కుప్పానికి వైఎస్ హయాంలోనే నీళ్ల కేటాయింపులు!
♦ హంద్రీ-నీవాకు నిధులిచ్చేందుకు డీపీఆర్ ఆమోదం
♦ రెండో దశలో కుప్పం వరకు నీరిచ్చేలా డీపీఆర్ ఆమోదం
బి.కొత్తకోట : సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పానికి హంద్రీ-నీవా నీరు ఇవ్వాలని 2007లోనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఆమోదించింది. ప్రాజెక్టు రెండో దశలో పుంగనూరు బ్రాంచ్ కెనాల్ ద్వారా సాగు, తాగునీరు ఇవ్వాలని నీళ్లు, నిధుల కేటాయింపు జరిగింది. అయితే ప్రస్తుత ప్రభుత్వం కుప్పానికి నీళ్లిచ్చేందుకు ప్రత్యేక ప్రణాళికతో నిధులు కేటాయించుకుంటోంది. జిల్లాలోని పెద్దతిప్పసముద్రం మండలంలో ప్రారంభమయ్యే పుంగనూరు బ్రాంచ్ కెనాల్(పీబీసీ) బి.కొత్తకోట, కురబలకోట, మదనపల్లె, పుంగనూరు, పెద్దపంజాణి మండలాల మీదుగా సాగుతుంది.
ఇదే కాలువ పలమనేరు నుంచి కుప్పం నియోజకవర్గం వరకు వెళ్లేలా ఒరిజినల్ డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు(డీపీఆర్)లో పేర్కొన్నారు. దీనికి 2007 జనవరి 1న వైఎస్.రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం ఆమోదం తెలిపి, జిల్లాలో జరిగే పనులకు రూ. 1,702కోట్లు కేటాయించారు. ఈ నిధులతోనే కుప్పం నియోజకవర్గానికి హంద్రీ-నీవా నీరిచ్చేందుకు కాలువ పనులు ఉన్నాయి.
పీబీసీని కేబీసీ చేశారు..
పీటీఎం నుంచి కుప్పం వరకు పుంగనూరు బ్రాంచ్ కెనాల్ సాగుతుంద ని ఒరిజినల్ డీటైల్డ్ ప్రాజెక్టు రిపోర్టు (డీపీఆర్)లో ఉండగా ప్రస్తుతం పలమనేరు, కుప్పం నియోజకవర్గాల్లో సాగే కాలువకు కుప్పం బ్రాంచ్ కెనాల్‌గా పేరు మార్చారు. కుప్పానికి నీరిచ్చేందుకు కృషిచేస్తున్నట్టు రూ.418 కోట్లు కేటాయించారు. ఈ నిధులను ప్రత్యేకంగా కేటాయించే అవసరంలేదు. కొత్తగా అనుమతులు ఇవ్వకపోయినా పర్వాలేదు.
పనులు చేపట్టేందుకు అనుమతి మంజూరు చేయాలని ఉన్నతస్థాయి అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్టు సమాచారం. అయితే ప్రభుత్వం కుప్పం నియోజకవర్గానికి తామే ప్రత్యేకించి హంద్రీ-నీవా నీరు తెస్తున్నామంటూ ప్రచారం చేసుకుంటోంది.
ఆయకట్టు పెంచిన వైఎస్
1994కు ముందు రూపొందించిన ప్రాజెక్టు నివేదికలో పేర్కొన్న దానికంటే అత్యధిక ఆయకట్టుకు నీరివ్వాలని వైఎస్ నిర్ణయం తీసుకున్నారు. 1994లో చిత్తూరు జిల్లాలో 1.4లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని మాత్రమే ప్రతిపాదించగా వైఎస్ రాజశేఖరరెడ్డి సీఎం అయ్యాక జిల్లా ఆయకట్టును 1.75లక్షల ఎకరాలకు పెంచారు. కొత్తగా 4.50లక్షల జనాభా నీరివ్వాలని ప్రాజెక్టులో భాగం చేశారు. మదనపల్లె పట్టణ ప్రజల తాగునీటి కోసం రెండు సమ్మర్‌స్టోరేజీ ట్యాంకులను మంజూరు చేశారు.