ఇది చిన్నమండెం మండలం మూలపల్లె అంగన్‌వాడీ కేంద్రం. ఇక్కడ ‘అమృత హస్తం’ అమలవుతోంది. మధ్యాహ్న భోజనంలో గుడ్డుతో పాటు పాలు ఇవ్వాలి.
రెండు నెలలుగా కోడిగుడ్లు సరఫరా కావడం లేదు. పాల సంగతి మర్చిపోయారు. పప్పన్నంతోనే ఇలా సరిపెట్టేస్తున్నారు.
కడప రూరల్, న్యూస్‌లైన్ : మైదుకూరు ప్రాంతంలో డిసెంబరు 2వ తేదీన అమృతహస్తం పథకాన్నిప్రారంభించారు. దువ్వూరు, చాపాడు మండలాల్లో మొదట మూడు, నాలుగురోజులు మాత్రమే గర్బిణులు బాలింతలకు పాలు పంపిణీ చేశారు. ఆతర్వాత ఇంతవరకు పాలు ఇవ్వలేదు.. ఇక గుడ్ల సంగతి సరేసరి. అమృతహస్తం పథకం అమలవుతున్న ప్రాంతాల్లో రెండు నెలలకు పైగా గుడ్లు అందడం లేదు. మొత్తం మీద పథకం నత్తనడకన సాగుతోంది.
అమృతహస్తం పథకాన్ని జిల్లాలో 2013 జనవరి నుంచి ప్రారంభించారు. బాలింతలు, గర్బిణులకు పౌష్టికాహారాన్ని అందిస్తామని ప్రభుత్వం ప్రగల్బాలు పలికింది. చివరకు పథకం నీరుగారి పోతోంది. లక్కిరెడ్డిపల్లె, రాయచోటి, ముద్దనూరు, పోరుమామిళ్ల, బద్వేలు, లక్కిరెడ్డిపల్లె,చక్రాయపేట, గాలివీడు, రామాపురం, రాయచోటి, సుండుపల్లె, సంబేపల్లె, చిన్నమండెం, ముద్దనూరు, మైలవరం, కొండాపురం, బద్వేలు, బ్రహ్మంగారిమఠం, పోరుమామిళ్ల, కాశినాయన, కలసపాడు మండలాల్లో గత జనవరి నుంచి ప్రొద్దుటూరు,మైదుకూరు,చాపాడు, దువ్వూరు, పులివెందుల, లింగాల, వేంపల్లె, సింహాద్రిపురం, వేముల మండలాల్లో గత డిసెంబర్ నుంచి ఈ పథకం అమలవుతోంది.
ఈ ప్రాంతాల్లో గర్బిణులు, బాలింతలు 55,653మంది ఉన్నారు. వీరికి మధ్యాహ్న భోజనంతోపాటు 200 ఎంఎల్ పాలు, నెలకు 25 రోజుల పాటు గుడ్డును అందించాల్సి ఉంది. అయితే దాదాపు అన్ని చోట్ల ఈ పథకం అస్తవ్యస్తంగా సాగుతోంది. రెండు నెలలకు పైగా గుడ్లు అందడం లేదు. కొన్ని ప్రాంతాల్లో నీళ్ల పాలను అందిస్తుండగా, మరికొన్ని ప్రాంతాల్లో పాలను అసలే ఇవ్వడం లేదు. పెరిగిన ధరల కారణంగా ఐసీడీఎస్ వారు గుడ్లను సరఫరా చేయడం లేదని తెలుస్తోంది. ఈ పథకంలో భాగంగా గర్బిణులు, బాలింతలకు అంగన్‌వాడీ కేంద్రాల్లోనే భోజన సౌకర్యం కల్పిస్తారు. చాలాచోట్ల ఇందుకు సంబంధించిన మెను సక్రమంగా అమలు కావడం లేదనే ఉన్నాయి.
అంగన్‌వాడీ కేంద్రాల్లోనూ అదే పరిస్థితి
జిల్లాలో మొత్తం 3615 అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఇందులో 353 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో మూడు నుంచి ఆరు సంవత్సరాలోపు పిల్లలు 73,533 మంది, 1-3 సంవత్సరాలలోపు పిల్లలు 77,188 మంది ఉన్నారు. ఈ కేంద్రాలలో గర్బిణులు, బాలింతలు మొత్తం 24,700 మంది ఉన్నారు. వీరికి నెలకు 16 గుడ్లు అందించాల్సి ఉంది. గడిచిన నవంబరు నెలలో రెండు వారాలు మాత్రమే నాలుగు చొప్పున గుడ్లను అందజేశారు. ఇంతవరకు గుడ్లు అందలేదు.
ఆ గుడ్లను ఎప్పుడు పంపిణీ చేస్తారో తెలియని పరిస్థితి. వీరికి ప్రతినెల రేషన్ సక్రమంగా అందడం లేదు. రోజుకు ఒకరికి 18 గ్రాముల నూనె, 40 గ్రాముల కందిపప్పు,120 గ్రాముల బియ్యం ఇవ్వాల్సి ఉంది. ఈ రేషన్ సకాలంలో అంటే ఒకటో తేదీరాకుండా 15వ తేదీ తర్వాత వస్తుండటంతో గర్బిణులు, బాలింతలు ఇబ్బందులు పడుతున్నారు.
జైలు గదులే నయం!
జిల్లాలో ఉన్న 3615 అంగన్‌వాడీ సెంటర్లలో 850 కేంద్రాలుమాత్రమే ప్రభుత్వ భవనాల్లో నడుస్తున్నాయి. మిగతావన్నీ అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఈ భవనాల్లో సక్రమంగా వెలుతురు లేక, గాలి ఆడక పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం ఒక కేంద్రానికి పట్టణ ప్రాంతాల్లో అయితే నెలకు రూ. 750, గ్రామీణ ప్రాంతాల్లో రూ. 200 మాత్రమే అద్దెగా చెల్లిస్తోంది. ఈ ప్రభావం కేంద్రాలపై పడుతోంది. పెద్ద గదులను తీసుకోలేక, చిన్న గదుల్లో నిర్వహించలేక అవస్థలు పడుతున్నారు. బాడుగను చేతినుంచి వేసుకుంటున్నామని కొంతమంది కార్యకర్తలు తెలుపుతున్నారు. అంతంత మాత్రం బాడుగలు ఉండగా ఆ బిల్లును కూడా ప్రభుత్వం సకాలంలో అందజేయకపోవడంతో కేంద్రాలను ఖాళీ చేయాలని యజమానులు ఒత్తిడి తెస్తున్నారని కార్యకర్తలు వాపోతున్నారు. వీరికి కూడా రెండు నెలలకు పైగా గుడ్లు సరఫరా కావడం లేదు.
రిక్తహస్తం
Published Fri, Jan 24 2014 2:10 AM | Last Updated on Wed, Aug 29 2018 7:54 PM
Advertisement