ఉలవపాడులోని పాఠశాలలో గుడ్డులేని భోజనం చేస్తున్న విద్యార్థులు
సాక్షి, బేస్తవారిపేట(ప్రకాశం): పేద విద్యార్థులు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో అమలు చేస్తున్న మధ్యాహ్న భోజన పథకాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది. పిల్లల ఆరోగ్యానికి వారానికి ఐదు కోడి గుడ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నా.. ఆచరణలో అసంపూర్తిగానే అమలు చేస్తోంది. ఏజెన్సీలకు బిల్లులను సకాలంలో చెల్లించకపోవడం, ఏజెన్సీల గడువు ముగిసిన పట్టించుకోకపోవడంతో గుడ్డు సరఫరా నిలిచిపోయింది. ఫిబ్రవరి నుంచి పత్తా లేని గుడ్డు.. ప్రచార ఆర్భాటానికి ప్రజాధనాన్ని విచ్చలవిడిగా ఖర్చుపెడుతున్న రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల పౌష్టికాహారం దగ్గరకొచ్చేసరికి గుడ్లు తేలేస్తోంది. ఫిబ్రవరి నెల నుంచి మధ్యాహ్నా భోజన పథకంలో గుడ్డుకు ఎగనామం పెడుతోంది.
అంగన్‌వాడీల్లోనూ అందని గుడ్డు..
జిల్లాలో ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలతో పాటు ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్నా భోజన పథకం అమల్లో ఉంది. పాఠశాల్లో సుమారు 2.60 లక్షల మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం చేస్తున్నారు. అదేవిధంగా ఐసీడీయస్ ప్రాజెక్టు పరిధిలో జిల్లాలో మొత్తం 21 ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో 180 సెక్టార్లు గా విభజించారు. మొత్తం 4244 కేంద్రాలు ఉన్నాయి. వీటిలో 4009 మెయిన్ సెంటర్లు, 225 మినీ సెంటర్లు ఉన్నాయి. వీటిలో 85 వేల మంది చిన్నారులు ఉన్నారు. వీరు కాక 13568 మంది గర్భిణిలు, 9826 మంది గర్భిణులు ఉన్నారు. వీరందరికి నెల రోజులుగా గుడ్లు అందని పరిస్థితి నెలకొంది.
బిల్లుల చెల్లింపులకు ‘ఎగ్’నామం
ఒక్క శనివారం మినహా మిగితా ఐదు రోజులు కోడిగుడ్డు అందించాల్సి ఉంది. గుడ్డును పాఠశాలకు సరఫరా చేసే ఏజెన్సీల గడువు ముగియడంతో ప్రభుత్వం గత ఏజెన్సీకే టెండర్‌ను పొడిగించింది. కానీ గడువు పూర్తి అయిన తర్వాత పెంచడంతో మళ్లీ గుడ్లు కొనుగోలు చేసి సరఫరా చేయడంలో కొంత సమయం పట్టింది. దీంతో రెండు వారాలకుపైగానే గుడ్ల సరఫరా నిలిచిపోయింది. బిల్లులు కూడా ప్రభుత్వం సక్రమంగా చెల్లించకపోవడంతో మరింత అలసత్వం నెలకొంది. మధ్యాహ్నా భోజన ఏజెన్సీలు గుడ్డును కొనుగోలు చేసి పెట్టేందుకు భారంగా మారడంతో ఒప్పుకోలేదు. ప్రస్తుతం పెంచిన గడువు ముగియడంతో పూర్తిగా గుడ్ల సరఫరా లేక విద్యార్థులకు పౌష్టికాహారం అందని ద్రాక్షగానే మారింది.
కోర్టులు ఆదేశించినా...
మధ్యాహ్న భోజన పథకం అమలు సక్రమంగా లేదని తల్లిదండ్రులు హైకోర్టులో పిటిషన్ వేయడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఉలవపాడు మండలం రామాయపట్నంలోని పాఠశాలలను ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్, కలెక్టర్ తోపాటు వివిధ శాఖలకు చెందిన అధికారులు తనిఖీలు జరిపారు. విద్యార్థులకు పౌష్ఠికాహారం అందించాలని ఉపాధ్యాయులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ ప్రభుత్వమే నిర్లక్ష్యంగా ఉంటే ప్రధానోపాధ్యాయులు మాత్రం ఏం చేయగలరు. ఓ వైపు కోర్టు అధికారులను, ప్రభుత్వాన్ని మందలిస్తున్నా ఉపయోగం లేకుండా పోయింది.
పరీక్షల సమయంలో ఇబ్బందులు..
ఇంటర్మీడియట్ పరీక్షలు జరుగుతుండగా, మార్చి–18 నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. పరీక్షలు దగ్గర పడుతున్న సమయంలో వీరంతా ఎక్కువ సమయం చదువుపై దృష్టి సారించడం సహజం. ఈ సమయంలో విద్యార్థులకు పూర్తి స్థాయిలో పౌష్టికాహారం అవసరం. కానీ మధ్యాహ్నా భోజన పథకానికి చెల్లించే ధరలు తక్కువ కావడంతో చాలాచోట్ల నాసిరకమైన భోజనం అందిస్తున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయి. కొందరు విద్యార్థులు భోజనాన్ని తినలేకపోతున్నారు. విద్యార్థులు ఆహారంలో గుడ్లు వేస్తారని కొంతమేర ఆసక్తి చూపిస్తారు. గుడ్లు లేకపోవడంతో నిరాశ చెందుతున్నారు. పరీక్షల సమయంలోనైనా విద్యార్థులకు పౌష్టికాహారం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
చాలా రోజుల నుంచి గుడ్డు పెట్టడం లేదు..
గత నెల నుంచి మధ్యాహ్నా భోజనంలో గుడ్డు ఇవ్వడం లేదు. గుడ్డు గురించి అడిగితే పైనుంచి సరఫరా లేదని చెబుతున్నారు. దీంతో ఏజెన్సీ వారు పెట్టే కూర అన్నం మాత్రమే తింటున్నాం. పాఠశాలలకు గుడ్లను సరఫరా చేయాలి.
–బ్రహ్మయ్య, 8వ తరగతి, జెడ్పీ ఉన్నత పాఠశాల, బేస్తవారిపేట
ప్రభుత్వం గుడ్లు సరఫరా చేయాలి..
ప్రభుత్వం నెల రోజులుగా గుడ్ల సరఫరా నిలిచిపోయిన పట్టించుకోలేదు. పాఠశాలలకు గుడ్లను సరఫరా చేయాలి. గతంలో వారానికి రెండు రోజులు పంపిణీ చేసేటప్పుడు బాగా ఇచ్చారు. వారానికి ఐదు రోజులు పంపిణీ జరుగుతున్నప్పటి నుంచి సక్రమంగా లేకుండపోయింది.
–సంజీవరాయుడు, 8వ తరగతి, జెడ్పీ ఉన్నత పాఠశాల, బేస్తవారిపేట
Comments
Please login to add a commentAdd a comment