అమృత హస్తం.. అస్తవ్యస్తం.. | amrutha hastham scheme is not implemented properly | Sakshi
Sakshi News home page

అమృత హస్తం.. అస్తవ్యస్తం..

Published Wed, Oct 30 2013 4:42 AM | Last Updated on Fri, Jun 1 2018 7:32 PM

amrutha hastham scheme is not implemented properly

 సాక్షి, మంచిర్యాల : జిల్లాలో ఇందిరమ్మ అమృత హస్తం అస్తవ్యస్తంగా మారింది. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందించాలనే సదుద్ధేశంతో ప్రవేశపెట్టిన పథకం సక్రమంగా అమలు కావడం లేదు. పథకానికి అవసరమైన నిధులు ఐకేపీ సిబ్బందికి ఇవ్వ డం, నిర్వహణ బాధ్యత అంగన్‌వాడీ కార్యకర్తలకు అంటగట్టడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అం గన్‌వాడీ కార్యకర్తలకు ఇవ్వాల్సిన నిధులు ఐకేపీ సిబ్బంది ఇవ్వకుండా తాత్సారం చే స్తున్నారు. దీంతో గర్బిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందని ద్రాక్షలా మారింది. బిల్లుల చెల్లింపులో జరుగుతున్న  జాప్యంపై అంగన్‌వాడీ కార్యకర్తలు ఈ నెల 21న ఆసిఫాబాద్ సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన, ఈనెల 23న కలెక్టర్ అహ్మద్ బాబును కలిసి గోడు విన్నవించారు.
 జిల్లా వ్యాప్తంగా 17,337 మంది లబ్ధిదారులు
 జిల్లా వ్యాప్తంగా 18 ఐసీడీఎస్ ప్రాజెక్టులున్నాయి. వీటి పరిధిలో 3,537 అంగన్‌వాడీ కేంద్రాలు, 586 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. స్త్రీ, శిశు సంక్షేమంలో భాగంగా గర్భిణులు, బాలింతలకు ఒకపూట సంపూర్ణ ఆహారం అందించాలనే సంకల్పంతో జనవరి 4, 2013న ప్రభుత్వం జిల్లాలో ఇందిరమ్మ అమృతహస్తం పథకాన్ని ప్రారంభించింది. తొలి విడతగా అన్ని ప్రాజెక్టుల్లో కాకుండా ఉట్నూరు, వాంకిడి, ఆసిఫాబాద్, బోథ్, ఆదిలాబాద్ రూరల్ ప్రాజెక్టు పరిధిలో అమలు చేశారు. బియ్యం, పప్పు, కూరగాయలు, ఒక గుడ్డు, 200 మిల్లీ లీటర్ల పాలు, ఒక ఐఎఫ్‌ఏ టాబ్లెట్ రోజు పంపిణీ చేస్తారు. ఇందు కోసం ఒక్కో బాలింత, గర్భిణీకి రోజు ప్రభుత్వం రూ.10 కేటాయిస్తుంది. ఉట్నూరు ప్రాజెక్టు పరిధిలో 2,808 గర్భిణులు, 2,793 బాలింతలు పథకం కింద లబ్ధిపొందుతున్నారు. వాంకిడి పరిధిలో 1,307 గర్భిణులు, 1,108 బాలింతలు, ఆసిఫాబాద్‌లో 650 మంది గర్భిణులు, 627 బాలింతలు, బోథ్‌లో 1,874 గర్భిణులు, 1,713 బాలింతలు, ఆదిలాబాద్ రూరల్ ప్రాజెక్టు పరిధిలో 2,312 మంది గర్భిణులు, 2,145 మంది బాలింతలు మొత్తం 17,337 మంది పథకం కింద లబ్ధిపొందుతున్నారు. ఈ లెక్కన చూసుకుంటే రోజుకు రూ.1,73,370 చొప్పున నెలకు రూ.52,01,100 ప్రభుత్వం వీరిపై ఖర్చు పెడుతోంది.
 అందని పౌష్టికాహారం
 ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతోనే అమలు నీరుగారుతోంది. బాలింతలు, గర్భిణులకు ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు ఐకేపీ విలేజ్ ఆర్గనైజర్లకు ఇస్తుండడం, నిర్వహణ బాధ్యత అంగన్‌వాడీలకు అప్పగించడంతో మొదట్లోనే విమర్శలు వ్యక్తమయ్యాయి. అయినా ప్రభుత్వం తోచిందే చేసింది. చివరకు బిల్లుల చెల్లింపు విషయంలోనూ అలసత్వం ప్రదర్శించడంతో గర్భిణులు, బాలింతలకు వండిపెట్టలేక అంగన్‌వాడీ కార్యకర్తలు అప్పులు చే శారు. పథకం ప్రారంభం నుంచి ఇప్పటివరకు ఐదు ప్రాజెక్టుల పరిధుల్లో 1,300 అంగన్‌వాడీ కేంద్రాలకు ఆరు నెలల నుంచి బిల్లులు నిలిచిపోవడంతో పథకం నిర్వహణ భారంగా మారిందని మావల అంగన్‌వాడీ కార్యకర్త పార్వతి ఆవే దన వ్యక్తం చేశారు.
 పెండింగ్‌లో బిల్లులు
 ఆరు రోజుల క్రితమే కొన్ని కేంద్రాల్లో మూడు నెలల బిల్లులు చెల్లించారు. 17,337 మంది లబ్ధిదారులకు సగటున మూడు నెలల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయనుకుంటే రూ.1,56,03,000 రావాల్సి ఉంది. బిల్లులు రాకపోవడంతో చాలా కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందడం లేదు. వాంకిడి మండల కేంద్రంలోని శ్రీ కేశవనగర్, హనుమాన్‌చౌక్, మాండోకర్‌వాడ, అర్జిగూడ, ఇంద్రానగర్ అంగన్‌వాడీ కేంద్రాలను ‘న్యూస్‌లైన్’ విజిట్ చేయగా, అన్ని కేంద్రాల్లో బియ్యం లేకపోవడంతో వండలేదని కార్యకర్తలు చెప్పారు. కేవలం బాలింతలు, గర్భిణులు పాలు, గుడ్డుతోనే సరిపెట్టుకున్నారు. బియ్యం సకాలంలో అందకపోవడంతో అప్పు తీసుకొచ్చి వండిపెడ్తున్నామని ఇంద్రానగర్, హనుమాన్‌చౌక్ అంగన్‌వాడీ కార్యకర్తలు చెప్పారు. తిర్యాణి మండల కేంద్రంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సమావేశం ఉందంటూ కొందరు అంగన్‌వాడీ కార్యకర్తలు ఏవీ పంపిణీ చేయలేదు. వచ్చిన గర్భిణులు, బాలింతలు వెనుదిరిగారు. ఈ విషయమై ‘న్యూస్‌లైన్’ ఐసీడీఎస్ ప్రాజెక్టు డెరైక్టర్ మీరా బెనర్జీ వివరణ కోసం ప్రయత్నించగా ఆమె అందుబాటులో లేరు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement