర్రీ కూడా అందించనున్నారు. నెలలో 25 రోజుల పాటు అంగన్వాడీ కేంద్రాల్లో భోజనం పెట్టనున్నారు. గర్భందాల్చినప్పటి నుంచి ప్రసవం అయిన తర్వాత ఆరు నెలల వరకు కూడా ప్రయోజనం పొందవచ్చు. నిర్వహణ బాధ్యత అంగన్వాడీలదే.. అమృతహస్తం పథకం (వన్ ఫుల్ మిల్) నిర్వహణ బాధ్యత అంగన్వాడీ కార్యకర్తలకే అప్పగించనున్నారు. ప్రస్తుతం గ్రామ సమైక్య సంఘాల సభ్యులు భోజనం వండి గర్భిణి, బాలింతలకు అందజేస్తున్నారు. అంగన్వాడీ కార్యకర్తలు, గ్రామ సమైక్య సభ్యుల మధ్య సమన్వయ లోపంతో ఈ పథకం ప్రస్తుతం అస్తవ్యస్తంగా తయారైంది. ఐసీడీఎస్ ద్వారా బియ్యం, పప్పు, కోడిగుడ్లు, నూనె అందజేయనుండగా, అంగన్వాడీ కార్యకర్తలు పాలు, కూరగాయలు, ఆకుకూరలు, పెరుగు అందజేయాల్సి ఉంటుంది. అన్ని అంగన్వాడీ కార్యకర్తల పేరిట జీరో అకౌంట్ తీసి నెలనెల వారి అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నారు. గర్భిణులు, బా లింతలకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతోనే ఈ పథకం ప్రారంభిస్తున్నట్లు ఐసీడీఎస్ పీడీ మీరా బెనర్జి చెప్పారు. కమిటీ మెంబర్లు వీరే.. ఈ పథకం నిర్వహణకు చైర్మన్‌గా సర్పంచ్ లేదా వార్డు సభ్యుడు/కౌన్సిలర్, ఆశా కార్యకర్త, ఇద్దరు తల్లులు, సైన్స్ ఉపాధ్యాయుడు లేదా రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి, అంగన్వాడీ కార్యకర్త, ఇద్దరు గ్రామస్తులు సభ్యులుగా ఉంటారు. మెనూ.. సోమవారం అన్నం, సాంబర్, కూరగాయలు, ఎగ్‌కర్రి, పాలు, కోడిగుడ్డు. మంగళవారం అన్నం, పప్పు, ఆకుకూరలు, కూరగాయలు, కోడిగుడ్డు, పాలు. బుధవారం అన్నం, పప్పు, ఆకుకూరలు, ఎగ్‌కర్రి, కోడిగుడ్డు, పాలు. గురువారం అన్నం, సాంబర్, కూరగాయలు, పెరుగు, కోడిగుడ్డు, పాలు. శుక్రవారం అన్నం, పప్పు, ఆకుకూరలు, కూరగాయలు, కోడిగుడ్డు, పాలు. శనివారం అన్నం, పప్పు, కూరగాయలు, పెరుగు, కోడిగుడ్డు, పాలు. -
ఆగిన అమృతహస్తం?
పలమనేరు : గర్భిణీలు, బాలింతలు, పిల్లలు, కిశోరబాలికల కోసం ఏర్పాటు చేసిన ‘అన్న అమృతహస్తం’ కొండెక్కింది. ప్రభుత్వం నుంచి అందాల్సిన బియ్యం, పప్పు, నూనెలు రాకపోవడం, ఐకేపీ నుంచి బిల్లులు పెండింగ్ పడ్డంతో పలమనేరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఈ కార్యక్రమానికి బ్రేక్‌పడింది. పది రోజులుగా 80 శాతం అంగన్వాడీ కేంద్రాల్లో అన్న అమృతహస్తం పూర్తిగా ఆగిపోయింది. దీంతో 20 వేల మందికి లబ్ధి చేకూరడం లేదు. అంగన్వాడీ కేంద్రాలకు అందని సరుకులు అమృతహస్తం కార్యక్రమానికి ప్రభుత్వం నుంచి బియ్యం, పప్పు, నూనెలు ప్రతి నెలా అందేవి. దీంతో పాటు సంబంధిత ఐకే పీ గ్రామసమాఖ్యల నుంచి కూరగాయలు, కోడిగుడ్లు, పాలు అందేవి. కొన్నాళ్లుగా ప్రభుత్వం నుంచి అన్ని సరుకులూ ఆగిపోయాయి. దీనికి తోడు ఐకేపీ గ్రూపులు తొలి నుంచీ ఇబ్బందులు పడుతున్నాయి. ఇన్నాళ్లు అంతంత మాత్రంగానే సాగిన ఈ కార్యక్రమం ఇప్పుడు ఆగిపోయే స్థితికి వచ్చింది. ఐకేపీ నుంచి బకాయిలు రూ.25 లక్షలు పలమనేరు ప్రాజెక్టుకు సంబంధించి 332 మినీ, మెయిన్ అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వీటిల్లో 2200 మంది గర్భిణీలు, 2350 మంది బాలింతలు, 11 నెలల నుంచి ఆరేళ్ల వయసున్న పిల్లలు 11,032 మంది, కిశోరబాలికలు 5600 మంది.. మొత్తం 22వేల మందికి పైగా లబ్ధిదారులున్నారు. వీరిలో పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు అంగన్వాడీ కేంద్రంలో ఓ పూట పౌష్టికాహారం అందించేవారు. కిశోర బాలికలకు మాత్రం ఇంటివద్దకే ఆహార వస్తువులు అందజేసే వారు. ఇందుకు సంబంధించి ఒక్కొక్కరికి ఓ పూట భోజనానికి ప్రభుత్వం రూ.14.30 పైసలు ఖర్చుచేస్తోంది. ఐకేపీ నుంచి అంగన్వాడీలకు రెండు, మూడు నెలలుగా బిల్లులు అందలేదు. రూ.25 లక్షలకు పైగా బిల్లులు పెండింగ్ పడ్డాయి. దీంతో ఈ కార్యక్రమం దాదాపుగా ఆగిపోయింది. అప్పులు చేసి అన్నం పెట్టలేం.. గంగవరం మండలం మబ్బువాళ్లపేటకు చెందిన అంగన్వాడీ వర్కర్ వీఆర్.