పన్నుల బాదుడేనా? | Green signal to municipalities | Sakshi
Sakshi News home page

పన్నుల బాదుడేనా?

Published Sat, Aug 23 2014 1:00 AM | Last Updated on Sat, Jul 7 2018 2:37 PM

పన్నుల బాదుడేనా? - Sakshi

పన్నుల బాదుడేనా?

  •   పురపాలక సంఘాలకు గ్రీన్ సిగ్నల్
  •   పాలక వర్గాలు సమాయత్తం
  •   మౌలిక వసతుల కోసమేనంటున్న వైనం
  •   10శాతానికి మించకూడదంటున్న ప్రజానీకం
  • మచిలీపట్నం : జిల్లాలోని పురపాలక సంఘాల్లో పన్నుల పెంపుదలకు రంగం సిద్ధమవుతోంది. పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పించాలంటే పురపాలక సంఘాల ఆదాయాన్ని పెంచుకోవాల్సిందేననే వాదన పాలకవర్గాల నుంచి వినిపిస్తోంది. వీరి వాదనకు ప్రభుత్వం వంతపాడుతుండటంతో పురపాలక సంఘాల్లో పన్నులు పెంచే ప్రక్రియను వేగవంతం చేస్తున్నారు.   పది సంవత్సరాలుగా పురపాలక సంఘాల్లో పన్నులు పెంచలేదు.

    దివంగత ముఖ్యమంత్రి వైఎస్.రాజశేఖరరెడ్డి హయాంలో పురపాలక సంఘాల్లో పనిచేసే ఉద్యోగులు, సిబ్బందికి ప్రభుత్వమే జీతాలు  చెల్లించే పద్ధతి అమల్లోకి వచ్చింది. దీంతో పురపాలక సంఘాలకు ఆర్థిక వెసులుబాటు లభించింది. ఈ నేపథ్యంలో అప్పట్లో పురపాలక సంఘాల్లో పన్నులు పెంచలేదు. జిల్లాలో మచిలీపట్నం, పెడన, గుడివాడ, నూజివీడు, జగ్గయ్యపేట, తిరువూరు, ఉయ్యూరు, నందిగామ పురపాలక సంఘాలున్నాయి.

    తిరువూరు, ఉయ్యూరు, నందిగామ నగర పంచాయతీలకు ఇటీవలనే ఎన్నికలు జరిగి మొదటిసారిగా పాలకవర్గాలు ఏర్పడ్డాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి నేపథ్యంలో  పురపాలక సంఘాలకు నిధులు విడుదల చేసేందుకు అవకాశాలు తక్కువగా ఉన్నాయని స్థానికంగానే పన్నులు పెంచి వసూలు చేసుకుని మౌలిక వసతులు కల్పించాలని ప్రభుత్వం సూచన ప్రాయంగా చెబుతోంది. దీనికి సంబంధించి ప్రత్యేక జీవో ఏమీ విడుదల చేయనప్పటికీ మౌఖికంగా ఆదేశాలిచ్చారు. ఈ ఆదేశాల ప్రకారం పన్నుల పెంపుదల ఎంత శాతం ఉంటుందోనని ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ప్రతి ఏడాది పదిశాతానికి మించకుండా పన్నులు పెంచితే ప్రజలపై ఒకేసారి భారం పడదనే వాదన వినబడుతోంది.
     
    జరుగుతున్నది ఇదీ

    పురపాలక సంఘాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక నిధులు విడుదల చేస్తాయి. ఈ నిధులు పురపాలక సంఘాలకు చేరి పనులు పూర్తి చేయాలంటే ఏడాదికి పైగా సమయం పడుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిధుల వినియోగంపై పురపాలక సంఘాలు, రాష్ట్ర ప్రభుత్వానికి సమన్వయం లేకపోటవడంతో కొన్ని నిధులు వెనక్కి మళ్లిన సంఘటనలు అనేకం ఉన్నాయి.

    వచ్చిన నిధులను సక్రమంగా వినియోగించుకునేందుకు పాలకవర్గాలు సమన్వయంతో పనిచేయాల్సి ఉంది. అయితే స్థానికంగా ఉన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో పురపాలక సంఘాల్లో సక్రమంగా పనులు జరగని పరిస్థితి నెలకొంది. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు రాబట్టాలంటే స్థానికంగా ఉన్న పరిస్థితులను పూర్తిస్థాయిలో వివరించాల్సిన అవసరం ఉంది. అయితే పాలకవర్గ సభ్యుల మధ్య నెలకొన్న వైషమ్యాలు ఈ నిధుల విడుదలకు అడ్డంపడుతోంది.
       
    పన్నులు పెరిగేది వీటికే...

    మచిలీపట్నం పురపాలక సంఘంలో 1.75 లక్షల మంది జనాభా ఉన్నారు. ఏడాదికి ఆదాయం రూ. 8 కోట్లుగా ఉంది. నూజివీడు పురపాలక సంఘంలో రూ. 60వేలు జనాభా ఉండగా రూ. 1.70 కోట్లు ఆదాయంగా ఉంది. నందిగామ పురపాలక సంఘంలో 50వేల మంది జనాభా ఉండగా రూ. 2 కోట్లు ఆదాయంగా ఉంది. పెడనలో 33వేల మంది జనాభా ఉండగా కోటి రూపాయలు ఆదాయం ఉంది.

    ఉయ్యూరు 50వేల మంది జనాభా ఉండగా రూ. 1.20 కోట్లు ఆదాయంగా ఉంది. జగ్గయ్యపేట పురపాలక సంఘంలో 52 వేల మంది జనాభా ఉండగా రూ. 1.30 కోట్లు ఆదాయంగా ఉంది. గుడివాడ పురపాలక సంఘంలో 1.13 లక్షల మంది జనాభా ఉండగా రూ. 2.50 కోట్లు ఆదాయంగా ఉంది. పురపాలక సంఘాల్లో ఇంటి పన్నులు, ఆయా పురపాలక సంఘాల్లోని షాపింగ్ కాంప్లెక్స్‌లు, కుళాయి పన్నులు, ఖాళీస్థలాలపై, ఆస్తి, ఆశీలు వసూలు, ప్రచార హోర్డింగ్‌లు, వివిధ దుకాణాలపై లెసైన్సుల రూపంలో పన్నులు వేస్తారు.

    వీటన్నింటికి పన్నులు 100 శాతం నుంచి 200శాతం వరకు పెంచే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇంత పెద్దస్థాయిలో పన్నులు పెంచితే ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందనే భయం పాలకవర్గాలను వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలపై పన్నుల భారం ఒకేసారి మోపకుండా ఏడాదికి 10 నుంచి 20శాతానికి పెంచుతూ ఐదేళ్లలో 100శాతం చేయాలనే తలంపులో పాలకవర్గాలు ఉన్నట్లు సమాచారం.

    పన్నులు పెంచినా వచ్చిన ఆదాయాన్ని ప్రజలకు వసతులు కల్పించటంలో సక్రమంగా వినియోగిస్తేనే ఉపయోగం ఉంటుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. అన్ని పురపాలక సంఘాల్లో అంతర్గత రహదారులు, తాగునీటి సమస్య, తాగునీటి పైప్‌లైన్లు, డంపింగ్‌యార్డులు, డ్రెయినేజీ సమ స్య, వీధిదీపాల సమస్యలు వెంటాడుతున్నాయి.  ఏ మేరకు మౌలిక వసతులు  కల్పిస్తారో  చూడాల్సిందే.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement