panchayati
-
ముహూర్తం నేడే..
సాక్షి, కొత్తగూడెం : జిల్లాలో కొత్తగా ఎన్నికైన మండల ప్రజాపరిషత్ పాలకవర్గాలు నేడు కొలువుదీరనున్నాయి. జిల్లా వ్యాప్తంగా 20 మండలాల్లో మంగళవారం మండల ప్రజాపరిషత్ అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ఎంపీటీసీ సభ్యులు, కో ఆప్షన్ సభ్యులు ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు స్వీకరించనున్నారు. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లాల పునర్విభజన తరువాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 21 మండల ప్రజాపరిషత్‌లు ఏర్పాటయ్యాయి. పునర్విభజన సమయంలో కొత్త మండలాలు ఏర్పాటు కావడంతో వీటి సంఖ్య పెరిగింది. గతంలో భద్రాద్రి జిల్లా పరిధిలో మొత్తం 17 మండల పరిషత్‌లు ఉండగా, వాటిలో రెండు రద్దయ్యాయి. కొత్తగా మరో 6 పెరిగాయి. దీంతో ఇప్పుడు వాటి సంఖ్య 21కి చేరింది. మండలాల పునర్విభజన తర్వాత కొత్తగూడెం మండలం పూర్తిగా మున్సిపాలిటీలో ఉండడం, భద్రాచలాన్ని ప్రభుత్వం మున్సిపాలిటీగా ప్రతిపాదించడంతో ఈ రెండు మండల పరిషత్‌లు రద్దయ్యాయి. కొత్తగా ఆళ్లపల్లి, కరకగూడెం, అన్నపురెడ్డిపల్లి, సుజాతనగర్, చుంచుపల్లి, లక్ష్మీదేవిపల్లి మండల పరిషత్‌లు ఏర్పాటయ్యాయి. మొత్తం 21 మండలాల్లో ప్రస్తుతం 20 మండల ప్రజాపరిషత్ పాలకవర్గాలు కొత్తగా కొలువుదీరనున్నాయి. బూర్గంపాడు మండల పాలకవర్గ కాలపరిమితి మరో ఏడాది ఉండడంతో అక్కడ మండల పరిషత్ ఎన్నికలు జరుగలేదు. కాగా, బుధవారం జిల్లా ప్రజాపరిషత్ పాలకవర్గం బాధ్యతలు స్వీకరించనుంది. కొత్తగా ఎన్నికైన జెడ్పీ చైర్మన్ కోరం కనకయ్య, వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్‌రావుతో కలిపి మొత్తం 21 మంది జెడ్పీటీసీ సభ్యులు రేపు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. గతంలో కొత్తగూడెం ఉమ్మడి మండలంగా ఉన్న సమయంలో స్థానిక పోస్టాఫీస్ సెంటర్లో ఉన్న మండల ప్రజాపరిషత్ కార్యాలయాన్ని జిల్లా పరిషత్ కార్యాలయంగా మార్పు చేశారు. ఆలస్యంగా పాలకవర్గాల ప్రమాణస్వీకారాలు... జిల్లాల పునర్విభజన తర్వాత కూడా ఉమ్మడి జిల్లా, మండల పరిషత్‌లు కొనసాగాయి. ఇటీవల ఎన్నికలు జరిగి చైర్మన్లు, వైస్ చైర్మన్లను ఎన్నుకున్నప్పటికీ ఆయా పాలకవర్గాల ప్రమాణస్వీకారంలో మాత్రం ఇతర జిల్లాలతో పోలిస్తే నెల రోజులు ఆలస్యం అయింది. గత సార్వత్రిక ఎన్నికల తర్వాత రాష్ట్ర విభజన జరిగింది. ఈ సందర్భంగా భద్రాద్రి జిల్లాలో ఉన్న వేలేరుపాడు, కుక్కునూరు, చింతూరు, కూనవరం, వీఆర్‌పురం, ఎటపాక (భద్రాచలం రూరల్) మండలాలు ఏపీలోకి వెళ్లాయి. ఈ నేపథ్యంలో ఉమ్మడి జిల్లా, మండల పరిషత్‌లు నెలరోజులు ఆలస్యంగా బాధ్యతలు స్వీకరించాయి. అయితే బూర్గంపాడు మండల ప్రజా పరిషత్ పాలకవర్గం మాత్రం ఏడాది ఆలస్యంగా బాధ్యతలు స్వీకరించింది. ఈ మండలంలోని నాలుగు గ్రామాలు ఏపీలో కలవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రస్తుతం బూర్గంపాడు మండల పరిషత్‌కు ఎన్నికలు జరుగలేదు. ఇక్కడ ప్రస్తుతం ఉన్న పాలకవర్గం హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకోవడంతో ఎన్నికలు నిలిచిపోయాయి. దీంతో ప్రస్తుతం 20 మండల పరిషత్‌లు ప్రమాణస్వీకారం చేయనున్నాయి. రేపు జిల్లా పరిషత్ పాలకవర్గం ప్రమాణస్వీకారం చేయనుంది. జిల్లా పరిషత్ విషయంలోనూ ప్రత్యేకతే ఉంది. గతంలో ఉన్న ఉమ్మడి ఖమ్మం జిల్లా పరిషత్ సైతం రాష్ట్ర విభజన సమయంలో నెలరోజులు ఆలస్యంగా ప్రమాణస్వీకారం చేసింది. అయితే జిల్లాల పునర్విభజన సమయంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏర్పాటు కాగా ఇల్లెందు నియోజకవర్గంలోని గార్ల, బయ్యారం మండలాలు మహబూబాబాద్ జిల్లాలోకి, భద్రాచలం నియోజకవర్గం పరిధిలోని వాజేడు, వెంకటాపురం మండలాలు ములుగు జిల్లాలోకి వెళ్లాయి. దీంతో భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలతో పాటు ములుగు, మహబూబాబాద్ జిల్లా పరిషత్ పాలకవర్గాలు సైతం నెలరోజులు ఆలస్యంగా ప్రమాణస్వీకారం చేయనున్నాయి. బుధవారం ఈ నాలుగు జిల్లాపరిషత్‌లు కొలువుదీరనున్నాయి. ప్రమాణ స్వీకారోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి సూపర్‌బజార్(కొత్తగూడెం): జిల్లాలోని మండలాల్లో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో–ఆప్షన్ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటలకు ఆయా ఎంపీడీఓ కార్యాలయాల్లో ప్రమాణ స్వీకార కార్యక్రమాలు జరుగుతాయని పేర్కొన్నారు. గతంలో పీఓలుగా నియమించిన అధికారులు ప్రజా ప్రతినిధులతో ప్రమాణ స్వీకారం చేయిస్తారన్నారు. కొత్తగా ఏర్పడిన మండలాలకు సిబ్బందిని కేటాయించడంతోపాటు ఫర్నిచర్ కూడా మంజూరు చేసినట్లు వివరించారు. భద్రాచలం, బూర్గంపాడు, కొత్తగూడెం మండలాలు మినహా మిగిలిన 14 పాత మండలాలు, 6 కొత్త మండలాల్లో ఎంపీపీ, వైస్ ఎంపీపీ, కో–ఆప్షన్ సభ్యులు, ఎంపీటీసీలు ప్రమాణస్వీకారం చేస్తారని వివరించారు. -
సమస్యల పరిష్కారం కోసం పంచాయతీ కార్మికుల ఆందోళన
-
కోట్లూరు పంచాయితీకి పుత్తా ఏం చేశారో చెప్పాలి
కడప కార్పొరేషన్ : కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గంలోని కోట్లూరు గ్రామపంచాయితీకి టీడీపీ ఇన్చార్జి పుత్తా నరసింహారెడ్డి ఏంచేశారో చెప్పాలని హెచ్ఎల్డబ్లు్యసీ అధ్యక్షుడు, వైఎస్ఆర్సీపీ నాయకుడు శ్రీనివాసులరెడ్డి ప్రశ్నించారు. కడపలోని కార్పొరేషన్ కాంప్లెక్స్‌లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నిన్న దళిత తేజం కార్యక్రమానికి కోట్లూరుకు వచ్చిన పుత్తా ఇక్కడి సర్పంచ్ లైట్లు వేశారా, నీళ్లు ఇచ్చారా, రోడ్లు వేశారా అని విమర్శించడం సరికాదన్నారు. కోట్లూరు మెయిన్ విలేజ్‌లో రూ.20లక్షలతో సీసీ రోడ్లు వేశామని, నీటి సమస్య తీర్చడానికి రూ.17లక్షల 12వ ఆర్థిక సంఘం నిధులతో టెండర్లు పిలిస్తే, వారి పార్టీకి చెందిన కాంట్రాక్టరే టెండర్‌వేసి పనులు చేయలేదన్నారు. ఫలితంగా నిధులు వెనక్కిపోయాయన్నారు. పెన్నానది నుంచి ప్రత్యేకంగా బోరువేసి హరిజనవాడకు నీళ్లిచ్చామన్నారు. బాకరాపురంలో రూ.25లక్షలతో 12 రోడ్లు వేశామన్నారు. అలాగే 14వ ఆర్థిక సంఘం నిధులతో రూ.8.87లక్షలతో 7 రోడ్లు వేశామని, ఎంపీ నిధులతో మరో రూ.6లక్షలకు ప్రతిపాదనలు పంపామన్నారు. బీచువారిపల్లెలో నీటి ఎద్దడి తీర్చేందుకు పంచాయితీ నిధులతో బోరువేసి, కొత్తమోటారు అమర్చామన్నారు. దీన్ని తానే వేయిం చానని పుత్తా చెప్పుకోవడం దారుణమన్నారు. ఆయన ఆ బోరును ఏ నిధులు తెచ్చి వేశారో చెప్పాలని ప్రశ్నించారు. వక్కిలేరు వంకలో 12సార్లు మరమ్మతు పనులు చేసి 15 సార్లు చేసినట్లు టీడీపీ నాయకులు బిల్లులు చేసుకున్నారని, ఇప్పటికీ కొత్త బ్రిడ్జి రాలేదన్నారు. నీరుచెట్టు పనుల్లో కూడా టీడీపీ నాయకులు భారీ ఎత్తును అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు. పుత్తా నరసింహారెడ్డి ఈ నాలుగేళ్లలో కోట్లూరుకు ఈ పనిచేశానని చెప్పగలిగితే తనతో పాటు సర్పంచ్ వెంకటలక్ష్మి కూడా రాజీనామా చేస్తుందని సవాల్ విసిరారు. -
ఆహ్వానించలేదా లేక..వీరే దూరంగా ఉన్నారా...
టీఆర్ఎస్లో ప్రాధాన్యత సమస్య సాక్షి ప్రతినిధి, వరంగల్ : తండాలకు పంచాయతీ హోదా కల్పించడంపై రాష్ట్ర వ్యాప్తంగా గిరిజనుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆ వర్గం వారు సంబరాలు జరుపుకుంటున్నారు. పలువురు లంబాడీ వర్గం ప్రజాప్రతినిధులు, ముఖ్యులు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావును శుక్రవారం హైదరాబాద్‌లో కలిసి కృతజ్ఞతలు సైతం తెలిపారు. అధికార పార్టీకి చెందిన లంబాడీ వర్గం ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇందులో పాల్గొన్నారు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన మంత్రి చందులాల్, ఎమ్మెల్యే శంకర్‌నాయక్ ఈ కార్యక్రమానికి దూరంగా ఉండడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. టీఆర్ఎస్ అధిష్టానమే వీరిద్దరికీ ప్రాధాన్యత లేకుండా చేసేందుకు కార్యక్రమానికి ఆహ్వానించలేదా... వీరే దూరంగా ఉన్నారా.. అనే అంశంపై అధికార పార్టీలో చర్చ జరుగుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో లంబాడీ వర్గం ఎమ్మెల్యేలు, ఎంపీల ప్రాతినిథ్యం ఎక్కువగా ఉంది. ఎస్టీ వర్గానికి రిజర్వ్ అయిన అన్ని నియోజక వర్గాల్లో లంబాడీ వర్గం వారే గెలిచారు. మహబూబాబాద్ ఎంపీగా అజ్మీరా సీతారాంనాయక్, ములుగు ఎమ్మెల్యేగా ఎ.చందులాల్, డోర్నకల్ ఎమ్మెల్యేగా డీఎస్.రెడ్యానాయక్, మహబూబాబాద్ ఎమ్మెల్యేగా బి.శంకర్‌నాయక్ గత ఎన్నికల్లో గెలిచారు. తండాలను పంచాయతీలుగా మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఈ వర్గం తరఫున ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపేందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర అధికార పార్టీ ముఖ్యులు వెళ్లారు. స్వయంగా రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్న అజ్మీరా చందులాల్ ఈ కార్యక్రమంలో లేకపోవడం ములుగు నియోజకవర్గంలో పెద్ద అంశంగా మారింది. అనారోగ్య సమస్యల వల్ల కొంత కాలంగా చందూలాల్ ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వచ్చారు. ఇటీవల పరిస్థితిలో మార్పు రాగా.. నియోజకవర్గంలో తిరుగుతున్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సమయంలో తండాలను పంచాయతీలుగా గుర్తిస్తూ చారిత్రక నిర్ణయం తీసుకున్న వేళ గిరిజన సంక్షేమ మంత్రి చందూలాల్ బయటకు రాకపోవడం చర్చకు దారితీసింది. మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ దూరంగా ఉండడం... ఈ సెగ్మెంట్లో టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే ఎం.కవిత హాజరుకావడం ఆసక్తి కలిగిస్తోంది. వర్గ పోరు.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని ఎస్టీ కేటగిరి అసెంబ్లీ నియోజవర్గాలలో వర్గపోరు కొనసాగుతోంది. ములుగు నియోజకవర్గంలో మంత్రి చందూలాల్‌కు, ఎంపీ సీతారాంనాయక్ వర్గాల మధ్య పొసగడంలేదు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సీతారాంనాయక్ ప్రయత్నిస్తున్నారనే ప్రచారం ఇక్కడ చందూలాల్ వర్గానికి ఇబ్బంది కలిగిస్తోంది. వీరి మధ్య వర్గపోరు కొన్నిసార్లు బహిరంగంగానే సాగి.. ఫ్లెక్సీల చించివేతల వరకు వెళ్లింది. అలాగే మహబూబాబాద్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌కు, ఎంపీ సీతారాంనాయక్‌కు ఇదే పరిస్థితి ఉంది. టీఆర్ఎస్ అధిష్టానం అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని ఎంపీ సీతారాంనాయక్ సన్నిహితుల వద్ద చేసిన వ్యాఖ్యలతో శంకర్‌నాయక్ వర్గంలో అసంతృప్తికి కారణమవుతున్నాయి. ఈ సెగ్మెంట్లో సైతం ఎంపీ, ఎమ్మెల్యేలు కలిసి కార్యక్రమాల్లో పాల్గొనే పరిస్థితి లేదు. మరోవైపు మహబూబాబాద్ మాజీ ఎమ్మెల్యే మాలోత్ కవిత వర్గానికి, సిట్టింగ్ ఎమ్మెల్యే శంకర్‌నాయక్ వర్గానికి మధ్య ఇదే పరిస్థితి ఉంది. డోర్నకల్ నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే డీఎస్.రెడ్యానాయక్‌కు అక్కడ పోటీ చేసి ఓడిపోయిన సత్యవతి రాథోడ్‌కు మధ్య రాజకీయంగా పొసగడంలేదు. ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి దగ్గర జరిగిన కార్యక్రమంలో ఇద్దరు ముఖ్య ప్రజాప్రతినిధులు లేకపోవడం ఆసక్తిని పెంచుతోంది. టీఆర్ఎస్ అధిష్టానమే వీరిద్దరి ప్రాధాన్యత తగ్గించిందా.. లేక వీరిద్దరే ఉద్దేశపూర్వకంగా దూరంగా ఉన్నారా అనే అంశంపై స్పష్టత రావడంలేదు. ఈ రెండు అంశాలలో ఏది జరిగినా వచ్చే ఎన్నికల్లో టికెట్ల విషయంపై ఇప్పుటి నుంచే ఆసక్తికర అంచనాలు మొదలయ్యాయి. -
తెలంగాణలో నూతన పంచాయతీ రూపకల్పన పక్రియ
-
‘గ్రూప్స్’ నోటిఫికేషన్లు విడుదల
గ్రూప్–1 పోస్టులు 78 - గ్రూప్–3లో 1055 పంచాయతీ కార్యదర్శుల పోస్టులు - హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ల పోస్టులు 100 - మొత్తం 1317 పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో గ్రూప్–1, గ్రూప్–3 సహా 1317 పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ శనివారం నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 9 నోటిఫికేషన్లను కమిషన్ చైర్మన్ ప్రొఫెసర్ పి.ఉదయభాస్కర్ మీడియా సమావేశంలో విడుదల చేశారు. 2017లో ఈ పోస్టులన్నిటికీ రాత పరీక్షలు, అభ్యర్థుల ఎంపిక పూర్తి చేస్తామని ఆయన తెలిపారు. గ్రూప్–1లో 78 పోస్టులు ఉన్నాయి. ఇందులో డిప్యుటీ కలెక్టర్లు, కమర్షియల్ టాక్స్ ఆఫీసర్లు, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్లు, డిప్యుటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, అసిస్టెంట్ ఎక్సయిజ్ సూపరింటెండెంట్, జిల్లా బీసీ సంక్షేమాధికారులు, గ్రేడ్–2 మున్సిపల్ కమిషనర్లు, లేబర్ అసిస్టెంట్ కమిషనర్ల పోస్టులున్నాయి. గ్రూప్–3లో 1055 పంచాయతీ కార్యదర్శుల పోస్టులు భర్తీ చేయనున్నారు. వీటితో పాటు టౌన్ ప్లానింగ్ అసిస్టెంట్లు– 5, అగ్రికల్చర్ ఆఫీసర్లు–30, టౌన్, కంట్రీప్లానింగ్ అసిస్టెంట్ డైరెక్లర్లు–5, మైనింగ్ రాయల్టీ ఇన్స్పెక్టర్లు–5, ఫిషరీస్ అసిస్టెంట్ డైరెక్టర్లు–10, అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్లు–13, అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్లు–10, అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్లు–6, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్లు–100 పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 1317 పోస్టులకు సంబంధించి 9 నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఆయా నోటిఫికేషన్ల పోస్టులకు దరఖాస్తు చేసే ముందు అభ్యర్థులు తమ అర్హతలు, ఇతర సమాచారానికి సంబంధించి వన్‌టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ (ఓటీపీఆర్)ను పూర్తి చేయాల్సి ఉంటుందని కమిషన్ వివరించింది. ఈ పోస్టులకు 1:50 చొప్పునే మెయిన్స్‌కు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. స్క్రీనింగ్ టెస్టులను ఆఫ్‌లైన్ మోడ్‌లో ఓఎమ్మార్ సమాధానాలతో నిర్వహించనున్నారు. కాగా, ఏపీపీఎస్సీ కార్యాలయాన్ని విజయవాడ, లేదా గుంటూరులలో ఏర్పాటుచేయడానికి అద్దెభవనాలను అన్వేషిస్తున్నామని ఉదయభాస్కర్ తెలిపారు. గ్రూప్–1 దరఖాస్తుల గడువు జనవరి 30 గ్రూప్–1 పోస్టులకు ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ శనివారం నుంచే ప్రారంభమైంది. జనవరి 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. స్క్రీనింగ్ టెస్ట్/ ప్రిలిమనరీ పరీక్ష మే 7వ తేదీన ఉంటుంది. దీనికి నెగిటివ్ మార్కుల విధానం అమలు చేయనున్నారు. ప్రిలిమనరీ పరీక్షను రాష్ట్రంలోని 13 జిల్లా కేంద్రాల్లో నిర్వహించనున్నారు. మెయిన్ పరీక్షను విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం కేంద్రాల్లో ఆగస్టు 17 నుంచి 27వ తేదీ వరకు నిర్వహిస్తారు. గ్రూప్–1లో స్క్రీనింగ్ టెస్ట్ 150 మార్కులకు ఉంటుంది. జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీపై ఈ పరీక్ష ఉంటుంది. మెయిన్స్ పరీక్షలో జనరల్ ఇంగ్లిషుతో పాటు ఐదు పేపర్లలో పరీక్షలు నిర్వహిస్తారు. గ్రూప్–3 దరఖాస్తుల గడువు జనవరి 30 గ్రూప్–3 కింద భర్తీ చేయనున్న 1055 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి సంబంధించి ఆన్లైన్ దరఖాస్తుల ప్రక్రియ శనివారం నుంచే ప్రారంభమైంది. ఆన్లైన్ దరఖాస్తును కమిషన్ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచారు. జనవరి 30 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసే వారు కమిషన్ అధికారిక వెబ్సైట్ ‘పీఎస్సీ.ఏపీ.జీఓవీ.ఇన్’ నుంచి సంబంధిత కరస్పాండింగ్ లింకులోకి వెళ్లాల్సి ఉంటుంది. లేదా ‘హెచ్‌టీటీపీ:ఏపీపీఎస్‌సీఏపీపీఎల్‌ఐసీఏటీఐఓఎన్‌ఎస్17.ఏపీపీఎస్సీ.జీఓవీ.ఐఎన్’ ద్వారా నేరుగా దరఖాస్తు చేసుకోవచ్చు. గ్రూప్–3 పోస్టులకు స్క్రీనింగ్ టెస్ట్ ఏప్రిల్ 23న నిర్వహిస్తారు. మెయిన్ పరీక్షను జులై 16న ఆన్లైన్లో కంప్యూటరాధారితంగా చేపడతారు. ఈ పోస్టులకు స్క్రీనింగ్ టెస్ట్‌ను 150 మార్కులకు నిర్వహిస్తారు. ఇది డిగ్రీ స్టాండర్డ్‌లో ఉంటుంది. దీనికి నెగిటివ్ మార్కుల పద్దతిని అనుసరిస్తారు. మెయిన్ పరీక్ష 300 మార్కులకు 2 పేపర్లుగా ఉంటుంది. పేపర్1లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీస్‌పై ప్రశ్నలుంటాయి. రెండో పేపర్లో రూరల్ డెవలప్మెంట్, గ్రామీణ ప్రాంతంలో సమస్యల (ఆంధ్రప్రదేశ్ ప్రాధాన్యతగా)పై ప్రశ్నలుంటాయి. ► టౌన్‌ప్లానింగ్ అసిస్టెంట్ డైరెక్టర్ల పోస్టులకు శనివారం నుంచి ఆన్లైన్ దరఖాస్తులు ప్రారంభం కాగా జనవరి 30వరకు స్వీకరించనున్నారు. దరఖాస్తులు 25 వేలు దాటితే స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఎప్పుడు నిర్వహించేది తర్వాత ప్రకటించనున్నారు. మెయిన్ పరీక్షను ఏప్రిల్ 5, 6వ తేదీల్లో కంప్యూటరాధారితంగా చేపట్టనున్నారు. ఈ పరీక్షను విజయవాడ, గుంటూరులలో నిర్వహిస్తారు. మెయిన్ పరీక్ష 150 చొప్పున మూడు పేపర్లలో 450 మార్కులకు ఉంటుంది. ► అసిస్టెంటు టౌన్‌ప్లానర్ పోస్టులకు కూడా జనవరి 30వరకు ఆన్లైన్ దరఖాస్తు గడువుగా నిర్ణయించారు. 25వేలకు మించి దరఖాస్తులు వస్తే స్క్రీనింగ్ టెస్ట్ తేదీని తరువాత ప్రకటిస్తారు. మెయిన్ పరీక్షను ఏప్రిల్ 4, 5 తేదీల్లో నిర్వహిస్తారు. మెయిన్ పరీక్ష 150 చొప్పున మూడు పేపర్లలో 450 మార్కులకు ఉంటుంది. ► అగ్రికల్చరల్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు గడువు జనవరి 30తో ముగుస్తుంది. స్క్రీనింగ్ టెస్ట్ అవసరమైతే తేదీని తర్వాత ప్రకటిస్తారు. మెయిన్ పరీక్షను ఏప్రిల్4న 450 మార్కులకు రెండు పేపర్లలో నిర్వహిస్తారు. ► అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు గడువు జనవరి 30. స్క్రీనింగ్ టెస్ట్‌ను జూన్ 18న నిర్వహిస్తారు. మెయిన్ పరీక్షను సెప్టెం బర్ 21, 22 తేదీల్లో నిర్వహించనున్నారు. ► మైనింగ్ రాయల్టీ ఇన్స్పెక్టర్ పోస్టులకు అవసరమైతే స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. మెయిన్ పరీక్షను ఏప్రిల్ 5న నిర్వహిస్తారు. ► హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టులకు దరఖాస్తు గడువు జనవరి 30. ఈ పోస్టులకు జూన్11న స్క్రీనింగ్ టెస్ట్, సెప్టెంబర్ 21న మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. ► అసిస్టెంట్ డైరెక్టర్ ఫిషరీస్ పోస్టులకు దరఖాస్తు గడువు జనవరి 30. ఈ పోస్టులకు స్క్రీనింగ్ టెస్ట్ అవసరమైతే ఎప్పడు నిర్వహించేది తర్వాత ప్రకటిస్తారు. మెయిన్ పరీక్ష మే 4, 5 తేదీల్లో జరుగుతుంది. -
దొంగ బిల్లులే..!
యనమలకుదురు గ్రామ పంచాయతీలో నకిలీ బిల్లు యనమలకుదురు ‘పంచాయితీ’ అక్రమాల్లో కొత్త కోణం బిల్లులో పేర్కొన్న సంస్థ లేదని తేల్చిన డీసీటీవో పెనమలూరు : యనమలకుదురు గ్రామ పంచాయతీలో నకిలీ బిల్లులతో నిధులు డ్రా చేసినట్లు వస్తున్న ఆరోపణలకు బలం చేకూరుతోంది. పంచాయతీలో చూపిస్తున్న బిల్లుల్లో పేర్కొన్న వ్యాపార సంస్థలేమీ లేవని వాణిజ్య పన్నుల శాఖ అధికారులు ధ్రువీకరించారు. దీంతో నకిలీ బిల్లులతో నిధులు డ్రా చేసినట్లు స్పష్టమవుతోంది. ఇందుకు సంబంధించిన వివరాలు... యనమలకుదురు పంచాయతీ కార్యదర్శిగా రామకోటేశ్వరరావు 2015లో పని చేశారు. ఆ సమయంలో పారిశుద్ధ్య నిర్వహణ, విద్యుత్ పరికరాల కొనుగోలు, వాటర్ వర్క్స్, ఇతర పనులకు సంబంధించి నకిలీ బిల్లులు పెట్టి రూ.50లక్షలకు పైగా నిధులు డ్రా చేశారు. పంచాయతీ పాలకవర్గ ఆమోదం లేకుండానే ట్రెజరీ నుంచి కాకుండా నేరుగా ఈ నిధులు డ్రా చేశారనే ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై అప్పట్లో ‘సాక్షి’లో వరుస కథనాలు ప్రచురితమయ్యాయి. దీంతో విచారణ చేసిన ఉన్నతాధికారులు.. నిధులు డ్రా చేసే విషయంలో నిబంధనలు పాటించలేదని గుర్తించి రామకోటేశ్వరరావును సస్పెండ్ చేశారు. అయితే నకిలీ బిల్లులపై మాత్రం విచారణ చేయలేదు. అక్రమంగా డ్రా చేసిన సొమ్మును రికవరీ చేయలేదు. ఈ అవనితీ వ్యవహారంలో అధికార పార్టీ నేతలు, పలువురు అధికారుల పాత్ర కూడా ఉందని, అందువల్లే కార్యదర్శి సస్పెన్షన్‌తో సరిపెట్టారనే ఆరోపణలు వచ్చాయి. స.హ.చట్టం దరఖాస్తుతో... విజయవాడలోని భావన్నారాయణ వీధిలో డోర్ నంబర్ 45–3–44 /2ఏలో నిఖిత ఎంటర్ప్రైజెస్ పేరుతో రూ.15లక్షల విలువైన పలు రకాల మెటీరియల్ తీసుకున్నట్లు పంచాయతీలో బిల్లులు చూపించారు. ఈ బిల్లులపై ఏపీ జీఎస్టీ నంబర్ 1842 ఆర్సీ నంబర్ వీజే2/02/865 అని ఉంది. ఈ క్రమంలో పంచాయతీ లెక్కల్లో చూపిస్తున్న బిల్లులు అందించిన వ్యాపార సంస్థల వివరాలు ఇవ్వాలని యనమలకుదురు ఉప సర్పంచ్ ముప్పవరపు నారాయణరావు సమాచార హక్కు చట్టం ద్వారా వాణిజ్య పన్నుల శాఖ అధికారులను కోరారు. దీనిపై విచారణ చేసిన విజయవాడ డీసీటీవో నిఖిత ఎంటర్ప్రైజెస్ పేరుతో అసలు తమ పరిధిలో వ్యాపార సంస్థలు లేవని ధ్రువీకరిస్తూ బదులిచ్చారు. ఉయ్యూరులో మంజునాథ ఎంటర్ ప్రైజెస్ పేరుతో కూడా రూ.10 లక్షల వరకు బిల్లులు ఉన్నాయి. అక్కడి డీసీటీవో కూడా మంజునాథ ఎంటర్ప్రైజెస్ పేరుతో ఎటువంటి వ్యాపార సంస్థ లేదని తెలిపారు. ఇదే తరహాలో మరికొన్ని సంస్థల పేరుతో బిల్లులు పెట్టి నిధులు డ్రా చేసినట్లు సమాచారం. ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి నిధుల రికవరీకి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
నేటి నుంచి నామినేషన్ల స్వీకరణ
జిల్లాపరిషత్ : రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఈనెల 19 న విడుదల చేసిన పంచాయతీ ఉప పోరుకు శుక్రవారం నుంచి నామినేషన్లుు స్వీకరిస్తున్నట్లు జడ్పీ సీఈవో, ఇన్చార్జి డీపీవో మోహన్‌లాల్ తెలిపారు. జిల్లాలో ఖాళీ ఏర్పడిన ఒక ఎంపీటీసీ, మూడు సర్పంచ్, 38 వార్డుసభ్యుల స్థానాలకు వచ్చే నెల 8న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు రిటర్నింగ్ అధికారులు మండల పరిషత్ కార్యాలయాల్లో నామినేషన్ పత్రాలను స్వీకరిస్తారని మోహన్‌లాల్ పేర్కొన్నారు. అంతకుముందు అధికారులు ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేస్తారన్నారు. ఎన్నికలు జరిగే మండలాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని, పోలింగ్, ఓట్ల లెక్కింపు ఆయా గ్రామపంచాయతీ కార్యాలయంలో ఉంటుందని తెలిపారు. సిరికొండ మండలంలోని ముషీర్‌నగర్ ఎంపీటీసీ స్థానం ఎన్నికకు రిటర్నింగ్ అధికారిగా వికలాంగులశాఖ సహాయ సంచాలకులు చిన్నయ్య, అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిగా ఎంపీడీఓ శ్రీనివాస్‌రావును నియమించగా, మిగిలిన సర్పంచి, వార్డుసభ్యుల ఎన్నికకు రిటర్నింగ్ అధికారులుగా స్టేజ్–1 ఈవోపీఆర్డీలను నియమించామని పేర్కొన్నారు. -
వైస్ చైర్మన్ వర్గీయుల వీరంగం
ప్రొద్దుటూరు క్రైం: పంచాయితీకి పిలిచి ఓ యువకుడిని మున్సిపల్ వైస్ చైర్మన్ వైస్ జబివుల్లా వర్గీయులు చితకబాదిన సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల మేరకు.. నడింపల్లెకు చెందిన జాఫర్ హుసేన్ జీవనోపాధి నిమిత్తం సౌదీ అరేబియాకు వెళ్లే ప్రయత్నంలో ఉన్నాడు. ఓ పంచాయితీ విషయమై మాట్లాడాలని వైస్ చైర్మన్ జబివుల్లా అతన్ని కేహెచ్‌ఎం వీధిలోని వాటర్ ప్లాంట్ వద్దకు పిలిపించారు. అతని వెంట మరో 20 మంది దాకా యువకులు రావడంతో వారిని వెళ్లాలని చెప్పడంతో వారు వెళ్లిపోయారు. చేతులు కట్టుకుని నిల్చున్న జాఫర్‌ను అక్కడున్న వైస్ చైర్మన్ వర్గీయులు నానా దుర్భాషలాడారు. చేతులు కట్టుకునే ఉండాలని పక్కకు తీస్తే కొడతామని వారు హెచ్చరించారు. ఈ క్రమంలోనే జబివుల్లా సమక్షంలో సుమారు 20 మంది దాకా జాఫర్ హుసేన్‌పై దాడికి పాల్పడ్డారు. నీ దిక్కున్న చోట చెప్పుకో అంటూ అతన్ని హెచ్చరించారు. వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్‌లో హల్చల్ వైస్ చైర్మన్ వర్గీయుల చేతుల్లో దాడికి గురైన జాఫర్ హుసేన్ ఆదివారం రాత్రి 9 గంటల సమయంలో వన్‌టౌన్‌కు ఫిర్యాదు చేయడానికి వెళ్లాడు. అతనితోపాటు సోదరుడు, తల్లి కూడా స్టేషన్‌కు వెళ్లింది. గతంలో కూడా రెండు సార్లు తనపై దాడికి పాల్పడ్డారని జాఫర్ తెలిపాడు. రంజాన్ మాసంలో ఉపవాసం ఉన్నానని చెప్పినప్పటికీ వదలకుండా నడిరోడ్డుపై చెప్పు కాళ్లతో కొట్టారని అతను అన్నాడు. విషయం తెలుసుకున్న జబివుల్లాతోపాటు అతని వర్గీయులు స్టేషన్‌కు చేరుకున్నారు. ఫిర్యాదు చేయవద్దంటూ జాఫర్ తల్లితో చెప్పగా ఆమె అందుకు అంగీకరించలేదు. ఈ సమయంలోనే కొందరు జాఫర్ హుసేన్‌ను భయపెట్టే ప్రయత్నం చేశారు. కొద్ది సేపు ఇరు వర్గీయులతో వన్‌టౌన్ పోలీస్‌స్టేషన్ కిటకిటలాడింది. వీళ్లంతా పోలీస్‌స్టేషన్‌లో హల్చల్ చేస్తున్నప్పటికీ వారిని అడ్డుకోడానికి పోలీసులు సాహసించలేదు. హాజీబాషా, షేక్షా, బాషాఖాన్తోపాటు మరికొందరు తనపై దాడి చేశారని జాఫర్ హుసేన్ ఫిర్యాదు చేశాడు. ఈ విషయమై వన్‌టౌన్ ఎస్ఐ చిన్నపెద్దయ్యను వివరణ కోరగా ఓ యువతి విషయమై జరిగిన గొడవలో జాఫర్ హుసేన్ ఫిర్యాదు చేశాడన్నారు. అయితే కోర్టు అనుమతితో కేసు కట్టాల్సి ఉందని ఆయన తెలిపారు. -
ఊర్లే లేవు.. రోడ్డేశారట..
► రోడ్లు వేయకుండానే వేసినట్లుగా రికార్డులు ► పనులు చేయకుండానే నిధులు స్వాహా ► పంచాయతీలో లేని గ్రామాల పేర్లతో పనులు ఉట్నూర్ : గ్రామ పంచాయతీలో లేని గ్రామాలను సృష్టించారు. ఆ రెండు గ్రామాలను అనుసంధానం చేస్తూ రోడ్డు కూడా వేసేశారు. అలా కాంట్రాక్టర్ల ధనదాహానికి అధికారుల అవినీతి తోడైంది. ఫలితంగా రోడ్డు వేయకుండానే వేసినట్లు రికార్డుల్లో చూపిస్తూ నిధులు స్వాహా చేశారు. ప్రభుత్వం రూరల్ కనెక్టివిటి ప్రాజెక్ట్(గ్రామీణ అనుసంధాన రోడ్లు)-1 పథకంలో భాగంగా మొదటి విడతలో ఉపాధి హామీ పథకం ద్వారా గ్రామాల్లో రోడ్ల పనులు చేపట్టింది. 2010-11 ఆర్థిక సంవత్సరంలో మొదటి విడతలో జిల్లా వ్యాప్తంగా 1,066 పనులకు గాను ప్రభుత్వం రూ.53 కోట్ల 90 లక్షల 8 వేలు కేటారుుంచింది. ఐటీడీఏ ఇంజినీరింగ్ విభాగం ద్వారా జిల్లా వ్యాప్తంగా గ్రామాలను గుర్తించి పనులు చేపట్టారు. రోడ్డు నిర్మాణమే లేదు ఆర్సీపీ(రూరల్ కనెక్టివిటి ప్రాజెక్టు)-1 పనుల్లో భాగంగా ఉట్నూర్ మండలం దొంగచింత గ్రామం నుంచి సోనాపూర్ వరకు గ్రావెలింగ్ రోడ్డు నిర్మాణానికి రూ.9.65 లక్షలు కేటారుుంచారు. దొంగచింత నుంచి సోనాపూర్‌కు రోడ్డు నిర్మించాల్సి ఉండగా.. దొంగచింత నుంచి కేవలం 60 నుంచి 70 మీటర్ల వరకు రెండు వైపులా మట్టి పోసి వదిలేశారు. అంతేగానీ సోనాపూర్ వరకు రోడ్డు నిర్మాణమే జరగలేదు. కాని అధికారులు మాత్రం రోడ్డు పూర్తి చేసినట్లు రికార్డుల్లో రాశారు. అదీగాక రోడ్డు నిర్మాణంలో భాగంగా కూలీల చెల్లింపులు రూ.25వేలుగా, మెటీరియల్‌కు రూ.9.23 లక్షలు ఖర్చయినట్లు లెక్కలేశారు. రూ.9.48 లక్షలతో పనులు పూర్తరుునట్లు రికార్డులు సృష్టించారు. కాని ఇంతవర కు సోనాపూర్‌కు రోడ్డు నిర్మాణమే జరగలేదు. ఎన్నో ఏళ్లుగా సోనపూర్ గ్రామస్తులు రోడ్డు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు, పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ రోడ్డు వేయకుండానే నిధులు కాజేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నారుు. పంచాయతీలో గ్రామాలు లేకున్నా.. ఉట్నూర్ గ్రామ పంచాయతీలో దాబా, పూనగూడ అనే గ్రామాలు లేవు. కాని అధికారులు ఆ గ్రామాలు ఉట్నూర్ గ్రామ పంచాయతీలో ఉన్నట్లు సృష్టించారు. అంతటితో ఆగకుండా ఆ రెండు గ్రామాల మధ్య అనుసంధానంగా గ్రావెలింగ్ రోడ్డు వేసినట్లు రికార్డుల్లో నమోదు చేసి లక్షలాది రూపాయలు కాజేశారు. దాబా, పునగూడ గ్రామాలకు గ్రావెలింగ్ రోడ్డు నిర్మాణం కోసం ఆర్సీపీ మొదటి విడతలో భాగంగా రూ.17.50 లక్షలు కేటారుుంచారు. రూ.10.55 లక్షలతో రోడ్డు నిర్మాణం పూర్తి చేసినట్లు రికార్డుల్లో నమోదు చేశారు. లేని గ్రామాలకు ఐటీడీఏ ఇంజినీరింగ్ అధికారులు రోడ్డు ఎలా వేశారో వారికే తెలియూలి. 2010-11 సంవత్సరంలో ఆర్సీపీ మొదటి విడతలో మంజూరైన పనుల్లో భాగంగా చాలా ప్రాంతాల్లో రోడ్లు వేయకుండానే నిధులు కాజేశారని పలు గిరిజన సంఘాలు ఆరోపిస్తున్నారుు. ఆర్సీపీ ద్వారా నిర్మించిన రోడ్డు పనులన్నింటిపై ఉన్నతాధికారులు పూర్తి స్థాయిలో విచారణ నిర్వహిస్తే వాస్తవాలు బయటపడుతాయని అంటున్నారుు. విచారణ చేపడుతాం 2010-11 సంవత్సరాల్లో నేను ఇక్కడ బాధ్యతలు నిర్వహించలేదు. ఆర్సీపీ మొదటి విడతలో గ్రామాల్లో వేసిన రోడ్లన్నింటినీ పరిశీలిస్తాం. దొంగచింత నుంచి సోనాపూర్ వరకు వేసిన రోడ్డు నిర్మాణం, ఉట్నూర్ గ్రామ పంచాయతీలో దాబా, పూనగూడ అనే గ్రామాల మధ్య వేసిన రోడ్డు నిర్మాణంపై విచారణ నిర్వహిస్తాం. ఉట్నూర్ పంచాయతీలో దాబా, పూనగూడ గ్రామాలు ఉన్నాయా లేవా అనే అంశంపై విచారణ చేపడుతాం. - రమేశ్, ఈఈటీడబ్ల్యూ ఐటీడీఏ -
నమ్మించి లోబర్చుకుని... మరో పెళ్లికి సిద్ధ పడి..
► నాలుగు రోజుల క్రితం వేరే యువతితో నిశ్చితార్థం ► పత్రికలు పంచుతుండగా యువకుడ్ని నిలదీసిన బాధితురాలు ► న్యాయం చేయాలంటూ పోలీసులను ఆశ్రయించిన వైనం సోమందేపల్లి : కాలేజీకి వెళుతున్న అమ్మాయిని.. ప్రేమ పేరుతో నమ్మించి బుట్టలో వేసుకున్నాడా ఘనుడు. తన వాంఛను తీర్చుకున్నాడు. ఆనక మరో యువతితో వివాహానికి సిద్ధమయ్యాడు. విషయం తెలిసిన బాధితురాలు నిలదీసింది. బాధితురాలు, పోలీసుల తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. అనంతపురం జిల్లా సోమందేపల్లి మండలం పాపిరెడ్డిపల్లికి చెందిన ఓ దళిత బాలిక ప్రతిరోజు పెనుకొండలోని జూనియర్ కాలేజీకి, ఇదే మండలం వెలుగమాకులపల్లికి చెందిన నర్సింహమూర్తి(20) ఆటోలో వెళ్లేది. అదే అదనుగా అతను నిన్ను ప్రేమిస్తున్నానంటూ ఆ విద్యార్థినిని నమ్మించాడు. ఏడాది నుంచి వీరి మధ్య ప్రేమ వ్యవహారం నడిచింది. అనంతరం మనం పెళ్లి చేసుకుందామంటూ ఆమెను లోబర్చుకుని తన వాంఛ తీర్చుకున్నాడు. ఈ నేపథ్యంలో గత నాలుగు రోజుల క్రితం అతను మరో యువతితో నిశ్చితార్థమైంది. పెళ్లి పత్రికలు పంచుతుండగా గమనించిన బాధితురాలు తనను పెళ్లి చేసుకుంటానని మోసం చేశావంటూ నిలదీసింది. దీంతో మనం పారిపోయి పెళ్లి చేసుకుందామంటూ బాధితురాలిని నమ్మించాడు. శుక్రవారం ఆమెను ఆటోలో తీసుకెళుతుండగా గోరంట్ల సమీపంలో అతని స్నేహితులు ఆటోను నిలిపారు. ఈ సందర్భంగా వారు తన పట్ల అసభ్యంగా ప్రవర్తించి చేయి లాగారని, దీంతో స్థానికులు వచ్చి కాపాడినట్లు బాధితురాలు ఆరోపిస్తూ విలేకరుల ఎదుట రోదించింది. తనను చంపేందుకే తీసుకెళ్లినట్లు ఆమె కన్నీరుమున్నీరైంది. ఈ ఘటనపై శనివారం తల్లిదండ్రులతో కలిసి పోలీసు స్టేషన్‌కు వచ్చింది. తనకు న్యాయం చేయాలని పోలీసుల్ని కోరింది. కొందరు కుల పెద్దలు స్టేషన్లోనే దుప్పటి పంచాయితీ చేసినట్లు సమాచారం. తమ కుమార్తెకు ఆ యువకుడితో పెళ్లి చే యించాలని తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. -
ఇచ్చినట్లే ఇచ్చి.. లాక్కుంటున్నారు..
వందశాతం వసూళ్ల కోసం అడ్డదారులు వెదిరలో పింఛన్ డబ్బులనుంచి ఇంటిపన్ను వసూలు అధికారుల తీరుపై గ్రామస్తుల ఆగ్రహం ఈవోపీఆర్డీపై ఫిర్యాదు రామడుగు : పేరుకే పింఛన్ల పంపిణీ.. ఒక చేతితో ఇచ్చి.. మరో చేతితో లాక్కున్నట్లుంది అధికారుల నిర్వాకం. గ్రామపంచాయతీల్లో వందశాతం పన్నుల వసూలు కోసం వృద్ధులు, వికలాంగుల పింఛన్లకు ఎసరు పెడుతున్నారు. ఉన్నతాధికారుల మౌఖిక ఆదేశాలతో ముక్కుపిండి వసూలు చేసే కార్యక్రమానికి సిబ్బంది రంగంలోకి దిగారు. దీంతో అధికారుల తీరుపై విమర్శలు వ్యక్తమవుతున్నారు గ్రామపంచాయతీల్లో వందశాతం పన్నులు వసూలు చేయాలని జిల్లా స్థారుు అధికారులు ఆదేశాలు జారీ చేశారని గ్రామాల్లో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం పేదలకు ప్రతినెల పింఛన్ ఇస్తుంటే అధికారులు మాత్రం వాటిని పంచాయతీ బిల్లుల కింద జమచేసుకోవడంపై మండలంలోని వెదిర గ్రామస్తులు బుధవారం ఆగ్రహం వ్యక్తంచేశారు. వృద్ధులకు ఇవ్వాల్సిన మొత్తాన్ని తీసుకోవడంపై నిరసన వ్యక్తమైంది. 60మంది వద్ద వసూలు.. వెదిర గ్రామ పంచాయతీలో వృద్ధులకు, వితంతువులు, గీత, చేనేత కార్మికులకు 111 మందికి పింఛన్లు బుధవారం పంపిణీచేశారు. ఇందులో 60 మంది నుంచి సుమారు రూ.50వేలను ఇంటి పన్ను కింద వసూలు చేశారు. బకారుు మొత్తం చెల్లించకుంటే వచ్చేనెల నుంచి పింఛన్ ఇవ్వబోమని ఈవోపీఆర్డీ శశికళ హెచ్చరించడంతో పింఛనుదారులు భయపడి పన్నుచెల్లించారు. విషయం తెలుసుకున్న యువకులు వెళ్లి అధికారులను నిలదీశారు. జిల్లా అధికారుల మౌఖిక ఆదేశాల మేరకే వసూలు చేస్తున్నామని ఈవోపీఆర్డీ చెప్పారు. గ్రామస్తులు, యువకులు నిలదీయడంతో మిగతా మొత్తాన్ని పంపిణీచేయకుండా ఆమె వెనుదిరిగారు. పింఛన్ డబ్బుల నుంచి ఇంటిపన్నులు వసూలు చేసిన ఈవోపీఆర్డీపై గ్రామస్తులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. కాగా.. పింఛన్ డబ్బుల నుంచి ఇంటి పన్నులు వసూలు చేయకూడదని ఎంపీడీవో రాధారాణి తెలిపారు. అధికారులు ఇంటింటా తిరిగి పన్నులు వసూలు చేయాలని మాత్రమే ఆదేశించామని చెప్పారు. పన్ను చెల్లిస్తేనే రేషన్‌సరుకులు..! శంకరపట్నం: వందశాతం ఇంటి పన్ను వసూళ్లకు రేషన్‌సరుకులను ముడిపెడు బోతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఆసరా పింఛన్దారులనుంచి ఇంటి పన్ను, నల్లా పన్నుల పేరిట పంచాయతీ కార్యదర్శులు వసూలు చేస్తున్నారు. మార్చి నెలాఖరులోపు వందశాతం పన్నులు వసూలు చేయాలని అధికారులు స్పెషల్‌డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ప్రతినెల గ్రామాల్లో పంపిణీ చేస్తున్న రేషన్ సరుకుల కోసం వచ్చే కార్డుదారుల నుంచి ఇంటి పన్ను బకాయిలు చెల్లిస్తేనే సరుకులు అందించాలని డీలర్లకు ఆదేశాలు ఇవ్వనున్నట్లు సమచారం. గతంలో మరుగుదొడ్ల నిర్మాణం చేపేట్టేందుకు స్థానికంగా రేషన్ సరుకులను ముడిపెట్టడంతో నిర్మాణాలు జరిగాయి. ప్రస్తుతం పన్నుల వసూళ్లకు అదే విధానాన్ని అవలంబించనున్నారు. అన్ని బకారుులు రావాలంటే రేషన్‌సరుకులను ముడిపెట్టాలని కొందరు ఎంపీడీవోలు కలెక్టర్‌ను కోరినట్లు సమాచారం. ఇంటి పన్నుల కోసం రేషన్‌సరుకుల నిలిపివేయాలన్న ఆదేశాలురాలేదని తహశీల్దార్ సంపత్ చెప్పారు. ఇదెక్కడి న్యాయం..? వెయ్యి రూపాయలు పింఛన్ ఇచ్చి ఇంటిపన్ను కింద రూ.800లు తీసుకుండ్రు..మందులకు డబ్బులు లేకుండా చేసిండ్రు. గవర్నమెంట్ డబ్బులు మాకు ఇబ్బంది ఉందని ఇస్తుంటే.. ఇలా ఇంటిపన్ను పేర తీసుకోవడం న్యాయమా..? - బుచ్చమ్మ, పింఛన్‌దారు, వెదిర మొత్తం తీసుకున్నరు.. నాకు వె య్యి రూపాయలు పింఛన్ వస్తే ఇంటి పన్ను కిందనే మొత్తం తీసుకున్నరు. నాకు నెల ఖర్చుల కిందకు అవుతాయనుకుంటే ఇలా ఇంటిపన్ను కింద తీసుకుంటే కష్టంగా ఉంటుంది.. - దుద్యాల కిష్టయ్య, వెదిర -
పల్లె జనంపై పన్ను పోటు
పట్టణ తరహాలో పంచాయతీల్లోనూ పన్నులు చట్టాన్ని సవరించిన ప్రభుత్వం తాజా నిర్ణయంతో పల్లె ప్రజలపై అదనపు బారం కర్నూలు సిటీ: ఇంటి నిర్మాణాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ తదితర వాటికి సంబంధించి ఇకపై పల్లె జనం కూడా పన్ను చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ భూ అభివృద్ధి చట్టం- 2002కు ప్రభుత్వం సవరణలు చేసింది. గ్రామ పంచాయతీల్లో కూడా సొంతిళ్లు నిర్మించుకోవాలనుకునే వారు నిర్దేశించిన మేరకు పన్ను చెల్లించేలా ఈ నెల 8వ తేదీన పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్ రెడ్డి జీఓ ఎంఎస్ 12ను జారీ చేశారు. ఫలితంగా ఇంతకాలం నిధులు లేక నీరసించిన పంచాయతీ ఖజానాకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల నిధులు సమకూరుతాయని సంబరపడాలో పల్లెజనంపై పన్నులవాత మొదలవుతుందని బాధపడాలో తెలియని పరిస్థితి సర్పంచ్‌ల్లో నెలకొంది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక పంచాయతీలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోగా ప్రజలపై పన్నుల భారం పడేలా నిర్ణయం తీసుకోవడం గమనార్హం. చట్టానికి సవరణ ఇలా.. తాత్కాలిక నిర్మాణాలకు గతంలో ఎలాంటి ఫీజు లేకపోగా ఇకపై రూ. 100 ఫీజు చెల్లించాల్సి ఉంది. శాశ్వత భవన నిర్మాణాలకు సంబంధించి స్క్వేర్ మీటర్‌కు గతంలో రూ. 2 చెల్లింస్తుండగా రూ. 20 కి పెంచారు. నివాసేతర భవన నిర్మాణానికి స్క్వేర్ మీటర్‌కు రూ.40 లేదా రూ. 2 వేలు చెల్లించాలి. గతంలో స్క్వేర్ మీటర్‌కు రూ. 8 లేదా మొత్తంగా రూ. 400 మాత్రమే ఉండేది. లేఆవుట్ ఫీజు స్క్వయర్ మీటర్‌కు రూ.4 లేదా రూ.5 వేలు ప్రకారం, గతంలో రూ.2 లేదా రూ.3 వేలు చెల్లించే వారు. లేఆవుట్ భూమి అప్రూవల్ కోసం స్క్వేర్ మీటర్‌కు రూ. 5 నుంచి రూ.10కి పెంచారు. అనధికార లేఅవుట్లలోని ప్లాట్ల విలువలో 14 శాతం కాంట్రిబ్యూట్ చేయాలి. గ్రై డ్ పంచాయతీల్లో మాస్టర్ ప్లాన్ అనుమతి కోసం రూ.4 వేల నుంచి రూ.5 వేలు, మైనర్ పంచాయతీల్లో రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు వసూలు చేయాలి. నిబంధనలు అతిక్రమిస్తే వెయ్యి నుంచి రూ.2 వేల వరకు, నిబంధనలు పాటించకుండా భవనాన్ని నిర్మిస్తే రూ. 20 వేల వరకు జరిమానా విధించవచ్చు. -
20 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణ
ఆ తర్వాత యథేచ్ఛగా విక్రయంఆపైన చెరువుల తవ్వకానికి శ్రీకారం కన్నెత్తి చూడని రెవెన్యూ అధికారులు 20 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణ మచిలీపట్నం : బందరు మండలంలో అధికార పార్టీ నాయకుల కబ్జా పరంపర కొనసాగుతూనే ఉంది. కరగ్రహారం పంచాయతీ పరిధిలో క్యాంప్‌బెల్‌పేట సమీపంలో 20 ఎకరాలకు పైగా ప్రభుత్వ భూమి ఉంది. ఏడెనిమిది సంవత్సరాల కిందట ఈ భూమిలో ఉప్పు పండించేవారు. కాలక్రమంలో ఉప్పు పండించడాన్ని నిలిపివేయడంతో ఖాళీగా ఉంటోంది. దీనిపై కన్నేసిన తెలుగుదేశం పార్టీకి చెందిన స్థానిక ప్రజాప్రతినిధి ఒకరు ఈ భూమి తనదేనని ప్రచారం చేసుకుంటూ వచ్చాడు. 15 రోజుల క్రితం ఈ భూమిని ఎకరం రూ.40 వేల నుంచి రూ.50 వేల వరకు కరగ్రహారం గ్రామానికి చెందిన మరో వ్యక్తికి, ఆ తర్వాత మరో ఇద్దరికి విక్రయించేశాడు. ఈ భూమిని చెరువుగా తవ్వుకునేందుకు తాను అండదండగా ఉంటానని వారికి భరోసా ఇచ్చాడు. అనుకున్నదే తడవుగా మంగళవారం ఈ భూమిని రొయ్యల చెరువుగా మార్చేందుకు మార్కింగ్ ఇచ్చారు. ప్రభుత్వ భూమిని యథేచ్ఛగా ఆక్రమించి చెరువులుగా తవ్వేందుకు ప్రయత్నిస్తున్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడంపై స్థానిక అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల ప్రభుత్వం జారీ చేసిన భూసేకరణ నోటిఫికేషన్లో సర్వే నంబరు 248లో ఈ భూమిని కూడా చేర్చారని స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవటమే కాక విక్రయించి చెరువులుగా తవ్వేందుకు స్థానిక ప్రజాప్రతినిధి ప్రయత్నాలు ప్రారంభించారని, దీన్ని అడ్డుకుంటామని క్యాంప్‌బెల్‌పేట మత్స్యకారులు అంటున్నారు. అవసరమైతే ఈ విషయంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఇటీవల భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసిన సమయంలో ప్రజాప్రతినిధి ఆక్రమించుకున్న భూమి ప్రభుత్వానికి చెందినదని పంచాయతీ కార్యాలయం వద్ద నోటీసు బోర్డులోనూ ఉంచారని గ్రామస్తులు పేర్కొన్నారు. -
భవిష్యత్ బాధలు
జిల్లాలోని పంచాయతీ కార్మికులకు కష్టం వచ్చింది. రెండు సంవత్సరాలు అధికారులు పంచాయతీ పీఎఫ్(భవిష్య నిధి) లావాదేవీలు నిలిపివేశారు. దీంతో ఉద్యోగ భద్రతపై 1,202 మంది ఆందోళన చెందుతున్నారు. 2012 నుంచి పంచాయతీ అధికారులు కార్మికులతో 12 శాతం పీఎఫ్ వాటా కట్టించుకున్నారు. 1,202 మంది కార్మికులు రెండు సంవత్సరాలపాటు వాటా చెల్లించారు. 2014 నుంచి వారికి కష్టాలు మొదలయ్యాయి. జీవో 505 ప్రకారం కాంట్రాక్ట్ కార్మికులను పంచాయతీల పరిధిలో కాకుండా ప్రైవేటు కాంట్రాక్టర్లకు అప్పగించాలని జిల్లా అధికారులు ఆదేశించారు. దీంతో కార్మికులు కోర్టును ఆశ్రయించారు. తిరిగి పంచాయతీ పరిధిలోనే కొనసాగేలా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. ఆ తరువాత పంచాయతీ అధికారులు కార్మికుల పీఎఫ్ లావాదేవీలను నిలిపివేశారు. కార్మికులు పీఎఫ్ వాటాను ఇచ్చే ప్రయత్నం చేసినా అధికారులు తీసుకోవడం లేదు. రెండు సంవత్సరాలు పీఎఫ్ కట్టించుకుని ఇప్పుడు ఎందుకు నిలిపివేస్తున్నారంటూ కార్మికులు అడిగినా అధికారులు సమాధానం చెప్పడం లేదు. ఈ సమస్యపై జిల్లా కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ప్రయోజనం లేదు. దీంతో వారు ఆందోళన బాటపట్టేందుకు సిద్ధమవుతున్నారు. జిల్లాలో 1,363 పంచాయతీలు ఉన్నాయి. 98 పంచాయతీల పరిధిలో 834 పారిశుధ్య కార్మికులు, 300 మంది పంపు ఆపరేటర్లు, 36 గురు ఎలక్ట్రీషియన్లు, 30 మంది డ్రైవర్లు మొత్తం 1202 మంది ఉన్నారు. వీరంతా 1984 నుంచి కాంట్రాక్ట్ పద్ధతిలో పనిచేస్తున్నారు. 2012లో వచ్చిన జీవో నంబర్ 11 ప్రకారం వీరికి వేతనాలు చెల్లించాల్సి ఉంది. ఈ మేరకు స్కిల్డ్ లేబ ర్కు రూ.10,079, అన్‌స్కిల్డ్‌కు రూ.8,079, సెమీస్కిల్డ్ వారికి రూ.5,579 ప్రకారం జీతాలు ఇవ్వాల్సి ఉంది. జిల్లాలోని 14 మేజర్ గ్రామపంచాయతీల పరిధిలో మాత్ర మే జీవో నంబర్ 11 అమలుచేస్తామని, 19 పంచాయతీల్లో రూ.5,050 ఇస్తామని మరికొన్ని పంచాయతీల్లో రూ4,600 ప్రకా రం జీతాలు చెల్లిస్తామని 2013లో జిల్లా పంచాయతీ అధికారులు కార్మికులతో ఒప్పందం కుదుర్చుకున్నారు. కరువు భత్యం ఇస్తామని చెప్పారు. ప్రధానంగా పీఎఫ్, ఈఎస్ఐ అమలుచేస్తామని హామీ ఇచ్చారు. కానీ అవేవీ అమలుకు నోచుకోలేదు. పలుమార్లు కార్మికుల వినతి మేరకు పీఎఫ్ వాటా తీసుకునేలా అన్ని పంచాయతీలకు తిరిగి ఉత్తర్వులు ఇస్తామని ఇటీవల డీపీవో వారికి హామీ ఇచ్చారు. అయితే ఇంతవరకూ ఆ హామీ అమలు కాలేదని గ్రామ పంచాయతీ కార్మిక యూనియన్ జిల్లా ప్రధానకార్యదర్శి వెంకట్రామయ్య ఆవేదన వ్యక్తంచేశారు. తక్షణం పీఎఫ్‌తో పాటు ఈఎస్ఐ సదుపాయం కల్పించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. దీంతో పాటు కార్మికులకు ఉద్యోగ భద్రత లేకుండా పోయిందన్నారు. ఇప్పటికే పీలేరు, రేణిగుంట, బీ.కొత్తకోట పంచాయతీలు త్వరలోనే మున్సిపాలిటీలుగా మారే అవకాశం ఉన్నందున 175 మంది పంచాయతీ కార్మికులు వీధిన పడుతారేమోనని ఆందోళన చెందుతున్నారు. పంచాయతీ కార్మికులకు ప్రభుత్వం ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. అధికారులు స్పందించకపోతే ఆందోళనకు దిగుతామన్నారు -
భార్య ఎడబాటుతో.. భర్త ఆత్మహత్య
పగిడ్యాల(కర్నూలు జిల్లా): భార్య ఎడబాటును జీర్ణించుకోలేని భర్త ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన బుధవారం పగిడ్యాల మండలం నెహ్రూనగర్ గ్రామంలో చోటుచేసుకుంది. వివరాలు.. నెహ్రూనగర్ గామానికి చెందిన రమేష్(32)కు మిడుతూరు గ్రామానికి చెందిన అరుణ అనే యువతితో నాలుగేళ్ల క్రితం పెళ్లి జరిగింది. భార్యభర్తలు రెండేళ్లపాటు అన్యోన్యంగా సంసారం సాగించాక విభేదాలు తలెత్తాయి. పెద్దలతో పంచాయతీ నిర్వహించి రమేష్ భార్యను కాపురానికి పిలిపించుకున్నాడు. అయితే మళ్లీ ఏడాది పాటు కాపురం చేసిన తర్వాత మనస్పర్ధలు తలెత్తడంతో భార్య అరుణ పుట్టింటికి వెళ్లిపోయింది. అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని భర్త, అత్తమామలపై కేసు పెట్టింది. ఈ క్రమంలోనే ఒంటరిగా జీవించలేక మనోవేదనకు గురై బుధవారం ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. రమేష్ తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
తేలని పంచాయితీ
విభజన అంశాలపై ఎవరి వాదన వారిదే సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల విభజన అంశంపై హస్తిన చేరినా పంచాయతీ తెగలేదు. ఇక్కడి కేంద్ర హోం శాఖ కార్యాలయంలో హోం శాఖ కార్యదర్శి ఎల్సీ గోయల్ నేతృత్వంలోని వివాదాల పరిష్కారాల కమిటీ శనివారం సమావేశమైంది. ఈ సమావేశంలో ఇరు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల పంపిణీ విషయంలో చర్చలు జరిగాయి. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ చట్టంలోని షెడ్యూలు-9, షెడ్యూలు-10లో పొందుపరచిన సంస్థలు, సెక్షన్-8 ద్వారా ఉమ్మడి రాజధానిలో గవర్నర్‌కు శాంతిభద్రతలపై సంక్ర మించిన అధికారాలపై చర్చ జరిగింది. అయితే ఆయా అంశాల్లో పరస్పర అంగీకారం కుదిరిన అంశాలు స్వల్పమే. ఇక విభజనకు ముందున్న పన్ను బకాయిలపై కూడా హోం శాఖ స్పష్టత ఇవ్వనట్టు సమాచారం. తొలుత షెడ్యూలు-9లోని 85 సంస్థల పంపిణీపై చర్చ జరగగా కేవలం ఆరు సంస్థలు మినహా అన్నింటిపై అంగీకారం కుదిరింది. ఆర్టీసీ, మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్, ట్రేడ్ ప్రమోషన్స్ సంస్థ, ఆంధ్రప్రదేశ్ ఫుడ్స్ తదితర ఆరు సంస్థల్లో పరస్పర అంగీకారం కుదరలేదు. మిగిలిన అన్ని సంస్థల పంపిణీలో అంగీకారం కుదిరినందున వాటి పంపిణీకి షీలాభిడే కమిటీ తుది సిఫారసులు ఖరారు చేస్తుందని, ఆ సిఫారసులకు అనుగుణంగా నడచుకోవాలని నిర్ణయించారు. షెడ్యూలు-10పై న్యాయశాఖ సలహా... ఇక షెడ్యూలు 10లో 107 సంస్థలు ఉన్నాయి. ఇందులో ఉన్న ఏపీ ఉన్నత విద్యామండలి విషయంలో ఇటీవల హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. భౌగోళిక/ప్రాదేశిక ప్రాంతాన్ని బట్టి ఆయా రాష్ట్రాలకే చెందుతాయన్న ఈ తీర్పు ప్రకారం అన్ని సంస్థల విషయంలో నడుచుకోవాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ కోరగా... ఈ తీర్పుపై సుప్రీం కోర్టులో అప్పీలు చేశామని, తీర్పు వచ్చేంతవరకు వేచి చూడాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు కోరారు. ఈ విషయంలో న్యాయశాఖ సలహా తీసుకుని స్పష్టత ఇస్తామని హోం శాఖ కార్యదర్శి స్పష్టం చేశారు. అయితే షెడ్యూలు-10లోని సంస్థల ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సేవలు కోరుకుంటే అందించేందుకు సిద్ధంగా ఉన్నామని, అయితే అవసరమైన పాలనావ్యయం భరించాలని తెలంగాణ సూచించింది. గవర్నర్ అధికారాలపై స్పష్టత కరువే పునర్ వ్యవస్థీకరణ చట్టం సెక్షన్-8లో పేర్కొన్న రీతిలో ఉమ్మడి రాజధానిలో గవర్నర్‌కు శాంతిభద్రతలపై ఉండాల్సిన ప్రత్యేక అధికారాలపై మార్గదర్శకాలు రూపొందించాలని ఏపీ సీఎస్ కృష్ణారావు కోరగా... తెలంగాణ సీఎస్ రాజీవ్ శర్మ వ్యతిరేకించారు. దీనిపై చట్టంలోనే స్పష్టంగా ఉందని, ప్రత్యేక మార్గ దర్శకాలు అవసరం లేదని స్పష్టంచేశారు. దీనికి హోం శాఖ కార్యదర్శి స్పందిస్తూ... ఈ విషయమై గవర్నర్‌తో మాట్లాడతామన్నారు. పన్ను బకాయిలు ఇచ్చేలా చూడండి: కృష్ణారావు ఉమ్మడి రాష్ట్రంలోని పన్ను బకాయిలను తెలంగాణలోనే ఉన్న ప్రధాన కార్యాలయాలు వసూలు చేసుకోవచ్చని చట్టంలో చెప్పడంవల్ల తాము నష్టపోతున్నామని చెప్పినట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐ.వై.ఆర్.కృష్ణారావు తెలిపారు. సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడుతూ... బకాయిల్లో తమ వాటా తమకు వచ్చేలా చూడాలని కోరినట్లు చెప్పారు. చట్టప్రకారమే జరగాలని చెప్పాం: రాజీవ్‌శర్మ పన్ను బకాయిల వసూళ్లు, గవర్నర్ అధికారాల విషయంలో చట్ట ప్రకారం నడచుకునేలా చూడాలని హోం శాఖను కోరామని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ మీడియాకు వివరించారు. షీలా భిడే కమిటీ నివేదిక వచ్చేవరకు షెడ్యూలు-9 విషయంలో ముందు కు వెళ్లరాదని కోరినట్టు తెలిపారు. షెడ్యూలు-10 కింద ఉన్న సంస్థలు ఏ రాష్ట్రంలో ఉంటే బకాయిలు కూడా ఆ రాష్ట్రానికే చెందుతాయని చెప్పారు. -
చిత్ర వి‘చిత్రాలు’
* ఆసరా జాబితా తప్పుల తడక * పురుషులు, చిన్నారులు వితంతువులట! * వృద్ధాప్య కోటాలో ఒకరే రెండుసార్లు అర్హులు * రూ.కోట్లకు పడగలెత్తిన మాజీ కౌన్సిలర్లకూ లబ్ధి * జిల్లాలో పలుచోట్ల ఇదే తంతు.. సాక్షి, ఖమ్మం: ‘పట్టుమని ఐదేళ్లు నిండని పసిపాపలకు వితంతువుల కోటాలో పింఛన్.. పురుషులూ వితంతువులేనట!. ఒక పంచాయతీ అర్హుల జాబితా మరో పంచాయతీ పరిధిలో దర్శనం. రూ. కోట్లకు పడగలెత్తిన మాజీ కౌన్సిలర్లూ పింఛన్‌కు అర్హులేనట..!. వికలాంగ బాలుడుకి వితంతువు కోటాలో పెన్షన్.’ ఇలా జిల్లాలో పింఛన్ల (ఆసరా) పథకం జాబితాలో చిత్రవిచిత్రాలెన్నో చోటుచేసుకోవడం గమనార్హం. ఖమ్మం కార్పొరేషన్ జాబితాలోనైతే ఎన్ని తప్పులుండాలో అన్ని ఉన్నాయి. జిల్లాలో పలు చోట్ల ఇదే రీతిన జాబితాలు రూపుదిద్దుకున్నాయి. ఇదేంటని అర్హులు గగ్గోలు పెడుతున్నా వారి గోడు వినేవారేలేరు. జిల్లాలో పింఛన్ల జాబితా అస్తవ్యస్తంగా మారింది. గతంలో అర్హులు ప్రస్తుత పింఛన్ జాబితాలో తమ పేర్లే లేవని ఓవైపు రోడ్డెక్కుతుంటే.. మరోవైపు అనర్హుల పేర్లు, చిన్నారులు, ఆదాయం దండిగా ఉన్న మాజీ కౌన్సిలర్ల పేర్లు జాబితాలో చోటుచేసుకోవడం విస్తుగొల్పుతోంది. ఈ నెల 10 నుంచి జిల్లా వ్యాప్తంగా పింఛన్ల పంపిణీ ప్రక్రియ ప్రారంభమైంది. పలు చోట్ల అర్హుల పేర్లు లేకుండా వారి స్థానంలో పసిపిల్లల పేర్లు, ఫొటోలు ఉండటం ఆశ్చర్యం గొల్పుతోంది. ప్రభుత్వం, అధికారులు పింఛన్ల పంపిణీ నిరంతర ప్రక్రియ అని ఊదరగొడుతున్నా గతంలో అర్హుల పేర్లు ప్రస్తుతం జాబితాలో ఎందుకు లేవో సమాధానం చెప్పేవారు లేరు. సర్వే సమయంలో అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో అర్హుతలున్నా వేలాది మందికి జిల్లాలో పింఛన్ దక్కలేదు. పది రోజులుగా వీరంతా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అధికారులు మాత్రం ఇంకా జాబితాలు ఉన్నాయంటూ.. సమాధానం దాటవేస్తున్నారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జాబితాలో చిన్నారులు, పురుషులను వితంతువులుగా పేర్కొనడంతో అధికారులు తమ తప్పిదాలు ఎక్కడ బయటపడతాయోనని బెంబేలెత్తుతున్నారు. ప్రధానంగా ఖమ్మం కార్పొరేషన్ పరిధిలో పింఛన్ జాబితా చాలా వరకు తప్పుల తడకగా ఉంది. కార్పొరేషన్ అధికారులు, సిబ్బంది అలసత్వంతోనే జాబితా గందరగోళంగా తయారైందనే ఆరోపణలు వస్తున్నాయి. కొత్తగూడెం మున్సిపాలిటీ, సత్తుపల్లి, రఘునాథపాలెం మండలంలో ఇలాంటివి ఎన్నో చోటుచేసుకున్నాయి. ఆధార్ నంబర్లు మారడం, పేరు ఒకరిది ఫొటో మరొకరిది, వితంతువుల పేర్లు మారడం..