జ్యోతి రెండు నెలలుగా అప్పు చేసి అమృతహస్తాన్ని నిర్వహించింది. ఇందుకు సంబంధించి ఆమెకు రూ.12 వేల దాకా డబ్బు రావాల్సి ఉంది. బిల్లులు కాకపోవడంతో ఈ నెల 1 నుంచి పొయ్యి వెలిగించడమే మానేసింది. ఈమె ఒక్కరే కాదు, అందరు అంగన్వాడీలు ఇదే సమస్యతో బాధపడుతున్నారు. గతంలో మిగిలిన సరుకులు ఉన్న కొన్ని సెంటర్లు మినహా మిగిలిన 80 శాతం సెంటర్లలో పది రోజుల నుంచి పొయ్యి వెలగడం లేదు. ఫలితంగా ప్రాజెక్టు పరిధిలో 20వేల మందికి పైగా లబ్ధిదారులకు పౌష్టికాహారం దూరమైంది. ఈ విషయమై సీడీ సీవో రాజేశ్వరిని వివరణ కోరగా ప్రభుత్వం నుంచి సరుకులు అందని మాట నిజమేనన్నారు. ఇక ఐకేపీ నుంచి రూ.25 లక్షల బిల్లులు రావాల్సి ఉందన్నారు. కొన్ని సెంటర్లలో ఈ కార్యక్రమం జరుగుతున్నా పలుచోట్ల ఆగిందన్నారు. జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లానని రెండు, మూడు రోజుల్లో ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారన్నారు. -
ఐసీడీఎస్ ఖాళీ
సాక్షి,ఒంగోలు: ఆరోగ్య గ్రామీణ భారతావనికి ఆలంబనగా ఉండాల్సిన అంగన్వాడీ కేంద్రాలు సేవల్లో ఆమడదూరంలో కొనసాగుతున్నాయి. కేంద్రాలు సిబ్బంది కొరతతో కునారిల్లుతున్నాయి. దీన్ని గుర్తించిన ప్రభుత్వం సిబ్బంది నియామకాలకు అనుమతించింది. అయితే, దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా ఉంది జిల్లా అధికారుల తీరు. ఖాళీల భర్తీ దిశగా చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. మొత్తమ్మీద జిల్లాలో 2,55,642 మంది తల్లీపిల్లలు, కౌమారబాలికల ఆరోగ్యసంరక్షణ గాలిలో దీపంలా మారింది. భావి భారత పౌరులను ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడానికి, మాతాశిశు మరణాలను నియంత్రించేందుకు అంగన్వాడీ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గర్భిణులు, బాలింతలు, ఐదేళ్లలోపు వయసున్న చిన్నారులకు పౌష్టికాహారం అందించి ఆరోగ్యం, సామాజిక పరిస్థితులపై అవగాహన కల్పించాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమంలో క్రియాశీలకపాత్ర పోషించాల్సింది అంగన్వాడీ సిబ్బందే. జిల్లా పరిస్థితిదీ.. జిల్లాలో మొత్తం 21 ప్రాజెక్టులు నడుస్తున్నాయి. వీటి పరిధిలో 4244 అంగన్వాడీ కేంద్రాలు, 235 మినీ అంగన్వాడీ కేంద్రాలున్నాయి. మొత్తం 2,55,642 మంది లబ్ధిదారులు పౌష్టికాహారం పొందుతున్నారు. ఈ పథక నిర్వహణకు సరిపడినంత అంగన్వాడీ కార్యకర్తలు, సహాయకులు, మినీ అంగన్వాడీ కార్యకర్తలు, లింక్‌వర్కర్లు లేరనే విషయాన్ని ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. సిబ్బంది నియామకానికి అనుమతి కూడా ఇచ్చింది. ప్రస్తుతం జిల్లాలో దాదాపు 300కిపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంత భారీ ఎత్తున ఖాళీలు ఉండటంతో పోషకాహారం పంపిణీ కార్యక్రమం సిబ్బందికి భారంగా మారింది. 200కి పైగా కేంద్రాల్లో అసలు అంగన్వాడీ కార్యకర్తలే లేకపోవడంతో సమీప ప్రాంతాల వారిని ఇన్చార్జులుగా నియమిస్తూ నడిపిస్తున్నారు. అమృతహస్తం ఏదీ..? ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించి పౌష్టికాహారం అందించేందుకు జిల్లాలో మొత్తం 4 ప్రాజెక్ట్‌లు (కనిగిరి, మార్కాపురం రూరల్, యర్రగొండపాలెం, బేస్తవారిపేట) ఏర్పాటు చేశారు. వీటిల్లో కూడా సిబ్బంది కొరత ఉందని ప్రభుత్వం గుర్తించినా.. ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీచేసే నాథుడు కరువయ్యాడు. పిల్లల్లో పోషకాహార లోపం.. జిల్లాలో అంగన్వాడీ కేంద్రాల పరిధిలో మొత్తం 2,55,642 మంది లబ్ధిదారులు పోషకాహారం పొందుతున్నారని లెక్కలు చెబుతున్నాయి. వీరితోపాటు గర్భిణులు 36,269 మంది ఉండగా, బాలింతలు 34,241 మంది ఉన్నారు.