అభివృద్ధి జాడేదీ?
జిల్లాకు చెందిన వెంకయ్యనాయుడు, నారాయణ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో మంత్రులుగా పనిచేస్తున్నా నగరాభివృద్ధికి నిధులు తీసుకురావడంలో వెనుకబడుతున్నారు. మంత్రి నారాయణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.40కోట్లు తీసుకువచ్చి అభివృద్ధి పనులు చేపడతామని ప్రకటించిన ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. అమృత్ పథకం కింద రూ.10 కోట్లు విడుదల కావాల్సి ఉన్నా అభివృద్ధి ప్రతిపాదనల తయారీలో జాప్యంతో మంజూరు కాలేదు. ఫలితంగా నెల్లూరు కార్పొరేషన్‌లో పాలకవర్గం కొలువుదీరి రెండున్నరేళ్లు గడిచినా అభివృద్ధి జాడలు మాత్రం కనిపించడం లేదు.నెల్లూరు, సిటీ: నెల్లూరు నగర పాలక సంస్థ పాలకులు, అధికారులు నిర్లక్ష్యంతో నగరాభివృద్ధి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నచందంగా తయారైంది. మంజూరైన నిధులను సద్వినియోగించుకోకపోవడం..రావాల్సిన నిధులకు ప్రతిపాదనలు తయారుచేసి పంపడంలో జాప్యం చేస్తుండడంతో అభివృద్ధిలో వెనుకబడిపోతోంది. నెల్లూరు నగర పాలక సంస్థ పరిధిలో 54 డివిజన్‌లు ఉన్నాయి. సుమారు 7లక్షల మందికిపైగా జనాభా నివాసం ఉంటున్నారు. నగరపాలక వర్గం ఏర్పడి రెండున్నర సంవత్సరాలు గడుస్తుండగా ఇప్పటి వరకు 13వ ఆర్థిక సంఘం నిధులు రూ.17కోట్లు, కార్పొరేషన్ సాధారణ నిధులు రూ.20కోట్లతో మాత్రమే అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. ఇందులోను కొన్ని పనులు టెండర్ల దశలోనే నిలిచిపోయాయి. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్, 14వ ఆర్థిక సంఘం నిధుల కింద రూ.70కోట్ల వరకు విడుదల కాగా అధికారులు ఇంకా అభివృద్ధి పనులకు ప్రతిపాదనలు తయారు చేసే పనిలోనే ఉన్నారు. నిధులను వినియోగించుకోకపోతే వెనక్కు వెళ్లే అవకాశం ఉంది. అయినా పాలకులు, అధికారులు అభివృద్ధి పనులకు చర్యలు తీసుకోవడంలో వెనుకబడుతున్నారు.మంజూరు కాని అమృత్ పథకం నిధులుగత ఏడాది జూన్ 25న కేంద్ర ప్రభుత్వం నెల్లూరు నగర పాలక సంస్థను అమృత్ పథకం కింద ఎంపిక చేసింది. అమృత్ పథకం కింద 5 ఏళ్లలో వివిధ దశల్లో రూ.102 కోట్లు మంజూరు చేస్తారు. ఇందులో భాగంగా ఈ ఏడాది రూ.10కోట్లతో పనులు ప్రారంభించాల్సి ఉంది. అధికారులు అసత్వంతో ప్రతిపాదనలు పంపడంలో జాప్యం చేయడంతో ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు.ప్రకటనలకే పరిమితంరాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులను తీసుకువచ్చి నగరాన్ని అభివృద్ధి చే స్తామన్న మంత్రి నారాయణ హామీలు ప్రకటనలకే పరిమితమయ్యాయి. రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుంచి రూ.10కోట్లు, సాధారణ నిధుల నుంచి రూ.40కోట్లు మంజూరు చేయిస్తామని ప్రకటించిన ఇంతవరకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. మంత్రి తన సొంత జిల్లాకే నిధులు తీసుకురాలేకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.అధికార పార్టీ కార్పొరేటర్ల డివిజన్‌లోనే అభివృద్ధి13వ ఆర్థిక సంఘం, సాధారణ నిధులతో అరకొరగా అభివృద్ధి పనులకు టెండర్లు పిలిచినా అవి కేవలం అధికార పార్టీ కార్పొరేటర్ల డివిజన్‌లకే పరిమితమవుతున్నాయి. వైఎస్సార్‌సీపీ కార్పొరేటర్ల డివిజన్లకు పనులు కేటాయింపులో పక్షపాతం చూపిస్తున్నారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు ఎన్నిసార్లు కమిషనర్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితం ఉండడం లేదు.బడా కంపెనీకి టెండర్లుఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు రూ.42.30కోట్లతో చేపట్టనున్న పనులను 8 ప్యాకేజీలుగా విభజించి గత నెలలో టెండర్లును పిలిచారు. అయితే మంత్రి నారాయణ ఆదేశాలతో టెండర్లును ఒకే కాంట్రాక్ట్ సంస్థకు అప్పగించేందుకు పావులు కదుపుతున్నారు. 8 ప్యాకేజీల టెండర్లను రద్దు చేసి బడకంపెనీకి అప్పగించే పనిలో ఉన్నారు.