లాంటి సంఘటనలెన్నో చోటుచేసుకున్నాయి. జాబితా తప్పుల తడకగా ఉన్నా అధికారులు ఇదేమి పట్టించుకోవడం లేదు. ‘ఇదేమని..? తమ పేర్లే లేకుండా అసలు పసిపిల్లల పేర్లు ఎలా ఎక్కిసారు..’? అని లబ్ధిదారులు అడిగితే మాత్రం సదరు అధికారులు వారిపై శివాలెత్తుతున్నారు. కార్పొరేషన్లో వింతలు.. ఖమ్మం కార్పొరేషన్, రఘునాథపాలెం మండలంలోని గ్రామాల్లో ఆసరా జాబితాల్లో అనేక తప్పిదాలు వెలుగు చూస్తున్నాయి. టేకులపల్లికి కేటాయించిన అధికారి చాలా మంది అర్హులను సర్వే చేయలేదని ఆరోపణలున్నాయి. ఖానాపురంహవేలి డివిజన్ పరిధిలో పసిపాపల పేర్లు జాబితాలో వచ్చాయి. డి.కమిలి పేరుతో ఓ చిన్నారి ఫొటోతో వితంతువుగా, ఎన్.కోటయ్య పేరుతో రెండు చోట్ల వయో వృద్ధులుగా, శ్రీనివాసచారిని వితంతువు కోటాలో చూపుతూ పింఛన్లు మంజూరయ్యాయి. అలాగే రూ.కోట్లకు పడగలెత్తిన మాజీ కౌన్సిలర్లకు కూడా పింఛన్లు దక్కాయి. గాంధీచౌక్‌లోని బడా వ్యాపారులకు పింఛన్లు మంజూరు కావడం గమనార్హం. రఘునాథపాలెం మండలంలో పలు గ్రామాల్లో పింఛన్ల జాబితా మారింది. ఒక పంచాయతీ పరిధిలోని అర్హులు మరో పంచాయతీ పరిధిలోకి వెళ్లారు. చింతగుర్తి, మల్లేపల్లి, రేగులచలక, కోయచలక గ్రామాల జాబితాలు ఇలా తారుమారయ్యాయి. కొత్తగూడెం మున్సిపాలిటీ పరిధిలో 12వ వార్డులో హరిణి అనే రెండేళ్ల చిన్నారికి చేనేత వృత్తిదారు (వీవర్స్) కింద పింఛన్ మంజూరు చేశారు. ఇదే వార్డులో రిజ్వాన్ అనే మూడేళ్ల బాలుడికి సైతం ఇదేవిధంగా పింఛన్ మంజూరు చేయడం గమనార్హం. జె.మంజి అనే వ్యక్తి పింఛన్‌కు దరఖాస్తు చేసుకోకపోయినా అతనికి వితంతు పింఛన్ మంజూరు కావడం విశేషం. ఇదెక్కడి విడ్డూరం అంటూ ఆ వార్డు ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. హంజి అనే మహిళ వితంతు పింఛన్ కోసం దరఖాస్తు చేసుకుంటే ఆమెకు బదులుగా ఆమె కొడుకు మాంజికి వితంతు పింఛన్ మంజూరు చేశారు. యువకులు.. వృద్ధులయ్యారు.. ఆసరా జాబితాలో యువకుల ఫొటోలతో వృద్ధాప్య పింఛన్లు మంజూరు చేయడం విచిత్రం. సత్తుపల్లి నగర పంచాయతీ 8వ వార్డులో బండారు సావిత్రి వితంతు పింఛన్‌కు దరఖాస్తు చేసుకుంటే ఆమె 30 ఏళ్ల కుమారుడు వరప్రసాద్‌కు వృద్ధాప్య కోటాలో పింఛన్ వచ్చింది. జిల్లాలోని పలు గ్రామాల్లో ఇలానే వృద్ధుల పేర్లకు బదులు యువకుల ఫొటోలు జాబితాలో చోటుచేసుకున్నాయి. సత్తుపల్లి 7వ వార్డులో కలకొడిమ శాంతమ్మ వృద్ధాప్య పింఛన్‌కు దరఖాస్తు చేసుకుంది. ఆమె భర్త పేరు కృష్ణమూర్తి బదులుగా సత్యనారాయణ అని వచ్చింది. 9వ వార్డులో సుగ్గాల అలివేలుకు బదులుగా దిడ్డిగా అలివేలు.. మస్తాన్‌బీ భర్త పేరు బాలయ్య అయితే.. భర్తపేరుకూడా మస్తాన్ అనే వచ్చింది. పాల్వంచ మున్సిపాలిటీ లో వనమా కాలనీకి చెందిన వికలాంగ బాలుడు తాఫీక్ అహ్మద్‌కు వికలాంగుల కోటా కింద పింఛన్ రావాలి. అయితే అధికారులు తయారు చేసిన జాబితాలో వితంతువుగా చూపడంతో రూ. వెయ్యి పింఛన్ మంజూరైంది. అర్హులను గుర్తించాలనే ఉద్దేశంతో ఇంటింటికీ వెళ్లి సర్వే చేసిన అధికారులు ఇలాంటి తప్పిదాలు చేయడంతో అసలు లబ్ధిదారులకు నష్టం వాటిల్లుతోంది. సర్వేలో తప్పులు దొర్లితే సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామని చెప్పిన ప్రభుత్వం వీటికి ఏమి సమాధానం చెబుతుందో చూడాలి. -
పార్కులో పంచాయితీ!
బంజారాహిల్స్: అది బంజారాహిల్స్‌లోని జలగం వెంగళరావు పార్కు... మంగళవారం ఉదయం 10.30 గంటలు. సుమారు 80 మంది వరకు పిల్లలు, పెద్దలు టిక్కెట్లు తీసుకొని ఎంచక్కా చెట్ల కింద కూర్చున్నారు. వనభోజనాలకో, కాలక్షేపానికో వీరంతా వచ్చారని అక్కడ ఉన్న వారు అనుకున్నారు. కొద్దిసేపటికి తేలిందేమిటంటే వాళ్లు వచ్చింది భార్యాభర్తల మధ్య నెలకొన్న ఓ వివాదంపై చర్చించేందుకు. ఇంతలో ఒక పెద్దాయన లేచి మాట్లాడాడు. ఆ తర్వాత ఇంకో వ్యక్తి.. ఇలా గంటన్నర పాటు సమావేశం ప్రశాంతంగా సాగింది. ఆ తర్వాత సంభాషణలు వేడెక్కాయి. పెద్ద మనుషులంతా కాలర్లు పట్టుకొని మరీ కొట్టుకోవడం ప్రారంభించారు. అరుపులు కేకలతో ఆ ప్రాంతం దద్దరిల్లింది.. పార్కులో సందర్శకులు ఆందోళనకు గురయ్యారు. అక్కడి నుంచి పరుగులు తీశారు. సుమారు అరగంట పాటు యుద్ధ వాతావరణం నెలకొంది. ఆ తర్వాత పోలీసులు రావడం... పంచాయితీని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లడం చకచకా జరిగిపోయాయి... విషయంలోకి వెళ్తే... లంగర్‌హౌజ్‌కు చెందిన వేముల గణేష్‌కు, టెంపుల్ అల్వాల్‌కు చెందిన సుజాతకు పదేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ప్రణయ్ రాజ్ అనే పదేళ్ల కొడుకు ఉన్నాడు. పెళ్లయిన రెండేళ్లకు దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. రూ.20 లక్షల కట్నం తెస్తేనే కాపురం చేస్తానంటూ గణేష్ పేచీ పెట్టడంతో సుజాత కోర్టును ఆశ్రయించింది. ఈ మధ్యలో తన భర్త గణేష్‌కు అత్త విజయలక్ష్మి, మామ యాదగిరి కలిసి రెండో పెళ్లి చేశారంటూ సుజాత అనుమానించింది. తనకు న్యాయం చేయాలంటూ పెద్దలను వేడుకోవడంతో అటు లంగర్‌హౌజ్ నుంచి గణేష్ తరఫున... ఇటు అల్వాల్ నుంచి సుజాత తరఫున పెద్దలు, బంధువులు పెద్ద ఎత్తున పార్కులో పంచాయితీ పెట్టారు. ఈ పంచాయితీలోనే మాటామాటా పెరిగింది. తనకు అన్యాయం చేశాడంటూ గణేష్‌కు సుజాత దేహశుద్ధి చేసింది. ఈ కేసును బంజారాహిల్స్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
అట్టర్ ఫ్లాప్
మచిలీపట్నం : ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించిన 100 రోజుల ప్రణాళిక నిధుల లేమితో కొట్టుమిట్టాడింది. పంచాయతీల్లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. కార్యక్రమానికి సంబంధించిన విధి విధానాలు ప్రకటించిన ప్రభుత్వం పనులు చేయడానికి అవసరమైన నిధులు మాత్రం విడుదల చేయలేదు. దీంతో కాగితాలపై తప్ప క్షేత్రస్థాయిలో ఒక్క పని కూడా జరగకపోవటం గమనార్హం. మొక్కలు నాటమన్నారు.. ఒక్కటీ ఇవ్వలేదు! మొక్కలు నాటాలని ప్రభుత్వం సూచించినా ఒక్క పంచాయతీకి కూడా మొక్కలు ఇవ్వలేదని ఆయా పంచాయతీ సర్పంచులు, కార్యదర్శులు చెబుతున్నారు. మొక్కలు కావాలని ఇండెంట్ పెట్టినా ఇంతవరకు రాలేదని వారు తెలిపారు. మేజర్ పంచాయతీల్లో పారిశుద్ధ్య పనులు చేసేందుకు కార్మికులతో పాటు ట్రాక్టర్లు కూడా ఉన్నాయి. మైనర్ పంచాయతీల్లో ఈ వెసులుబాటు లేకపోవటంతో పారిశుద్ధ్యానికి సంబంధించిన పనులు జరగలేదు. మైనర్ పంచాయతీల్లో డ్రెయిన్లలో పూడికతీత నామమాత్రంగానే జరిగింది. నిధులు లేకుండా పనులు ఎలా... పంచాయతీల్లో వంద రోజుల ప్రణాళిక అమలుకు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా నిధులుృవిడుదల చేయకపోవటంతో ఒక్క పనీ జరగలేదు. చేతిపంపులు, కుళాయిలు, పైప్లైన్లు నూరుశాతం మరమ్మతులు చేయాలని చెప్పినా నిధుల లేమి కారణంగా ఈ పనులు చేయలేదు. కంప్యూటర్లకు సంబంధించి పరికరాలు కొనుగోలు చేయాలని సూచించినా ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాకపోవటంతో ఆ ప్రయత్నమే జరగలేదు. పంచాయతీల్లోని రోడ్లకు మరమ్మతులు చేయాల్సి వస్తే ఆయా నివేదికలను పంపాలని ప్రభుత్వం కోరింది. పంచాయతీల నుంచి నివేదికలు వెళ్లినా నిధులు విడుదల కాకపోవటంతో మరమ్మతులు జరగలేదు. అన్ని పంచాయతీల్లో వీధి లైట్లను నూరుశాతం వెలిగించాలనే నిబంధన విధించినప్పటికీ నిధుల కొరత కారణంగా అరకొరగా ఈ పనులు చేసి చేతులు దులుపుకున్నారు. డంపింగ్ యార్డులు లేని మైనర్ పంచాయతీల్లో 10 సెంట్ల భూమి, మేజర్ పంచాయతీల్లో అర ఎకరం భూమి రెవెన్యూ అధికారుల ద్వారా కేటాయిస్తామని ప్రకటించారు. దీంతో పంచాయతీల నుంచి డంపింగ్ యార్డుల కోసం వినతులు ప్రభుత్వానికి వెళ్లాయి. రెవెన్యూ అధికారులు ఈ అంశంపై దృష్టిసారించకపోవటంతో డంపింగ్ యార్డులకు భూమి కేటాయింపు అంశం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. దోమల నివారణకు బెటైక్స్, ఎబేట్, టెక్నికల్ మలాథియాన్ వంటివి పిచికారీ చేయాల్సి ఉంది. పంచాయతీల్లో ఉన్న కొద్దిపాటి నిల్వలను పిచికారీ చేసినట్లు చూపి ఈ కార్యక్రమాన్ని నామమాత్రంగానే చేశారు. మరుగుదొడ్లకు ఇసుక కొరత... ఇసుక కొరత కారణంగా ఏ పంచాయతీలోనూ మరుగుదొడ్ల నిర్మాణం ప్రారంభం కాలేదు. ప్రభుత్వం ఒక్కొక్క మరుగుదొడ్డికి రూ.9,900 మంజూరు చేస్తామని ప్రకటించింది. ఆచరణలో మరుగుదొడ్డి నిర్మాణానికి రూ.15 వేల నుంచి రూ.16 వేల వరకు ఖర్చవుతోంది. అదనపు ఖర్చు చేసి మరుగుదొడ్డి నిర్మించుకునేందుకు ఎవరూ ముందుకు రాకపోవటంతో ఈ ప్రక్రియ నిలిచిపోయింది. వంద రోజుల ప్రణాళికను సక్రమంగా అమలు చేయాలని సర్పంచులు, అధికారులు చొరవ చూపినా నిధుల కొరతతో పనులు చేయలేని పరిస్థితి నెలకొంది. 15 రోజులకే ముగిసిన ఆన్లైన్ నివేదికల ప్రక్రియ వంద రోజుల ప్రణాళికలో భాగంగా ఆయా అంశాలపై దృష్టి సారించాలని సూచించిన ప్రభుత్వం ఆయా పంచాయతీల్లో ప్రతిరోజూ చేపట్టిన కార్యక్రమాల వివరాలను ఆన్లైన్లో నివేదిక పంపాలని నిబంధన విధించింది. మూడు, నాలుగు పంచాయతీలకు కంప్యూటర్ ఆపరేటర్‌ను కేటాయించటంతో 12 నుంచి 15 రోజుల పాటు ఈవోపీఆర్డీల పర్యవేక్షణలో నివేదికలు పంపి అనంతరం ఈ ప్రక్రియను నిలిపివేశారు. జన్మభూమి కార్యక్రమం ప్రారంభమైన అనంతరం ఈ నివేదికలను పంపే అంశంపై పట్టించుకునేవారే కరువయ్యారు. వంద రోజుల ప్రణాళిక ముఖ్యాంశాలివీ... - పారిశుద్ధ్యం - డ్రెయిన్లలో పూడికతీత - మొక్కలు నాటడం - వీధి లైట్లు వంద శాతం వెలిగించటం - చేతిపంపులు, పబ్లిక్ కుళాయి మరమ్మతులు - తాగునీటి పైప్లైన్లు దెబ్బతిన్న ప్రాంతాల్లో నూతన పైపులు వేయటం - పంచాయతీ కార్యాలయాల్లోని కంప్యూటర్లకు అవసరమైన సామగ్రి కొనుగోలు - రోడ్ల మరమ్మతులు - డంపింగ్ యార్డుల కోసం స్థలసేకరణ - దోమల నివారణకు మందుల పిచికారీ - మరుగుదొడ్ల నిర్మాణం -
పంచాయితీ చేశారు !