జిల్లాలో సుమారుగా నాలుగు శాతం మంది ఐదేళ్లలోపు చిన్నారులు ప్రమాదస్థాయిలో.. సుమా రు 25 వేల మందికి పైగా పిల్లలు సాధారణ పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు. ఐసీడీఎస్ ఉన్నతాధికారుల వైఖరిపై ఆరోపణల దుమారం రేగుతోం ది. పోస్టుల భర్తీ విషయంలో సదరు అధికారులు స్వార్థపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోస్టుల భర్తీపై ఐసీడీఎస్ ప్రాజె క్ట్ అధికారి విద్యావతిని ‘సాక్షి’ ఫోన్లో వివరణ కోరగా.. అంగన్వాడీ కేంద్రాల్లో సిబ్బంది కొరతకు సంబంధించి తనకు సమాచారం తెలియదని చెప్పారు. -
‘అమృత హస్తం, మార్పు’ పనితీరు భేష్
నర్సాపూర్‌రూరల్, న్యూస్‌లైన్: గర్భిణి, బాలింత, శిశుమరణాల తగ్గింపు కోసం ప్రవేశ పెట్టిన మార్పు, అమృతహస్తం పథకాల పని తీరు భేష్‌గా ఉందని వరల్డ్ బ్యాంక్, విదేశీ బృందం సభ్యులు కితాబునిచ్చారు. గురువారం నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామంలో వరల్డ్ బ్యాంక్ బృందం సభ్యులతోపాటు లూయిస్ దేశానికి చెందిన 5 మంది సీనియర్ ప్రభుత్వ అధికారుల బృందం సభ్యులు మార్పు, అమృతహస్తం పథకాలపై సమీక్షించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా కొనసాగుతున్న అమృత హస్తం పథకం గురించి మహిళలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం సర్పంచ్ భరత్‌గౌడ్ అధ్యక్షతన నిర్విహించిన మార్పు గ్రామస్థాయి సమావేశంలో వారు పాల్గొని మార్పు పథకంలో పనిచేస్తున్న అధికారులతోపాటు గర్భిణి, బాలింతలతో చర్చించారు. అమృత హస్తం, మార్పు పథకాల పని తీరు తెలుసున్న వరల్డ్ బ్యాంక్, విదేశీ బృందం సభ్యులు అశికోయిలీ కతురియ, సంగీత, ఖాంప్లో సిహకంగ్, ఖాసేంగ్ ఫిలావోంగ్, సెంగ్ప్రాసేవ్ వాంతనౌవోంగ్, చాన్లావ్ లుఆంగ్లత్, సోవంఖమ్ పోమ్మసెంగ్, ఫెట్దర చంతల మాట్లాడుతూ ఈ పథకాలను తమ దేశాల్లో కూడా ప్రవేశ పెట్టించెందుకు కృషి చేస్తామన్నారు. ఈపథకాలపై విదేశీయులతోపాటు మనదేశంలోని ఆయా రాష్ట్రాల అధికారులకు అహగాహన కల్పించేందకు మెదక్ జిల్లాకు తీసుకు రానున్నట్లు తెలిపారు. అనంతరం రెడ్డిపల్లి ప్రాథమిక ఆరోగ్యో కేంద్రాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మార్పు రాష్ట్ర కోఆర్డినేటర్ సరళ రాజ్యలక్ష్మి, ఆర్జెడి విజయలక్ష్మి, జిల్లా వైద్యాఆరోగ్య శాఖ అధికారి పద్మ, డీఆర్డీఓ ప్రాజెక్ట్ అధికారి రాజెశ్వర్రెడ్డి, ఐసీడీఎస్ జిల్లా ప్రాజెక్టు అధికారి శైలజ, సీడీపీఓ కనకదుర్గ, ఎంపీడీఓ రమాదేవి, పీహెచ్సీ వైద్యురాలు జ్యోతి, సర్పంచ్ భరత్‌గౌడ్, ఐకేపీ ఏరియా కోఆర్డినేటర్ బాబూరావు, ఏపీఎం సత్యనారాయణ మాజీ ఆత్మకమిటీ చెర్మన్ ఆంజనేయులుగౌడ్. అశోక్‌గౌడ్, తదితరులు పాల్గొన్నారు. జిల్లాస్పత్రిని సందర్శించిన బృందం సంగారెడ్డి అర్బన్: జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రిలోని పోషక పునరావస కేంద్రాన్ని కేంద్ర ప్రభుత్వ అధికారులు, ప్రపంచ బ్యాంకు బృందం, లావోస్ దేశం మెటర్నల్ చైల్డ్ హెల్త్ సెంటర్ ప్రతినిధులు గురువారం సందర్శించారు. వైద్యం అందిస్తున్న తీరును పరిశీలించి డాక్టర్ల ద్వారా వివరాలను తెలుసుకున్నారు. ఎన్ఆర్సీ సెంటర్ పనితీరును స్టడీ చేయడానికి వచ్చినట్లు ఆ సంస్థ డెరైక్టర్ కాంపియో సీయాకాంగ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో లావోస్ దేశ మెటర్నల్ చైల్డ్ హెల్త్ సెంటర్ డిప్యుటీ డెరైక్టర్లు ఖామ్సెంగ్ ఫిల్వాంగ్, వరల్డ్ బ్యాంక్ ఇండియా అధికారులు అశికోయిల్ ఖథారియా, మోహినోక్, రాష్ట్ర ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ జాయింట్ డెరైక్టర్ సరళ రాజ్యలక్ష్మి, ఎన్ఆర్హెచ్ఎం డీపీఎంఓ జగన్నాథ్‌రెడ్డి, ఎన్ఆర్సీ వైద్యులు డాక్టర్ రహీం, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
