ఐసీడీఎస్ ఖాళీ
సాక్షి,ఒంగోలు: ఆరోగ్య గ్రామీణ భారతావనికి ఆలంబనగా ఉండాల్సిన అంగన్‌వాడీ కేంద్రాలు సేవల్లో ఆమడదూరంలో కొనసాగుతున్నాయి. కేంద్రాలు సిబ్బంది కొరతతో కునారిల్లుతున్నాయి. దీన్ని గుర్తించిన ప్రభుత్వం సిబ్బంది నియామకాలకు అనుమతించింది. అయితే, దేవుడు వరమిచ్చినా పూజారి కరుణించలేదన్న చందంగా ఉంది జిల్లా అధికారుల తీరు.
ఖాళీల భర్తీ దిశగా చర్యలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. మొత్తమ్మీద జిల్లాలో 2,55,642 మంది తల్లీపిల్లలు, కౌమారబాలికల ఆరోగ్యసంరక్షణ గాలిలో దీపంలా మారింది. భావి భారత పౌరులను ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడానికి, మాతాశిశు మరణాలను నియంత్రించేందుకు అంగన్‌వాడీ కేంద్రాలను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. గర్భిణులు, బాలింతలు, ఐదేళ్లలోపు వయసున్న చిన్నారులకు పౌష్టికాహారం అందించి ఆరోగ్యం, సామాజిక పరిస్థితులపై అవగాహన కల్పించాల్సి ఉంటుంది. ఈ కార్యక్రమంలో క్రియాశీలకపాత్ర పోషించాల్సింది అంగన్‌వాడీ సిబ్బందే.
జిల్లా పరిస్థితిదీ..
జిల్లాలో మొత్తం 21 ప్రాజెక్టులు నడుస్తున్నాయి. వీటి పరిధిలో 4244 అంగన్‌వాడీ కేంద్రాలు, 235 మినీ అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. మొత్తం 2,55,642 మంది లబ్ధిదారులు పౌష్టికాహారం పొందుతున్నారు. ఈ పథక నిర్వహణకు సరిపడినంత అంగన్‌వాడీ కార్యకర్తలు, సహాయకులు, మినీ అంగన్‌వాడీ కార్యకర్తలు, లింక్‌వర్కర్లు లేరనే విషయాన్ని ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది.
సిబ్బంది నియామకానికి అనుమతి కూడా ఇచ్చింది. ప్రస్తుతం జిల్లాలో దాదాపు 300కిపైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంత భారీ ఎత్తున ఖాళీలు ఉండటంతో పోషకాహారం పంపిణీ కార్యక్రమం సిబ్బందికి భారంగా మారింది. 200కి పైగా కేంద్రాల్లో అసలు అంగన్‌వాడీ కార్యకర్తలే లేకపోవడంతో సమీప ప్రాంతాల వారిని ఇన్‌చార్జులుగా నియమిస్తూ నడిపిస్తున్నారు.
అమృతహస్తం ఏదీ..?
ప్రజల్లో ఆరోగ్యంపై అవగాహన కల్పించి పౌష్టికాహారం అందించేందుకు జిల్లాలో మొత్తం 4 ప్రాజెక్ట్‌లు (కనిగిరి, మార్కాపురం రూరల్, యర్రగొండపాలెం, బేస్తవారిపేట) ఏర్పాటు చేశారు. వీటిల్లో కూడా సిబ్బంది కొరత ఉందని ప్రభుత్వం గుర్తించినా.. ఇప్పటి వరకు ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీచేసే నాథుడు కరువయ్యాడు.
పిల్లల్లో పోషకాహార లోపం..
జిల్లాలో అంగన్‌వాడీ కేంద్రాల పరిధిలో మొత్తం 2,55,642 మంది లబ్ధిదారులు పోషకాహారం పొందుతున్నారని లెక్కలు చెబుతున్నాయి. వీరితోపాటు గర్భిణులు 36,269 మంది ఉండగా, బాలింతలు 34,241 మంది ఉన్నారు.జిల్లాలో సుమారుగా నాలుగు శాతం మంది ఐదేళ్లలోపు చిన్నారులు ప్రమాదస్థాయిలో.. సుమా రు 25 వేల మందికి పైగా పిల్లలు సాధారణ పౌష్టికాహార లోపంతో బాధపడుతున్నారు.
ఐసీడీఎస్ ఉన్నతాధికారుల వైఖరిపై ఆరోపణల దుమారం రేగుతోం ది. పోస్టుల భర్తీ విషయంలో సదరు అధికారులు స్వార్థపూరిత ధోరణితో వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పోస్టుల భర్తీపై ఐసీడీఎస్ ప్రాజె క్ట్ అధికారి విద్యావతిని ‘సాక్షి’ ఫోన్‌లో వివరణ కోరగా.. అంగన్‌వాడీ కేంద్రాల్లో సిబ్బంది కొరతకు సంబంధించి తనకు సమాచారం తెలియదని చెప్పారు.