కోడుమూరు, ప్యాలకుర్తి గ్రామంలో పాపానికి వెల కట్టారు. గ్రామంలో మతిస్థిమితంలేని మహిళపై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అఘాయిత్యానికి పాల్పడుతూ నాలుగు నెలల గర్భవతిని చేశాడు. ఈ నెల 3వ తేదీన విషయం తెలుసుకున్న మహిళ కుటుంబ సభ్యులు కనుగొని చితకబాదారు. గ్రామ పెద్దల దగ్గర పంచాయితీ పెట్టడంతో వ్యవహారం బయటకు వచ్చింది. ఐదారు నెలలుగా మతిస్థిమితంలేని మహిళ ఇంట్లోకి ఎవరూలేని సమయంలో చొరబడి అఘాయిత్యానికి పాల్పడుతున్నట్లు ఆ వ్యక్తి ఒప్పుకున్నాడు. కాగా ఈ మహిళకు పదేళ్ల క్రితం వెల్దుర్తి మండలంలోని ఓ గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. ఆమెకు కుమార్తె ఉంది. మతిస్థిమితం సరిగా లేదని భర్త వదిలేయడంతో కుటుంబసభ్యులు చేరదీశారు. నిరుపేద వర్గానికి చెందిన కుటుంబ సభ్యులంతా పనులకు వెళితే మతిస్థిమితంలేని మహిళ ఇంటి దగ్గరే ఉండేది. ఈ విషయాన్ని గమనించిన ఆ వ్యక్తి మహిళపై రోజు అత్యాచారానికి పాల్పడేవాడు. ప్రస్తుతం గర్భం తొలగించడానికి, ఇతరత్రా ఖర్చులకు రూ. 70 వేలు ఇచ్చేవిధంగా గ్రామ పెద్దలు పంచాయితీ చేశారు. ఈ విషయం పోలీసులకు తెలిసినప్పటికీ బాధితులు పోలీసు స్టేషన్‌కు రానప్పుడు తామెందుకు తలదూర్చాలని తెలియనట్లు ఉన్నారు. -
పదోన్నతులపంచాయతీ
పంచాయతీ కార్యదర్శుల మధ్య పోస్టింగ్‌ల వివాదం తారా స్థాయికి చేరింది. వర్గాలుగా విడిపోయి ఒకరిపై మరొకరు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకునే వరకు వెళ్లింది. జిల్లా పంచాయతీ, పంచాయతీ రాజ్ శాఖలో పని చేస్తున్న కొందరు జూనియర్ అసిస్టెంట్లు, ఇప్పటికే గ్రేడ్-3 గ్రామ పంచాయతీ కార్యదర్శులుగా పని చేస్తున్న 22 మందికి ఇటీవల గ్రేడ్-2 కార్యదర్శులుగా పదోన్నతి కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పదోన్నతి పొందిన వారిలో కొంత మంది ప్రస్తుతం ఖాళీగా వున్న గ్రేడ్-1 పంచాయతీల్లో నియమించాలని కోరడంతో పంచాయతీ అధికారులు ఆ మేరకు నియామకాలు చేపట్టేందుకు రంగం సిద్ధం చేశారు. అందుకు గ్రేడ్-1 గ్రామ పంచాయతీ కార్యదర్శులు అభ్యంతరం వ్యక్తం వ్యక్తం చేయడంతో వర్గాలుగా విడిపోయారు. రూ.5 లక్షల పైబడి ఆదాయం ఉన్న 61 గ్రామ పంచాయతీలను గుర్తించి గ్రేడ్-1 క్లస్టర్లుగా, రూ.2 నుంచి 3 లక్షల లోపు ఆదాయం ఉన్న 39 పంచాయతీలను గ్రేడ్-2 క్లస్టర్లుగా, రూ.లక్ష నుంచి 2 లక్షల లోపు ఆదాయం ఉన్న 231 పంచాయతీలను గ్రేడ్-3 క్లస్టర్లుగా, లక్ష రూపాయల లోపు ఆదాయం ఉన్న 661 గ్రామ పంచాయతీలను గ్రేడ్-4 క్లస్టర్లుగా గుర్తించారు. అయితే ప్రస్తుతం గ్రేడ్-2 కార్యదర్శులుగా పదోన్నతి పొందిన వారిలో 17 మందిని గ్రేడ్-1 క్లస్టర్‌గా గుర్తించిన గ్రామాలకు కార్యదర్శులుగా నియమించేందుకు జిల్లా పంచాయతీ అధికారులు అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. అయితే గ్రేడ్-2 కార్యదర్శులను గ్రేడ్-1 కింద ఎంపిక చేసిన గ్రామాల్లో నియమిస్తే భవిష్యత్తులో తమకు అన్యాయం జరిగే అవకాశం ఉందని ఈ విషయంలో పునరాలోచించుకోవాలని జిల్లా పంచాయతీ అధికారులను కలిసి విజ్ఞప్తి చేస్తున్నా.. అక్కడి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో.. అక్రమ నియామకాలకు అడ్డుకట్ట వేసి తమకు న్యాయం చేయాలని కోరుతూ కొంతమంది గ్రేడ్-1 కార్యదర్శులు జిల్లా పరిషత్ సీఈఓ విజయేందిరని కలిసి విన్నవించినట్లు తెలిసింది. -
విద్యార్థులు ఫుల్... గదులు నిల్
విద్యార్థులు ఫుల్... గదులు నిల్ ఎర్రగుంట్ల, :ఎర్రగుంట్ల నగర పంచాయతీ పరిధిలోని దొండపాడు రస్తాలోని రామాంజనేయపురం కాలనీలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులు ఫుల్‌గా ఉన్నా.. గదులు కొరతగ ఉండడంతో గత్యంతరం లేక ఉపాధ్యాయులు పాఠశాల ఆవరణలో తడికలతో గుడిసెలు వేసుకొని పాఠాలు బోధిస్తున్న దుస్థితి ఇక్కడ నెలకొంది. విద్యార్థులు తక్కువగా ఉన్న పాఠశాలలకు మాత్రం ప్రభుత్వం బిల్డింగ్‌లను మంజూరు చేస్తుందని మా పాఠశాలలో విద్యార్థులు సుమారు 101 మంది ఉన్నా బిల్డింగ్ వసతి కల్పించలేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఈ పాఠశాలో మొదటి తరగతి నుంచి ఐదవ తరగతి వరకు విద్యార్థులు ఉండగా ప్రధానోపాధ్యాయునితో కలిపి ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్నారు. ఉన్న గదులు రెండు శిథిలావస్థకు చేరుకున్నాయని వర్షం వస్తే తడిసి ముద్ద అవుతుందని వారు వాపోయారు. విద్యార్థులు సంఖ్య చాలా ఎక్కువగ ఉండడంతో గత్యంతరం లేక ఆవరణలోనే తడికలతో ఒక గుడిసెను వేసుకొని విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నామని వారు వాపోయారు. ఇప్పటికైన ప్రజాప్రతినిధులు కానీ, విద్య శాఖ ఉన్నతాధికారులు స్పందించి పాఠశాలకు కొత్త భవనాలు మంజురు చేయాలని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శంకరయ్య, ఉపాధ్యాయుడు శివరామిరెడ్డిలు కోరుతున్నారు -
నిరుద్యోగులకు తీపి కబురు
చిత్తూరు(జిల్లాపరిషత్), న్యూస్‌లైన్: జిల్లాలోని నిరుద్యోగులకు తీపి కబురు. గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి ప్రభుత్వం సోమవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ర్టంలోని 2200పైగా గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శుల పోస్టులను ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా చిత్తూరు జిల్లాకు 104 పోస్టులు వచ్చాయి. అభ్యర్థులు జనవరి 4 నుంచి 22వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష ఫీజును జనవరి 20వ తేదీలోపు చెల్లించాలి. పరీక్ష ఫిబ్రవరి 23న జరగనుంది. ఇదిలా ఉండగా పోస్టుల భర్తీకి అవసరమైన రిజర్వేషన్ల వివరాలను జిల్లా యంత్రాంగం మేలోనే ఏపీపీఎస్సీకి పంపింది. మరిన్ని వివరాలను www.apspsc.gov.in వెబ్సైట్లో పొందవచ్చు. -
ప్రేమ పెళ్లితో.. పోలీసులకు తంటా!