‘అధ్వాన’హస్తం
సాక్షి, కొత్తగూడెం: జిల్లా స్త్రీ, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అమృతహస్తం పథకం అభాసుపాలవుతోంది. ఈ పథకం అమలుతీరుపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. జిల్లాలో 23 ఐసీడీఎస్ ప్రాజెక్టులుండగా ఖమ్మం, కొత్తగూడెం పరిధిలో అర్బన్ ప్రాజెక్టులున్నాయి. ఖమ్మం రూరల్, తిరుమలాయపాలెం, మధిర రూరల్ తో పాటు ఏజెన్సీలో 18 ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి. కేవలం గ్రామీణ ప్రాంతాల ప్రాజెక్టుల పరిధిలోనే గత ఏడాది నుంచి అమృతహస్తం పథకం అమలవుతోంది. ఈ ప్రాజెక్టుల పరిధిలో 49,146 మందికి మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలి. కానీ పథకంలో పేర్కొనట్లుగా ఏ అంగన్వాడీ కేంద్రంలోనూ పూర్తిస్థాయిలో మెనూ అమలు కాకపోవడం గమనార్హం. రోజుకు 200 మిల్లీలీటర్ల పాలు, వారానికి నాలుగు రోజులు గుడ్డు అందించాలని మెనూలో పేర్కొన్నారు. పథకం ప్రారంభం నుంచి చాలా అంగన్వాడీ కేంద్రాల్లో పాలు పంపిణీ చేయడం లేదు. కొన్ని కేంద్రాల్లో వారం, పదిరోజులు మాత్రమే పాల పంపిణీతో సరిపెడుతున్నారు. అసలు మెనూలో పాల పంపిణీ కూడా ఉందని గర్భిణులు, బాలింతలకే తెలియదు. స్థానికంగా పాల కొరత ఉందని అందుకే పంపిణీ చేయలేకపోతున్నామని అంగన్వాడీ టీచర్లు చెబుతున్నారు. కోడి గుడ్డు వారానికి రెండు రోజులే ఇస్తున్నారు. ప్రస్తుతం చాలా కేంద్రాలకు పదిహేను రోజులుగా గుడ్డు సరఫరానే లేదు. ఇదేమని బాలింతలు అడిగినా తమకే సరఫరా లేదని అంగన్వాడీ టీచర్లు చెబుతుండటంతో చేసేది లేక వెనుదిరుగుతున్నారు. ఏజెన్సీలో మరీ అధ్వానం... ఏజెన్సీలో ‘అమృతహస్తం’ అమలుతీరు మరీ దారుణంగా ఉంది. ఇక్కడ గర్భిణులు, బాలింతలు 36,858 మంది వరకు ఉన్నారు. వీరిలో సగం మందికి కూడా అమృతహస్తం మెనూ అందడం లేదు. పోషకాహార లోపం వల్ల ఏజెన్సీలోని గిరిజన మహిళలకు రక్తహీనత వస్తోంది. అమృతహస్తం పథకం ప్రకారం పప్పు, పాలు, ఆకు కూరలు, ఆయిల్ తప్పకుండా ఇస్తేనే వీరి ఆరోగ్యం కొంతైనా మెరుగుపడేది. పాల్వంచ, ఇల్లెందు, భద్రాచలం ఏజెన్సీ పరిధిలోని కేంద్రాలపై అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కేవలం నాసిరకం పప్పు, ముతక బియ్యం, వారానికి రెండు రోజులు మాత్రమే గుడ్లు ఇస్తున్నారు. మెనూలో సూచించిన ప్రకారం కాకుండా తక్కువ మోతాదులో పప్పు, నూనె అందిస్తున్నారనే ఆరోపణలున్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లోనే వీటిని వడ్డించి పెట్టాల్సి ఉండగా కొన్ని కేంద్రాల్లోనే వండి పెడుతుండగా మిగిలిన కేంద్రాల్లో కొద్ది మొత్తంలో పంపిణీ చేసి అంగన్వాడీ టీచర్లు చేతులు దులుపుకుంటున్నారు. కాంట్రాక్టర్ల కక్కుర్తి.. నాణ్యతకు తూట్లు.. అమృతహస్తం పథకంలో పప్పు, నూనె, గుడ్లు అంతా కాంట్రాక్టర్లే సరఫరా చేయాలి. కానీ వీరు ఉన్నతాధికారులను మచ్చిక చేసుకొని నాసిరకమైన సరుకులను అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. పప్పు పుచ్చిపోయి ఉండటంతో గర్భిణులు, బాలింతులు దాన్ని తీసుకోవడానికి ఇష్టపడటం లేదు. నూనె పరిస్థితి కూడా ఇంతే. చిన్నగుడ్లు సరఫరా చేసి పెద్దగుడ్లకు బిల్లు చేస్తున్నట్లు సమాచారం. గుడ్లలోనూ నాణ్యత ఉండటం లేదని అంగన్వాడీ టీచర్లే చెబుతుండటం గమనార్హం. పథకం ప్రారంభంలో వస్తువుల్లో నాణ్యత ఉన్నా.. అధికారుల పర్యవేక్షణ లోపంతో నాణ్యతలోపించడమే కాకుండా మెనూ సక్రమంగా అమలు కావడం లేదని అంటున్నారు. ప్రభుత్వం కాంట్రాక్టర్లకు రూ. కోట్లు మంజూరు చేస్తున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం ఈ పథకం లబ్ధి గర్భిణులు, బాలింతలకు అందకపోవడం శోచనీయం. -
అంగన్వాడీ భవనాలకు రూ.100 కోట్లు
తాండూరు టౌన్, న్యూస్‌లైన్: రీజియన్ పరిధిలో నూతన అంగన్వాడీ భవనాల నిర్మాణానికి సుమారు రూ.100 కోట్లు అందుబాటులో ఉన్నాయని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ రీజినల్ డిప్యూటీ డెరైక్టర్ రాజ్యలక్ష్మి పేర్కొన్నారు. బుధవారం ఆమె తాండూరు పట్టణంలోని ‘శిశుగృహ’ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రీజినల్ పరిధిలోని రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, మెదక్, హైదరాబాద్ జిల్లాల్లో 1,539 అంగన్వాడీ భవనాల నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నుంచి రూ.4.5లక్షల చొప్పున రూ. 69.25 కోట్లు మంజూరయ్యాయన్నారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో భవన నిర్మాణానికి రూ.రెండు లక్షల చొప్పున మొత్తం రూ.30.78 కోట్లను మంజూరు చేసిందన్నారు. రీజినల్ పరిధిలో 10 ఏళ్ల సర్వీసు, ఇతర అర్హతలు ఉన్న 161 మంది అంగన్వాడీ కార్యకర్తలకు సూపర్వైజర్లుగా పదోన్నతి కల్పించామన్నారు. అంగన్వాడీల వేతనాల పెంపు అంశం ఉన్నతాధికారుల పరిశీలనలో ఉందన్నారు. ఇందిరమ్మ, అమృతహస్తం, బాలామృ తం పథకాలు పకడ్బందీగా అమలవుతున్నాయన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఖాళీగా ఉన్న 400అంగన్వాడీ కార్యకర్తల పోస్టులను భర్తీ చేయనున్నట్లు చెప్పారు. తాండూరు పరిధిలో ఖాళీగా ఉన్న మూడు సూపర్వైజర్ పోస్టులను కూడా భర్తీ చేస్తామన్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కళాజాత కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం శిశుగృహలోని చిన్నారుల వివ రాలను, వారి ఆరోగ్య పరిస్థితులను నిర్వాహకురాలు సునీతను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట ఐసీడీఎస్ సీడీపీఓ వెంకటలక్ష్మి ఉన్నారు. -
రిక్తహస్తం
ఇది చిన్నమండెం మండలం మూలపల్లె అంగన్వాడీ కేంద్రం. ఇక్కడ ‘అమృత హస్తం’ అమలవుతోంది. మధ్యాహ్న భోజనంలో గుడ్డుతో పాటు పాలు ఇవ్వాలి. రెండు నెలలుగా కోడిగుడ్లు సరఫరా కావడం లేదు. పాల సంగతి మర్చిపోయారు. పప్పన్నంతోనే ఇలా సరిపెట్టేస్తున్నారు. కడప రూరల్, న్యూస్‌లైన్ : మైదుకూరు ప్రాంతంలో డిసెంబరు 2వ తేదీన అమృతహస్తం పథకాన్నిప్రారంభించారు. దువ్వూరు, చాపాడు మండలాల్లో మొదట మూడు, నాలుగురోజులు మాత్రమే గర్బిణులు బాలింతలకు పాలు పంపిణీ చేశారు. ఆతర్వాత ఇంతవరకు పాలు ఇవ్వలేదు.. ఇక గుడ్ల సంగతి సరేసరి. అమృతహస్తం పథకం అమలవుతున్న ప్రాంతాల్లో రెండు నెలలకు పైగా గుడ్లు అందడం లేదు. మొత్తం మీద పథకం నత్తనడకన సాగుతోంది. అమృతహస్తం పథకాన్ని జిల్లాలో 2013 జనవరి నుంచి ప్రారంభించారు. బాలింతలు, గర్బిణులకు పౌష్టికాహారాన్ని అందిస్తామని ప్రభుత్వం ప్రగల్బాలు పలికింది. చివరకు పథకం నీరుగారి పోతోంది. లక్కిరెడ్డిపల్లె, రాయచోటి, ముద్దనూరు, పోరుమామిళ్ల, బద్వేలు, లక్కిరెడ్డిపల్లె,చక్రాయపేట, గాలివీడు, రామాపురం, రాయచోటి, సుండుపల్లె, సంబేపల్లె, చిన్నమండెం, ముద్దనూరు, మైలవరం, కొండాపురం, బద్వేలు, బ్రహ్మంగారిమఠం, పోరుమామిళ్ల, కాశినాయన, కలసపాడు మండలాల్లో గత జనవరి నుంచి ప్రొద్దుటూరు,మైదుకూరు,చాపాడు, దువ్వూరు, పులివెందుల, లింగాల, వేంపల్లె, సింహాద్రిపురం, వేముల మండలాల్లో గత డిసెంబర్ నుంచి ఈ పథకం అమలవుతోంది. ఈ ప్రాంతాల్లో గర్బిణులు, బాలింతలు 55,653మంది ఉన్నారు. వీరికి మధ్యాహ్న భోజనంతోపాటు 200 ఎంఎల్ పాలు, నెలకు 25 రోజుల పాటు గుడ్డును అందించాల్సి ఉంది. అయితే దాదాపు అన్ని చోట్ల ఈ పథకం అస్తవ్యస్తంగా సాగుతోంది. రెండు నెలలకు పైగా గుడ్లు అందడం లేదు. కొన్ని ప్రాంతాల్లో నీళ్ల పాలను అందిస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో పాలను అసలే ఇవ్వడం లేదు. పెరిగిన ధరల కారణంగా ఐసీడీఎస్ వారు గుడ్లను సరఫరా చేయడం లేదని తెలుస్తోంది. ఈ పథకంలో భాగంగా గర్బిణులు, బాలింతలకు అంగన్వాడీ కేంద్రాల్లోనే భోజన సౌకర్యం కల్పిస్తారు. చాలాచోట్ల