దుబ్బాక, న్యూస్‌లైన్: అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా మరింత మెరుగైన సేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది జనవరిలో ‘అమృత హస్తం’ పేరిట నూతన పథకాన్ని ప్రారంభించింది. మాతాశిశు మరణాలను నివారించాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. గత జనవరిలో జిల్లాలో 1,402 అంగన్‌వాడీ కేంద్రాల్లో ఈ పథకం ప్రారంభం కాగా తాజాగా సోమవారం మరో 800 కేంద్రాల్లో ప్రారంభించనున్నారు. ఈ పథకం ద్వారా అంగన్‌వాడీ కేంద్రాల్లో నిత్యం గర్భిణులు, బాలింతలకు ఒక పూట పౌష్టికాహారాన్ని (భోజనం) అందించాలి. ఇందులో 200 ఎంఎల్ పాలు, కోడిగుడ్డు, ఆకు కూర, కూరగాయలు, పప్పుతో కూడిన భోజనాన్ని (పౌష్టికాహారం) అందజేయాలి. నిత్యం రుచికరమైన పౌష్టికాహారాన్ని తీసుకుంటే గర్భిణులు, బాలింతలు ఆరోగ్యంగా ఉండడమే గాకుండా శిశువుల ఆరోగ్యం కూడా మెరుగ్గా ఉంటుందని ప్రభుత్వ ఉద్దేశం.
సత్ఫలితాల వల్లే మిగతా కేంద్రాలకు..
మొదటి విడతగా ప్రారంభించిన కేంద్రాల్లో సత్ఫలితాలు రావటంతో దీన్ని జిల్లా అంతటా ఈ కార్యక్రమాన్ని విస్తరిస్తున్నారు. జిల్లాలో 11 ఐసీడీఎస్ ప్రాజెక్టులున్నాయి. మొదట్లో నర్సాపూర్, రామాయంపేట, మెదక్, జహీరాబాద్, నారాయణఖేడ్ ప్రాజెక్టుల పరిధిలోని 1,402 అంగన్‌వాడీ కేంద్రాల్లోనే ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఆయా కేంద్రాల్లో సుమారు 12 వేల మంది గర్భిణులు, బాలింతలు పౌష్టికాహారాన్ని అందుకున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం తీసుకున్న గర్భిణులు 12 నుంచి 15 కిలోల బరువు పెరిగారని, ఈ ప్రాంతంలో జన్మించిన శిశువుల బరువు 2.5 కిలోలపై బడే ఉందని అధికారులు గుర్తించారు. మాతాశిశు మరణాలు చాలావరకు తగ్గడంతో ఈ పథకాన్ని రెండో విడతలో జిల్లాలోని మరో మూడు ప్రాజెక్టులైన దుబ్బాక, గజ్వేల్, జోగిపేట పరిధిలోని ఎనిమిది వందల అంగన్‌వాడీ కేంద్రాల్లో సోమవారం ప్రారంభించనున్నారు.
ఐకేపీ, అంగన్‌వాడీల సంయుక్త ఆధ్వర్యంలో...
అమృతహస్తం పథకాన్ని అంగన్‌వాడీ కేంద్రాలతోపాటు ఐకేపీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఐకేపీ గ్రామైక్య సంఘాలు, మెప్మా వారికి నిధులు కేటాయిస్తున్నారు. ఈ నిధులతో నెలనెలా పౌష్టికాహారానికి సంబంధించి ఆకు కూరలు, కూరగాయలు, పోపు సామగ్రిని కొనుగోలు చేసి ఇస్తారు. అంగన్‌వాడీ కేంద్రాలకు వచ్చే కోడి గుడ్లు, నూనె, పప్పులతోపాటు ఐకేపీ ఆధ్వర్యంలో అందించే పౌష్టికాహారంతో కలిపి గర్భిణులకు, బాలింతలకు భోజనం తయారు చేసి ఇస్తారు. ఇందుకు అంగన్‌వాడీ ఆయాలకు నెలకు రూ.250 వేతనాన్ని అదనంగా అందజేయనున్నారు.
జిల్లా అంతటా ‘అమృతహస్తం’
Published Sun, Dec 1 2013 11:35 PM | Last Updated on Sat, Jun 2 2018 8:29 PM
Advertisement
Advertisement