బోథ్, న్యూస్‌లైన్ : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన అమృతహస్తం పథకం నిర్వహణ కొరవడి అభాసుపాలవుతోంది. గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం అందకుండా పోతోంది. బోథ్ ఐసీడీఎస్ పరిధిలో 271 అంగన్‌వాడీ కేంద్రాలు, 46 మినీ అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. 3,798 మంది గర్భిణులు, బాలింతలు ఉన్నారు. 20 రోజుల క్రితం బియ్యం అయిపోయాయి. దీంతో అంగన్‌వాడీ కార్యకర్తలు భోజనాలు ఏర్పాటు చేయడం లేదు. గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారం కోసం అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చి నిరాశతో వెనుదిరుగుతున్నారు. ఈ పథకం కింద ఒక్కొక్కరికి రోజు 125 గ్రాముల బియ్యం, 30 గ్రాముల పప్పు, 16గ్రాముల నూనె, 50 గ్రాముల కూరగాయలు, 200 మిలీలీటర్ల పాలు ఇవ్వాల్సి ఉంటుంది.
వారంలో రెండు రోజులు కోడిగుడ్డు కూర, రెండ్రోజులు ఆకుకూరలు, రెండ్రోజులు కూరగాయలతో కూడిన సాంబారు వడ్డిస్తారు. బియ్యం, పప్పు పౌరసరఫరాల సంస్థ సమకూరుస్తుండగా పోపు దినుసులు గ్రామైక్య సంఘాలు సమకూర్చాల్సి ఉంది. వీటికి సంబంధించిన బిల్లును ప్రభుత్వం గ్రామైక్య సంఘం ఖాతాల్లో జమ చేస్తుంది. కానీ సంఘం సభ్యులు కూరగాయలు, పోపు దినుసులు సమకూర్చకపోగా.. అందుకోసం విడుదలైన నిధుల్లో చేతివాటం ప్రదర్శిస్తున్నారని అంగన్‌వాడీ కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. బియ్యం విషయమై సీడీపీవో జ్యోతిని సంప్రదించగా.. బియ్యం విడుదలలో ఆలస్యమైందని అన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల లబ్ధిదారుల సంఖ్యలో హెచ్చుతగ్గులు ఉంటాయి. అన్ని చోట్ల బియ్యం అయిపోయే పరిస్థితి లేదు. నేరడిగొండ మండలంలో బియ్యం పంపిణీ చేస్తున్నారని చెప్పారు. రెండు మూడు రోజుల్లో అన్ని కేంద్రాలకు సరఫరా అవుతాయని అన్నారు.
ఆకలి తీర్చని అమృతహస్తం
Published Sun, Dec 15 2013 3:35 AM | Last Updated on Sat, Jun 2 2018 8:36 PM
Advertisement