ధీమా లేని జనశ్రీ బీమా
వేలాది మంది విద్యార్థులకు మొండిచెయ్యి
పథకాన్ని రెన్యూవల్ చేయని ప్రభుత్వం
పుట్టపర్తి అర్బన్ : జనశ్రీ బీమా పథకానికి ధీమా లేకుండా పోయింది. ఈ సంవత్సరం జనశ్రీ బీమా యోజన పథకంలోని లబ్ధిదారుల దరఖాస్తులను రెన్యువల్ చేయకుండా ప్రభుత్వం నిరుపేద విద్యార్థులకు మొండి చేయి చూపనుంది. స్వయం సహాయక సంఘాల్లో సభ్యులైన గ్రామీణ మహిళలు చెల్లించిన బీమా ప్రీమియం వృథా కాకూడదన్న నెపంతో లబ్ధిదారుల ఇళ్లల్లో చదువుకొనే పిల్లలకు స్కాలర్‌షిప్పు మంజూరు చేస్తున్న ప్రభుత్వం 2015-16లో రెన్యూవల్ చేయకుండా నిలిపివేసింది. దీంతో వేలాది మంది విద్యార్థులకు ఈసారి మొండి నిరాశ మిగలనుంది. వివరాల్లోకి వెళితే దివంగత ముఖ్యమంత్రి వైస్ రాజశేఖరరెడ్డి హయాంలో గ్రామీణ మహిళలకు బీమా పథకాన్ని ప్రవేశ పెట్టి సంవత్సరానికి రూ.165 చెల్లించిన వారికి బీమా వర్తింపచేశారు. లబ్థిదారులు ప్రమాదవ శాత్తు మృతి చెందితే రూ.75 వేలు, సాధారణ మరణం పొందితే రూ.35 వేలు, ప్రమాదంలో శరీరంలో ఏవైనా రెండు భాగాలు పూర్తిగా తొలగిస్తే రూ.75 వేలు, ఒక భాగం తొలగిస్తే రూ.37,500 అందించేలా పథకాన్ని రూపొందించారు.
లబ్ధిదారులు జీవించి ఉన్నట్టయితే .. వారి ఇళ్లలోని విద్యార్థులకు నాలుగు సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరం రూ.1200 స్కాలర్‌షిప్పు వచ్చే విధంగా వైఎస్ ఆ పథకంలో మార్పులు చేసి కొనసాగించారు. అయితే 2015-16లో కేవలం ఆమ్‌ఆద్మీ, అభయహస్తం పథకంలోని లబ్ధిదారులకు రెన్యూవల్ చేస్తూ జనశ్రీ బీమా యోజన లబ్ధిదారులకు ప్రభుత్వం మొండి చూపుతోందని పలువురు మహిళలు విమర్శిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా అర్బన్, రూరల్ కలిపి గత సంవత్సరం 4,112 మంది జనశ్రీ బీమా యోజనలో లబ్ధిదారులుగా చేరారు.
వారందరికీ స్కాలర్‌షిప్పుల దరఖాస్తులను రెన్యూవల్ చేయకుండా ప్రభుత్వం ఆన్‌లైన్‌లో సైట్ వివరాలు తొలగించింది. దీంతో ప్రభుత్వ నిర్వాకంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి.
వేలాది మంది విద్యార్థులు నష్టపోతారు
ప్రతి సంవత్సరం ఆమ్‌ఆద్మీ, అభయహస్తం, జనశ్రీ యోజన కింద పేద విద్యార్థులకు స్కా లర్‌షిప్పులు మంజూరయ్యేవి. ఈసంవత్సరం జనశ్రీ యోజనలో స్కాలర్‌షిప్పులు రెన్యూవల్‌కు సంబంధించి ఎటువంటి సమచారం లేదు. రెన్యూవల్ చేయకపోతే వచ్చే సంవత్సరం వేలాది మంది విద్యార్థులు ఉపకారవేతనం అవకాశం కోల్పోతారు. - సెల్వరాజ్, పుట్టపర్తి, ఏపీఎం