పౌష్టికాహారం మాట దేవుడెరుగు... ఏకంగా ప్రాణాలమీదికొచ్చేలా ఉంది. అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులు... బాలింతలు... గర్భిణులకు పోషకాలు కలిగిన ఆహారం అందివ్వాలని నిర్దేశించారు. ఇందుకోసం అవసరమైన సరకులు సరఫరాకు ఓ కాంట్రాక్టర్‌ను నియమించారు. కాసులకు కక్కుర్తిపడిన ఆయన కాస్తా కాలం చెల్లిన సరకులు ఇచ్చేసి వారందరి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
పూసపాటిరేగ(నెల్లిమర్ల): చిన్నారులకు నాణ్యమైన పౌష్టికాహారం అందించి వారికి తగిన విద్యాబుద్ధులు నేర్పించడానికి అంగన్‌వాడీ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాలకు సరఫరా చేసే సరకుల్లో అవినీతి చోటు చేసుకుంటోంది. కాలం చెల్లిన సరకులు సరఫరా చేయడం, నాసిరకం పప్పు అందించడం వంటివి జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. కొంత కాలంగా పూసపాటిరేగ మండలంలో పలు కేంద్రాలకు కాలం చెల్లిన సరకులు, నాసిరకం పప్పులు సరఫరా చేస్తున్న విషయం గురువారం వెలుగులోకి వచ్చింది. మండలంలోని కేంద్రాల్లో ప్రీస్కూల్ చిన్నారులు 1528 మంది, గర్భిణులు 543 మంది, బాలింతలు 441 మంది ఉన్నారు.
కోనాడ గ్రామంలోని కేంద్రానికి 2016 సంవత్సరంలో తయారైన రజినీ రిఫైన్డ్ పామాయల్ సరఫరా చేశారు. అంతేకాదు. కామవరం, కనిమెల్ల, పేరాపురం గ్రామలకూ వాటినే అందించారు. వాస్తవానికి తయారైన ఆరునెలల్లోగానే సరకు వినియోగించాల్సి ఉంది. కానీ ఏడాది దాటినా వాటిని సరఫరా చేయడం విశేషం. పేరాపురం, గొల్లపేట కేంద్రాలకు కల్తీ అయిన కందిపప్పు సరఫరా చేయడంతో వెనక్కి పంపించినట్లు కార్యకర్త చిన్నమ్మలు తెలిపారు. ఈ కేంద్రాలకు సరఫరా చేసే సరుకులు నాణ్యతను పరిశీలించాల్సిన అధికారులు కూడా ఎందుకో ‘మామూలు’గా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించాల్సి ఉంది.
తక్షణమే చర్యలు తీసుకుంటాం
పూసపాటిరేగ మండలంలోని పలు కేంద్రాలకు కాలం చెల్లిన నూనెప్యాకెట్లు, కంది పప్పు సరఫరా అయినట్లు మా దృష్టికి వచ్చింది. వాటిని పరిశీలించగా కాలం చెల్లినట్లు తేలింది. దీనిపై ఉన్నతాధికారులకు తెలియచేస్తాను. – ఎన్.ఆరుద్ర, ఏసీడీపీఓ,భోగాపురం ఐసీడీఎస్ సెక్టారు.
కాలం చెల్లిన నూనె అందించారు
అంగన్‌వాడీ కేంద్రానికి 2016లో తయారైన నూనెప్యాకెట్‌ను సరఫరా చేశారు. దీనిని నిశితంగా పరిశీలించగా ఆ విషయం బయటపడింది. దీనివల్ల పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపవచ్చు.
– కె.ఎస్.కె.దుర్గ, అంగన్‌వాడీ కార్యకర్త, కోనాడ
Comments
Please login to add a commentAdd a comment