పల్లె జనంపై పన్ను పోటు
పట్టణ తరహాలో
పంచాయతీల్లోనూ పన్నులు
చట్టాన్ని సవరించిన ప్రభుత్వం
తాజా నిర్ణయంతో పల్లె ప్రజలపై
అదనపు బారం
కర్నూలు సిటీ: ఇంటి నిర్మాణాలు, లేఅవుట్ల క్రమబద్ధీకరణ తదితర వాటికి సంబంధించి ఇకపై పల్లె జనం కూడా పన్ను చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఇందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ భూ అభివృద్ధి చట్టం- 2002కు ప్రభుత్వం సవరణలు చేసింది. గ్రామ పంచాయతీల్లో కూడా సొంతిళ్లు నిర్మించుకోవాలనుకునే వారు నిర్దేశించిన మేరకు పన్ను చెల్లించేలా ఈ నెల 8వ తేదీన పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ జవహర్ రెడ్డి జీఓ ఎంఎస్ 12ను జారీ చేశారు. ఫలితంగా ఇంతకాలం నిధులు లేక నీరసించిన పంచాయతీ ఖజానాకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల నిధులు సమకూరుతాయని సంబరపడాలో పల్లెజనంపై పన్నులవాత మొదలవుతుందని బాధపడాలో తెలియని పరిస్థితి సర్పంచ్‌ల్లో నెలకొంది. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక పంచాయతీలకు ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోగా ప్రజలపై పన్నుల భారం పడేలా నిర్ణయం తీసుకోవడం గమనార్హం.
చట్టానికి సవరణ ఇలా..
తాత్కాలిక నిర్మాణాలకు గతంలో ఎలాంటి ఫీజు లేకపోగా ఇకపై రూ. 100 ఫీజు చెల్లించాల్సి ఉంది.
శాశ్వత భవన నిర్మాణాలకు సంబంధించి స్క్వేర్ మీటర్‌కు గతంలో రూ. 2 చెల్లింస్తుండగా రూ. 20 కి పెంచారు.
నివాసేతర భవన నిర్మాణానికి స్క్వేర్ మీటర్‌కు రూ.40 లేదా రూ. 2 వేలు చెల్లించాలి. గతంలో స్క్వేర్ మీటర్‌కు రూ. 8 లేదా మొత్తంగా రూ. 400 మాత్రమే ఉండేది.
లేఆవుట్ ఫీజు స్క్వయర్ మీటర్‌కు రూ.4 లేదా రూ.5 వేలు ప్రకారం, గతంలో రూ.2 లేదా రూ.3 వేలు చెల్లించే వారు.
లేఆవుట్ భూమి అప్రూవల్ కోసం స్క్వేర్ మీటర్‌కు రూ. 5 నుంచి రూ.10కి పెంచారు. అనధికార లేఅవుట్లలోని ప్లాట్ల విలువలో 14 శాతం కాంట్రిబ్యూట్ చేయాలి.
గ్రై డ్ పంచాయతీల్లో మాస్టర్ ప్లాన్ అనుమతి కోసం రూ.4 వేల నుంచి రూ.5 వేలు, మైనర్ పంచాయతీల్లో రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు వసూలు చేయాలి.
నిబంధనలు అతిక్రమిస్తే వెయ్యి నుంచి రూ.2 వేల వరకు, నిబంధనలు పాటించకుండా భవనాన్ని నిర్మిస్తే రూ. 20 వేల వరకు జరిమానా విధించవచ్చు.