సాక్షి, తిరుమల: తమిళనాడులోని వాణియంబాడికి చెందిన ఓ ప్రేమ జంట బుధవారం తిరుమలలో పెళ్లి చేసుకుంది. అమ్మాయి మైనర్ అని, ప్రియుడు కిడ్నాప్ చేశాడంటూ ఆమె బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇష్టంలేని పెళ్లి చేస్తుండటంతో పారిపోయి వచ్చానని, తన ఇష్టపూర్వకంగానే ప్రియుడిని పెళ్లి చేసుకున్నానని ఆ యువతి తెలిపింది. దీంతో తిరుమల పోలీసులు ఏం చేయాలో తెలీక తలలు పట్టుకున్నారు. వివరాలిలా.. తమిళనాడులోని వేలూరు జిల్లా వాణియంబాడికి చెందిన ప్రభాకర్ (22), అదే ప్రాంతానికి చెంది బెంగళూరులో స్థిరపడిన లత బుధవారం తిరుమలలో ప్రేమ పెళ్లి చేసుకున్నారు. ఈ సమాచారం తెలుసుకుని వధువు బంధువులు తిరుమలకు చేరుకున్నారు. నవ దంపతులను బస్టాండ్‌లో పట్టుకున్నారు. తాను ప్రియుడితోనే జీవిస్తానని లత తెగేసి చెప్పింది. ఇంతలో జనం గుమికూడారు. పోలీసులు అక్కడకు చేరుకున్నారు. నడిరోడ్డులో పంచాయితీ వద్దంటూ అందరినీ స్టేషన్‌కు తీసుకెళ్లారు. మైనరుగా ఉన్న లత (17 సంవత్సరాలా 10 నెలలు)కు గతనెల 25వ తేదీన మరో యువకుడితో నిశ్చితార్థం చేశామని ఆమె బంధువులు పోలీసులకు తెలిపారు. లతను ప్రభాకర్ కిడ్నాప్ చేశాడని వాణియంబాడి స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. దీనిపై నవ వధువు లత అభ్యంతరం తెలిపింది. తనకు ఇష్టంలేని వ్యక్తితో నిశ్చితార్థం జరిపించా రంది. అందుకని పారిపోయి వచ్చి ప్రియుడిని పెళ్లి చేసుకున్నానని స్పష్టం చేసింది. దీంతో తిరుమల పోలీసులు తలలు పట్టుకున్నారు. ఈ కేసు తమ పరిధిలోకి రాదని.. ఇరువర్గాలు వాణియంబాడి స్టేషన్లో తేల్చుకోవాలని చెప్పారు. అయితే తిరుమల పోలీసులు మాత్రం ముందుజాగ్రత్తగా ఇరువర్గాల స్టేట్మెంట్ను రికార్డు చేసుకున్నారు. -
‘ఓటి’ నేతల చేటు రాజకీయం
విశ్లేషణ: రాజ్యాంగం బడుగు, బలహీన, మైనారిటీ వర్గాల అసంఖ్యాక ప్రజలకు హామీ పడిన నిబంధనలు ఆచరణలో అమలులోకి రానంత కాలం వర్గ సమాజంలోని పంచాయతీ వ్యవస్థ సహితం కలవాడి కులగోత్రాల చట్రంలోనే ప్రజల్ని గానుగెద్దుల్లా తిప్పుతుంటుంది. 65 ఏళ్లుగా వర్గ రాజకీయ పక్షాల ప్రభుత్వాలు, నాయకులూ పాటించిన ప్రజాస్వామ్య వ్యతిరేక, ప్రజావ్యతిరేక పంథా ఇది. ఒక వర్గం వారి ‘ఆడపిల్లలు ప్రత్యర్థి వర్గం జనాభాను పెంచే సంతానోత్పత్తి’ యంత్రాలు కాకూడదట! దీన్ని బట్టి చూస్తే పురుషాధిక్యతా రోగం, బడుగు, బలహీన వర్గాలు మైనారిటీల పట్ల ఏహ్యమైన చిన్నచూపు, దుర్మార్గపు మనస్తత్వం ఎంతగా గూడుకట్టుకుని ఇప్పటికీ ఊళ్లేలుతున్నాయో అర్థమవుతోంది. ఏ రాజకీయ పక్షానికీ మత వ్యవహారాలతో మతాలతో సంబంధం ఉండరాదని మత సంస్థలకు రాజకీయాలతో ప్రమేయం ఉండరాదని రాజ్యాంగ నిర్ణయసభ తీర్మానం. కానీ పాలక పక్షాలు మత రాజకీయం ద్వారా ఎన్నికలలో ప్రజల్ని సమీకరించడానికి అలవాటు పడ్డాయి. ‘‘మత విశ్వాసం అనేది కేవ లం వ్యక్తిగతం. కనుక ఆ వ్యక్తిగత విశ్వాసాన్ని ప్రతి ఒక్కరూ తన వరకే పరిమితం చేసుకోవటంలో మనం జయప్రదం కాగలిగితే, మన రాజకీయ జీవి తాలు కూడా సుఖప్రదంగా సాగుతాయి. ప్రభుత్వ అధికారులూ, ప్రజలు, పౌరులూ కలిసికట్టుగా సెక్యులర్ దేశాన్నీ ప్రభుత్వాన్నీ నిర్మించుకోవడానికి అవసరమైన నిర్మాణాత్మక కార్యాచరణ బాధ్యతను తలకెత్తుకోగలిగితే - భారతదేశం యావత్తు ప్రపంచానికే తిలకప్రాయమవుతుంది’’. - మహాత్మాగాంధీ: 1947, ఆగస్టు 23 దేశ విభజన ఫలితంగా ఉత్పన్నమైన సమస్యల అవశేషాల నుంచి భారత పాలకులు నేటికీ బయటపడలేదు. పైగా ఎప్పుడు ఎన్నికలు దగ్గర పడుతున్నా ఓట్ల కోసం, సీట్ల కోసం ప్రజా బాహుళ్యాన్ని మత రాజకీయాలతో కకావికలు చేస్తున్నారు. 1947 నాటి రాజ్యాంగ నిర్ణయ సభ భారత దేశాన్ని సెక్యులర్ వ్యవస్థగా నిర్వచిస్తూ చేసిన స్పష్టమైన తీర్మానాన్ని దేశ పాలకశక్తులు భ్రష్టుపట్టిస్తూ వస్తున్నాయి. ఈ విషయంలో మతాతీత వ్యవస్థకే కట్టుబడి ఉంటానని ప్రతినబూనిన కాంగ్రెస్‌పార్టీ, బీజేపీ ‘తొడుగు’ లోని సంఘ్ పరివార్ ‘హిందూత్వ’ శక్తులు రెండూ ఆ తీర్మానాన్ని పక్కకు పెట్టాయి. బీజేపీ ఆగడాలను గమనించిన మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ శేషన్ ఆ పదవిలో ఉన్నప్పుడు ఒక సందర్భంలో... బీజేపీ సెక్యులర్ రాజ్యాంగంపై ప్రమాణం చేసి అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నందున, ఆ పార్టీ ఎన్నికల చిహ్నాన్ని ఎందుకు రద్దు చేయకూడదని ప్రశ్నించాల్సివచ్చింది. ఏ రాజకీయ పక్షానికీ మత వ్యవహారాలతో మతాలతో సంబంధం ఉండకూడదు. అలాగే మత సంస్థలకు రాజకీయాలతో ప్రమేయం ఉండరాదన్నది రాజ్యాంగ నిర్ణయసభ ఏకగ్రీవ తీర్మానం. కానీ ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాలక పక్షాలు మత రాజకీయం ద్వారా ఎన్నికలలో ప్రజల్ని సమీకరించడానికి అలవాటు పడ్డాయి. గత అరవయ్యేళ్లుగానూ మత ఘర్షణలు లేని సంవత్సరాలు చాలా అరుదు. ఇప్పుడు తాజాగా ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో రెండు మతాల మధ్య ప్రేమ బంధాన్ని బలవంతంగా తెంచడానికి జరిగిన ప్రయత్నమే ముజఫర్‌నగర్ దారుణాలకు కారణం. చదివేవి ధర్మశాస్త్రాలు, కూల్చేవి ప్రార్థనాలయాలవుతున్నాయి. ‘‘దేవతలు నాశనం చేయాలనుకున్న వాళ్ల’’కు ముందు ‘పిచ్చి’ పట్టిస్తారట! ముజఫర్‌నగర్ జిల్లాలో జరిగింది కూడా అదే. ఆ ఘటనలకు సంబంధించి కొందరు కాంగ్రెస్, బీజేపీల నాయకులు ఎన్నికల ప్రయోజనాల దృష్ట్యా రకరకాల కథనాలను వ్యాప్తిలోకి తెచ్చారు! కొన్నాళ్ల క్రితం పాకిస్థాన్‌లో జరిగిన దుర్ఘటన తాలూకు వీడియోను సంపాదించి దానిని ముజఫర్‌నగర్ జిల్లాలోని గ్రామంలో జరిగినట్టుగా ‘ఫుటేజి’ అతికి సర్క్యులేషన్లో పెట్టడం అందులో ఒకటి! ఈ ‘డ్రామా’ జనంలో గుప్పుమని మంటలు లేపింది! నిజానికి పాకిస్థాన్‌లోని ఆ ఘటనకూ ముజఫర్‌నగర్ ఘటనకూ సంబంధం లేదు. వాస్తవం ఏమిటి? అంతకు ముందు ఒక మత వర్గానికి చెందిన ఇద్దరు కుర్రాళ్లు మరొక వర్గానికి చెందిన ప్రేమికుడిని చంపేశారు! సెప్టెంబర్ 7 నాటి ఈ ఘటన ఇరు వర్గాల మధ్య సృష్టించిన అల్లర్లలో కొన్ని డజన్ల మంది పౌరులు హతులయ్యారు. కాగా ఒక వర్గానికి చెందిన ఇద్దరు కుర్రాళ్ల హత్యపైన మాత్రమే ‘భారతీయ కిసాన్ యూనియన్’ పేరిట జరిపిన ‘ఖాప్ మహా పంచాయతీ’ సభ అంతకుముందు మరొక మైనారిటీ వర్గానికి చెందిన ప్రేమికుడైన కుర్రవాడిపై జరిగిన హత్యాకాండను మాట మాత్రంగా కూడా ప్రస్తావించలేదు! కొందరు బీజేపీ నాయకులు, ఒక కాంగ్రెస్ నాయకుడూ ఈ సభలో తీర్పరులు! ‘ఖాప్’లో ఆ పార్టీల నాయకులు చేసిన రెచ్చగొట్టే ఉద్రేకపూరిత ప్రసంగాలు, వాళ్లు సర్క్యులేట్ చేసిన దొంగ వీడియోలే ఈ దుర్ఘటనకు కారణమని పోలీసుల నివేదిక వెల్లడించింది. ఇరవై ఏళ్లలో యూపీలో ఇంతస్థాయిలో హింసాయుత మత ఘర్షణలు జరగలేదని స్థానిక ప్రజలు చెప్పారని వార్తలు. ఈ దుర్ఘటన తాలూకు కేసుల నుంచి, అరెస్టుల నుంచి ఎలా బయటపడాలో ఆలోచనలో పడిన ఉభయ పార్టీల నాయకులు ఇప్పుడు చేస్తున్నది కేసులు ‘మాఫీ’ చేయించుకునే కొత్త కథనాల అల్లిక! తమ వర్గానికి చెందిన కొందరు కుర్రాళ్లను పోగుచేయటం, వారికి ఎదుటి వర్గానికి చెందిన వారి దుస్తులు తొడిగి ‘ఆత్మగౌరవ పోరాటం’ లేదా ‘లవ్ జీహాద్’ అనే కొత్త నినాదాన్ని జనంలోకి ఎక్కించడాన్ని ఒక ‘కళ’గా నేర్పటం ‘వీళ్లు ఎవరు’ అని తెలియకుండా వాళ్లకి ‘సోను’, ‘రాజు’ అని పేర్లు పెట్టారు. జీన్స్, టీ షర్టులు, మొబైల్ ఫోన్లు, మోటార్ బైక్‌లు ఇచ్చారు! వీళ్లు స్కూళ్లు, కాలేజీల ముందు నిలబడి ఉండాలి! ఒక వర్గం వారి ఆడపిల్లల్ని ‘లవ్’ చేస్తున్నట్టు పోజులివ్వాలట. మెల్లగా ఆ ఆడపిల్లల్ని ‘ప్రేమాయణం’ నాటకంలోకి దించాలి! అది ‘ప్రేమ కోసం పవిత్ర యుద్ధం’ (లవ్ జీహాద్) అట. ప్రేమ వలలోకి లాగటం ‘ప్యార్ సే ఫస్నా’! ఎదుటి వారిని రెచ్చగొట్టి ‘ముగ్గు’లోకి దించడానికి ఆర్ఎస్ఎస్, సంఘ్ పరివార్ ప్రవేశపెడుతున్న ‘చిట్కా’లని హిందూ మీరట్ ప్రతినిధి ప్రశాంత ఝా (11-9-13) వెల్లడించాడు! అదేమంటే, ఒక వర్గం వారి జనాభా పెరగకుండా ఉండాలంటే, ఆ వర్గం వారి కుర్రాళ్లను ఎదుటి వర్గం వారి ఆడపిల్లలు పెళ్లాడకుండా చేయడం! ఒక వర్గం వారి ‘ఆడపిల్లలు ప్రత్యర్థి వర్గం జనాభాను పెంచే సంతానోత్పత్తి’ యంత్రాలు కాకూడదట! దీన్ని బట్టి చూస్తే పురుషాధిక్యతా రోగం, బడుగు, బలహీన వర్గాలు మైనారిటీల పట్ల ఏహ్యమైన చిన్నచూపు, దుర్మార్గపు మనస్తత్వం ఎంతగా గూడుకట్టుకుని ఇప్పటికీ ఊళ్లేలుతున్నాయో అర్థమవుతోంది. సమాజంలోని ఏ రెండు వర్గాల మగ-ఆడ పిల్లల మధ్య ప్రేమానురాగాలు మొలకెత్తినా వాటిని మొగ్గలోనే తుంచివేయడానికి కుల, మతాల ప్రాతిపదికపైన సిద్ధమయ్యే ‘ఖాప్ పంచాయతీ’ నిర్ణయాలను సుప్రీంకోర్టు శఠించి, ఆ పంచాయతీలపైన వాటికి ప్రోద్బలమిచ్చిన నాయకులపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. దాన్ని ప్రభుత్వాలు పాటించడం లేదు. అందుకు కారణం - కొన్ని రాజకీయ పక్షాల, ప్రధాన పాలక పక్షాల ఓటు-సీటు రాజకీయాలే! రాజ్యాంగం బడుగు, బలహీన, మైనారిటీ వర్గాల అసంఖ్యాక ప్రజలకు హామీ పడిన నిబంధనలు ఆచరణలో అమలులోకి రానంత కాలం వర్గ సమాజంలోని పంచాయతీ వ్యవస్థ సహితం కలవాడి కులగోత్రాల చట్రంలోనే ప్రజల్ని గానుగెద్దుల్లా తిప్పుతుంటుంది. 65 ఏళ్లుగా వర్గ రాజకీయ పక్షాల ప్రభుత్వాలు, నాయకులూ పాటించిన ప్రజాస్వామ్య వ్యతిరేక, ప్రజావ్యతిరేక పంథా ఇది అని మరచిపోరాదు. అందుకే గాంధీజీ కూడా చేసేది లేక ఒక లౌకికవాద నైతిక పాఠాన్ని సూక్తిగా చెప్పాడు. ‘‘నదిలో సరదాగా ఈత కొట్టుకోండి గాని, నదిలో మాత్రం మునిగిపోకండి’’ అన్నాడు! అంటే ఇంతకు ముందు చెప్పినట్లు ‘మతం అనేది కేవలం వ్యక్తిగత విశ్వాసం’ కాబట్టి హద్దులు మీరవద్దు అని పరోక్షంగా బోధించాడు. గ్రామీణ వ్యవస్థ అర్థ భూస్వామ్య, పెట్టుబడి చట్రంలో కొనసాగినంత కాలం పంచాయతీల వల్ల కూడా బడుగు, బలహీన వర్గాల ప్రయోజనాలకు కులవ్యవస్థలో రక్షణ ఉండదు కాబట్టే కేవలం ‘గ్రామ స్వరాజ్య’ నినాదం వల్ల పేద, సాదల ప్రయోజనాలు నెరవేరవన్నాడు డాక్టర్ అంబేద్కర్! కనుకనే వర్గ సమాజంలో మత విషయాల పట్ల జాగరూకతలో గాంధీ ఇలా అన్నారు. ఆది నుంచీ పాఠశాల దశ నుంచీ పాఠ్య ప్రణాళికల్లో ‘‘ఒకరి మతమే గొప్పదనీ, ఇతర ధర్మాలన్నీ పనికిరానివనీ, తప్పుడువనీ అన్న భావాన్ని పిల్లల్లో ఎదగనివ్వరాదు. అలా చేయకపోతే తాము నమ్మిన మతమే నిజమైనదన్న తలంపు వారిలో అలాగే మిగిలిపోతుంది. ఇది ప్రమాదకరం’’! నేటి ‘ఓటి’ నాయకులు ‘ఓటు’ రాజకీయాల్లో మునిగి ఉన్నందున గాంధీ హెచ్చరికలు పనికిమాలినవిగా భావిస్తున్నారు. - ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు