భద్రాద్రి జిల్లా పరిషత్ కార్యాలయం
సాక్షి, కొత్తగూడెం : జిల్లాలో కొత్తగా ఎన్నికైన మండల ప్రజాపరిషత్ పాలకవర్గాలు నేడు కొలువుదీరనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 20 మండలాల్లో మంగళవారం మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ఎంపీటీసీ సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాల పునర్విభజన తరువాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 21 మండల ప్రజాపరిషత్‌లు ఏర్పాటయ్యాయి. పునర్విభజన సమయంలో కొత్త మండలాలు ఏర్పాటు కావడంతో వీటి సంఖ్య పెరిగింది. గతంలో భద్రాద్రి జిల్లా పరిధిలో మొత్తం 17 మండల పరిషత్‌లు ఉండగా, వాటిలో రెండు రద్దయ్యాయి. కొత్తగా మరో 6 పెరిగాయి. దీంతో ఇప్పుడు వాటి సంఖ్య 21కి చేరింది. మండలాల పునర్విభజన తర్వాత కొత్తగూడెం మండలం పూర్తిగా మున్సిపాలిటీలో ఉండడం, భద్రాచలాన్ని ప్రభుత్వం మున్సిపాలిటీగా ప్రతిపాదించడంతో ఈ రెండు మండల పరిషత్‌లు రద్దయ్యాయి.
కొత్తగా ఆళ్లపల్లి, కరకగూడెం, అన్నపురెడ్డిపల్లి, సుజాతనగర్, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండల పరిషత్‌లు ఏర్పాటయ్యాయి. మొత్తం 21 మండలాల్లో ప్రస్తుతం 20 మండల ప్రజాపరిషత్ పాలకవర్గాలు కొత్తగా కొలువుదీరనున్నాయి. బూర్గంపాడు మండల పాలకవర్గ కాలపరిమితి మరో ఏడాది ఉండడంతో అక్కడ మండల పరిషత్ ఎన్నికలు జరుగలేదు. కాగా, బుధవారం జిల్లా ప్రజాపరిషత్ పాలకవర్గం బాధ్యతలు స్వీకరించనుంది. కొత్తగా ఎన్నికైన జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావుతో కలిపి మొత్తం 21 మంది జెడ్పీటీసీ సభ్యులు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గతంలో కొత్తగూడెం ఉమ్మడి మండలంగా ఉన్న సమయంలో స్థానిక పోస్టాఫీస్ సెంటర్‌లో ఉన్న మండల ప్రజాపరిషత్ కార్యాలయాన్ని జిల్లా పరిషత్ కార్యాలయంగా మార్పు చేశారు.
ఆలస్యంగా పాలకవర్గాల ప్రమాణస్వీకారాలు...
జిల్లాల పునర్విభజన తర్వాత కూడా ఉమ్మడి జిల్లా, మండల పరిషత్‌లు కొనసాగాయి. ఇటీవల ఎన్నికలు జరిగి చైర్మన్లు, వైస్ చైర్మన్లను ఎన్నుకున్నప్పటికీ ఆయా పాలకవర్గాల ప్రమాణస్వీకారంలో మాత్రం ఇతర జిల్లాలతో పోలిస్తే నెల రోజులు ఆలస్యం అయింది. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. ఈ సందర్భంగా భద్రాద్రి జిల్లాలో ఉన్న వేలేరుపాడు, కుక్కునూరు, చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక (భద్రాచలం రూరల్) మండలాలు ఏపీలోకి వెళ్లాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా, మండల పరిషత్‌లు నెలరోజులు ఆలస్యంగా బాధ్యతలు స్వీకరించాయి. అయితే బూర్గంపాడు మండల ప్రజా పరిషత్ పాలకవర్గం మాత్రం ఏడాది ఆలస్యంగా బాధ్యతలు స్వీకరించింది. ఈ మండలంలోని నాలుగు గ్రామాలు ఏపీలో కలవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రస్తుతం బూర్గంపాడు మండల పరిషత్‌కు ఎన్నికలు జరుగలేదు. ఇక్కడ ప్రస్తుతం ఉన్న పాలకవర్గం హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడంతో ఎన్నికలు నిలిచిపోయాయి.
దీంతో ప్రస్తుతం 20 మండల పరిషత్‌లు ప్రమాణస్వీకారం చేయనున్నాయి. రేపు జిల్లా పరిషత్ పాలకవర్గం ప్రమాణస్వీకారం చేయనుంది. జిల్లా పరిషత్ విషయంలోనూ ప్రత్యేకతే ఉంది. గతంలో ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ సైతం రాష్ట్ర విభజన సమయంలో నెలరోజులు ఆలస్యంగా ప్రమాణస్వీకారం చేసింది. అయితే జిల్లాల పునర్విభజన సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏర్పాటు కాగా ఇల్లెందు నియోజకవర్గంలోని గార్ల, బయ్యారం మండలాలు మహబూబాబాద్ జిల్లాలోకి, భద్రాచలం నియోజకవర్గం పరిధిలోని వాజేడు, వెంకటాపురం మండలాలు ములుగు జిల్లాలోకి వెళ్లాయి. దీంతో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలతో పాటు ములుగు, మహబూబాబాద్ జిల్లా పరిషత్ పాలకవర్గాలు సైతం నెలరోజులు ఆలస్యంగా ప్రమాణస్వీకారం చేయనున్నాయి. బుధవారం ఈ నాలుగు జిల్లాపరిషత్‌లు కొలువుదీరనున్నాయి.
ప్రమాణ స్వీకారోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలోని మండలాల్లో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో–ఆప్షన్ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు ఆయా ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రమాణ స్వీకార కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. గతంలో పీఓలుగా నియమించిన అధికారులు ప్రజా ప్రతినిధులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారన్నారు. కొత్తగా ఏర్పడిన మండలాలకు సిబ్బందిని కేటాయించడంతోపాటు ఫర్నిచర్ కూడా మంజూరు చేసినట్లు వివరించారు. భద్రాచలం, బూర్గంపాడు, కొత్తగూడెం మండలాలు మినహా మిగిలిన 14 పాత మండలాలు, 6 కొత్త మండలాల్లో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో–ఆప్షన్ సభ్యులు, ఎంపీటీసీలు ప్రమాణస్వీకారం చేస్తారని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment