ఆదిలాబాద్ టౌన్ : గర్భిణి, బాలింతలకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతో నిర్వహిస్తున్న అమృతహస్తం పథకం జిల్లాలోని అన్ని ప్రాజెక్టుల్లో అమలు చేసేందుకు ప్రణాళిక సిద్ధమైంది. ఈ నెల 15 నుంచి ‘వన్ ఫుల్ మిల్’ పేరిట ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. జిల్లాలో మాతా శిశు మరణాలను తగ్గించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని మరింతగా పకడ్బందీగా అమలు చేసేందుకు ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. ఇదివరకు గర్భిణులు, బాలింతలకు నెలకు 16 ఉడికించిన కోడిగుడ్లను మాత్రమే అందించేవారు. ఇక నుంచి నెలరోజులపాటు వారికి కోడిగుడ్లు ఇవ్వనున్నారు. ప్రొటీన్‌లు, విటమిన్‌లతో కూడిన ఆహారాన్ని అందజేయనున్నారు. ఈ పథకం నిర్వహణ బాధ్యతలను అంగన్‌వాడీ కార్యకర్తలకే అప్పగించనున్నారు.
జిల్లాలో ఇలా...
అమృత హస్తం పథకం 2013 జనవరిలో జిల్లాలోని 12 ప్రాజెక్టుల పరిధిలో ప్రారంభించారు. ఆరు ప్రాజెక్టు పరిధిలో ఈ పథకం అమలుకు నోచుకోలేదు. ఈ నెల 15వ తేదీ నుంచి 18 ప్రాజెక్టుల పరిధిలోని 3,538 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు. దీంతో జిల్లాలో 44 వేల మంది గర్భిణి, బాలిం తలకు పౌష్టికాహారం లభించే అవకాశం ఉంది. రూ.15 విలువ గల భోజనాన్ని ప్రతిరోజూ వారికి ఇవ్వనున్నారు. ఆకుకూరలు, కూరగాయలు, పాలు, పెరుగు, ఉడికించిన కోడిగుడ్లు, ఎగ్‌కర్రీ కూడా అందించనున్నారు. నెలలో 25 రోజుల పాటు అంగన్‌వాడీ కేంద్రాల్లో భోజనం పెట్టనున్నారు. గర్భందాల్చినప్పటి నుంచి ప్రసవం అయిన తర్వాత ఆరు నెలల వరకు కూడా ప్రయోజనం పొందవచ్చు.
నిర్వహణ బాధ్యత అంగన్‌వాడీలదే..
అమృతహస్తం పథకం (వన్ ఫుల్ మిల్) నిర్వహణ బాధ్యత అంగన్‌వాడీ కార్యకర్తలకే అప్పగించనున్నారు. ప్రస్తుతం గ్రామ సమైక్య సంఘాల సభ్యులు భోజనం వండి గర్భిణి, బాలింతలకు అందజేస్తున్నారు. అంగన్‌వాడీ కార్యకర్తలు, గ్రామ సమైక్య సభ్యుల మధ్య సమన్వయ లోపంతో ఈ పథకం ప్రస్తుతం అస్తవ్యస్తంగా తయారైంది. ఐసీడీఎస్ ద్వారా బియ్యం, పప్పు, కోడిగుడ్లు, నూనె అందజేయనుండగా, అంగన్‌వాడీ కార్యకర్తలు పాలు, కూరగాయలు, ఆకుకూరలు, పెరుగు అందజేయాల్సి ఉంటుంది. అన్ని అంగన్‌వాడీ కార్యకర్తల పేరిట జీరో అకౌంట్ తీసి నెలనెల వారి అకౌంట్లలో డబ్బులు జమ చేయనున్నారు. గర్భిణులు, బా లింతలకు పౌష్టికాహారం అందించాలనే ఉద్దేశంతోనే ఈ పథకం ప్రారంభిస్తున్నట్లు ఐసీడీఎస్ పీడీ మీరా బెనర్జి చెప్పారు.
కమిటీ మెంబర్లు వీరే..
ఈ పథకం నిర్వహణకు చైర్మన్‌గా సర్పంచ్ లేదా వార్డు సభ్యుడు/కౌన్సిలర్, ఆశా కార్యకర్త, ఇద్దరు తల్లులు, సైన్స్ ఉపాధ్యాయుడు లేదా రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగి, అంగన్‌వాడీ కార్యకర్త, ఇద్దరు గ్రామస్తులు సభ్యులుగా ఉంటారు.
మెనూ..
సోమవారం అన్నం, సాంబర్, కూరగాయలు, ఎగ్‌కర్రి, పాలు, కోడిగుడ్డు.
మంగళవారం అన్నం, పప్పు, ఆకుకూరలు, కూరగాయలు, కోడిగుడ్డు, పాలు.
బుధవారం అన్నం, పప్పు, ఆకుకూరలు, ఎగ్‌కర్రి, కోడిగుడ్డు, పాలు.
గురువారం అన్నం, సాంబర్, కూరగాయలు, పెరుగు, కోడిగుడ్డు, పాలు.
శుక్రవారం అన్నం, పప్పు, ఆకుకూరలు, కూరగాయలు, కోడిగుడ్డు, పాలు.
శనివారం అన్నం, పప్పు, కూరగాయలు, పెరుగు, కోడిగుడ్డు, పాలు.
15నుంచి ‘వన్ ఫుల్ మిల్’..
Published Wed, Dec 10 2014 2:39 AM | Last Updated on Fri, Jun 1 2018 7:32 PM
Advertisement