పలమనేరు : గర్భిణీలు, బాలింతలు, పిల్లలు, కిశోరబాలికల కోసం ఏర్పాటు చేసిన ‘అన్న అమృతహస్తం’ కొండెక్కింది. ప్రభుత్వం నుంచి అందాల్సిన బియ్యం, పప్పు, నూనెలు రాకపోవడం, ఐకేపీ నుంచి బిల్లులు పెండింగ్ పడ్డంతో పలమనేరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలో ఈ కార్యక్రమానికి బ్రేక్‌పడింది. పది రోజులుగా 80 శాతం అంగన్‌వాడీ కేంద్రాల్లో అన్న అమృతహస్తం పూర్తిగా ఆగిపోయింది. దీంతో 20 వేల మందికి లబ్ధి చేకూరడం లేదు.
అంగన్‌వాడీ కేంద్రాలకు అందని సరుకులు
అమృతహస్తం కార్యక్రమానికి ప్రభుత్వం నుంచి బియ్యం, పప్పు, నూనెలు ప్రతి నెలా అందేవి. దీంతో పాటు సంబంధిత ఐకే పీ గ్రామసమాఖ్యల నుంచి కూరగాయలు, కోడిగుడ్లు, పాలు అందేవి. కొన్నాళ్లుగా ప్రభుత్వం నుంచి అన్ని సరుకులూ ఆగిపోయాయి. దీనికి తోడు ఐకేపీ గ్రూపులు తొలి నుంచీ ఇబ్బందులు పడుతున్నాయి. ఇన్నాళ్లు అంతంత మాత్రంగానే సాగిన ఈ కార్యక్రమం ఇప్పుడు ఆగిపోయే స్థితికి వచ్చింది.
ఐకేపీ నుంచి బకాయిలు రూ.25 లక్షలు
పలమనేరు ప్రాజెక్టుకు సంబంధించి 332 మినీ, మెయిన్ అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటిల్లో 2200 మంది గర్భిణీలు, 2350 మంది బాలింతలు, 11 నెలల నుంచి ఆరేళ్ల వయసున్న పిల్లలు 11,032 మంది, కిశోరబాలికలు 5600 మంది.. మొత్తం 22వేల మందికి పైగా లబ్ధిదారులున్నారు. వీరిలో పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు అంగన్‌వాడీ కేంద్రంలో ఓ పూట పౌష్టికాహారం అందించేవారు. కిశోర బాలికలకు మాత్రం ఇంటివద్దకే ఆహార వస్తువులు అందజేసే వారు. ఇందుకు సంబంధించి ఒక్కొక్కరికి ఓ పూట భోజనానికి ప్రభుత్వం రూ.14.30 పైసలు ఖర్చుచేస్తోంది. ఐకేపీ నుంచి అంగన్‌వాడీలకు రెండు, మూడు నెలలుగా బిల్లులు అందలేదు. రూ.25 లక్షలకు పైగా బిల్లులు పెండింగ్ పడ్డాయి. దీంతో ఈ కార్యక్రమం దాదాపుగా ఆగిపోయింది.
అప్పులు చేసి అన్నం పెట్టలేం..
గంగవరం మండలం మబ్బువాళ్లపేటకు చెందిన అంగన్‌వాడీ వర్కర్ వీఆర్.జ్యోతి రెండు నెలలుగా అప్పు చేసి అమృతహస్తాన్ని నిర్వహించింది. ఇందుకు సంబంధించి ఆమెకు రూ.12 వేల దాకా డబ్బు రావాల్సి ఉంది. బిల్లులు కాకపోవడంతో ఈ నెల 1 నుంచి పొయ్యి వెలిగించడమే మానేసింది. ఈమె ఒక్కరే కాదు, అందరు అంగన్‌వాడీలు ఇదే సమస్యతో బాధపడుతున్నారు. గతంలో మిగిలిన సరుకులు ఉన్న కొన్ని సెంటర్లు మినహా మిగిలిన 80 శాతం సెంటర్లలో పది రోజుల నుంచి పొయ్యి వెలగడం లేదు.
ఫలితంగా ప్రాజెక్టు పరిధిలో 20వేల మందికి పైగా లబ్ధిదారులకు పౌష్టికాహారం దూరమైంది. ఈ విషయమై సీడీ సీవో రాజేశ్వరిని వివరణ కోరగా ప్రభుత్వం నుంచి సరుకులు అందని మాట నిజమేనన్నారు. ఇక ఐకేపీ నుంచి రూ.25 లక్షల బిల్లులు రావాల్సి ఉందన్నారు. కొన్ని సెంటర్లలో ఈ కార్యక్రమం జరుగుతున్నా పలుచోట్ల ఆగిందన్నారు. జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లానని రెండు, మూడు రోజుల్లో ఈ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారన్నారు.
ఆగిన అమృతహస్తం?
Published Fri, Nov 14 2014 3:18 AM | Last Updated on Wed, Sep 19 2018 8:32 PM
Advertisement