వైఎస్సార్ మాస్క్‌తో ఎన్నికల ప్రచారం
స్వతంత్ర అభ్యర్థి వినూత్న ఆలోచన
హొసూరు: హొసూరు నియోజక వర్గంలో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ స్వతంత్ర అభ్యర్థి వినూత్న ప్రచారాన్ని నిర్వహించారు. హొసూరు నియోజకవర్గంలో వివిధ రాజకీయ పార్టీలతో సహా 20 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. నెల్లూరుకు చెందిన కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి స్వతంత్ర అభ్యర్థిగా చెన్నై ఆర్కే నగర్‌లో, హొసూరులో జయలలితకు వ్యతిరేకంగా బరిలో దిగాడు. తమిళనాడు రాష్ట్రంలో తెలుగు భాషా పరిరక్షకుడుగా పేరున్న కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి తమిళనాడు ప్రభుత్వం నిర్బంధ తమిళభాషా చట్టం పేరుతో తెలుగువారిని అన్యాయానికి గురిచేయడాన్ని నిరసించి జయలలిత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో పోరాటాలు చేపట్టారు. ఇతను హొసూరు నియోజకవర్గంలో బుధవారం వినూత్న రీతిలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.
హొసూరులో వై.ఎస్.రాజశేఖరరెడ్డి అభిమానులు ఎక్కువగా ఉన్నందువల్ల రాజశేఖరరెడ్డి అభిమానులను ఆకర్షించేందుకు వైఎస్సార్ ఫోటోతో గల మాస్క్‌లను ధరించి మద్దతుదారులతో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో ఆయన పలుచోట్ల మాట్లాడుతూ, హొసూరు ప్రాంతంలో తెలుగువారు ఎక్కువగా ఉన్నందువల్ల వారి ఆధిక్యతను తగ్గించేందుకు పారిశ్రామిక అభివృద్ధి పేరుతో తెలుగువారి భూములలో పరిశ్రమలు ఏర్పాటు చేసి తమిళనాడులోని ఇతర ప్రాంతాల నుంచి తమిళులను దిగుమతి చేసుకొని తెలుగువారిని వలస వెళ్లే విధంగా చేస్తున్నారన్నారు.
దీనికి నిరసనగా తాను హొసూరు నియోజకవర్గంలో పోటీ చేస్తునాన్నని తెలుగువారందరూ ఆటో గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. హొసూరు నియోజకవర్గంలో అచ్చెట్టిపల్లి, చూడగొండపల్లి, కురుబట్టి, సొప్పట్టి తదితర గ్రామాల్లో ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు.