జలాశయాలకు ఆధునికీకరుణ లేదు
►బాగుపడని కాలువలు,స్లూయీస్మరమ్మతులకు నిధులివ్వని ప్రభుత్వం
► శివారు భూములకు అందని నీరు వేలాది ఎకరాల్లో ఎండిపోతున్న పంటలు
ప్రాజెక్టులు చెంత ఉన్నా రైతులకు సాగునీటి చింతతప్పడం లేదు. ప్రభుత్వం పోకడలతో ఇవి ఆధునికీక రణకు నోచుకోక శివారుభూములకు నీరందడంలేదు. తుప్పలు, పిచ్చిమొక్కలుపేరుకుపోయిన కాల వలు, పిల్ల కాలువల బాగుకుసర్కారు ఏళ్ల తరబడినిధులివ్వడం లేదు. మరమ్మతులకు రూ.కోట్లు అవసరం కాగారూ.లక్షలు కేటాయిస్తున్నారు.వీటితో పూర్తిస్థాయిలో పనులుజరగక సుమారు 40వేల ఎకరాలకు సాగునీరందని దుస్థితి. మూడేళ్లుగాఅతివృష్టి, అనావృష్టితో అల్లాడుతున్నఅన్నదాతలకు ఆపన్నహస్తంకానరావడం లేదు. - చోడవరం
జిల్లాలో రైవాడ, కోనాం, పెద్దేరు, తాండవ వంటి పెద్ద జలాశయాలతోపాటు కల్యాణపులోవ, పాలగెడ్డ, తారకరామ, గొర్లెగెడ్డ వంటి మినీ రిజర్వాయర్లు ఉన్నాయి. 2006లో అప్పటి సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి రైవాడ, కోనాం, పెద్దేరు, తాండవ, కల్యాణపులోవ రిజర్వాయర్ల ఆధునికీకరణకు రూ.42కోట్లు మంజూరు చేశారు. ప్రకృతి వైఫరీత్యాల వల్ల 2009 వరకు కొంత అంతరాయం ఏర్పడినప్పటికీ దశలవారీ పనులు చేస్తూ వచ్చారు. వైఎస్ మరణాంతరం బాధ్యతలు చేపట్టిన సీఎంలు, టీడీపీ ప్రభుత్వం నిర్లక్ష్యంతో ఈ పనులు పూర్తిగా పడకేశాయి. ఇప్పుడు ఆయకట్టు రైతులకు వర్షమే ఆధారమవుతోంది.
రైవాడ రిజర్వాయర్ పరిధిలో 15,344ఎకరాల ఆయకట్టు ఉంది. కుడి,ఎడమ కాలువల లైనింగ్ పనులు పూర్తికాలేదు. ఆరు పిల్లకాలువల్లో ఒక్కదానినీ బాగు చేయలేదు. ఏటేటా నిర్మాణ వ్యయం పెరగడంతో అదనంగా రూ.42కోట్లతో రివైజ్డ్ ప్రతిపాదనలను అధికారులు మళ్లీ ప్రభుత్వానికి పంపారు. కోనాం రిజర్వాయరు కింద 15,140ఎకరాల ఆయుకట్టు ఉంది. దీని చిన్న,పెద్ద కాలువలకు లైనింగ్,స్లూయీస్, గేట్ల నిర్మాణ పనులు పూర్తికాలేదు. పాడైన ఔట్ ఫ్లో గేట్లకు మరమ్మతులు చేపట్టలేదు. దీనివల్ల వందలాది క్యూసెక్కుల నీరు వృథాగా పోతోంది. పెద్దేరు రిజర్వాయరు కింద 19,650ఎకరాల ఆయుకట్టు ఉంది.
ఎడమ కాలువ పనులు 70శాతం పూర్తయ్యాయి. సుమారు 25కిలోమీటర్ల కుడికాలువ లైనింగ్ పనులు అసలు చేపట్టలేదు. దీనివల్ల ఎడమకాలువ పరిధిలో 4వేల ఎకరాలకు, కుడికాలువ పరిధిలో 9వేల ఎకరాలకు సాగునీరు అందడం లేదు. కల్యాణపులోవ రిజర్వాయర్ కాలువ పనుల్లో నాణ్యతా లోపం, చివరి వరకు కాలువలు నిర్మించకపోవడం వల్ల రైతులు లబోదిబోమంటున్నారు. ఇక మినీ రిజర్వాయర్లు పరిస్థితి చెప్పనవసరం లేదు. తారకరామ పనులు 20 ఏళ్లుగా పూర్తికాలేదు. రైతుల సాగునీటి వ్యధలు తీరడం లేదు. గొర్లెగెడ్డ,పాలకగెడ్డ, ఉరకగెడ్డ, లక్ష్మీపురం చెరువు పనులు కాగితాలకే పరిమితమైపోయాయి. ఈ రిజర్వాయర్ల పనులు పూర్తికావాలంటే రూ.100కోటు అవసరం. టీడీపీ ప్రభుత్వం గతేడాది కేవలం రూ.15లక్షలు, ఈ ఏడాది రూ.6లక్షలు మాత్రమే కేటాయించింది. కనీసం ప్రత్యేక నిధులైనా ఇచ్చి రానున్న ఖరీఫ్ నాటికైనా వీటిని ఆధునీకరిస్తే రైతులకు మేలు జరుగుతుంది.
ప్రభుత్వానివి నీటిమాటలే...
రైవాడ కాలువ లైనింగ్ పనులు లక్కవరం వరకు చేపట్టకపోవడంతో చివరి ఆయకట్టుకు నీరందడం లేదు. ఆధునికీకరణకు రూ.కోట్లు అవసరమైతే ప్రభుత్వం కేవలం రూ.6లక్షలు మాత్రమే ఇచ్చింది. రైతు సంక్షేమమే ధ్యేయమని చెబుతున్న ప్రభుత్వం జలాశయాల కాలువలు, పిల్లకాలువల బాగు విషయంలో నిర్లక్ష్యం వహిస్తోంది. వచ్చే ఖరీఫ్‌నాటికైనా వీటి మరమ్మతులు చేపట్టాలి - మట్టా రాజునాయుడు,
నీటిసంఘం మాజీ అధ్యక్షుడు, లక్కవరం.
ప్రతిపాదనలు పంపాం.. రైవాడ రిజర్వాయర్ ఆధునికీకరణకు రూ.42.6కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాం. ఇంకా నిధులు రాలేదు. వస్తే పనులు చేపడతాం. కుడికాలువ నిర్మాణం పూర్తిచేయాల్సి ఉంది. - మాధవిలత, ఇరిగేషన్ డీఈఈ, చోడవరం.