తాండూరు టౌన్, న్యూస్‌లైన్: రీజియన్ పరిధిలో నూతన అంగన్‌వాడీ భవనాల నిర్మాణానికి సుమారు రూ.100 కోట్లు అందుబాటులో ఉన్నాయని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ రీజినల్ డిప్యూటీ డెరైక్టర్ రాజ్యలక్ష్మి పేర్కొన్నారు. బుధవారం ఆమె తాండూరు పట్టణంలోని ‘శిశుగృహ’ను సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రీజినల్ పరిధిలోని రంగారెడ్డి, మహబూబ్‌నగర్, నల్లగొండ, నిజామాబాద్, మెదక్, హైదరాబాద్ జిల్లాల్లో 1,539 అంగన్‌వాడీ భవనాల నిర్మాణానికి ప్రపంచ బ్యాంకు నుంచి రూ.4.5లక్షల చొప్పున రూ. 69.25 కోట్లు మంజూరయ్యాయన్నారు. అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక్కో భవన నిర్మాణానికి రూ.రెండు లక్షల చొప్పున మొత్తం రూ.30.78 కోట్లను మంజూరు చేసిందన్నారు.
రీజినల్ పరిధిలో 10 ఏళ్ల సర్వీసు, ఇతర అర్హతలు ఉన్న 161 మంది అంగన్‌వాడీ కార్యకర్తలకు సూపర్‌వైజర్లుగా పదోన్నతి కల్పించామన్నారు. అంగన్‌వాడీల వేతనాల పెంపు అంశం ఉన్నతాధికారుల పరిశీలనలో ఉందన్నారు. ఇందిరమ్మ, అమృతహస్తం, బాలామృ తం పథకాలు పకడ్బందీగా అమలవుతున్నాయన్నారు. ఎన్నికల నోటిఫికేషన్ రాకముందే ఖాళీగా ఉన్న 400అంగన్‌వాడీ కార్యకర్తల పోస్టులను భర్తీ చేయనున్నట్లు చెప్పారు.
తాండూరు పరిధిలో ఖాళీగా ఉన్న మూడు సూపర్‌వైజర్ పోస్టులను కూడా భర్తీ చేస్తామన్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు కళాజాత కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. అనంతరం శిశుగృహలోని చిన్నారుల వివ రాలను, వారి ఆరోగ్య పరిస్థితులను నిర్వాహకురాలు సునీతను అడిగి తెలుసుకున్నారు. ఆమె వెంట ఐసీడీఎస్ సీడీపీఓ వెంకటలక్ష్మి ఉన్నారు.
అంగన్‌వాడీ భవనాలకు రూ.100 కోట్లు
Published Thu, Feb 13 2014 12:04 AM | Last Updated on Sat, Jun 2 2018 8:29 PM