ఇందుకు సంబంధించిన మెను సక్రమంగా అమలు కావడం లేదనే ఉన్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లోనూ అదే పరిస్థితి జిల్లాలో మొత్తం 3615 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 353 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో మూడు నుంచి ఆరు సంవత్సరాలోపు పిల్లలు 73,533 మంది, 1-3 సంవత్సరాలలోపు పిల్లలు 77,188 మంది ఉన్నారు. ఈ కేంద్రాలలో గర్బిణులు, బాలింతలు మొత్తం 24,700 మంది ఉన్నారు. వీరికి నెలకు 16 గుడ్లు అందించాల్సి ఉంది. గడిచిన నవంబరు నెలలో రెండు వారాలు మాత్రమే నాలుగు చొప్పున గుడ్లను అందజేశారు. ఇంతవరకు గుడ్లు అందలేదు. ఆ గుడ్లను ఎప్పుడు పంపిణీ చేస్తారో తెలియని పరిస్థితి. వీరికి ప్రతినెల రేషన్ సక్రమంగా అందడం లేదు. రోజుకు ఒకరికి 18 గ్రాముల నూనె, 40 గ్రాముల కందిపప్పు,120 గ్రాముల బియ్యం ఇవ్వాల్సి ఉంది. ఈ రేషన్ సకాలంలో అంటే ఒకటో తేదీరాకుండా 15వ తేదీ తర్వాత వస్తుండటంతో గర్బిణులు, బాలింతలు ఇబ్బందులు పడుతున్నారు. జైలు గదులే నయం! జిల్లాలో ఉన్న 3615 అంగన్వాడీ సెంటర్లలో 850 కేంద్రాలుమాత్రమే ప్రభుత్వ భవనాల్లో నడుస్తున్నాయి. మిగతావన్నీ అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఈ భవనాల్లో సక్రమంగా వెలుతురు లేక, గాలి ఆడక పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఒక కేంద్రానికి పట్టణ ప్రాంతాల్లో అయితే నెలకు రూ. 750, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 200 మాత్రమే అద్దెగా చెల్లిస్తోంది. ఈ ప్రభావం కేంద్రాలపై పడుతోంది. పెద్ద గదులను తీసుకోలేక, చిన్న గదుల్లో నిర్వహించలేక అవస్థలు పడుతున్నారు. బాడుగను చేతినుంచి వేసుకుంటున్నామని కొంతమంది కార్యకర్తలు తెలుపుతున్నారు. అంతంత మాత్రం బాడుగలు ఉండగా ఆ బిల్లును కూడా ప్రభుత్వం సకాలంలో అందజేయకపోవడంతో కేంద్రాలను ఖాళీ చేయాలని యజమానులు ఒత్తిడి తెస్తున్నారని కార్యకర్తలు వాపోతున్నారు. వీరికి కూడా రెండు నెలలకు పైగా గుడ్లు సరఫరా కావడం లేదు. -
‘కేర్’మంటున్న ‘అమృతహస్తం’
అమృతహస్తం పథకాన్ని జిల్లాలో గత ఏడాది జనవరి 4న ప్రారంభించారు. ఏజెన్సీ ప్రాంతాలైన ఉట్నూర్, వాంకిడి, ఆసిఫాబాద్‌లతోపాటు నాన్ ఏజెన్సీ ప్రాంతాలైన ఆదిలాబాద్ రూరల్, బోథ్ ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లోని 1,470 అంగన్వాడీ కేంద్రాల్లో అమలవుతోంది. మరో నాలుగు ప్రాజెక్టులు నిర్మల్, ఖానాపూర్, సిర్పూర్(టి), చెన్నూర్‌లకు విస్తరించింది. జనవరి నుంచే అమలు చేయాలని ప్రభుత్వం డిసెంబర్లో ఉత్తర్వులు జారీ చేసింది. కానీ ఇంకా ప్రారంభానికి నోచుకోలేదు. సీడీపీవోలు, సూపర్వైజర్లకు శిక్షణ ఇస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. అంగన్వాడీ కేంద్రం పరిధిలో అమృతహస్తం కమిటీలు ఏర్పాటు చేయాలి. ఇందులో ఇద్దరు విలేజ్ ఆర్గనైజర్స్(వీవో), గర్భిణి, బాలింత, అంగన్వాడీ కార్యకర్త సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ ప్రతి రోజు పథకం అటెండెన్స్, గర్భిణుల సమీకరణ, నాణ్యమైన ఆహారం తదితరాలు పరిశీలించాలి. రోజు భోజనంలో పదార్థాలు, భోజనం పెట్టే సమయం క్రమపద్ధతిగా చేస్తూ ఉండాలి. ఈ కమిటీలే గర్భిణులు, బాలింతలకు ఎంసీపీ కార్డులు అందించాలి. కానీ కొత్త ప్రాజెక్టుల్లో వీటి కదలిక లేకపోవడంతో పథకం అమలు జాప్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పర్యవేక్షణ కరువు.. గర్భిణులు, బాలింతలకు ఒక పూట సంపూర్ణ పౌష్టికాహారం కోసం ఒక్కొక్కరికి ప్రభుత్వం రూ.15 కేటాయిస్తోంది. బియ్యం, పప్పు, నూనె పౌరసరఫరాల శాఖ నుంచి అంగన్వాడీ కేంద్రాలకు సరఫరా అవుతాయి. కూరగాయలు, గుడ్లు, పాలు, ఆకుకూరలను ఐకేపీ వీవోలు కొనుగోలు చేసి అంగన్వాడీ కార్యకర్తలకు ఇవ్వాలి. అన్ని సకాలంలో అందితే వంట చేసి లబ్ధిదారులకు వడ్డించాలి. కానీ బియ్యం ఉంటే పప్పు, పప్పు ఉంటే బియ్యం ఉండకపోవడం.. ఈ రెండూ ఉంటే నూనె, పోపు దినుసులు లేపోవడం జరుగుతోంది. దీంతో పౌష్టికాహారం పోషకాలు లోపిస్తున్నాయి. ప్రతి నెల అడ్వాన్స్‌గా సరుకులు అందుబాటులో ఉండేలా చూడాల్సిన సీడీపీవోలు గుడ్లు, బియ్యం, పప్పుదినుసులు, నూనె పక్కదారి పట్టించి సొమ్ము చేసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. అంగన్వాడీ హెల్పర్లకు కట్టెల బిల్లులు వీవోలు చెల్లించకపోవడంతో తామెక్కడి నుంచి తెచ్చి వండేదని కొందరు వంట చేయడం లేదు. ఈ పథకం అమలవుతున్న కేంద్రాలకు సిలిండర్లు, గ్యాస్టౌలు మంజూరు చేసినప్పటికీ పంపిణీలో సీడీపీవోలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. కోడిగుడ్డు ధర పెరగడం, ఆకుకూరలు, కూరగాయల ధరలు స్థిరంగా ఉండకపోవడంతో పప్పుతో భోజనం సరిపెడుతున్నారు. కొన్ని అంగన్వాడీ కేంద్రాల్లో కార్యకర్తలు, హెల్పర్ల పోస్టులు ఖాళీగా ఉండడంతో పథకం అమలుకు నోచుకోవడం లేదు. నెలలో పీడీ ఐదు అంగన్వాడీ కేంద్రాలు, సీడీపీవోలు, సూపర్వైజర్లు 20 కేంద్రాల్లో పథకం అమలు తీరును పరిశీలించాలనే నిబంధన ఉన్నా ఆచరించిన దాఖలాలు లేవు. హాజరు, నాణ్యత, నిర్దారించిన గ్రాముల్లో ఆహారం అందుతుందా? లేదా ?, వంట వండే చోట శుభ్రత, వడ్డించే తీరును పరిశీలిస్తూ.. ఉన్నతాధికారులు పర్యవేక్షిస్తే పౌష్టికాహారం అందుతుందని లబ్ధిదారులు కోరుతున్నారు. -
హవ్వ.. నేలపైనా బువ్వ
భీమడోలు, న్యూస్‌లైన్ : వాళ్లంతా గర్భిణులు.. బాలింతలు.. ఎంత నిరుపేదలైనా.. ఎంతటి మొరటు మనుషులైనా వాళ్లని అపురూపంగా చూసుకుంటారు. అమృత హస్తం పథకం నిర్వాహకులు మాత్రం గర్భిణులు.. బాలింతలపై కనికరం లేకుండా వ్యవహరిస్తున్నారు. పౌష్టికాహారం కోసం అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే ఆ మహిళలను కటిక నేలపై కూర్చోబెట్టి భోజనం వడ్డిస్తున్నారు. ఈ పరి స్థితి కొందరు గర్భిణులు, బాలింతలకు ప్రాణసంకటంగా మారుతోంది. నేలపై కూర్చుని భోజనం చేసేందుకు వారు పడుతున్న పాట్లు వర్ణనాతీతంగా ఉన్నారుు. భీమడోలు ప్రాజెక్ట్ పరిధిలో ఇంతే... భీమడోలు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని భీమడోలు, ద్వారకాతి రుమల, దెందులూరు మండలాల్లో 180 వరకూ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటి పరిధిలో నిరుపేద కుటుంబాలకు చెందిన 3,500 మంది గర్భిణులు, బాలింతలు నమోదయ్యూరు. వారందరికీ అమృతహస్తం పథకం కింద పాలు, కోడిగుడ్లు, పౌష్టికాహారంతో కూడిన భోజనాన్ని అందించాల్సి ఉంది. జిల్లాలోని ఇతర ప్రాంతాల్లో గతంలోనే ఈ పథకం అమలు చేస్తుం డగా, భీమడోలు ప్రాజెక్ట్ పరిధిలోని మూడు మండలాల్లో ఈనెల 20 నుంచి అమల్లోకి వచ్చింది. అన్ని కేంద్రాల్లోనూ గర్భిణులు, బాలింతల్ని కింద కూర్చోబెట్టి పౌష్టికాహారం అందిస్తున్నారు. వారికి బెంచీలు లేదా కుర్చీలు వేయూల్సి ఉండగా, ఎక్కడా అలాంటి ఏర్పాట్లు లేవు. గర్భిణులను, బాలింతలను నేలపై కూర్చోబెట్టకూడదని, ఇలా చేయడం వారి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. పేదలంటే అలుసా? అంగన్వాడీ కేంద్రాల్లో కటిక నేలపై కూర్చోబెట్టి పౌష్టికాహారం అందిస్తున్న తీరుపై గర్భిణులు, బాలింతల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేదరికాన్ని అలుసుగా తీసుకుని అధికారులు ఇలా వ్యవహరించడం సరికాదని పలువురు పేర్కొంటున్నారు. ఇలాంటి పథకం మాకు అవసరం లేదని కొందరు గర్భిణులు, బాలింతలు నిర్వాహకులకు చెప్పేస్తున్నారు. దీనిపై ఐసీడీఎస్ పీవో టి.స్వరాజ్యలక్ష్మిని ‘న్యూస్‌లైన్’ వివరణ కోరగా.. బెంచీలు, కుర్చీల వంటివి ఏర్పాటు చేసేం దుకు నిధులు లేవన్నారు. దాతల సహకారంతో వీటిని ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
ఆకలి తీర్చని అమృతహస్తం
బోథ్, న్యూస్‌లైన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమృతహస్తం పథకం నిర్వహణ కొరవడి అభాసుపాలవుతోంది. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందకుండా పోతోంది. బోథ్ ఐసీడీఎస్ పరిధిలో 271 అంగన్వాడీ కేంద్రాలు, 46 మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. 3,798 మంది గర్భిణులు, బాలింతలు ఉన్నారు. 20 రోజుల క్రితం బియ్యం అయిపోయాయి. దీంతో అంగన్వాడీ కార్యకర్తలు భోజనాలు ఏర్పాటు చేయడం లేదు. గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం కోసం అంగన్వాడీ కేంద్రాలకు వచ్చి నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రోజు 125 గ్రాముల బియ్యం, 30 గ్రాముల పప్పు, 16గ్రాముల నూనె, 50 గ్రాముల కూరగాయలు, 200 మిలీలీటర్ల పాలు ఇవ్వాల్సి ఉంటుంది. వారంలో రెండు రోజులు కోడిగుడ్డు కూర, రెండ్రోజులు ఆకుకూరలు, రెండ్రోజులు కూరగాయలతో కూడిన సాంబారు వడ్డిస్తారు. బియ్యం, పప్పు పౌరసరఫరాల సంస్థ సమకూరుస్తుండగా పోపు దినుసులు గ్రామైక్య సంఘాలు సమకూర్చాల్సి ఉంది. వీటికి సంబంధించిన బిల్లును ప్రభుత్వం గ్రామైక్య సంఘం ఖాతాల్లో జమ చేస్తుంది. కానీ సంఘం సభ్యులు కూరగాయలు, పోపు దినుసులు సమకూర్చకపోగా.. అందుకోసం విడుదలైన నిధుల్లో చేతివాటం ప్రదర్శిస్తున్నారని అంగన్వాడీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. బియ్యం విషయమై సీడీపీవో జ్యోతిని సంప్రదించగా.. బియ్యం విడుదలలో ఆలస్యమైందని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల లబ్ధిదారుల సంఖ్యలో హెచ్చుతగ్గులు ఉంటాయి. అన్ని చోట్ల బియ్యం అయిపోయే పరిస్థితి లేదు. నేరడిగొండ మండలంలో బియ్యం పంపిణీ చేస్తున్నారని చెప్పారు. రెండు మూడు రోజుల్లో అన్ని కేంద్రాలకు సరఫరా అవుతాయని అన్నారు. -
‘గుడ్డు’ హుళక్కి
నిజాంసాగర్, న్యూస్‌లైన్ : ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, వసతి గృహాలలో మెనూ తప్పుతోంది. ధర పెరగడంతో పౌష్టికాహారంలో గుడ్డు దూరమవుతోంది. విద్యార్థులు, బా లింతలకు గుడ్డు లేకుండానే భోజనం వడ్డిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 11 నెలల క్రితం అమృతహస్తం ప్రవేశపెట్టింది. జిల్లాలో భీమ్‌గల్, దోమకొండ, ఎల్లారెడ్డి, మద్నూర్, బాన్సువాడ ఐసీడీఎస్ డివిజన్ల పరిధిలోని 19 మండలాలలో ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. ఆయా మండలాల పరిధిలో పథకం ప్రారంభ సమయంలో 11,694 మంది గర్భిణులు, 7,650 మంది బాలింతలు ఉన్నారు. ఈ పథకం బాలారిష్టాలను దాటడం లేదు. సమన్వయ లోపంతో అభాసుపాలవుతూనే ఉంది. ఈ పథకంలో ఒక్కో లబ్ధిదారుకు పోషకాహారం అందించేందుకు ప్రభుత్వం రూ. 15 చొప్పున గ్రామైక్య సంఘాలకు చెల్లిస్తోంది. అయితే గ్రామైక్య సంఘాలు, ఐసీడీఎస్ అధికారుల మధ్య సమన్వయలోపంతో పథకం సరిగా అమలు కావడం లేదు. దీంతో పోషకాహారం సరఫరా చేసిన అంగన్వాడీ కార్యకర్తలకు సకాలంలో బిల్లులు అందడం లేదు. కొన్ని గ్రామాలలోని అంగన్వాడీ కేంద్రాలకు ఇప్పటికీ పాలు సరఫరా చేయడం లేదు. దీంతో అంగన్వాడీ కార్యకర్తలు అప్పులు చేసి పోషకాహారం అందిస్తున్నారు. 15 రోజుల నుంచి అమృతహస్తం లబ్ధిదారులకు పదిహేను రోజుల నుంచి కోడి గుడ్డు అందించడం లేదని తెలిసింది. కోడిగుడ్డు ధరలు పెరగడంతో ఏజెన్సీ నిర్వాహకులు గుడ్లను సర ఫరా చేయడం లేదు. దీంతో ఆయా అంగన్వాడీ కేంద్రాలలో గర్భిణులు, బాలింతలకు గుడ్డులేని భోజనం అందిస్తున్నారు. ప్రభుత్వం కోడిగుడ్డుకు రూ. 3.50 చెల్లిస్తుండగా ప్రస్తుతం మార్కెట్లో 5 రూపాయలకో గుడ్డు విక్రయిస్తున్నారు. దీంతో ఏజెన్సీలు కోడిగుడ్డు సరఫరాను నిలిపివేశాయి. ధరలకు అనుగుణంగా స్లాబ్ రేట్ పెంచాలని ఏజెన్సీ నిర్వాహకులు కోరుతున్నారు.