చిలకలపూడిలో తయారయ్యే దేవుని ఆభరణాల నమూనా
సాక్షి, అమరావతి: ఆకాశాన్నంటుతున్న ధరతో సామాన్యులకి బంగారం అందని ఆభరణమే అయింది. చిన్నపాటి గొలుసు కొనాలన్నా లక్షలు పెట్టాల్సిందే. డిజైన్లు అంతకంటే వేగంగా మారిపోతున్నాయి. బంగారానికి ప్రత్యామ్నాయంగా పుట్టుకు వచ్చిందే ఇమిటేషన్ లేదా రోల్డ్ గోల్డ్ లేదా వన్‌గ్రామ్ గోల్డ్ నగలు. ఏ పేరుతో పిలుచుకున్నా వీటి కేరాఫ్ అడ్రస్ కృష్ణా జిల్లా చిలకలపూడి. బంగారు ఆభరణాలకు ఏమాత్రం తీసిపోని విధంగా గిల్ట్ నగలు తయారు చేయడం చిలకలపూడి కళాకారుల గొప్పతనం.
బాగా డిమాండ్ ఉన్న యాంటిక్ నగల్లో కూడా కొత్త డిజైన్లు సృష్టిస్తూ మహిళల మనసులు దోచుకుంటున్నారు. లక్షలు విలువ చేసే బంగారు బ్రైడెల్ సెట్స్‌ను రూ.5,000 నుంచి రూ.25,000కే అందిస్తున్నారు. సినిమాల్లో, సీరియల్స్‌లో నటీనటులు ధరించే ఆభరణాల్లో అత్యధిక శాతం చిలకలపూడిలో తయారైనవే. అంతేకాకుండా అనకాపల్లి నుంచి చికాగో వేంకటేశ్వర స్వామి ఆలయం వరకు దేవుని అలంకరణకు ఉపయోగించే వజ్ర, వైఢూర్యాలు పొదిగిన కిరీటాలు, ఆభరణాలు కూడా ఇక్కడివే.
ఒక కుటుంబంతో ఆరంభం
114 ఏళ్ల క్రితం ఒక కుటుంబంతో ప్రారంభమైన ఈ కళ ఇప్పుడు గోల్డ్ పార్క్ ఏర్పాటుతో పెద్ద వ్యాపార సామ్రాజ్యంగా మారింది. 1908లో మచిలీపట్నానికి సమీపంలో ఉన్న చిలకలపూడి గ్రామంలో టేకి నరసింహం అనే స్వర్ణకారుడి ఆలోచన నుంచి మొదలయ్యింది ఈ రోల్డ్ గోల్డ్ వ్యాపారం. బంగారం ధరలు భారీగా పెరగడంతో మధ్య తరగతి ప్రజల కోసం రాగి మీద బంగారం పూతతో ఆభరణాల తయారీని మొదలుపెట్టారు. అప్పట్లో రూ. 100 ఉండే బంగారం దిద్దులను కేవలం పావలాకే అందించడంతో ఈ రోల్డ్ గోల్డ్ ఆభరణాలకు డిమాండ్ పెరిగింది.
వైఎస్సార్ చొరవతో గోల్డ్ క్లస్టర్ ఏర్పాటు
దేశంలో ఇమిటేషన్ గోల్డ్ ఆభరణాల్లో రాజస్థాన్, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల పోటీని తట్టుకోలేక చిలకలపూడి తయారీదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయం 2006లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి దృష్టికి వచ్చింది. వెంటనే ఇక్కడ అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తెచ్చి, మచిలీపట్నం ఇమిటేషన్ గోల్డ్ జ్యూవెలరీ పార్క్ ఏర్పాటు చేశారు. 2007లో 48 ఎకరాల్లో ఇమిటేషన్ జ్యూవెలరీ పార్కు ఏర్పాటైంది.
ఇప్పుడు ఈ పార్కులో 236 యూనిట్లలో ప్రత్యక్షంగా 3,000 మందికి ఉపాధి లభిస్తోంది. మచిలీపట్నం, పెడన, పామర్రు, అవనిగడ్డ నియోజకవర్గాల్లో ఉండే 24 గ్రామాలకు చెందిన 27 వేల మందికి పైగా మహిళలు ఇంటి వద్దే ఆభరణాలు తయారు చేస్తూ పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. వీరు ఒక్కొక్కరు రోజుకు రూ.200 నుంచి రూ.450 వరకు సంపాదిస్తున్నారు. ప్లేటింగ్, క్యాడ్, కాస్టింగ్ వంటి సౌకర్యాలు ఒకే చోట ఉండటంతో ఈ పార్కులో ఉత్పత్తి గణనీయంగా పెరిగింది. తొలుత రూ.10 కోట్లుగా ఉన్న చిలకలపూడి వ్యాపారం రూ.100 కోట్లను అధిగవిుంచడమే కాకుండా ఇతర రాష్ట్రాల పోటీని తట్టుకొని విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుకుంది.
అదే బాటలో జగన్ ప్రభుత్వం
వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ పార్క్‌ను మరింత అభివృద్ధి చేస్తోంది. రూ. 8 కోట్లతో రహదారులు, డ్రెయిన్లు, ఈటీపీ ఆధునికీకరణ, ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణం చేపడుతోంది. స్థానిక యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు స్కిల్ హబ్‌ను ఏర్పాటు చేస్తోంది. నూతన డిజైన్ల రూపకల్పనకు క్యాడ్, కాస్టింగ్ వంటి వాటిలో ఇక్కడ శిక్షణ ఇస్తారు.
Comments
Please login to add a commentAdd a comment